top of page

ప్రేమ గెలుపు

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ప్రేమగెలుపు, #PremaGelupu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

ree

Prema Gelupu - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 12/07/2025

ప్రేమ గెలుపు - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అర్జున్ బిటెక్ పూర్తయ్యాక జాబ్ కోసం ప్రయత్నిస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తల్లి లక్ష్మికి కొడుకంటే పంచప్రాణాలు. తన కొడుకును ఉన్నతస్థాయిలో చూడాలనే ఆశతో కష్టపడి పెంచింది. అర్జున్ చాలా బాధ్యతాయుతంగా, గౌరవంగా ఎదిగినవాడు. 


ఒకసారి తన ఫ్రెండ్ గోపీ ద్వారా జయపురానికి వెళ్లాడు అర్జున్. అక్కడ ఒక మెడికల్ క్యాంప్‌లో వాలంటీర్‌గా పని చేస్తూ, సునీత అనే యువతితో పరిచయమై, కొన్నాళ్ల తర్వాత అది స్నేహంగా మారింది. సునీత ఆరోగ్య సేవలకే ప్రాధాన్యం ఇచ్చే, స్వతంత్ర ఆలోచనలు ఉన్న డాక్టర్. 


కాలం హాయిగా సాగిపోతూ ఇద్దరి మనసులు కలిసి వారి మధ్య ప్రేమ చిగురించి అది మరింత బలపడింది. 

ఒక రోజు సునీత తండ్రి కిరణ్ కి కూతురి ప్రేమ విషయం తెలిసింది. అతడు ప్రముఖ రాజకీయ నాయకుడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తన కూతురిని ఆయన కంటికి రెప్పలా పెంచి పెద్దచేశాడు. తమ కూతురికి తమ అంతస్తుకి తగిన సంంబంధం చేయాలని కిరణ్ అభిలాష. 

“సునీతా! నీవు ప్రేమలో పడ్డావని విన్నాను. నిజమేనా?” అడిగాడు కూతురిని కిరణ్. 


“అవును నాన్నా! నేను, అర్జున్ ప్రేమించుకున్నాం. అతను చాలా మంచివాడు. అతనొక అనాథ. అతను మన ఇంటికి వస్తే మనమే అన్నీ అతనికి. త్వరలో మేమిద్దరం మీ అనుమతితో పెళ్లి చేసుకుందామనుకున్నాం. ” అంది సునీత. 


"ఏంటి? నీకు మతి పోయిందా? ఒక అనాథ నా అల్లుడా? అతడిని పెళ్లి చేసుకుని మన పరువు-ప్రతిష్టలను మంటగలుపుతావా? సంఘంలో మనం తలెత్తుకు తిరగగలమా? " అని రౌద్రంగా గర్జించాడు కిరణ్. 


"చూడు నాన్నా! మీరు సమాజానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు కదా! మీ అమ్మాయి తన జీవితానికొక మనసున్న మంచి మనిషిని భర్తగా ఎన్నుకుంటే మీరు వ్యతిరేకంగా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను అతడిని పెళ్లిచేసుకుంటాను. మీరొప్పుకుని దగ్గరుండి మా పెళ్లి చేస్తే సంఘంలో మీ పెద్దరికం నిలబడుతుంది. " అంది సునీత.

 

“లేకపోతే?” అన్నాడు కిరణ్. 


“మీ బిడ్డ మీకు దూరమవుతుంది”. అంది సునీత స్ధిరంగా. 


“అతనికోసం ప్రాణంగా పెంచుకున్న ఈ తండ్రిని ఒదులుకుంటావా? అందుకే అంటారు ప్రేమ గుడ్డిదని” అన్నాడు కిరణ్. 


“మాది మనసులు కలిసిన ప్రేమ. అన్యోన్యంగా జీవించడానికి ప్రేమ, మంచి మనసు కావాలి. ఆస్ధి- అంతస్థులు ముఖ్యం కాదు నాన్నా. ” అంది సునీత. 


కిరణ్ తన కూతురి మనసు ఇంక మారదన్న నిర్ణయానికి వచ్చి కాసేపు ఆలోచనలో పడ్డాడు. 


“అయితే ఒక పనిచేయి. రేపే నీవతడిని మనింటికి తీసుకుని రా! నేనతడికి ఒక పరీక్ష పెడతాను. అందులో అతను నెగ్గితేనే మీ పెళ్లి”. అన్నాడు కిరణ్. 


“సరే!. మీ పరీక్షలో అతను తప్పకుండా గెలుస్తాడు”. అంది సునీత. 


"ప్రేమ అనేది నిజమైతే, ఆ త్యాగాన్ని కూడా మోయగలగాలి. నీ ప్రేమకు పరీక్ష ఇది. " అన్నాడు మరలా కిరణ్ కూతురితో. 


ఆ మరుసటి రోజు అర్జున్ ని ఇంటికి తీసుకొచ్చి తండ్రికి పరిచయం చేసింది సునీత. 


అర్జున్ వినయంగా కిరణ్ కి నమస్కారం చేసి కూర్చున్నాడు.

 

 "చూడు అర్జున్! నీవు మా అమ్మాయి జీవితంలోకి రావాలంటే నువ్వు నాకు ఎదురుగా నిలబడి గెలవాలి – కేవలం మా అమ్మాయి మీద ప్రేమతో గెలుపు కాదు, జీవితంలో స్థిరమైన భవిష్యత్తుతో. " అన్నాడు కిరణ్ అర్జున్ తో. 


“సరే! అప్పుడు మీరే నన్ను పిలిచి మీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. ఇదే! నా ఛాలెంజ్!” అన్నాడు అర్జున్. 


కిరణ్, సునీతల వద్ద శెలవు తీసుకుని తన ఇంటికి వెళ్లాడు అర్జున్. 


ఇంటికి వచ్చిన అర్జున్ మనసులో ఫైర్ అయి అతనిలోని పట్టుదల ఇంకా పెరిగింది. బాగా ఆలోచించి ఎనిమిది నెలలపాటు రెస్ట్ కూడా లేకుండా ఓ ఫ్రీలాన్స్ టెక్ ప్రాజెక్ట్‌ను డెవలప్ చేసి, బిజినెస్‌గా మార్చి మంచి పేరు సంపాదించుకున్నాడు. 


ఒక రోజు అర్జున్ వ్రాసిన ఆప్‌ను ఓ మీడియా సంస్థ "దేశ భవిష్యత్తు టెక్ యూత్" గా రికగ్నైజ్ చేసింది. దానితో అర్జున్ పేరు అన్ని పేపర్లలో, ఛానెల్స్ లలో మారుమ్రోగింది. సునీత చాలా సంతోషించింది. ఆ వార్త చూసి కిరణ్ షాక్ అయి అర్జున్ ని తన ఇంటికి పిలిచాడు. 


అర్జున్ ని సాదరంగా పలకరించి మర్యాద చేశాడు కిరణ్. 


“అర్జున్! నీ పట్టుదల, కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నీవు నీ ప్రేమను ఈ దేశానికి సేవ చేసే మిషన్ గా మార్చావు. నా అల్లుడిగా నీవు అర్హుడివి. నా కూతురికి ఏలోటూ లేకుండా నీవు చూసుకుంటావు అన్న నమ్మకం, ధైర్యం నాకు వచ్చింది. మీ పెళ్లికి నేను ఇష్టపూర్వకంగా ఒప్పీకుంటున్నాను” అన్నాడు కిరణ్. 


అర్జున్, సునీత లు చాలా సంతోషించారు. తర్వాత అర్జున్ వాళ్ళ వద్ద శెలవు తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. 

 ఒక శుభముహూర్తాన అర్జున్, సునీతల పెళ్లి పెద్దల సమక్షంలో చాలా ఘనంగా చేశాడు కిరణ్. 


తమ కృషి, పట్టుదలతో తమ ప్రేమని గెలిపించుకున్న అర్జున్, సునీతలని అందరూ అభినందించి ఆ క్రొత్త దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సునీత, అర్జున్ లు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. వాళ్లని చూస్తున్న కిరణ్ ఆనందానికి అవధులు లేవు. 


.. సమాప్తం .. 


ree

-నీరజ హరి ప్రభల

Profile Link


YouTube Playlist Link









Comments


bottom of page