top of page

ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3


'Prema Entha Badhiram 3/3' - New Telugu Story Written By Sripathi Lalitha

'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3/3' పెద్ద కథ చివరి భాగం

రచన: శ్రీపతి లలిత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:


సుధ ఒక ప్రముఖ బ్యాంకులో జనరల్ మేనేజర్.


భర్త మురళికి సీరియస్ గా ఉన్నట్లు కొడుకు ప్రవీణ్ వద్దనుండి ఫోన్ వస్తుంది.


గతం గుర్తుకు వస్తుంది సుధకి..


స్నేహితురాలు ఉష అన్నయ్య మురళితో ప్రేమలో పడుతుంది సుధ. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న తన కోరికను పక్కన పెట్టి అతన్ని పెళ్లి చేసుకొంటుంది. కొద్ది రోజుల్లోనే భర్త ప్రవర్తనలో తేడాను గమనిస్తుంది సుధ.

సుధకి బ్యాంకు ఆఫీసర్ గా జాబ్ వస్తుంది. అమెరికా వెళ్తాడు మురళి. కొడుకు ప్రవీణ్ తండ్రిని మిస్ అవుతున్నట్లు గ్రహిస్తాడు.ఇక ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3 చదవండి.


సుధకి ఎప్పుడో నమ్మకం పోయింది మురళి మీద, మళ్ళీ వచ్చి తమతో గడుపుతాడని. అందుకే, వీలైనంత ప్రవీణ్ తో గడుపుతూ, తండ్రి లేని లోటు తెలియకుండా చేయాలనుకునేది.


అలాఅని, మురళి మీద ప్రవీణ్ కి చెడుగా చెప్పేది కాదు. పెద్ద అయితే మంచిచెడు ప్రవీణే తెలుసుకుంటాడు అనుకునేది.


రామనాథం, రాజ్యలక్ష్మి దిగులు పెట్టుకున్నారు మురళిమీద.

ఎంత ఫోన్లో మాట్లాడినా కొడుకుని చూసి చాలా రోజులయింది, ఎలా ఉన్నాడో ఏమిటో అని.


వీళ్ళ పోరు పడలేక మధ్యలో వచ్చి వెళ్లాడు కానీ, సుధని, ప్రవీణ్ ని తీసుకెళ్లడం గురించి ఏమి అనలేదు.


మురళి వచ్చినప్పుడు, తండ్రి తెచ్చిన బహుమతులు అందరికి చూపించి మురిసిపోయాడు ప్రవీణ్.


సుధ మాత్రం నిర్లిప్తంగానే ఉండేది.


సుధ జీవితం ఇలా అవడానికి తమకొడుకే కారణం అని బాధ పడేవారు మురళి తల్లి, తండ్రులు.


సుధ మాత్రం అలా అనుకునేది కాదు. తాను క్లిష్ట పరిస్థితుల్లో

ఉన్నప్పుడు అత్తగారు, మామగారు ప్రవీణ్ ని ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకున్నారు.


వాళ్ళు అలా చూడబట్టే తాను ఈ ఉద్యోగం తెచ్చుకొని ఏ

ఇబ్బంది లేకుండా ఈ స్థాయికి చేరింది. ప్రవీణ్ గురించిన ఆలోచన లేకుండా ఉద్యోగం మీద దృష్టి పెట్టింది. అది తను ఎప్పుడు మర్చిపోదు.


అందుకే అత్తా, మామలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేది. కుదిరినప్పుడల్లా వాళ్ళకి ఫోన్ చేయడం, అప్పుడప్పుడు వెళ్లడం చేసేది.


"నేను మీ కోడలిని అనుకోకండీ, మీ కొడుకునే అనుకోండి" అనేది.


రామనాథం, రాజ్యలక్ష్మి విజయవాడలో సొంత ఇంటికి మారిపోయారు. ఉష, కృష్ణ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకుని విజయవాడ వెళ్లిపోయారు పెద్దవాళ్ళకి సాయంగా.


సరోజకి కూడా, లక్ష్మమ్మ- రాజు అని వాళ్ళ చుట్టాల్లో అతనితో పెళ్లి కుదిర్చింది. పెళ్లి ఖర్చు అంతా సుధ పెట్టుకుని చక్కగా పెళ్లి చేయించింది.


రాజుకి డ్రైవింగ్ వచ్చు అని తెలిసి ఆటోకి అప్పు ఇప్పించింది. సుధ తన శ్రద్ధ అంతా ఉద్యోగంలో పెట్టి అంచెలంచెలుగా ఎదిగింది. ప్రమోషన్ మీద సుధకి ఐదు సంవత్సరాల పాటు అమెరికాలో బ్రాంచ్లో పోస్టింగ్ వచ్చింది.


ప్రవీణ్ ఆనందానికి హద్దులు లేవు. కనిపించిన ప్రతివాళ్ళకి "మేము నాన్న దగ్గరికి వెళ్తున్నాము" అని చెప్పాడు.


మురళికూడా ఈ విషయం తెలియగానే, తాను ఉంటున్న ఊరుకి, 5 గంటల దూరంలో సుధ బ్రాంచ్ అని, తాను అన్నీ చూసుకుంటాను అని చెప్పాడు.


"అమ్మయ్య! ఇప్పటికైనా వీళ్ళ సంసారం కుదుట పడుతుంది” అని ఇరువైపుల పెద్దవాళ్ళు సంతోషపడ్డారు.


అమెరికా పోస్టింగ్ తో, సుధ పేరు బ్యాంకింగ్ సర్కిల్లో మారుమోగిపోయింది. తన నేర్పుతో ఒక బ్రాంచిని ఐదు బ్రాంచీలకి పెంచింది. జనరల్ మేనేజర్గా ప్రమోషన్ కూడా వచ్చింది.


మురళి తనదైన స్టయిల్ లో సుధని ఉద్యోగం మానేయమని మధ్య మధ్యలో అనేవాడు. నిజానికి సుధ మురళిని పట్టించుకోవడం మానేసింది. వారం, వారం వచ్చి ప్రవీణ్ తో గడిపి వెళ్ళేవాడు మురళి. తన కొడుకుకి తండ్రి ప్రేమని దూరం చేయడం ఇష్టం లేక సర్దుకుపోయేది.


అందరు తండ్రుల్లా మురళి తనతో చనువుగా, ముద్దుచేస్తూ

ఉండడు అని ప్రవీణ్ కి అనిపించేది కానీ, కనీసం ఇంత అయినా తనతో గడుపుతున్నాడు అనుకొని సంతోష పడేవాడు.


వయసు వస్తున్నకొద్ది ప్రవీణ్, తల్లి ఎంత కష్టపడి, ఎంత ఇష్టపడి ఉద్యోగం చేస్తోందో, దానికోసం ఎన్ని చిన్న సంతోషాలు పోగొట్టుకుందో అర్థంచేసుకున్నాడు.


తండ్రి మనస్తత్వం కూడా కొద్దిగా అర్థమవసాగింది. తల్లికి గుర్తింపు వస్తే, సంతోషం కంటే, తండ్రి నుంచి అసూయ ఎక్కువ బయటపడేది. ఆఖరికి తనని పొగడాలన్నా తండ్రి ఆలోచించేవాడు అనుకున్నాడు ప్రవీణ్.


అంతకుముందు తండ్రి దూరంగా ఉండడానికి కారణం తల్లే అనుకునేవాడు. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తల్లి తనకోసం ఎంత సర్దుకుంటోందో. ఒకరకముగా అమెరికా రావడం మంచిదే అయింది అనుకున్నాడు. కొన్ని విషయాలు బాగా అర్ధమయ్యి తల్లి విలువ తెలుసుకోగలిగాడు.


అమెరికాలో ఉండాల్సిన సమయం అయిపోయాక, సుధ కోరుకున్నట్టుగా హైద్రాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు. ప్రవీణ్ చదువు అమెరికాలోనే కొనసాగిస్తాను అన్నాడు.


"నువ్వు కూడా ఇక్కడే ఉద్యోగం చూసుకో, ఇండియా వెళ్ళకు" అన్నాడు మురళి సుధతో.


ప్రవీణ్ కూడా "అవును అమ్మా! నువ్వు కూడా ఉండిపోవచ్చుకదా, ఇక్కడ, నీకు మంచి అవకాశాలు వస్తాయి" అన్నాడు ప్రవీణ్.


కానీ సుధ ఇష్టపడలేదు.


"మా అమ్మావాళ్లకి, మీవాళ్ళకి దగ్గర కదా అని హైదరాబాద్ అడిగాను. నా కోరికని మన్నించారు మా బ్యాంకు వాళ్ళు. నా పనితనానికి గుర్తింపుగా ఇస్తున్న 'బహుమానము' ఇది.


ఈరకమైన గుర్తింపు, సంతృప్తి, నాకు ఉద్యోగం ద్వారానే దొరికింది. నేను ఈ ఉద్యోగం మానను. " అని మురళితో చెప్పి కొడుకు వంక చూసి,


"ప్రవీణ్! నువ్వుకూడా చదువు అయ్యాక, ఇండియాలోనే ఉద్యోగం చూసుకో. తాత గారు, బామ్మ గారు పెద్దవాళ్ళు అయ్యారు. ఉష అత్త, మామ ఎంత కాలం వాళ్ళ బాధ్యత తీసుకుంటారు?


అత్త వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. నిన్ను చిన్నప్పుడు అంత ప్రేమగా చూసిన తాతా, బామ్మా ఋణం, కొంత కాకపోతే కొంత అయినా తీర్చుకోవాలి మనం. అదే వాళ్లకు మనము ఇచ్చే పెద్ద"బహుమానం” అని,


మళ్ళీ మురళితో "ఈ వయసులో మీ అమ్మా, నాన్నలకి నీ అవసరం, అండ కావాలి, ఇంతమాత్రం ఆదాయం, నీకు ఇండియాలో కూడా ఉంటుంది. నువ్వు కూడా నాతో వస్తే మంచిది, కాదు అంటావా నీ ఇష్టం." అంది. మురళి ఏమి మాట్లాడలేదు.


సుధ హైదరాబాద్ వచ్చింది. ఒక ఇల్లు అమ్మకానికి వస్తే, కొనుక్కుని అందులోకి మారింది. ఆ ఇల్లు చాలా నచ్చింది సుధకి.


పాతకాలం ఇళ్ళలా ముందు ఖాళీస్థలం, వెనుక ఖాళీస్థలం. మొక్కలు పెట్టుకోడానికి, సాయంత్రం కుర్చీ వేసుకొని బయట కూర్చోడానికీ వీలు ఉంది.


రెండు వాటాల ఇల్లు, పెద్ద వాటాలోతనుండి, చిన్న వాటాలోకి సరోజ వాళ్ళని రమ్మంది, తనకి సాయంగా ఉంటారని.

సరోజ, రాజు ఇద్దరు పిల్లలతో వచ్చేసారు.


ఇంట్లో అంతా సరోజ చూస్తే, రాజు ఆటో నడిపేవాడు. ఆఫీస్ కి బ్యాంకు డ్రైవర్ ఉన్నాడు.


మిగిలినప్పుడు రాజే కార్ డ్రైవ్ చేసేవాడు. సరోజ పిల్లల చదువు ఖర్చు సుధే భరించేది. వారానికి ఒకసారి సుధ అమ్మవాళ్ల ఇంటికి వెళ్లడమో, వాళ్ళు రావడమో జరిగేది.

రెండు వారాలకి ఒకసారి విజయవాడ వెళ్లి అత్తగారు వాళ్ళని చూసి వచ్చేది.


ప్రవీణ్ కూడా చదువు అయ్యాక ఇండియా వచ్చాడు.


వచ్చేముందు తండ్రిని కలిసాడు. మురళిని చూస్తే ఆరోగ్యం బాగా లేనట్టు అనిపించింది.


"నాకు ఇండియాలో జాబ్ దొరికింది నాన్నా, నేను వచ్చేవారం వెళ్తున్నాను. మీరేంటి ఇలా అయిపోయారు, ఆరోగ్యం బాలేదా? ఒక్కరూ ఇక్కడ ఎందుకు? నాతో వచ్చెయ్య కూడదా? అందరం అక్కడ ఉండచ్చు." ఆదుర్దాగా

అడుగుతున్న కొడుకుని చూసి, మొదటిసారి ప్రేమ ఉప్పొంగింది మురళికి.


"థాంక్యూ మై సన్ ఫర్ యువర్ కన్సర్న్!" అంటూ గట్టిగా కావిలించుకున్నాడు. మొదటిసారి నిజమైన తండ్రి పరిష్వన్గ ఆనందం ప్రవీణ్ పొందాడు.


"తప్పకుండా! త్వరలో నిర్ణయం తీసుకుంటాను నాన్నా!" ప్రేమగా అన్నాడు మురళి. అన్నట్టుగానే, ఒక ఆరు నెలల తరవాత ఇండియాకి వచ్చేసాడు మురళి.


ఇంటినుంచి ఉద్యోగం చేస్తూ, విజయవాడలోనే తల్లి తండ్రులతో ఉండిపోయాడు. పెద్దవయసులోనన్నా కొడుకు తమ దగ్గరికి వచ్చాడని, వాళ్ళు కూడా సంతోషపడ్డారు.


వారం, వారం ప్రవీణ్ వెళ్లినా, సుధ మాత్రం, తను ఎప్పుడు ఎలావెళ్లేదో అలాగే వెళ్తుండేది.


"ఈమధ్యే చూసి వచ్చాను, ఇంతలో ఏమయ్యి ఉంటుంది హాస్పిటల్లో చేరేంత ?" అనుకుంటూ "రాజూ.. ఎక్కడున్నాము?" ఆలోచనలనుంచి బయటపడి అడిగింది

సుధ.


"అమ్మా! హాస్పిటల్ దగ్గరకి వచ్చేసాము."అన్నాడు రాజు.


ఒక్కనిమిషం సుధ గుండె ఝల్లుమంది.

మురళి ఎలా ఉన్నాడో ? నిండా 55 ఏళ్ళు లేవు.


ఐసీయూ దగ్గర ప్రవీణ్ ని చూసి "ఎలా ఉంది నాన్నకి ?" ఆదుర్దాగా అడిగింది.


"హార్ట్ ఎటాక్ వచ్చింది. అత్యవసర వైద్యం చేశారు.


అత్త, మామ డాక్టరుగారితో మాట్లాడుతున్నారు. నేను నీకోసం ఇక్కడ ఉన్నాను" అన్నాడు తల్లి భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెపుతూ.


మాటల్లోనే ఉష, కృష్ణ వచ్చారు.


"బైపాస్ చేయాలి అన్నారు. హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తే మంచిది అంటున్నారు." ఉష చెప్పింది.


సుధ బ్యాంకు వాళ్ళు కూడా వచ్చారు.


"మేడం! మేము డాక్టర్స్ తో మాట్లాడాము. రెండు రోజుల తరవాత, స్పెషల్ అంబులెన్సులో హైదరాబాద్ షిఫ్ట్ చేద్దాము. భయపడక్కరలేదు." అంటూ ధైర్యం చెప్పారు.


"సుధ వచ్చేలోగా, ఇక్కడ వీళ్లు అంతా చూసుకున్నారు. ఏదైనా పదవి ప్రభావం" అనుకున్నారు ఉష, కృష్ణ.


హైద్రాబాద్లో, మురళికి వైద్యం చాలాబాగా జరిగింది. డిశ్చార్జ్ చేసాక సుధ ఇంటికే తీసుకువచ్చారు. ఒక నెల తరవాత చెకప్ కి రమ్మన్నారు. రామనాథం, రాజ్యలక్ష్మి కూడా ఉండిపోయారు. సరోజ, రాజు అన్నిరకాలుగా సాయం చేస్తున్నారు.


ఒకరోజు మాములుగా సుధ ఆఫీసుకి వెళ్తుంటే "నాకు తోచటంలేదు, సెలవ పెడతావా ?" అడిగాడు మురళి.


"లేదు, నాకు చాలా పనిఉంది." అంది సుధ.


"నన్ను ఒంటరిగా వదిలేస్తావా ? పోనీ, నీసర్వీసుకి పెన్షన్ వస్తుంది కదా, జాబ్ మానెయ్యి" అన్నాడు తేలిగ్గా.


మురళి మాటలకి పిచ్చి కోపం వచ్చింది సుధకి. కానీ నియంత్రించుకొని నెమ్మదిగా, స్థిరంగా


"మురళీ! నీ ఆరోగ్య రీత్యా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ తప్పట్లేదు. ప్రేమ గుడ్డిది అంటారు. గుడ్డిదే కాదు చెవిటిది కూడా.


నువ్వు పెళ్లిచేసుకుందామని అన్నప్పుడు, ఎవరు ఏమి చెప్పిన వినకుండా తొందరపడ్డాను. నా ఆశయాన్ని కూడా పక్కకి పెట్టి పెళ్లి చేసుకున్నాను.


నీ సంగతి నాకు తెలీదు, కానీ నేను నిన్ను అప్పుడు నిజంగా ప్రేమించాను, నీ విజయాన్ని నాదిగా ఆనందించాను. నువ్వు బాధపడితే నేను ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాను.


నీ ఉద్యోగం పోతే నాకే అలా జరిగినట్టుగా అనుకొని, నీకు, ఇలా చెయ్యి, అలాచెయ్యి అని సలహాలు చెప్పాను. నువ్వు నన్ను మాటలతో, చేతలతో బాధపెట్టినా, నీతో సర్దుకున్నాను.


ప్రేమించాను అని, నా వెనకబడి పెళ్లి చేసుకొని, నువ్వు నాకు ఇచ్చిన పెద్ద 'బహుమానం ' ఏమిటో తెలుసా? ఒంటరితనం.


నువ్వు, నన్ను 25 ఏళ్ళ నుంచి ఒంటరిగానే వదిలేసావు. ఏ విషయంలోనూ నాకు తోడుగాలేవు. నా స్వయంశక్తితో నేను ఈ స్థాయికి వచ్చాను.


నా అదృష్టం ఏమంటే, మీ వాళ్ళు అందరూ, నా వాళ్ళు అయ్యారు. వాళ్ళ ప్రోత్సాహముతో నేను ఇబ్బంది లేకుండా ప్రవీణ్ ని పెంచాను.


ఆడదానికి భర్త పొతే, సమాజం సానుభూతి చూపుతుంది, అదే భర్త వదిలేస్తే, ఆమెదే తప్పు అంటారు. నేను అలాంటి ఎన్నో అవమానాలు పొందాను.


అసలయిన ఒంటరితనం నాకు తెలుసు. నువ్వు ఎప్పుడూ స్వార్థపరుడవే. నీకు, నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ ముఖ్యంకాదు. నీ అవసరాన్నిబట్టి, వస్తూపోతూ ఉంటావు.


నాకు వస్తున్న గుర్తింపు నువ్వు భరించలేక, నన్ను ఉద్యోగం మానెయ్యమంటున్నావు. అది నాకు తెలుసు. అమెరికాలో ఉన్నప్పుడు నీతో ఉండి, ప్రవీణ్ కూడా, నువ్వు ఏమిటో తెలుసుకున్నాడు.


నీకు అవసరమైతే ఆర్థికంగా అండగా ఉంటాను, మనిషిని పెట్టి చేయిస్తాను. అంతేకాని ఉద్యోగం మానేసి నీతో ఉండే సమస్యే లేదు.


ఇదికూడా మీ అమ్మా, నాన్న కోసం, ఇంకా ప్రవీణ్ కోసం మాత్రమే. ఇప్పుడు నేను నీ భార్యగా కాదు, వాళ్ళ కోడలిగా, నీ కొడుక్కి తల్లిగా మాత్రమే ఉన్నాను, ఉంటాను.


ఒకప్పుడు ‘ప్రేమ ఎంత మధురం’ అనుకున్న నేను, తరవాత ‘ప్రేమ ఎంత బధిరం’ అనుకోవాల్సి వచ్చింది.


ఇప్పటికయినా 'కళ్ళు పూర్తిగా తెరిచి', 'చెవులతో సరిగ్గా విని' నిర్ణయాలు తీసుకుంటున్నాను.


నాకు త్వరలో 'ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్' గా ప్రమోషన్ వస్తోంది. ఆర్డర్స్ కోసం చూస్తున్నాను. నాకు ముంబైలో పోస్టింగ్ రావచ్చు. నేను వెళ్ళిపోతాను. నాకు ఇంకా చాలా సర్వీస్ ఉంది, నేను బ్యాంకు చైర్మన్ కూడా అవుతాను.


నువ్వు ఏమైనా అనుకో, నీకంటే ఉద్యోగమే ముఖ్యం నాకు.

ఎందుకంటే, నా జీవితంలో ఉన్న తోడు, నీడ అదే! నువ్వు కాదు. గుడ్ బై అండ్ టేక్ రెస్ట్" అని ధీమాగా ఆఫీసుకి వెళ్తున్న సుధవంక కళ్లప్పగించి చూస్తుండిపోయాడు మురళి.


(ప్రస్తుతానికి ఇదే ముగింపు)

========================================================================

సమాప్తం

========================================================================శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.37 views0 comments

コメント


bottom of page