top of page

ప్రేమయేవ జయతే


'Premayeva Jayathe' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 07/12/2023

'ప్రేమయేవ జయతే' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



యువతరం గుండె చప్పుడే.. ప్రేమ.

ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ.. ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..

అర్థం కాని పుస్తకమే అయినాగాని జీవిత పరమార్థం

తానే అనిపిస్తుంది ఈ ప్రేమ.


ప్రేమ.. ప్రేమ.. అని ఓ సినీకవి సిరివెన్నెలలు కురిపిస్తే

.. మా గుండె చప్పుడు అదే అంటున్నది నేటి యువతరం.


కాలం మారినా, కల్చర్‌ మారినా హైటెక్‌ ప్రపంచంలో హైరానాలెన్నివున్నా మా గుండెల్లో ప్రేమగీతం ఉందంటోంది.


ప్రేమ ఎంతో పవిత్రమైనది. ప్రేమ లేనిదే మనుషులు జీవించలేరు. ప్రతి మనిషికి ప్రేమించే స్వభావం ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ పుట్టడం

సహజం. ప్రేమ ఆకర్షణ కాదు. నిజమైన ప్రేమ మంచి మనసును బట్టి ఉంటుంది.


అమృతత్వం లోంచి జన్మించిందే ప్రేమ. సంప్రదాయం హద్దులు తెలిసిన ప్రవర్తన "ప్రేమకు " మరింత శోభనిస్తుంది.

ప్రేమలోని అనుభూతిన ఆస్వాదించినప్పుడే అది మనకు అర్థమవుతుంది. ప్రేమను వెన్నంటే త్యాగం ఉంటుంది. అంతర్‌ సౌందర్యాన్ని దర్శించినప్పుడు ప్రేమను పొంద

గలుగుతారు. భౌతికంగా కనిపించని ఒక అందమైన రూపం ప్రేమ. ప్రేమంటే నమ్మకం. దానిని పెద్దలకు తెలియజేసి వారి అంగీకారంతో పెళ్ళిచేసుకోవాలి.


ప్రేమంటే ఒకరోజులో పుట్టేదికాదు. పైపై మెరుగులకు ఆకర్షణలకు ఇది అతీతమైనది. ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మనసా, వాచా, ఏకత్వం ప్రతిబించాక అప్పుడు అది ప్రేమగా రూపాంతరం చెందితే.. దానికి నిజమైన అర్థం ఉంటుంది. నిజమైన ప్రేమికులు చాలా తక్కువగా ఉంటారు.

ప్రేమంటే స్పందించని హృదయం ఈ లోకాన వుందా? ప్రేమకు నిర్వచించగల శక్తి ఎవరికైనా ఉందా? ప్రేమ సజీవం, నిత్యనూతనం. అజరామరం.


ప్రేమకు అందరం దాసోహం. దేశాలకు, గోషాలకు

అతీతమైనది " ప్రేమ". ప్రేమకు ఎల్లలు లేవని, ప్రాణాలపై అసలు తెరపులేదని చెప్పేందుకు అజ్మీ, బాషాల

ప్రేమ కధే మంచి ఉదాహరణ. ప్రస్తుత కధావస్తువు. ప్రస్తుతము వస్తున్న ప్రేమకథా చిత్రాలకు తీసిపోనిది.


అనగనగా ఓ అరబ్బుదేశం. దాని పేరు కువైట్. పెట్రోల్‌తో డబ్బులు పండించే ఆ దేశంలో అరబ్బులు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చు. కావల్సిందల్లా వధువు తరుఫువారు అడిగినంత కన్యశుల్కాన్ని చెల్లించడమే.


ఆ క్రమంలో ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో మూడోభార్యకు పుట్టిన సంతానమే దలాల్‌అజ్మీ. పుట్టినరోజే తల్లిని కోల్పోయింది. ఆ తరువాత తండ్రి పరమపదించాడు. ఇక పినతల్లే ఆమెకు ఆలంబన. సహజసిద్దమైన అసూయ ఆ తల్లిలోనూ ప్రవేశించింది. తన సవతిబిడ్డ అయిన అజ్మీ అంటే ఆమెకు అకారణ కోపం. ఏది చేసినా తప్పే. ఈ పరిస్థితుల్లో తన తోబుట్టువుల ప్రేమరాహిత్యం ఆమెను

మరింత కుంగదీసింది.


అజ్మీ కుటుంబ నేపధ్యం అలా ఉన్న తరుణంలో కక్షలు, కుమ్ములాటలు, కరువుకు ఆలవాలమైన ' కడప' ఊరునుంచి ఉపాధి నిమిత్తం కువైట్‌ బయలుదేరాడు జాఫర్‌ బాషా. పేద కుటుంబానికి చెందిన అతని తండ్రి కడప జిల్లాలోని పుల్లంపేటలో ఓ సాదాసీదా రైతు. రెండెకరాల భూమితో లభించే ఫలసాయం పెద్దకుటుంబానికి కష్టమైంది. ఈ పరిస్థితులలో అతి కష్టంమీద డిగ్రీవరకు చదువును నెట్టుకురాగలిగాడు జాఫర్‌బాషా.


ఆ తరువాత బరువులను, బాధ్యతలను నెత్తినవేసుకుని అప్పటికప్పుడు నేర్చుకున్న డ్రైవింగ్‌ సర్టిఫికెట్‌తో డ్రైవర్‌వేషాన్ని ధరించి కువైట్‌కు బయలు దేరాడు. దలాల్‌ అజ్మీ ఇంట్లో డ్రైవర్‌ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. వారిచ్చే ఐదువేలరూపాయల జీతాన్ని ఇంటికి పంపి తను దిగువమధ్యతరగతి కుటుంబ లక్షణాలతో ఇంటిల్లిపాదిని ఆకట్టుకున్నాడు.


తల్లి కుటుంబసభ్యుల చీత్కారాలకు గురవుతున్న అజ్మీ అంటే అతనికి సానుభూతి. తనపట్ల అందరూ వైరుధ్యభావాలని ప్రకటించినా, జాఫర్‌బాషా చూపుల్లో

కనిపించే సానుభూతి. గోషాలు- పరదాలు వంటి ఇనుపసంకెళ్ళ మధ్యవున్న అజ్మీకి ఎంతో ఊరట.


మహిళలంటే ఎంతో గౌరవంగా, మర్యాదగా మసులుకొనే బాషా అంటే ఒకవిధమైన అభిమానం. బయటకు వెళ్ళినప్పుడల్లా తన మనసులోని భావాలను పంచుకునేందుకు ఒక మంచి స్నేహితుడు దొరికాడని ఆనందం.


ప్రకృతిలోని ఆకర్షణకు ఆమె కూడా అతీతం కాలేదు. మంచిమిత్రుడు ఆమె మదిలోని ప్రియుడుగా మారిపోయాడు. తనలోని అభిమానం, ప్రేమ కట్టలు తెంచుకున్న పరిస్థితుల్లో వాటికి మాటల్లో ఒక రూపాన్ని తొడగాలని ఆతృత, అతి తక్కువ కాలంలోనే తనలోని ప్రేమని బాషాతో వెల్లడించింది.


అయితే అజ్మీ అంటే అతనికి ఓ విధమైన సానుభూతి.

కుటుంబసభ్యుల ప్రేమరాహిత్యం, ఆమె చేత ఇలా చెప్పింస్తుందని తనలోనే సమాధానపడ్డాడు. ప్రేమ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బాషాను కదిలించివేసింది. సానుభూతి దశనుంచి అభిమానంగా మాట్లాడే పరిస్థితికి వచ్చిన అతను ఆమెలోని స్థిరత్వం, నిశ్చలత్వం, ధీరత్వం చూసి కదిలిపోయాడు. ప్రేమపట్ల ఆమెకు ఉన్న అచంచల విశ్వాసము, దానిని నిలుపుకునేందుకు చూపే ధైర్యం నిజంగానే అతన్ని భయపెట్టాయి.


వీటిని తట్టుకుని తాను నిలబడగలనా అన్నదే అతని సంశయం. అదంతా అర్థంలేని ఆలోచనలే, అజ్మీ ఊరడింపుతో ఆమె ప్రేమలోకంలోకి అడుగుపెట్టాడు.

అవధులులేని ఆనంద పారవశ్యంలో మేనులు కలిశాయి. ఇక వారిద్దరి మధ్య ప్రేమ వారధి శాశ్వతమైనది. ఈ లోగా మూడున్నరేళ్ళు వీసాగడువు ముగింపుదశకు వచ్చింది. దేశం వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి.


ప్రేమికుల విరహం ప్రణయాగ్నిగా మారి ఇద్దరినీ బంధించివేసింది. అయినా నిర్బంధంగా బాషా దేశం వదలక తప్పనిస్థితి. పరిస్థితులను అనుకూలంగా చేసుకుని కువైట్‌కు తిగి వస్తానని బాషా చెప్పినా అజ్మీ చెవికి ఎక్కలేదు. కలిసి భారతదేశం వెళ్ళిపోదామని తెగింపుగా చెప్పింది.


అదెలా సాధ్యమని ప్రశ్నించిన అతనికి ఆమె చెప్పిన సమాధానాలు లెక్కలేనన్ని. అయితే అతనికి సమంజసంగా అనిపించలేదు. పై పెచ్చు సమాజానికి వ్యతిరేకంగా

కనిపించాయి. వీసా నిబంధనలు దేశ అనుమతులు తనకు అడ్డంకి అన్న విషయాన్ని ఆమెకు చెప్పి చూశాడు. వాటన్నింటిని ఆమె లెక్క చేయలేదు.


"నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పేది విను. లేకుంటే వెళ్ళిపొ”మ్మంది.


దీంతో అజ్మీ చెప్పిన ప్రతిపాదనకే ఒప్పుకున్నాడు.

అప్పటికే తన ఇంట్లో పనిచేస్తున్న ఆయేషా పాసుపోర్టును అజ్మీ దొంగతనంగా తీసుకుని అందులో ఆమె ఫోటోకు బదులు తన ఫోటోను అతికించింది. ఏ మాత్రం

అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఇంట్లో తన తోబుట్టువు తో మాత్రం ఈ విషయాన్ని చెప్పింది.


దొంగపాసుపోర్టు తో కువైట్‌ విమానాశ్రయంలో ఏదో విధంగా అధికారుల కళ్ళుగప్పి చెన్నై వరకు రాగలిగింది. అక్కడే అసల విషయానికి అంకురార్పణ జరిగింది.


అజ్మీ పాస్‌పోర్టు నకిలీదిగా పసిగట్టిన అధికారులు వెంటనే ఆమెను దేశం వదలి వెళ్ళాల్సిందిగా కోరారు. తాను స్వదేశం వెళితే తన కుటుంబసభ్యులు చంపేస్తారని కళ్ళనీళ్ళ పర్యంతమైంది. ఆమె ప్రేమలోని నిజాయితీని, ప్రేమకోసం దేశం వదలి రావడాన్ని గమనించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు డిల్లీలోని తమ ఉన్నతాధికారులకు

సమాచారాన్ని అంగించారు.


వారి సూచన మేరకు ఎంతో సానుభూతిగా వ్యవహరించి చెన్నై విమానాశ్రయం పోలీసులకు అప్పగించారు. నకిలీ పాసుపోర్టు పై ఇండియా వచ్చిందనే ఆరోపణపై

పోలీసులు ఆమెను "ఆలందూర్‌" కోర్టులో హాజరుపరిచారు.


ఇక అక్కడినుండి జాఫర్‌బాషా తన కర్తవ్యాన్ని ప్రారంభించాడు. తనతో తెచ్చుకున్న డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చుపెట్టడం ప్రారంభించాడు. హైకోర్టుకు చెందిన ఒక న్యాయవాదికి భారీమొత్తాన్ని చెల్లించి బెయిల్‌ కోసం దరఖాస్తును పెట్టించాడు.


అజ్మీ వృత్తాంతాన్ని విన్న ఆలందర్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ వైద్యనాథన్‌ ఆమెకు కండిషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు. ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌ కు వచ్చి సంతకం పెట్టాల్సిందిగా

కోరారు. అయితే ఆ విషయాన్ని న్యాయవాది వారికి సరిగా వివరించలేదు. మూడు రోజుల పాటు సెలవుదినాలు వచ్చినందున ఆ తరువాత రమ్మంటు చెప్పాడు.


దీంతో బాషా స్వస్థలమైన పుల్లంపేటకు అజ్మీని తీసుకుని వెళ్ళాడు. అక్కడ బాషా తల్లిదండ్రులు వారిద్దరినీ ఆశీర్వదించారు. మూడురోజుల సెలవుదినాలు తరువాత తిరిగివచ్చిన అజ్మీకి పోలీసులు అరదండాలు తగిలించారు. కండిషన్‌బెయిల్‌ లోని నిబంధనలను అతిక్రమించినందుకు

మహిళా ఖైదీల జ్యుడీషియల్‌ కష్టడీ క్రింద పంపారు.


అక్కడే ఆమె ప్రేమకథ మలుపు తిరిగింది. అజ్మీ ఆహారానికి స్వస్తి చెప్పింది. అక్కడ ఖైదీ అధికారులు ఎంతగా ప్రయత్నించినా ససేమిరా అనడంతో దిక్కుతోచని పరి

స్థితుల్లో పడ్డారు. పత్రికల కెక్కి పతాకశీర్షికగా మారిన అజ్మీ ఉదంతం దేశమంతటా వ్యాపించింది.


సహజంగానే మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్న జయలలిత ఆమెకు రక్షణ కల్పించవలసిందిగా తన అధికారులను ఆదేశించి శాసనసభలో ప్రకటన కూడా

చేసింది. ఈ విషయం ఆ ప్రేమజంటకు ఎంతో ఊరట నిచ్చింది. చెన్నైలో ఉండి విషయము తెలుసుకున్న రాజకీయనాయకులు కేంద్రహోంశాఖమంత్రికి ఈ సమా

చారాన్ని తెలిపారు. అజ్మీని కువైట్‌కు తిరిగి పంపబోమని నిష్పష్టంగానే ప్రకటించినారు. అలాగే ఇండియా పౌరసత్వాన్ని కల్పించాలని జయలలిత కేంద్రానికి విజ్ఞప్తి

చేశారు. వీటికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఆ తరవాత జయలలిత ఆ ప్రేమజంటను పిలిచి ఆశీర్వదించారు. త్వరలోనే వారి అభ్యర్థన మేరకు పెళ్ళి

జరిపిస్తామని వాగ్ధానం చేశారు.


అంతవరకు చెన్నైలో ఉండవచ్చని ఏర్పాట్లు చేశారు. తనకు ఏదైనా ఉపాధి చూపమని కోరిన బాషాకు సరేనన్నారు. జయలలిత అభయం, కేంద్రం ఆశీర్వచనం వీరికి

ఎంతగానో మనో ధైర్యాన్ని కలిగించాయి. దాంతో వారు భారతదేశంలో తమ ప్రేమను సఫలం చేసుకోవచ్చనే ఆశలను పెంచుకోగలిగారు. తమ కలలను సాకారం చేసుకో

వచ్చునని భావించారు. బాషాతో తన దాంపత్యం నిజం కానున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అజ్మీ అక్కడున్న వారందరికీ తెలిపింది.


జాఫర్‌బాషాలో తనకు ఎన్నో అంశాలు నచ్చాయని తనకు తెలిసిన అరబ్బీలో చెప్పింది. ప్రేమ పైన తన అభిప్రాయాన్ని కోరితే తమ దేశంలో ఇవన్నీ సాదారణమే

నని తెప్పింది. ఎటొచ్చి భారతీయుడైన బాషాను ప్రేమించబట్టే తనకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆమె చెప్పింది. అయితే వీటిని ఇబ్బందులుగా భావించడం లేదు. తన ప్రేమ సాఫల్యానికి, అడ్డుపడిన చిన్న అవాంతరాలుగానే అనుకుంటున్నానని అంది.


ఈ ప్రేమపోరాటంలో తన ప్రాణాలు వదలాల్సి వచ్చినా సంతోషంగా వదలడానికి, దేశ ఎల్లలు దాటేముందే నిర్ణయించుకున్నానని ఆమె నిర్భయంగా చెప్పింది. అజ్మీకోసం తన ప్రాణాలు అర్పించేందుకు ఏమాత్రం వెనుకాడనని బాషా సైతం పునరుద్ఘాటించాడు. అజ్మీ మాత్రం బాషా సాన్నిహిత్యం, సాంగత్యం తనకెంతో ఆనందాన్నిస్తాయని తన వెంట వున్న వారితో పదేపదే చెబుతోంది.


తనకు ఏసీలూ, పట్టుపరుపులు కంటే బాషా తీయటి పలుకులు, అతని ప్రేమనిండిన చూపులు ఎంతో ఆనందాన్నిస్తాయని తెలుపుతోంది. రావలసిన శుభఘడియలు రానే వచ్చాయి. ఒక మంచిరోజున జాఫర్‌బాషా, అజ్మీ ల ' నిఖా' వైభవోపేతంగా జయలలిత చేయించింది.


అంతేకాక జాఫర్‌బాషాకు ' పల్లవన్‌ ట్రాన్స్‌పోర్టు' లో ఉద్యోగము వేయించింది. బాషా ఉద్యోగంతో వారిద్దరి

వైవాహిక జీవితం శుభప్రదంగా జరుగుతోంది.


------------------------------శుభమ్-----------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







86 views1 comment

1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 07, 2023

కథ బావుంది. ఇక్కడ జయలలిత గారికి జోహార్లు 👑

Like
bottom of page