top of page

ప్రేమ తరంగాలు - పార్ట్ 1

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

ధారావాహిక ప్రారంభం

Prema Tharangalu - Part 1 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 08/11/2024

ప్రేమ తరంగాలు - పార్ట్ 1 తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ముకుందవర్మ... లాప్‍టాప్‍లో ఫేస్‍బుక్‍ ఓపెన్ చేసి... పెండ్లి కొడుకుల ఫొటోలను బయోడేటాలనూ.... చూస్తున్నాడు.


ఆ రోజు ఆదివారం. కాఫీ యిస్తూ చెప్పింది అర్థాంగి నీలవేణి...

"కాస్త మన పిల్ల వయస్సును మనసులో పెట్టుకొని తగిన వరుణ్ణి ఈ రోజైనా చూడండి. బెండకాయ ముదిరినా... బ్రహ్మచారి ముదిరినా... అనే సామెత మగపిల్లలకే కాదు ఆడపిల్లలకూ వర్తిస్తుంది" రుసరుసలాడుతు చెప్పింది నీలవేణి.


ఆమెకు.... సంవత్సరం రోజులుగా తాము ప్రయత్నిస్తున్నా.... తమ కుమార్తె సత్యభామకు తగిన వరుడు తటస్థ పడనందుకు ఎంతో విచారం.


సత్యభామ... తన మేనమామ పరమశివం.... అమెరికాలో సైంటిస్ట్. వారి భార్య నందిని.... ఆమె ఇంగ్లీషు ప్రొఫెసరు. వారి వద్ద ఉంటూ... బి.ఎస్సీ, ఎం.బి.ఎ చదివి అక్కడే ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమె వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు. ఈ సంవత్సరంలో ఎలాగైనా కూతురు వివాహం చేయాలని నీలవేణిగారి సంకల్పం.


కానీ... ముకుంద వర్మకు ఆ విషయంలో ఎలాంటి తొందరా లేదు. హాయిగా ఉద్యోగం చేస్తూ స్వేఛ్ఛగా... ఆనందంగా వున్న కుమార్తె సత్యభామ జీవితం.... ప్రశాంతంగా మరో రెండు సంవత్సరాల పాటు అలాగే కొనసాగాలనే నిర్ణయం.


కూతురు వివాహ సమయంలో ఆ దంపతుల నిర్ణయాలు వేరు వేరు. కానీ... భార్య నీలవేణి మాటను కాదనలేని బలహీనుడు ముకుందవర్మ.


అందుకే.... ఆమెను తృప్తిపరచాలని ప్రతి ఆదివారం ఓ అరగంటసేపు కంప్యూటర్ ముందో, లాప్‍టాప్ ముందో కూర్చొని... పెండ్లి కొడుకుల వివరాలను చూడటం తప్పనిసరి అయింది ముకుందవర్మ గారికి.


వృత్తిరీత్యా వారు న్యాయవాది. క్రిమినల్ లాయర్‍గా మంచి పేరున్న వ్యక్తి. 


సత్యభామ వయస్సు పది సంవత్సరాలుగా వున్నప్పుడు ఆ దంపతులకు ఒక మగ సంతానం కలిగింది. వాడికి తన తండ్రిగారైన లేటు ఆనందవర్మ పేరునే పెట్టారు. ప్రస్తుతం వాడి వయస్సు పదిహేను సంవత్సరాలు. ప్లస్‍వన్ చదువుతున్నాడు.


బావమరిది పరమశివానికి ఒక కొడుకు ధనుంజయ్.... ఒక కూతురు పల్లవి. వారు పుట్టింది అమెరికాలోనే. యిరువురిలో.... ధనుంజయ్ సత్యభామ కన్నా మూడేళ్ళు పెద్ద. పల్లవి భామ ఒకే వయస్సు వాళ్ళు.


ధనుంజయ్ డాక్టర్. ముకుందవర్మకు తన కూతురును ధనుంజయ్‍కి యివ్వాలనే ఆశ. తన కూతురు తన కళ్ళముందు అంటే తమ వూరికి దగ్గరలో వుండే ఏదో ఒక సిటీలో సంబంధం చూచి వివాహం చేయాలనేది నీలవేణి కోరిక. భార్యా భర్తలిరువురికీ కులగోత్రాల పట్టింపు.


"ఏదైనా... మనకు సరిపడేలా వుందా!" భర్త ప్రక్కకు వచ్చి అడిగింది నీలవేణి.


"నీలూ!"


"చెప్పండి."


"నీవు తప్పుగా అనుకోకూడదు సుమా!"


"మీరు తప్పుగా చెబితే...నేను ఒప్పుగా ఎలా అనుకోగలను?"


"అంటే!..."


"మీరు... నాకు తప్పుగా తోచేరీతిలో ఏమీ మాట్లాడకూడదని...."


తలను ఆడిస్తూ... నిట్టూర్చాడు ముకుందవర్మ.


"ఏమిటది!.... మీలో మీరే ఏదో!...."


"అహా!... అలాంటిదేమీ లేదు. చూడు నీలూ!.. నా మనస్సులో వున్న మాటను చెబుతున్నాను."


"చెప్పండి..."


"నీ మేనల్లుడు ధనుంజయ్‍కు ఏం తక్కువ? డాక్టర్... మంచిపేరు... మంచి సంపాదన.. స్టేట్స్ లో వున్నాడు. వాడికి మన అమ్మాయికి ఈడూజోడు."


"చాలు. యిక ఆపండి. నాకు ఆ సంబంధం యిష్టం లేదు. నా కూతురికి మన ప్రాంతంలో... మన దేశంలోనే వుండే చక్కని కుర్రాణ్ణి చూడాలి. నేను తలుచుకొంటే.... కొన్ని గంటల్లో వెళ్ళి, అమ్మాయిని చూచేదానికి వీలుగా వుండాలి. వాడు సంపదలో పేదవాడైనా, మంచి గుణవంతుడుగా ఉండాలి. భోగభాగ్యాలు శాశ్వతాలు కావు. కానీ... మనిషిలో వుండే మంచి గుణాలు... వారి జీవితాంతం అలాగే వుంటాయి. కాబట్టి మనంత స్థితిపరుడు కాకపోయినా... మంచి గుణవంతుడైన పిల్లవాణ్ణి వెదకండి. వివరాలు నాకు చెప్పండి. సరేనా!"


కోర్టులో... క్రిమినల్ లాయర్‍గా ముకుందవర్మ సింహం... ఇంట్లో.... యిల్లాలి ముందు పిల్లి.... ఆమె ముందు వారు అలా వర్తించేదానికి కారణం.... వారు నమ్మిన ధర్మం... యింటి యిల్లాలి కన్నీరు... యజమానికి.... ఆ కుటుంబానికి క్షేమం కాదనే సత్యం.... 


"అలాగే నీలూ!... నీ మాటను నేను ఎప్పుడు కాదన్నాను" అనునయంగా చెప్పాడు ముకుందవర్మ.

"సరే. సంతోషం యింతవరకూ చూచిన సంబంధాల్లో ఏదైనా మనకు తగినదిగా కనబడిందా!"


"కనబడ్డాయి. ఒకటి, రెండు. కానీ అవి నీ టేస్టుకు సరిపోవు."


"సార్!... నమస్కారం" ప్లీడర్ గుమస్తా బాలగోవిందయ్య హాల్లోకి వచ్చారు. అమ్మగారిని చూచి... "అమ్మా!.... నమస్తే" వినయంగా చెప్పాడు.


అతని ప్రక్కన ఒక యువకుడు. అందగాడు. అతను ఆ యిరువురు పెద్దలను చూచి చేతులు జోడించి...

"నమస్తే సార్.... నమస్తే మేడం" వినయంగా చెప్పాడు.


ఆ ఇరువురూ అతన్ని కొన్నిక్షణాలు పరీక్షగా చూచారు.

"బాలగోవిందయ్యగారూ!" పిలిచింది నీలవేణి.


"చెప్పండమ్మా!" అమ్మగారిని సమీపించాడు.


"ఈ అబ్బాయి ఎవరు?" అడిగింది నీలవేణి.


"అమ్మా!..... ఇతను ఒక అనాధ బాలుడు. మీలాంటి మహనీయుల సాయంతో ఎం.బి.ఎ పాసైనాడు. మన అయ్యగారితో మాట్లాడి వీరి దగ్గర అసిస్టెంట్‍గా చేర్చాలని తీసుకొని వచ్చాను" ఆ ఇరువురి ముఖాలను మార్చి మార్చి చూస్తూ వినయంగా చెప్పాడు బాలగోవిందయ్య.


"నీ పేరేమిటి?" అడిగాడు ముకుందవర్మ.


"రాంబాబు సార్!" మెల్లగా చెప్పాడు రాంబాబు.


యిరువురినీ చూచి "కూర్చోండి" చెప్పాడు ముకుందవర్మ.


యిరువురూ వారి ఎదుటి సోఫాలో కూర్చున్నారు.

"మీది ఏ వూరు?" అడిగాడు ముకుందవర్మ.


రాంబాబు క్షణంసేపు వారి ముఖంలోకి చూచి.... వెంటనే బాలగోవిందయ్య ముఖంలోకి దిగాలుపడి చూచాడు.


"ఇతనికి తల్లిదండ్రులు పుట్టిన వూరు తెలియదు సార్. చర్చి ఫాదర్ ఆశ్రయంలో పెరిగాడు."


’తల్లితండ్రి వూరు పేర్లు తెలియని ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు!.... ఏ కారణం వలన ఇతను తన తల్లిదండ్రులను దూరం అయినట్లు?... వారు ఎక్కడ వున్నట్లు?.... వున్నారో లేదో!.... మన కులంవాడైతే ఎంత బాగుండేది? భామను యితనికి ఇచ్చి పెండ్లి చేసి... భామను ఎప్పుడూ నా కళ్ళముందుండేలా చేసుకొనేదాన్ని... నాకు అంత అదృష్టమా!’ అనుకొంది నీలవేణి.


"రేపటి నుండి నీవు ఉదయం ఎనిమిది గంటలకు యిక్కడికి రావాలి." చెప్పాడు ముకుందవర్మ.


"అలాగే సార్" వినయంగా చెప్పాడు రాంబాబు.


"మీ గురించి మీ ఫాదర్ జాన్ నాకు అన్ని విషయాలు ఫోన్‍లో చెప్పారు. జాన్ నాకు మంచి స్నేహితుడు. చాలా మంచి వ్యక్తి. మానవతావాది. నా గురించి బాలగోవిందయ్య నీకు చెప్పాడనుకొంటాను. నేను పేరుకు క్రిమినల్ లాయర్‍ని. కానీ... నా నిర్ణయాలు ధర్మాధర్మాల మీదనే ఆధారపడి వుంటాయి. అధర్మం చేసిన వారికోసం నేను ఏనాడూ వాదించలేదు. వాదించబోను. సత్యాన్ని, ధర్మాన్ని బ్రతికించడమే మన వృత్తిధర్మం. మన వృత్తి నిర్వహణలో మనం పూర్వాపరాలు పరిశీలించి సత్య ధర్మాలను రక్షించేదానికే మనం వాదించాలి. వాటిని గెలిపించాలి. ఏమంటావ్?" రాంబాబు ముఖంలోకి చూస్తూ అడిగాడు ముకుందవర్మ.


నీలవేణి లోనికివెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చింది. భర్త ప్రక్కన సోఫాలో కూర్చుంది.


"మీలాంటి వారి పరిచయ భాగ్యం నాకు కలిగినందుకు సంతోషిస్తున్నాను సార్!.... మీరు చెప్పిన రీతిలో నడుచుకొంటాను" చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు.


పనిమనిషి... మల్లి రెండు కాఫీ కప్పులతో వచ్చింది. రాంబాబుకు, బాల గోవిందయ్యకు అందించి లోనికి వెళ్ళిపోయింది.

"త్రాగండి" అంది నీలవేణి.


ఆ ఇరువురూ కాఫీ త్రాగి కప్పులను టీపాయ్‍పై వుంచి లేచి నిలబడ్డారు.

"వెళ్ళొస్తాను సార్!" చెప్పాడు రాంబాబు.


"మంచిది బాబు" అన్నాడు ముకుందవర్మ.


రాంబాబు, బాలగోవిందయ్య వెళ్ళిపోయారు.

"అబ్బాయి చాలా బాగున్నాడు కదండీ!" అంది నీలవేణి.


ముకుందవర్మ ఆమె ముఖంలోకి చూచి నవ్వాడు.

లంచ్ బ్రేక్‍లో ముకుందవర్మ భోజనం చేసి కోర్టులోని తన ఛాంబర్‍లో కూర్చొని ఏదో కేసు కట్టను పరిశీలిస్తూ వున్నాడు.


టేబుల్ మీద వున్న తన యాపిల్ ఐఫోన్‍లో మెసేజ్ వచ్చిన సవ్వడి. వెంటనే సెల్‍ను చేతికి తీసుకొన్నాడు. తన చెల్లెలు నందిని భర్త పరమశివం అమెరికా నుండి పంపిన మెసేజ్.


’బావా!... నీ లాప్‍టాప్‍ను ఓపెన్ చేసి చూడు. ఒక ముఖ్యమైన మెసేజ్‍ను పంపాను.’


ఆ మెసేజ్‍ను చూచి ముకుందవర్మ ఆశ్చర్యపోయాడు. విషయం ఏమై వుంటుందా అనే ఆలోచన. లాప్‍టాప్ ఇంట్లో ఉంది. మూడుగంటలకు జడ్జిగారి ముందు ఒక కేసు విచారణ.

సెల్‍లో మెసేజ్ సౌండ్ రాక మునుపు ఆ కేసుకు సంబంధించిన కాగితాలనే వారు పరిశీలిస్తూ వున్నది....


పరమశివం మెసేజ్... అతన్ని కలవరపరిచింది. ఆ కేసు వాయిదాకు పేపర్ రెడీ చేసి... బాలగోవిందయ్యకు ఇచ్చి... కార్లో వేగంగా యింటికి చేరాడు. 


ఆఫీస్ గదిలోనికి వెళ్ళి లాప్‍టాప్‍ను ఓపెన్ చేశాడు. ఆ సమయంలో అర్థాంగి నీలవేణి ప్రక్కవీధిలో వున్న తన అమ్మానాన్నల ఇంటికి వెళ్ళింది.


’బావా!... ఈ వార్త నీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మన సత్యభామ.... యిక్కడ మన ప్రాంతం నుంచే వచ్చిన కెమికల్ ఇంజనీర్‍గా పనిచేస్తున్న మురళీధర్ అనే అబ్బాయిని యిష్టపడి... అతనితో నాలుగురోజుల క్రితం డేటింగ్ ప్రారంభించింది. నేను, నందినీ ఎంతగా చెప్పినా, మా మాటలను లక్ష్యపెట్టలేదు. ఎదిగిన పిల్ల..... స్వతంత్రభావాలు కలది. పైగా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ వుంది కదా!... మురళీధర్... సత్యభామా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం అని మేము చెప్పిన మాటలను ఆమె లెక్కచేయలేదు. మన ఇంటికి రావడం లేదు.


కనుక... మీరు వెంటనే అమెరికాకు వచ్చి భామను మీతో తీసుకొని వెళ్ళవలసినదిగా కోరుచున్నాను. నేను విచారించి తెలుసుకొన్న విషయం, ఆ మురళీధర్ క్యారెక్టర్ లెస్ పర్సన్.

బై.... 

పరమశివం.


మెసేజ్ చదివి ముకుందవర్మ నిర్ఘాంతపోయాడు. తాను... తన కూతురుకు యిచ్చిన స్వేఛ్చా స్వాతంత్ర్యాలను ఆమె... ఆ రీతిగా దుర్వినియోగం చేస్తుందని తాను ఎన్నడూ వూహించలేదు.

ఈ విషయం తన భార్య నీలవేణికి తెలిస్తే... ఆమె గుండె ఆగిపోయి చచ్చిపోతుంది. ఒక్కగానొక్క కూతురైనందున భామ విషయంలో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకొని వుంది. తన కూతురు తాను చెప్పింది విని.. తనకు ఆనందాన్ని కలిగిస్తుందనే నమ్మకం ఆమె మనస్సు నిండా ఉంది.

కనుక... ఈ విషయాన్ని తాను నీలవేణికి చెప్పలేదు. తన మనస్సున దాచుకొని సున్నితంగా సమస్యా పరిష్కారాన్ని చేయాలి.


అతి విద్య, స్వేఛ్చా కొందరి విషయంలో విపరీత పరిణామాలకు దారితీస్తాయనే సత్యం సత్యభామ విషయంలో యదార్థంగా మారిపోయింది. ఆలస్యం చేయకుండా తాను అమెరికా వెళ్ళి భామను ఇండియాకు తీసుకొని రావాలి. ’ఆలస్యం అమృతం విషం’ అనుకొన్నాడు ముకుందవర్మ.


చెన్నైలో వున్న తన మిత్రుడు లాయర్ విశ్వనాధన్‍కు తన పేర అమెరికాకు ఒక టిక్కెట్ బుక్ చేయవలసిందిగా పాస్‍పోర్టు నెంబర్ ఇచ్చి, ఫోనులో చెప్పాడు. విశ్వనాధ్ సరేనని బుక్ చేసి ఫోన్ చేస్తానని చెప్పాడు.


నీలవేణి ఇంటికి వచ్చింది. భర్త ముఖంలో వున్న అప్రసన్నతను చూచి....

"ఏమండీ... అదోలా వున్నారు?" అడిగింది.


"ఒక కేసు విషయం... దాన్ని గురించి ఆలోచిస్తున్నాను. ఆ కేసుకు సంబంధించిన ఒక ముఖ్య వ్యక్తి అమెరికాలో వున్నాడు. అతన్ని కలిసి మాట్లాడేటందుకు నేను అమెరికా వెళ్లవలసి వుంది" సాలోచనగా చెప్పాడు ముకుందవర్మ.


"నేనూ మీతో రానా!... మన వాళ్లందరినీ చూచినట్లుంటుంది" ఆసక్తిగా అడిగింది నీలవేణి.


"నీలూ!.... నేను అక్కడ వుండబోయేది రెండు మూడు రోజులే.. మన ఇరువురం మన వాళ్ళతో కలిసి తిరిగేదానికి సమయం చాలదు."


"అంటే నేను వచ్చేదానికి వీలు కాదంటారా!" విచారంగా అడిగింది నీలవేణి.


"అవును నీలూ!..."


"సరే మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి" ముక్తసరిగా చెప్పింది. కానీ... భర్తతో కలిసి తాను అమెరికా వెళ్ళలేకపోతున్నందుకు మనస్సులో కొంత బాధ.


అడ్వకేట్ విశ్వనాధన్.... ఆ మరుదినం రాత్రి వయా దుబాయ్ మీదుగా ముకుందవర్మకు టికెట్ బుక్ చేసినట్లు మెసేజ్ పంపాడు.


ముకుందవర్మ.... ఆ ఉదయం కార్లో చెన్నైకి బయలుదేరాడు. భార్య నీలవేణి... తాను భర్తతో వెళ్లలేకపోయినందుకు బాధపడుతూ... భర్తకు వీడ్కోలు చెప్పింది. ముకుందవర్మ నాలుగు గంటలకు చెన్నై చేరాడు. ముకుందవర్మ... రామనాథం వద్ద టికెట్ తీసుకొని ఆ రాత్రి అమెరికాకు బయలుదేరాడు. పరమశివంకు తాను ఎన్నిగంటలకు అమెరికా చేరబోతున్న విషయాన్ని మెసేజ్‍గా పంపాడు.


పరమశివం... ముకుందవర్మను హోస్టన్ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకొన్నాడు. ఆ ఉభయులు వారి నిలయం చేరారు.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


49 views0 comments

Comentários


bottom of page