
'Prapancha Varasulu' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 03/04/2024
'ప్రపంచ వారసులు' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
సత్యం, సబ్ ఇన్పెక్టర్ గా దాదాపు ఇరవై ఏళ్లు నుండి పని చేస్తున్నా.. అతడికి ప్రమోషన్స్ రాలేదు. కారణం.. ! నీతి, నిజాయితీకి మారుపేరు. అంతేకదా మరీ..
మన దేశంలో నీతి, నిజాయితీకి ప్రమోషన్స్ ఉంటే కదా..
ప్రమోషన్స్ రాకపోగా అతడి పై దొంగచాటు దాడులు, ఒక్కోసారి ప్రాణహాని కూడా లేకపోలేదు.
ఒకరోజు నలుగురు వ్యక్తులు సత్యం పై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా బైక్ పై వెళ్తున్న ఓ నలభై ఏళ్ల రాయుడు చూసి మెరుపువేగంతో వెళ్ళి నలుగురు దుండగులను తరిమికొట్టాడు. సత్యంను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. ప్రాణాపాయం లేదని వార్త వచ్చాక..
"ఇక నేను బయలుదేరుతా సత్యం అన్నా " అన్నాడు రాయుడు.
ఆ మాటలకు సత్యం ఆశ్చర్యంగా
"నా పేరు నీకెలా తెలుసు "అని అడిగాడు.
"చూడు అన్నా, నా పేరు రాయుడు నేను ఇండియన్ ఆర్మీలో పారా మిలటరీ విభాగంలో పని చేస్తున్నాను. ఇక నువ్వు ఎవరివో.. నాకు ఎలా తెలుసో.. అనే విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నువ్వు ఒక కోవర్టువి " అని వెళ్ళిపోయాడు.
గాయాల తీవ్రత వలన ఆ మాటలు కానీ.. రాయుడు విషయం కానీ పట్టించుకోలేదు. కోలుకున్నాక అవన్నీ మర్చిపోయాడు.
ఇక తాను మరలా డ్యూటీ దిగాడు. అప్పటి నుండి చాలా రోజులుగా పట్టణంలో చాలా చోట్ల ప్రతి ఆదివారం చాలామంది పిల్లలు ప్రపంచ వారసులు అని రాసి ఉన్న చొక్కాలు ధరించి రోడ్లపై డ్యూటీ చేసే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, పేదలు, కూరగాయలు అమ్మేవారికి, తోపుడు బళ్ళ వారికి మంచీనీరు, మజ్జిగ, ఎండ వాన నుండి రక్షణ కోసం గొడుగులు మొదలైనవి ఉచితంగా పంపిణీ చేయటం గమనించాడు. మరోరోజు ఆ సేవ కార్యక్రమం స్వయంగా తనకు తన సిబ్బంది వరకు వచ్చింది. తన సిబ్బంది అందరూ వాళ్ళు ఇచ్చిన మంచినీరు, మజ్జిగ వంటివి సేవించి ఉపసమనం పొందారు. కానీ.. ! సత్యం వాటిని తిరస్కరించాడు.
"ఎండలో పని చేస్తు.. అలసిపోయిన మీలాంటి వారి కోసమే మేము ఈ కార్యక్రమం ప్రారంభించాము తీసుకోండి సత్యం అన్నా" అన్నాడు ఓ పిల్లాడు.
ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు.
"నా పేరు మీకెలా తెలుసు.. "అడిగాడు.
"మేము ఈ ఏరియాలో జెడ్పీ హైస్కూల్లో ఏడు నుండి పదోతరగతి చదువుతున్న పిల్లలం. ఇక నీ గూర్చి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే నువ్వు ఒక కోవర్టువి" అన్నాడు మరో పిల్లాడు.
ఇప్పుడు సత్యంకి ఒంట్లో రక్తం ఉడుకుతుంది. ఎందుకంటే.. ! తాను ఒక నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయినా.. ! పదిమందికి సేవ చేస్తున్న ఈ పిల్లలు, గౌరవ ప్రధానమైన ఉద్యోగంలో ఉన్న రాయుడు తనను కోవర్టు అని సంబోధించడం.. రాయుడు మాటలు కూడా గుర్తుకు వచ్చాయి. దీంతో పిల్లలకు తెలియకుండా తన సిబ్బందితో వారిని అనుసరించాడు. చాలా దూరం ప్రయాణం తర్వాత సత్యంకి ఆశ్చర్యం, ఉత్కంఠ మొదలయ్యాయి.
