'Premathathvam' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 24/12/2023
'ప్రేమతత్వం' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మన హైందవ సిద్ధాంత ప్రకారం వివాహబంధం ఎంతో పవిత్రమైనది. ప్రేమించి పెళ్ళి చేసుకొనే వారు కొందరైతే... పెళ్ళి చేసుకొని ప్రేమతో ఆనందంగా సహజీవనం చేసేవారు ఎందరో!... మన తాత తండ్రుల సంపార జీవితం అలాగే సాగింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ ద హెవెన్... ఆంగ్ల సామెత... దాన్ని కూడా తప్పకుండా పాటించారు. మన పెద్దలు. ఆ వ్యవస్థను నమ్మి... ఎదుటివారిలోని లోపాలను లెక్క చేయకుండా ప్రేమను పంచడం... నిజమైన మానవతకు నిదర్శనం అవుతుంది. అదే అసలైన ప్రేమ.....
ఆనందరావు... ఎమ్.టెక్, సివిల్ ఇంజనీర్, ఉద్యోగ రీత్యా స్థిరపడి.... చెల్లెలు సంధ్యకు వివాహం జరిపించి... ముప్పై సంవత్సరాల ప్రాయంలో నెల రోజుల క్రిందట రంజితను వివాహం చేసుకొన్నాడు. ఆనందరావు తల్లి గతించి ఐదేళ్లయింది. తండ్రి గోవిందరావు గ్రామవాసి. వున్న పది ఎకరాల భూమిని సాగు చేయిస్తూ గ్రామంలో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు. మంచి మనస్సు వున్న మనిషి, ఆ గ్రామానికి సర్పంచ్.
పంకజం... మల్లయ్యలు భార్యాభర్తలు. మల్లయ్య తాపీ మేస్త్రి... పంకజం ఆ కాలనీలో ఐదు ఇళ్ళకు పనిమనిషి ఆ ఐదు ఇళ్ళలో ఆనందరావు ఇల్లు ఒకటి. మల్లయ్య ఆనందరావు నిర్మంచే కట్టడాలలో తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. మల్లయ్యలోని నిజాయితీ వినయవిధేయతల కారణంగా... ఆనందరావుకు అతనంటే ఎంతో అభిమానం.
ఆనందరావు వివాహం అతని మేనమామ రంగయ్య చెప్పిన సంబంధంతో జరిగింది. రంజిత బి.టెక్ పాసయింది. వారి తొలిరేయి విచిత్రంగా సాగింది.
పడక గదిలోకి ప్రవేశించిన రంజిత... ఆనందరావు వూహించిన స్థితిలో లేదు. మౌనంగా మంచాన్ని సమీపించి తల దించుకొని నిలబడింది.
కొన్ని క్షణాలు ఆమెను పరీక్షగా చూచిన ఆనందరావుకు మనస్సున ఏదో అనుమానం...
"కూర్చోండి...” అన్నాడు మెల్లగా వారి పడకగది మేడమీద, ఆ గదికి మూడు కిటికీలు వున్నాయి. రంజని ఒక కిటికీని సమీపించి....
"నేను మీతో ఒక విషయం చెప్పాలి..." అతనికి వీపు మళ్ళించి చెప్పింది.
"నిర్భయంగా చెప్పండి.."
"మన వివాహం... నా ఇష్టామసారంగా జరగలేదు."
ఆనందరావు ఆశ్చర్యపోయాడు. తదేకంగా ఆమెను కొన్ని క్షణాలు చూచి... సమీపించి....
"కాస్త వివరంగా చెబితే... బాగుంటుందేమో!..." అన్నాడు.
"నేను మరో వ్యక్తిని ప్రేమించాను. అతను మా కులం వాడు కానందున అతనితో నా వివాహం జరగలేదు"
ఆనందరావుకు విషయం పూర్తిగా అర్థం అయింది.
'అనుకున్నదొక్కటి... అయినది మరొక్కటి... బోల్తా పడిందిరో బుల్ బుల్ పిట్ట…’ పాత పాట గుర్తుకు వచ్చింది. ముఖంలో విషాదం. తొలిరేయి వింత అనుభవాలను గురించి ఆలోచించాడేగాని... ఇలా కథ అడ్డం తిరుగుతుందని అతను వూహించలేదు. ఎవరూ ఆ రీతిగా వూహించరు.
ఆనందరావు... సహృదయుడు. ఆవేశం... అహంభావం లేనివాడు. సౌమ్యుడు.
'మామయ్య మాటలను నమ్మి... ఈమెతో మాట్లాడకుండానే మెడకు తాళి కట్టాను. తాను చెప్పిన మాటలను బట్టి తనకు నాతో సంసారం చేయడం ఇష్టం లేదు. దాంపత్య జీవితంలో అన్యోన్యత వుండాలి కాని... అరమరికలు వుండకూడదు. రంజిత ధైర్యశాలి. తన మనస్సులోని మాటను నిర్భయంగా చెప్పింది. ఆమెతో జీవితాన్ని పంచుకోడం. కుదరని పని. ఆమె ఆరాధించే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని అతనికి ఆమెను అప్పగించడం న్యాయం... ధర్మం... మానవత్వం' అనుకొన్నాడు ఆనందరావు.
కొన్ని క్షణాల తర్వాత... "అతని పేరు... ఎక్కడ వుంటారో చెప్పగలరా..." అడిగాడు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ!... ఆ సుమతీ శతకసూక్తి అతనికి స్ఫూరణకు వచ్చింది.
రంజిత వెంటనే జవాబు చెప్పలేదు. ఆ మౌనాన్ని ఆనందరావు కొన్ని క్షణాలు భరించాడు. ఆ తర్వాత....
"నా ప్రశ్నకు మీ జవాబు?..." అడిగాడు ఆనందరావు.
"మీరేం చేయాలనుకొంటున్నారు?..." రంజిత ప్రశ్న.
"ఇది నా ప్రశ్నకు జవాబు కాదు. అతని వివరాలు చెప్పండి. కలసి మాట్లాడి... మిమ్మల్ని వారి వద్దకు చేరుస్తాను. మనిషిగా అది నా ధర్మంగా భావించాను. ప్లీజ్ టెల్ మీ!...”
కొన్ని క్షణాల తర్వాత....
"పేరు భార్గవరావు వుండేది గుంటూరు..."
"మీరు చదివింది అక్కడే కదూ!....”
"అవును..."
"గుంటూరులో వారి ఇల్లు ఎక్కడో చెప్పగలరా!..."
"బ్రాడీపేట, వాళ్ళ నాన్నగారు సబ్ రిజిస్ట్రార్ గోపాల్రావుగారు..."
“థ్యాంక్యూ!...” రెండు క్షణాల తర్వాత... "ఇల్లు మీది. ఆ మంచం మీది మీరు నిర్భయంగా మంచంపై పడుకోండి. నేను ఆ సోఫాలో పడుకుంటాను. వుదయాన్నే ఐదు గంటలకు లేచి నేను వెళ్ళిపోతాను. మీ వాళ్ళకు అనుమానం రాకుండా మసలుకోండి. ఆఫీసర్ కాల్ చేసి వెంటనే రమ్మన్నందున వేకువనే విశాఖకు వెళ్ళానని చెప్పండి. నేను భార్గవగారిని కలుస్తాను. విషయాన్ని మీ అభిప్రాయాన్ని వారికి చెప్పి నాతో రేవు రాత్రికి... వీలుకాని పక్షంలో ఎల్లుండి వారిని నాతో తీసికొని వస్తాను. మీ ఇరువురినీ కలుపుతాను…” సౌమ్యంగా చెప్పాడు.
ఆనందరావు టెరస్ వైపుకు వున్న ద్వారాన్ని తెరచుకొని గది నుండి బయటికి నడిచాడు.
మూడవ అంతస్థు టెరస్ పైనుంచి చూస్తే... విశాఖపట్నం విద్యుద్దీపాల కాంతితో ఎంతో రమ్యంగా కనుపించింది. ఆనందరావుకు. విరక్తిగా నవ్వుకొన్నాడు. సిగరెటు వెలిగించి... ఓ దమ్ము లాగి పొగను వదలి రేపటి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు.
***
పన్నిండు గంటల ప్రాంతాన భార్గవ ఇంటిని సమీపించి కారును రోడ్డుకు ప్రక్కగా నిలిపాడు. దాదాపు పదికార్లు భార్గవ ఇంటి ముందు అగివున్నాయి. కారు దిగి మెల్లగా ఆ భవంతి వీధి గేటును సమీపించాడు. వందకు పైగా జనం.....
'తప్పతాగి... నిశిరాత్రిలో బులెట్ నడిపిన దానికి పర్యవసానం ఇది. మూర్ఖుడు... ముప్పైఏళ్ళ లోపే పోయాడు.." అది అక్కడి జన వాక్యం. ఆ మాటలను విన్న ఆనందరావు... ఆశ్చర్యపోయాడు. అక్కడి వున్న వారి ముఖాలను పరీక్షగా చూచాడు.
'తాగుబోతు వెధవ... ఆ తండ్రి కడువున చెడబుట్టాడు. అర్ధాంతరంగా చచ్చాడు...' మరో వ్యక్తి మాటలివి.
ఆనందరావుకు... విషయం పూర్తిగా అర్థం అయింది. మెల్లగా వెనుతిరిగి కారును సమీపించి కూర్చొని స్టార్ట్ చేశాడు.
ఆనందరావు... విశాఖపట్నం చేరాడు. గుంటూరులో తాను భార్గవరావు విషయంలో విన్నది... చూచినది... రంజితకు తెలియజేస్తే ఎంతగానో బాధ పడుతుందని... పరిపరి విధాల అలోచించి... చివరకు విషయాన్ని ఆమెకు తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చారు. క్లుప్తంగా... 'రంజితగారూ!... మనం మనకు నచ్చిన నిర్ణయాలను తీసుకొంటుంటాము. అన్ని నిర్ణయాలు అనుకొన్నట్లు జరగవు. మన జీవిత విధానం... దైవ నిర్ణయానుసారంగానే జరుగుతుందని నా నమ్మకం. భార్గవగారు... ప్రస్తుతంలో యీ లోకంలో లేరు... ఈ వార్త మీకు ఎంతో బాధను కలిగిస్తుందని నాకు తెలుసు. యధార్థాన్ని మీకు తెలియజేయడం... నా ధర్మం... అదే చేస్తున్నా... మన ఇరువురికీ వివాహం జరిగింది కాబట్టి... విశాఖలోని... నా ఇంటి ద్వారం ఆరు నెలల పాటు మీ కోసం... ఎప్పుడూ తెరవబడి వుంటుంది.
ఇట్లు
ఆనందరావు?...
వుత్తరాన్ని పోస్టు చేశాడు.
***
"దండాలు బాబుగారూ!... రమ్మన్నారు కదండీ.. వచ్చేశా..." వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న ఆనందరావును చూచి ఎంతో వినయంగా చిరునవ్వుతో చెప్పాడు మల్లయ్య. దృష్టిని మల్లయ్య వైపుకు త్రిప్పాడు ఆనందరావు.
"బాగున్నావా మల్లయ్యా!..." చిరునవ్వుతో అడిగాడు.
"అంతా తమరి దయ. బాగుండా...." నవ్వుతూ చెప్పాడు మల్లయ్య...
"మల్లయ్యా....."
"చెప్పండి బాబుగారూ!...”
"ఓ నెల రోజులు పంకజాన్ని యీ ఇంట్లో వుండమని చెప్పాలి. మీ అమ్మగారు ఎప్పుడైనా రావచ్చు"
"ఆఁ... నాకు అర్ధం అయింది... బాబు నెల రోజులు కాదు... ఆరు నెలలు వుండమని పంకజానికి చెబుతా..... సంతోషమా బాబూ!..."
"చాలా సంతోషం మల్లన్న...."
"బాబూ!.... ఇకనే వెళ్ళొచ్చా!..."
"మంచిది... వెళ్ళిరా!..."
చేతులు జోడించి నమస్కరించి మల్లయ్య వెళ్ళిపోయాడు.
***
"ఏం నిర్ణయించుకొన్నావు?..."
తలుపు మూసి తల్లి అనసూయ పలికిన పలుకులకు రంజిత వులిక్కిపడి ద్వారం వైపు చూచింది.
అనసూయ కూతురి మంచాన్ని సమీపించి కూర్చుంది. పడుకొని వున్న రంజిత లేచి కూర్చొని తల దించుకొంది.
"నా అల్లుడు నీకు వ్రాసిన వుత్తరాన్ని చదివాను. తెరిచి వుంచిన ద్వారాలు కలకాలం అలాగే వుండవు. కొంతకాలం మాత్రమే వుంటాయి. గతాన్ని మరచి... భవిష్యత్తును గురించి ఆలోచించు. అల్లుడిగారి మనస్సు ఎంత గొప్పదో వూహించు. నీ తర్వాత పెళ్ళికి ఇంకా మాకు ఇద్దరు ఆడపిల్లలు. నీ తోబుట్టువులు వున్నారనే విషయాన్ని గుర్తు చేసికో, రేపు వుదయం మన ఇద్దరం విశాఖకు నీ ఇంటికి బయలుదేరుతున్నాము. నీ తండ్రి రాజకీయ నాయకుడే కావచ్చు. గొప్ప పేరు వుండవచ్చు. ఆయనకు సంబంధించినవి నాకు సొంతం అవుతాయి. వివాహం అయిన నీకు కావు, నీ సొంతం... నీ సర్వస్వం విశాఖపట్నంలో వున్న నీ భర్త ఆనందరావు... రేపు వుదయం మన ప్రయాణం... నీ మంచి కోరి నేను చెప్పిన మాటలను అర్థం చేసికో..." కొన్ని క్షణాలు రంజిత ముఖంలోకి చూచి నిట్టూర్చి మౌనంగా వెళ్ళిపోయింది అనసూయ.
***
కాలింగ్ బెల్ నొక్కాడు ఆనందరావు. పంకజం తలుపు తెరిచింది. "అయ్యగోరూ... అమ్మగారు... వాళ్ళ అమ్మగారు వచ్చారు..." ఆనందంగా నవ్వుతూ చెప్పింది పంకజం.
ఆనందరావు పూహించని వార్తను విన్నాడు. ముఖంలో ఎంతో సంతోషం... వెంటనే బదులు పలకలేకపోయాడు.
"నిజం అయ్యగారూ... నా మాట నమ్మండి..."
"అలాగా!..."
"అవును..."
"వారెక్కడ!..."
"సీతారాముల ఆలయానికి వెళ్లారు. గంటయింది. యీ పాటికి వస్తా వుంటారు." పంకజం నవ్వుతూ చెప్పింది.
ఆనందరావు ఆనందంగా తన గదికి వెళ్ళిపోయాడు. కూనిరాగాలు తీస్తూ... స్నానం చేసి డ్రస్ చేసుకొన్నాడు. మెడపైని తన గది కిటికీ గుండా ఆలయానికి వెళ్ళిన... రంజిత అనసూయలు లోనికి రావడాన్ని చూశాడు.
వేగంగా మెట్లు దిగి వారు ముఖద్వారాన్ని దాటి హాల్లో ప్రవేశించగానే.... నవ్వుతూ.....
రండి... రండి... అత్తయ్యగారు!... మామయ్య... నా మరదళ్ళు బాగున్నారా..." అప్యాయంగా నవ్వుతూ అడిగాడు.
"అంతా బాగున్నారు బాబూ..." పరమానందంతో చెప్పింది అనసూయ.
రంజిత... ఆనందరావు ముఖంలోకి క్షణంసేపు చూచి తలను దించుకొంది.
"అత్తయ్యా!... నేను హోటల్ కు వెళ్ళి భోజనాన్ని పార్శిల్ చేయించుకొని ఇరవై నిముషాల్లో వస్తాను. మీరు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ వుండండి"
"బాబుగోరూ... మీరు హోటల్ కి ఎల్లాల్సిన అవసరంలేదు. పెద్దమ్మగారు వంట చేసినారు" నవ్వుతూ చెప్పింది పంకజం.
"అవును బాబూ... మూడున్నరకు వచ్చాం. అయిదున్నరకు పంకజం సాయంతో వంట పూర్తి చేశాను. భోం చేస్తారా...."
"ఓ అరగంట తర్వాత తిందాం. కొంచెం పని వుంది. పూర్తి చేసుకొస్తాను." రంజిత ముఖంలోకి క్షణంసేపు చూచి మెట్ల వైపుకు నడిచాడు ఆనందరావు.
"బాబుగోరూ... ఇకనే ఇంటికెళతా.... చిన్నమ్మగార్ని జాగర్తగా చూచుకోండి... " నవ్వుతూ చెప్పింది వంకజం.
"వెళ్ళిరా..." అంటూ మెట్లెక్కి తన గదిలో ప్రవేశించాడు. పంకజం ఆ తల్లీ కూతుళ్ళకు చెప్పి వెళ్ళిపోయింది.
"రంజితా!... అల్లుడిగారి గదికి వెళ్ళు. మాట్లాడు. మూగదానిలా ఆ చూపేంటి?... కదులు..." అంది అనసూయ.
“నాతో ఆయన ఒక్క మాట మాట్లాడలేదే…” మెల్లగా అంది రంజిత.
"మీ మధ్యన నేను పంకజం వున్నందున మాట్లాడలేదు. గదికి వెళ్ళు... నా అల్లుడు గొప్ప వ్యక్తి, చెప్పిన మాట విను. సౌమ్యంగా పలకరించు..."
రంజిత మెల్లగా మెట్లెక్కి గదిని సమీపించింది. ఎడమచేత్తో తలుపును తోసింది. గడియ పెట్టనందున తలుపు తెరచుకొంది. ల్యాప్ టాప్ ను చూస్తూ వున్న ఆనందరావు తల పైకెత్తి చూచాడు.
"ఇది మీ యిల్లు... నిర్భయంగా లోనికి రావచ్చు..." చిరునవ్వుతో చెప్పాడు ఆనందరావు.
మెల్లగా రంజిత అతను కూర్చొని వున్న కుర్చీని సమీపించి ముందున్న టేబుల్ ప్రక్కన నిలబడింది. లేప్టాప్ టేబుల్ మీద వుంది... అతను ఏదో మెసేజ్ పంపుతున్నాడు. నిలబడి వున్న రంజితను చూచి... "రొండు నిముషాలు... కూర్చోండి..."
"నా పేరు..." ఆగిపోయింది రంజిత.
"రంజిత.. ' నవ్వాడు ఆనందరావు.
"మీరు నన్ను!..."
"ఐదుక్షణాలు ఆగండి!..." దృష్టిని ల్యాప్టాప్ పై నుంచే చెప్పాడు ఆనందరావు.
మెసేజిని పంపించాడు. ల్యాప్టాప్ ను మూసేశాడు. చిరునవ్వుతో రంజిత ముఖంలోకి చూచి.. “ఆ... ఇక చెప్పండి విశేషాలు..." అన్నాడు.
రంజిత... మౌనంగా తలదించుకొని వుంది.
"ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ వున్న గొప్ప హక్కు వాక్ స్వాతంత్ర్యం. నిర్భయంగా మీరు ఏమి చెప్పదలచుకొన్నారో చెప్పండి. మీరేం చెప్పినా నాకు ఇష్టమే!..."
కుర్చీ నుంచి లేచి... ఎదురుగా వున్న కిటికీని సమీపించాడు ఆనందరావు. సమయం రాత్రి ఏడున్నర. వీధిలో కార్లు, స్కూటర్లు పోటీతో ముందుకు పరుగెడుతున్నాయి. విద్యుద్దీపాల కాంతిలో రోడ్డు మెరుస్తూ వుంది.
రంజిత ఏం చెప్పాలనుకొంటూ వుందో.. ఏ నిర్ణయానికి వచ్చిందో ఆమె చెబితే వినాలని ఆనందరావు కోరిక... ఆతృత.
ఏ మాట మాట్లాడితే... ఏమనుకుంటాడో... తనను ఏ రీతిగా అర్థం చేసుకుంటాడో అనే భయం... అనుమానం రంజిత మనస్సున.....
మెల్లగా అతన్ని సమీపించి వెనక నిలబడింది. ఆమె మాట్లాడితే వెనక్కు తిరిగాలనేది ఆనందరావు నిర్ణయం. అయిదారు నిముషాలు ఇరువురూ... వారి వారి ఆలోచనలలో వుండిపోయారు.
"రంజితా... భోజనానికి రండి..."
అనసూయ పిలుపు విని... ఆనందరావు వేగంగా వెనక్కు తిరిగాడు. వెనకనే వున్న రంజితకు అతని భుజం వేగంగా తగిలింది. రంజిత తూలి పడబోయింది. తన ఎడమ చేతిని ముందుకు చాచి రంజిత నడుముకు చుట్టి పట్టుకున్నాడు. చేతిని పైకి లేపుతూ... "సారీ అండీ!... చూడలేదు..." విచారంగా చెప్పాడు ఆనందరావు.
రంజిత... అతని కళ్ళల్లోకి చూచింది. అతని చూపుల్లో ఆవేదన... ఆమె మనస్సులోని సందేహాలు తీరిపోయాయి. వేగంగా లేచి వంగి ఆనందరావు పాదాలను తాకి... "ఏమండీ!... నన్ను క్షమించండి. మీకు ఎంతగానో బాధను కలిగించాను" దీనంగా చెప్పింది రంజిత.
ఆనందరావు ఆమె భుజాలను పట్టుకొని పైకి లేపి... "రంజితా... నీ మీద నాకు కోపం లేదు. 'జీవితమంటే' ఆశ... నిరాశ... సుఖం... దుఃఖం... చీకటి.. వెలుగుల కలయిక. మన హైందవ వివాహ వ్యవస్థ ప్రకారం దంపతులు ఇరువురూ ఒకటై... వాటిని సహనంతో ఎదుర్కోవాలి. పంచుకోవాలి. నా జీవితాంతం... నేను నీకు అన్ని విషయాల్లో తోడు నీడగా నీ వెంట వుంటాను నీ ఆనందమే నా ఆనందం... ఇవి పెదాలు పలికే పలుకులు కావు... నా హృదయంలోని మధురమైన భావాలు... పద, అత్తయ్యగారు పిలిచారు." అనునయంగా చెప్పాడు ఆనందరావు.
రంజిత పరవశంతో అతన్ని కౌగలించుకొంది ప్రీతిగా... ఆనందరావు ఆమెను తన హృదయానికి హత్తుకొన్నాడు. ఎ. భారమూ లేని ఒకరి హృదయ స్థంభన మరొకరికి అర్ధం అయింది. అనసూయ మరోసారి 'రంజితా!...." కాస్త హెచ్చుస్థాయిలో పిలిచింది. ఇరువురూ... తొట్రుపాటుతో విడివడి చిరునవ్వుతో గది నుండి బయటికి వచ్చారు.
వారి ముఖాల్లోని క్రొత్త కాంతిని చూచిన అనసూయ ఆనందంగా "పొద్దుపోతూ వుందిగా... భోంచేసి పడుకుందురుగాని రండి..." అంది.
ముగ్గురూ మెట్లు దిగి... డైనింగ్ హాలు వైపుకు నడిచారు.
'నా అల్లుడు బంగారం. నిజమైన ప్రేమతత్వాన్ని ఎరిగినవాడు. నిజంగా నా బిడ్డ అదృష్టవంతురాలు" ఆనందంగా అనుకొంది అనసూయ.
***
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentários