ప్రయాణం
- T. V. L. Gayathri

- Oct 16
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ప్రయాణం, #సైనికానీవేనాప్రాణం

గాయత్రి గారి కవితలు పార్ట్ 40
Prayanam - Gayathri Gari Kavithalu Part 40 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 16/10/2025
ప్రయాణం - గాయత్రి గారి కవితలు పార్ట్ 40 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
ప్రయాణం
(ఇష్టపది)
***********************
బాలలుగ చిన్నపుడు బడికివెళుతుంటాము.
చాల శాస్త్రాలనట చదువు కొంటుంటాము.
విద్యలను నేర్చుకొని విజయాలు సాధించి,
ఉద్యోగమందుకొని నున్నతిగ విలసిల్లి,
అక్కరలు తీర్చుకొని నాటు పోటులలోన
చక్కగా మోస్తాము సంసారబాధ్యతలు.
పిల్ల పాపల పెంచి ప్రేమకై తపియించి
మళ్లి మళ్ళీ మనము మాయలో పడతాము.
జవసత్వములు తగ్గి జడుపుతో దిగులుగా
భవసాగరములోన పయనించి పయనించి
కాలంబుతోపాటు కదలి పోతుంటాము.
వేళ వచ్చిందంటె వెడలి పోతుంటాము.
తనువు శాశ్వతమౌన? తరలి పోతుంటాము.
మనకర్మలను నాడు మరచి పోతుంటాము.
మనిషి పయనంబిదియె!మానవా!వినవయ్య!
ఘనమైన పనులతో కాలమును గడుపుమా!//
************************************

సైనికా! నీవే నా ప్రాణం!
************************************
ఎక్కడ ఉన్నా ప్రక్కన నీవే కనిపిస్తుంటావు!
ఎక్కడో మంచు కొండల్లో తిరుగుతూ ఉంటావు!
భుజాన తుపాకీతో నిత్యం పోరాటానికి' సై' యంటూ.
విజయమే లక్ష్యంగా భీతి లేకుండా పరిగెడుతూ.
నీ చేతుల్లో శౌర్యం!నీ దేహమే మండే అగ్నికణం.
నీ చూపులో తీక్షణం!నిజానికి నువ్వే ఓ ఆయుధం!
కోటగోడలా నిల్చుంటే దేశానికి నువ్వే రక్షణకవచం.
మాటు వేసిన శత్రు మూకలను మర్దించే నువ్వే వీరసింహం.
నిన్నే తల్చుకుంటూ నీ కోసం నిలుచున్నా నేనొంటిగా.
మన్ను కోసం తపించే నీకు మమత గుర్తుంటుందా?
ప్రతిక్షణం పలవరిస్తూ గడుపుతున్నా భయపడుతూ భారంగా!
గతినీవే యనుకుంటూ ఘడియలు లెక్కపెడుతూ తిరుగుతున్నా!
కడుపులో బిడ్డ నాన్న కావాలంటూ కదులుతూ చెబుతోంది.
ముడుపులు కడుతూ దేవునికి మొక్కుకుంటూ కూర్చున్నా!
వచ్చేస్తావా!ప్రియా!పరుగులు పెడుతూ మా కోసం!
అచ్చోట ముష్కరుల నందరిని అంతమొందించే దాకా రాలేవా?
నీవే దేశానికి బలమంటూ ప్రజలంతా నిన్ను కీర్తిస్తారు.
ధీవరుడవంటూ పాలకులు నీకోసం నిత్యం దేవుళ్ళాడుతారు.
నాకేమీ వినిపించవు సైనికా!నా ప్రాణం నీకోసం!
నీ కేమీ కాదనుకుంటూ నీ ధ్యాసలో మునిగింది నా మానసం.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:




Comments