ఎందుకంటే.. ఆ ప్రయాణంలో ప్రదేశాలు అన్ని తాను చిన్నప్పుడు ఆడుకుని పాడుకుని తిరిగినవే. పిల్లలు ప్రయాణించే వాహనం మూడంతస్తులతో గుండ్రంగా, విశాలంగా ఉన్న పెద్ద భవంతి వైపు వెళ్ళింది. సత్యం వాహనం కూడా అటు వెళ్ళింది. గేటు మీద ఉన్న కోటయ్య- రమాల అనాధాశ్రమం అనే అక్షరాలును చదవి సత్యం ఒక్కసారిగా భిన్నుడైయ్యాడు. గతాన్ని తలుచుకుని తప్పు చేసినవాడిలా అక్కడే తలదించుకుని ఉండిపోయాడు.
"ఏమైంది సార్? లోపలికి వెళ్దామా " అని ఓ కానిస్టేబుల్ అనగా తెలివి తెచ్చుకుని లోపలికి వెళ్ళారు. అక్కడ ఖాళీ ప్రదేశంలో ఒంటరిగా ఒక గది ఉంది. ఆ గది గోడ పై కోటయ్య- రమాల స్టోర్ రూం అని ఉండటం చూసి అందులోకి వెళ్ళాడు. అందులో ఒక రిక్షా, వెదురు బుట్టలు, అవి అల్లేందుకు ఉపయోగించే చాకు, తాటిచెట్టు ఎక్కేందుకు వాడే తాడు, తాటికళ్ళు గీయటానికి వాడే కత్తి, మట్టితో తయారుచేసిన బిడ్డి పురుషుడి మహిళ యొక్క పాత దుస్తులు ఉన్నాయి. పక్కగా అద్దంలో ఒక డైరీ ఉంది. ఆ డైరీ తెరిచాడు. మొదటి పేజీలో ‘నా బతుకు’ అని ఉంది.
తర్వాత..
పేదరికంలో పుట్టిన కోటయ్య తండ్రి పరిస్థితి వలన ఏడో తరగతి వరకు చదివి మానివేశాడు. అప్పట్లో కోటయ్య తండ్రి గుర్రపు బగ్గి తోలుతూ కుటుంబంను పోషించగా ఇప్పుడు కోటయ్య రిక్షా తోలుతూ బార్య రమాని చూసుకుంటున్నాడు. పాపం భార్య భర్తల్లో ఎవరి లోపమో కానీ.. వారికి పిల్లలు కలగలేదు. ఇప్పుడు అయితే వారికి పర్వాలేదు మరీ వృద్దాప్యంలో చూసుకునేందుకు అయినా సంతానం ఉండాలి కదా.. అందుకే వారి భయం, బాధ.
ఒకరోజు కోటయ్య రిక్షా నడుపుతున్నాడు. నడిరోడ్డు పై తల్లిదండ్రులు లేని ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉండటం చూసి ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుందామని భార్యకు చెప్పాడు. ఆమె కూడా ఒప్పుకోవటంతో సత్యం అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచారు. ఎంత కష్టమైనా వాడికి మంచి చదువు చెప్పించాలనుకున్నారు. కోరి అనాధగా నడిరోడ్డుపై తిరుగుతున్న వాడిని తెచ్చుకుని తమలాగే కష్టపడటం ఎందుకు.. గొప్పవాడైతే తమను చూసుకుంటాడని. నిజంగా కష్టం అంటే ఏంటో కష్టపడ్డవాడికే తెలుస్తుంది కదా.. !
సత్యంకి పదేళ్లు రాగా మరో అనాధ పిల్లడు కనపడితే రాయుడు అనే పేరు పెట్టి అతడిని కూడా పెంచుకున్నాడు కోటయ్య. అలా తన సంపాదన చాలకపోవటంతో తల్లి బుట్టలు అల్లుతు, కోటయ్య రిక్షా మరియు తాటికళ్ళు తీసి అమ్ముతు సత్యం పోలీసు ఉద్యోగానికి, రాయుడిని మిలటరీకి సిద్ధం చేయించాడు. అలా కోటయ్య రమాల కష్టంతో చదివి పోలీసు ఉద్యోగం సంపాదించాడు సత్యం.
ఇందుకోసం డబ్బు చాలకపోవటంతో కోటయ్య ఉన్న ఇల్లు కూడా అమ్మి మరీ ఉద్యోగానికి పంపాడు. కొన్నాళ్ళకి సత్యంకి, కోటయ్య రమాలు సొంత తల్లిదండ్రులు కాదని తెలిసి వాళ్ళని చూసుకోవల్సి వస్తుందని ఉద్యోగం పేరుతో వారికి దూరంగా వెళ్ళిపోయాడు.
చివరి దశలో తమను చూసుకుంటాడని అనుకున్న ఆ తల్లిదండ్రులు ఆశలకు పెద్ద కొడుకు అప్పుడే తలకొరివి పెట్టాడని బాధపడ్డారు. ఇక రాయుడు మిలటరీ ఉద్యోగం సంపాదించటానికి తన రిక్షాని కూడా అమ్మేశాడు కోటయ్య. ఈ త్యాగానికి గుర్తుగా సొంత తల్లిదండ్రులు కారని తెలిసినా.. రాయుడు వారిని విడిచి వెళ్ళలేదు. తనలాగే అనాధలను పెంచండని అందుకు సరిపడే డబ్బు నేను సంపాదిస్తానని ప్రోత్సహించాడు. కోటయ్య అమ్మిన రిక్షా తిరిగి తెచ్చి స్టోర్ రూంలో ఉంచుకున్నాడు.
కోటయ్య రమాలు బతికున్నంత వరకు రాయుడు సంపాదనతో దాదాపు ఇరవై మంది అనాధలను పెంచి ప్రభుత్వ, ప్రవేటు రంగాల్లో స్థిరపడేటట్లు ప్రోత్సాహించి కన్నుమాశారు. రాయడితొ సహా ఆ ఇరవైమంది సంపాదనతో తల్లిదండ్రుల జ్ఞాపకార్దం, కోటయ్య, రమాల ఆశయాలను నిలబెట్టేందుకు ఎందరో అనాధలను అక్కున చేర్చుకుని వారికి మంచి చదువు చెప్పించి గొప్పవాళ్ళని చేశాడు రాయుడు. అలా గొప్పవాళ్ళు అయిన వారిలో ఎందరో పెళ్ళి చేసుకుని కూడా కోటయ్య- రమాల చరిత్రని వారి ఆశయాలను మర్చిపోలేదు.
అలా వారి సంపాదనతోనే ఇప్పుడు ఇంత గొప్పభవనంలో పదివేల నుండి ఇరవైవేల మంది అనాధలను పోషించే స్థానానికి చేరుకున్నారు. దేశంలో నలుమూలల ఎందరో అనాధలకు ఇది ఒక నివాసం. ఇక్కడ ప్రతి పిల్లలకు కోటయ్య రమాల చరిత్ర మరియు తొలి అనాధ వ్యక్తి అయిన సత్యం చరిత్ర కూడా రాయుడు అందరికీ తెలియపర్చేవాడు.
తండ్రి మరణం తర్వాత ఆ డైరీని తానే కంటిన్యూ చేస్తూ దేశ సేవ ఒకవైపు అందరి అనాధల యోగక్షేమాలు మరోవైపు పెద్దన్నలా చూస్తున్నాడు రాయుడు. అందుకే ఈ ఆశ్రమం నుండి గొప్పవాళ్ళు అయిన వారందరికీ ప్రపంచ వారసులు అని పిలుస్తుంటారు.
ఇప్పుడు సత్యంకి కన్నీళ్లు ఆగటం లేదు. తల్లిదండ్రులు లేక అనాదిగా తిరుగుతున్న తనకు గొప్ప జీవితం ఇచ్చిన వారిని వదిలేశానని. నిజమే. వాళ్ళు గొప్ప తల్లిదండ్రులు. ఎందుకంటే అనాధలను పెంచి గొప్పవాళ్ళని చేస్తే వాళ్ళు వదిలిపోతారని తెలిసినా.. వాళ్ళు ఎందరో అనాధలను అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు లేకపోయినా.. వారి ఆశయాల కోసం ఇక్కడే ఉండి డ్యూటీ చేస్తూ రాయుడికి సహకరించాలని నిర్ణయించుకున్నాడు.
సత్యం ఇప్పుడు మారాడు కానీ.. ! తన మనసులో తాను నిజంగా కోవర్టునని ఊహించుకునే ఉంటాడు. ఎందుకంటే.. ! ఉద్యోగంలో ఎంత నిజాయితీగా ఉన్నా ఆలనాపాలనా చూసి ఈ స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులను వదిలెసేవాడు నిజంగా కోవర్టు కిందే లెక్క.
**** **** **** **** **** ****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments