ప్రేమ వెలుగుల జ్యోతి
- Neeraja Prabhala

- 4 days ago
- 6 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #KutumbaBandhamIntintiVelugu, #ప్రేమవెలుగుల జ్యోతి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Prema Velugula Jyothi - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 14/11/2025
ప్రేమ వెలుగుల జ్యోతి - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
సాయంత్రం ఆరుగంటల సమయంలో రామయ్య గారు వరండాలో వాలుకుర్చీలో వాలుగా కూర్చొని పత్రిక చదువుతున్నారు.
పెరటిలోని చెట్ల చల్లని గాలితో సుమనోహర పూల వాసనతో ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, కానీ ఆయన మనసు మాత్రం ప్రశాంతంగా లేదు సరికదా ఎందుకో అల్లకల్లోలంగా ఉంది.
“ఇంత పెద్ద ఇల్లు... ఇంట్లో అందరూ ఉన్నారు కానీ నాకు ఎవరూ లేరన్నట్టుంది. ప్రతి ఒక్కరు తమ తమ ఫోన్లలో, తమ పనుల్లో... బిజీ. ఫోన్ల మోత, మాటల ధ్వనులు వినిపిస్తున్నాయి కానీ తన మనసులో మాత్రం మౌనం? ఎందుకీ ఇంట్లో ఇంత నిశ్శబ్దం?” అనుకున్నాడు రామయ్య తన మనసులో.
వంటగదిలో భార్య లక్ష్మి టీ పెడుతూ తన భర్తని గురించి ఆలోచిస్త్తూ మధ్య మధ్యలో ఆవిడ చూపులు భర్తని గమనిస్తున్నాయి. ఎందుకో ఈ మధ్య ఆయన ఎక్కువ మౌనంగా ఉంటున్నారు.
" ఏమండీ! చాయ్ త్రాగుతారా?" పెద్దగా కేకేసి అడిగింది లక్ష్మి భర్తని.
"త్రాగుతా! తీసుకురా... కానీ ఈ చాయ్ కంటే మనమధ్యన మాటలు అరుదైపోయాయ్." అన్నాడు తెచ్చి పెట్టుకున్న నవ్వుతో రామయ్య.
లక్ష్మి పెదవులపై చిరుదరహాసం మెరిసింది. ఇంతలో కొడుకు అరుణ్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు.
హాలులో తన ల్యాప్‌టాప్‌ను తెరిచి, నేరుగా టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
కోడలు నేహ వంటలో బిజీగా ఉంది. కూతురు సుమ కాలేజీ నుంచి వస్తూనే ఫోన్‌లో మాట్లాడుతూ తన రూమ్‌లోకి వెళ్లింది.
"ఇదేనా మనమిద్దరం కలసి కలలు కనిన ఇల్లు... ఇప్పుడు మన అందరి మధ్య ప్రేమాప్యాయతలేవి? దగ్గరగా ఉంటున్నా మన మధ్యన అందనంత దూరాలు మాత్రమే కనిపిస్తున్నాయి." అన్నాడు రామయ్య లక్ష్మికి వినిపించేట్టుగా.
ఆ రాత్రి లక్ష్మి నేహతో కిచెన్‌లో మాట్లాడుతోంది.
“నేహా! నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. నీవు అందరినీ చక్కగా చూసుకుంటున్నావు, కానీ ఈ మధ్య మామయ్య గారు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు.” అంది లక్ష్మి.
“అవునత్తమ్మా! నాకు కూడా అలానే అనిపిస్తోంది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు తమ పనుల్లో మునిగి ఉన్నారు. మనమందరం కలసి కూర్చొని నవ్వుతూ మాట్లాడిన రోజులను ఎప్పుడో మర్చిపోయాం.” అంది నేహ.
“అత్తమ్మా! నేను రేపు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. అది ఇప్పుడు సస్పెన్స్. “ అంది నవ్వుతూ నేహ.
కోడలివైపు నవ్వుతూ చూసి ఊరుకుంది లక్ష్మి.
ఆ మరురోజు సాయంత్రం 7 గంటలకి అందరినీ హాలులోకి పిలిచింది నేహ.
టేబుల్ మీద ఒక చిన్న కేక్ ఉంచి దాని మీద రాసి ఇలా ఉంచింది నేహ.
“ మనమంతా కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడే ఇంటివెలుగు!” అందరూ దాన్ని గమనించారు.
"ఏమిటి ఇది నేహా?" అన్నాడు అరుణ్.
"ఇది మన చిన్న కుటుంబ పార్టీ. కనీసం ఈ రోజు ఫోన్లు పక్కన పెట్టి అఉదరం మనసువిప్పి మాట్లాడుకుందాం."
"అమ్మా! చాలా క్యూట్ ఐడియా!" అంది సుమ.
“మిమ్మల్నందరినీ ఇంతకాలం తరువాత ఇలా ఒకచోట చూస్తుంటే నా మనసు చాలా హాయిగా ఉంది. ” అన్నాడు రామయ్య.
అందరూ రామయ్య చేత సరదాగా కేక్ కట్ చేయించారు. నవ్వులు, చిన్న చిన్న జోక్స్, ఆత్మీయ మాటలు — ఆ ఇంట్లో మళ్లీ జీవం వచ్చింది.
రామయ్య గారి కళ్లల్లో తడి మెరుస్తోంది.
"నేహా! నువ్వు నా కోడలు కాదు అమ్మా... మా ఇంటి వెలుగు."అన్నాడు రామయ్య మనస్ఫూర్తిగా ఆమెని మెచ్చుకుంటూ.
“మనకు ఈ వృధ్ధాప్యంలో కావలసింది ఇదేనండి. మనం కలసి ఉండే ప్రతి క్షణం అపురూపం” అంది లక్ష్మి.
చాలా కాలం తర్వాత ఆ రాత్రి అందరూ ఒకే టేబుల్ దగ్గర భోజనం చేశారు. చిన్న నవ్వులు, పాత జ్ఞాపకాలు, ప్రేమతో కూడిన మాటలతో సందడిగా ఉంది. — ఆ ఇంట్లో మళ్లీ దీపావళి నాటి వెలుగు వెలిగింది.
ఒక కుటుంబం కలసి కూర్చుని మాట్లాడటం – అదే ఇంటి నిజమైన వెలుగు.
ఆ రోజు నుంచి ప్రతి ఆదివారం ఫ్యామిలీ సమయంగా నిర్ణయించారు.
మనుషుల మధ్యన ప్రాంతాలు దూరాలు కాదు, ప్రేమే మనుషులను దగ్గర చేస్తుంది.
లక్ష్మికి తను ప్రభుత్వ ఉద్యోగం మానేసి తను పిల్లల కోసం చేసిన త్యాగం గుర్తొచ్చింది.
ఆ మరురోజు సాయంత్రం – లక్ష్మి కిచెన్‌లో వంట చేస్తోంది.
నేహ, అరుణ్ లు తమ తమ ఆఫీసు పనుల్లో బిజీగా ఉంటున్నారు.
"ఎంత ప్రయత్నిస్తున్నా ఈ పిల్లలతో సరదాగా గడిపే అవకాశం చాలా తక్కువగా ఉంటోది. ఆయన అర్థం చేసుకుంటారా?" మనసులో అనుకుంది లక్ష్మి.
“అమ్మా! ఈ రోజు క్లాస్ చాలా కష్టంగా ఉంది. పాఠాలు అర్థం కాక చాలా టెన్షన్ గా ఉంది.” అంది అప్పుడే కాలేజి నుండి ఇంటికొచ్చిన సుమ.
“సుమా! నీ ఆరోగ్యాన్ని మొదట చూసుకో! చదువు తర్వాత.” అంది లక్ష్మి.
“అమ్మా ! రేపు ఆఫీసు పని చాలా ఉంది. కానీ నేను పెందరాడే ఇంటికి చేరుకుంటే కాస్త మాట్లాడుకుందాం. ఇంటికి రావడం ఆలశ్యం కావచ్చు. కంగారుపడకు. ” అన్నాడు అరుణ్.
“సరేలేరా!” అంది లక్ష్మి వంటగది పని ముగించుకుని వచ్చి కుర్చీలో కూర్చోబోతూ అకస్మాత్తుగా తూలబోయింది.
అది గమనించిన నేహ “అత్తమ్మా! ఏమైంది?!” అంది అతృతగా ఆవిడ దగ్గరకు వస్తూ.“
ఏంలేదు. కొంచెం తూలింది. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది” అంది లక్ష్మి.
“ఏం జరిగింది లక్ష్మి? నీవు జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం.” అన్నాడు కంగారు పడుతూ రామయ్య.
అరుణ్ వెంటనే తమ ఫామిలీ వైద్యుడికి ఫోన్ చేసి పిలిచాడు. డాక్టర్ వచ్చి ఆమెని పరీక్షించి నీరసంగా ఉందని, బలానికి మందులు వ్రాసిచ్చి వెళ్లాడు.
అరుణ్ బయటకు వెళ్లి ఆ ముదులను తెచ్చి తల్లికి అందిస్తే ఆవిడ వాటిని వేసుకుని పడుకుంది.
రోజులు గడుస్తున్నాయి. లక్ష్మి నెమ్మదిగా కోలుకుంటోంది.
ఆ రోజు – అరుణ్ ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీసులో ఓ ప్రాజెక్ట్ అవార్డు అందుకుంటున్న రోజు.
ఇంట్లో TV లో దాన్ని చూడటానికి రామయ్య తో సహా అందరూ ఆతృతగా కూర్చుని చూస్తున్నారు. . ప్రెజెంటేషన్ తరువాత, సీనియర్ బాస్,
“అరుణ్! మీరు ఈ ప్రాజెక్ట్‌ని సమయానికి పూర్తి చేసి, మన కంపెనీకి బలమైన ఫలితం ఇచ్చారు. మీరు నిజమైన హీరో!”అన్నాడు అరుణ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ.
“చాలా ధన్యవాదాలు సర్.ఇదంతా నా టీమ్ క్రెడిట్.” అన్నాడు అరుణ్ నవ్వుతూ. అరుణ్ అవార్డు తీసుకుంటున్నప్పుడు రామయ్య, లక్ష్మి ల కళ్లలో మెరుపు స్పష్టంగా కనిపిస్తోంది. అది గమనించిన నేహ అరుణ్ పట్ల ఆ తల్లి తండ్రుల ప్రేమకి సంతోషించింది.
కాసేపటి తర్వాత రామయ్య తన కుర్చీలో కూర్చుని గత తలపులను గుర్తు తెచ్చుకున్నాడు.
"నా కొడుకు… చిన్నప్పుడు ఆటలలో ఓడిపోతూ ఎప్పుడూ ఏడ్చేవాడు. ఇప్పుడు నిజంగా గొప్పవాడు అయ్యాడు." అనుకున్నాడు మనసులో రామయ్య.
“పొద్దస్తమానం ప్రతివాళ్లు తమ తమ జేబులలో ఫోన్లను చూసుకోవడం కంటే ఇలా తమ తమ వృత్తులలో కష్టపడి విజయం పొందడం గొప్పది.” అన్నాడు రామయ్య లక్ష్మితో.
“చూడండి. మన అరుణ్ ఎంత వృద్ధి లోకి వచ్చాడో కదా! మన కృషి ఫలించింది.” అంది భర్తతో లక్ష్మి.
మరుసటి రోజు ఇంటికి వచ్చిన అరుణ్ ని అందరూ అభినందించారు. తండ్రి కళ్లలో సంతోషాన్ని చూసి తృప్తిగా ఉన్నాడు అరుణ్.
"అప్పుడు చాలా కష్టపడుతున్నానని అనుకున్నా కానీ ఇప్పుడు నాన్న కళ్ళలో సంతోషంతో కూడిన గర్వం కనిపిస్తోంది. తండ్రి ప్రేమ ఎప్పుడూ మాటల్లో ఉండదు, కానీ కళ్ళలో, చిన్న చిన్న మెరుపులలో మనసుని కదిలిస్తుంది” అనుకున్నాడు అరుణ్ (మనసులో):
సుమ తన రూమ్‌లోని ల్యాప్‌టాప్ ని మూసేసి తల్లి వద్దకు వచ్చి “అమ్మా! డాక్టర్ కావాలనేది నా కల… కానీ ఫీజులు ఎక్కువ. ఎవరికి చెబుతాను?”
లక్ష్మి (గుండె నిండా ప్రేమతో):
“మనం ప్రయత్నిస్తే అసాధ్యం ఏదీ ఉండదు. నీవు కష్టపడి బాగా చదువు. స్కాలర్షిప్ తెచ్చుకో. సంకల్ప బలం దిశగా ఒక్కో అడుగు గట్టిగా వేయాలి. నీ కల నిజం చేసుకోవాలి. అందుకు మేమందరం నీకు మద్దతు నిస్తాం ” అంది కూతురికి ధైర్యం చెప్తూ లక్ష్యం సాధించే దిశగా.
“సుమా! నేను నా జీతంలో ప్రతినెలా నీకు సహాయం చేస్తాను.” అన్నాడు చెల్లెలి ఆశయాన్ని మెచ్చుకుంటూ అరుణ్.
సుమ (సంతోషంతో) “ మీరందరూ నన్ను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, నాకు అండగా నిలబడడడం చాలా గొప్ప. అదే నాకు నిజమైన ఆనందం.” అంది. సోదర సోదరిల మధ్యలో ప్రేమ – మాటల్లో కాదు, త్యాగంలో ఉంటుంది.
రోజూలాగానే ఆరోజు నేహ వంటలో బిజీగా ఉంది.
“నేహా! నీవు అందరికీ వంటలు చేస్తుంటే నీకు అలసట అనిపించట్లేదా?” లక్ష్మి ఆమెకు దగ్గరకి వచ్చి అంది.
“అత్తమ్మా! నాకు మీతో పనిచేయడం ఆనందం. పెళ్లైన క్రొత్తల్లో మొదట చిన్న గొడవలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మనం బలమైన బంధంగా మారాం.” అంది నేహ.
“అవును. నిజంగా! మనం మన మనసులను అర్థం చేసుకున్నాం కనుకనే తల్లి-కూతురు లాంటి అనుబంధం మనమధ్యన బలంగా ఏర్పడింది. నాకు సుమ, నీవు ఒకటే నేహా “ అంది లక్ష్మి.
“నాకు తెలుసు అత్తమ్మా! అర్థం చేసుకున్న ప్రేమే బలమైన బంధం.” అంది నేహా నవ్వుతూ.
అరుణ్ ఆఫీస్ నుంచి కోపంతో ఇంటికి వచ్చాడు.
“ఏం జరిగిందో చెప్పు అరుణ్?”ఎందుకలా కోపంగా ఉన్నావు?” అన్నాడు రామయ్య.
అరుణ్ మౌనంగా తన గదిలోకి వెళ్లాడు. “మీరు ఒక మాట కూడా చెప్పకుండా అలా కోపంగా గదిలోకి వెళ్లిపోతే, మా అందరికీ ఎంత బాధగా ఉందో తెలుసా?” అంది నేహ అతని వెనకనే గదిలోకి వస్తూ.
కోపం క్షణకాలం, కానీ దాని బాధ కుటుంబంలో అందరి మనసుల్ని కుదిపేస్తుంది. అరుణ్ మౌనాన్ని అర్థం చేసుకున్న నేహ అతన్ని ఏకాంతంగా ఉంచి గదినుండి బయటికి వెళ్లింది.
అరుణ్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు.
"నాన్నా, అమ్మా, సుమ, నేహా అందరూ నా గురించి కంగారు పడుతూ బాధపడుతున్నారు. వాళ్లు నా ఎడల ఎంత ప్రేమతో ఉన్నారో గుర్తొచ్చింది." అరుణ్ (మనసులో) అనుకుని చటుక్కున లేచి వాళ్ల వద్దకు వెళ్ళాడు.
“అమ్మా… నాన్నా… నన్ను క్షమించండి. ఆఫీసులో పని వత్తిడి లోని నా కోపాన్ని మీకు చెప్పలేక నేను తప్పు చేసాను.”అన్నాడు అరుణ్.
“అరుణ్! నీవు చిన్నవాడివి. ఇప్పుడు సరిగ్గా తెలుసుకున్నావు కాబట్టి మనం సంతోషంగా ఉన్నాం.”అన్నాడు రామయ్య.
“నీవు చేసే ప్రతి పని దశలో మా ప్రేమ ఉంటుందంటే, అది ఎప్పుడూ నీకు శక్తినిస్తూ ఉంటుంది. ప్రేమను గుర్తించేది మాటలు, చేతలలోని భావాలలో” అంది లక్ష్మి.
కొంతకాలం తర్వాత సుమ కష్టపడి చదివి ఎమ్ సెట్ లో మంచి రాంకుని పొంది మెడికల్ సీటుని, స్కాలర్షిప్ ని పొందింది. ఆ ఇంట్లో ఆనందం అంబరాన్నంటింది. అందరూ సుమని మెచ్చుకున్నారు.
సుమ డాక్టర్ కోర్సు చదువుతోంది. రోజులు హాయిగా గడుస్తున్నాయి. చూస్తూండగానే మరో నాలుగేళ్ల తర్వాత సుమ చదువు పూర్తయి హౌస్ సర్జన్ చేస్తోంది.
కొన్నాళ్లుగా సుమ, తన సహాధ్యాయి రవి ప్రేమించుకుంటారు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరువురూ తమ తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలనుకున్నారు.
“అమ్మా, నాన్నా! నేను రవిని ఇష్టపడుతున్నాను. మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటాము” అంది సుమ ఒకరోజున తల్లి తండ్రులతో.
“మన బిడ్డ, మన ఆశీర్వాదం లేకుండా వైవాహిక జీవితంలోని ఆనందం అసంపూర్ణం. అది బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకునుంటుంది. అందుకే మనం మన బిడ్డని ఆశీర్వదించాలి అనుకున్నారు లక్ష్మి దంపతులు. రవిని ఇంటికి తీసుకు రమ్మన్నాడు రామయ్య. చిన్ననాటి నుంచి రవి అనాధ శరణాలయంలో పెరిగి, పెద్దై కష్టపడి చదువుతున్నాడు. అతనికి అన్నీ మనమే ఇంక” అంది సుమ వాళ్లతో.
ఆ మరుసటిరోజున రవిని ఇంటికి తీసుకువచ్చి తల్లి తండ్రులకు, అన్నా, వదినలకు పరిచయం చేసింది సుమ.
రవి మాటతీరు, వినయవిధేయతలు, సంస్కారం ఆ ఇంట్లో అందరికీ నచ్చి వాళ్ల పెళ్లికి ఆమోదం చూపారు.
అతి త్వరలోనే వాళ్లిద్దరికి రిజిస్టర్ మారేజ్ చేశారు రామయ్య దంపతులు. వాళ్లకు దగ్గరలోనే సుమ, రవిలు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని క్రొత్త కాపురం మొదలుపెట్టారు. వాళ్ల అన్యోన్య కాపురాన్ని చూసి ఇంట్లో అందరూ సంతోషిస్తున్నారు.
చూస్తూండగానే మరో రెండేళ్లు గడిచాయి. సుమ, రవిలు హౌస్ సర్జన్ పూర్తి చేసి మంచి హాస్పిటల్ లో ఉద్యోగంలో చేరి తమ వృత్తిని కొనసాగిస్తున్నారు.
ఆ రోజు దీపావళి రోజు. సుమ, రవిలు రామయ్య ఇంటికి వచ్చారు. ఇల్లంతా దీపాలతో అలంకరించారు నేహా, సుమలు. ఇల్లంతా దీపాలు వెలిగి కళకళలాడుతూ ఉంది.
“ఈ దీపం లాంటి ప్రేమ మనం వెలిగించకపోతే,ఈ ఇల్లు చీకటిలో ఉంటుంది.” అన్నాడు రామయ్య లక్ష్మితో.
“అమ్మా,నాన్నా! ఇప్పుడు అర్థమైంది – మనం కలసి ఉండే ప్రతి క్షణము ప్రేమ వెలుగుల దీపావళి.” అన్నాడు అరుణ్ సంతోషంగా. క్షమించగల మనసే పండుగకు నిజమైన అర్థం మనసులో అనుకున్నారు నేహా, అరుణ్ లు.
“ప్రేమానురాగాలే మన బలము.” అన్నారు సుమ, రవిలు.
“సరే!అందరూ భోజనాలకు లేవండి. అంది నేహ వంటగదిలోకి వెళుతూ.
అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు.
కొన్నాళ్ల తర్వాత నేహ మహిళల సాధికారత కోసం ఒక సంఘాన్ని ప్రారంభించి దాని పాంప్లెట్లను అందరికీ పంచి, వ్యక్తి గతంగా ఇంటింటికి వెళ్లి సంఘం గురించి వాళ్లందరికీ అర్థమయ్యేలా వివరించింది. చాలా మంది మహిళలు అందులో చేరారు.
పెద్ద పెద్ద సంస్ధల వాళ్లని కలిసి తన సంఘంలోని వాళ్లకు ఉద్యోగాలను కల్పించింది నేహ. ఉపాధికి అనేక పొదుపు పథకాలను చేపట్టి ఆ దిశగా విజయం సాధిస్తోంది నేహ.
సుమ, రవిలు డాక్టర్ లుగా సేవలందిస్తూ మంచిఖ్యాతిని గడిస్తున్నారు. వీళ్లనందరినీ చూస్తున్న రామయ్య దంపతులు సంతోషంగా ఉంటున్నారు. సంతోషమే సగం బలం కదా!
“నాకు కాస్త గర్వంగా కూడా ఉంది. మన ప్రేమ, గౌరవం, కృషి… ఫలితంగా మన పిల్లలు చక్కగా వృధ్ధిలోకి వచ్చారు” అన్నాడు రామయ్య లక్ష్మితో.రవి కూడా మన పిల్లవాడే అనుకున్నారు ఆ దంపతులు.
“ఇది మన కుటుంబం సరైన దిశగా ఎదిగిన వైనం. ప్రేమతో నడిచే మార్గమే మన జీవిత విజయానికి మార్గం. కుటుంబం అనేది గోడలతో కట్టిన ఇల్లు కాదు, మనసుల మధ్య కట్టిన బంధం.” అంది లక్ష్మి నవ్వుతూ.
వారాంతాలలో ఆ ఇంట అందరూ కలసి భోజనం, నవ్వులు, పాటలతో గడపడం పరిపాటైంది.
“నేను కలలు కనిన ఇల్లు ఇదే. మనమందరం ఇలా ప్రేమాప్యాయతలతో కలసి ఉన్నప్పుడు ఇదే నిజమైన స్వర్గం.” అన్నాడు రామయ్య.
“ప్రేమ, గౌరవం, క్షమ – ఇవన్నీ ఇంట్లో దీపాన్ని వెలిగించే మూలధనం.” అంది లక్షి.
రవి దంపతులు, అరుణ్ దంపతులు వాళ్లకి నమస్కారం చేయగా వాళ్లని మనస్ఫూర్తిగా దీవించారు లక్ష్మి, రామయ్యలు.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link




Comments