top of page

ప్రేమించాక ఏమైందంటే'Preminchaka Emaindante' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'ప్రేమించాక ఏమైందంటే' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఫోన్ రింగవుతూంటే లిఫ్ట్ చేసింది రమ్య.

"రమ్యా! ఈరోజు కాలేజీ అవగానే మూవీకీ వెళదామా!" అడిగాడు శరత్.


"సరే!" అని ఫోన్ పెట్టేసి కాలేజీకి వెళ్లేందుకు సిధ్ధమవుతోంది రమ్య.


"రమ్యా! బ్రేక్ ఫాస్ట్ రెడీ!" అన్న తల్లి సుమతి గొంతువిని "వచ్చేస్తున్నా!" అంటూ డైనింగ్ రూమ్ లోకి వెళ్లిన రమ్యకు తన కోసం ఎదురుచూస్తున్న తండ్రి రంగారావు కనిపించారు.


"హాయ్ ! నాన్నా!" అంటూ పలకరించింది రమ్య.


"హాయ్! రమ్యా! నీకోసమే ఎదురుచూస్తున్నా!" అన్నాడు రంగారావు.


వాళ్లకు టిఫెను పెట్టి తనూ తినడానికి కూర్చుంది సుమతి. కాసేపు కబుర్లతో బ్రేక్ఫాస్ట్ ముగించి వాళ్లిద్దరికీ "బై" చెప్పి కాలేజీకి వెళ్లింది రమ్య.


ఒక ప్రైవేటుకంపెనీలో పనిచేస్తున్న రంగారావు భార్య సుమతి, కూతురు రమ్యతో పెద్దలిచ్చిన ఇంట్లో సంతోషంగా ఉంటున్నాడు. ఆదంపతులు తమకు ఉన్నంతలో గుట్టుగా బ్రతుకుతూ పరువు ప్రతిష్టలే ప్రాణంగా భావిస్తూ రమ్యను కష్టపడి పెంచారు. రమ్య కూడా కష్టపడి చదువుతూ ఇప్పుడు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది.


తన క్లాస్మేట్ అయిన శరత్ క్రికెట్ ఆట, అతని అందము, మాటతీరు, చురుకుదనము, చదువుపట్ల అతని శ్రధ్ధ నచ్చి అతనితో సన్నిహితంగా ఉంటోంది రమ్య. తొలుత వాళ్ల పరిచయం స్నేహంతో మొదలై ఇద్దరి మనసులు కలిసి ఇచ్చిపుచ్చుకున్నారు. వాళ్లిద్దరి మధ్య తరచూ సినిమాలు, షికార్లు పరిపాటే.


ప్రముఖ వ్యాపారస్తుడైన విశ్వనాధానికి ఏకైక కొడుకు శరత్. చిన్నప్పటి నుంచి అతను ఐశ్వర్యంలో పెరుగుతున్నా ఇంటర్ పూర్తవగానే తండ్రి తన వ్యాపార బాధ్యతలను చూడమన్నా, వద్దని పట్టుబట్టి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతనికి రమ్య అందము, నిదానము, మాటతీరు, చదువులో ఫస్టు రావాలన్న ఆమె పట్టుదల నచ్చి ఆమెతో ప్రేమగా ఉంటున్నాడు.


వాళ్లిద్దరూ సరదాగా సినిమాలు, షికార్లు చేస్తూ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు. మంచి ఉద్యోగం వచ్చాక తమ ప్రేమ విషయాన్ని తమ పెద్దలకు చెపుదామనుకున్నారు కానీ వాళ్లు ప్రేమించాక ఏమైందంటే వాళ్ల సినిమాలు, షికార్ల విషయం ఇరుపెద్దలకు తెలిసింది. ఏదీ ఎంతోకాలము దాగదు కదా ! ఇలాంటి విషయాలు అసలు దాగవు.

ఆ విషయమై ఇరు పెద్దలు వాళ్ల పిల్లలను ఇంట్లో నిలదీశారు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని చెప్పి మంచి ఉద్యోగంలో స్ధిరపడ్డాక పెళ్లి చేసుకుంటామన్న తమ నిర్ణయాన్ని తెలిపారు. విశ్వనాధం దంపతులు తమ అంతస్థు, స్టేటస్ కు తగ్గ మంచిసంబంధాన్ని వెతికి కొడుక్కి పెళ్లి చేయాలన్న తమ నిర్ణయాన్ని తెలిపి, ప్రేమ- పెళ్లి అంటే తమకిష్టం లేదని నిష్కర్షగా చెప్పారు.


శరత్ తను రమ్యనే పెళ్లి చేసుకుంటానన్న తన ధృఢనిర్ణయాన్ని తెలిపాడు. రమ్యని పెళ్లి చేసుకుంటే తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కనీయనని తండ్రి బెదిరించినా శరత్ ఏమాత్రమూ జంకలేదు. "రమ్య చాలా మంచిపిల్లనీ, ఆమెని మీకు పరిచయం చేస్తే మీరు తప్పకుండా మా పెళ్లికి ఒప్పుకుంటారు" అన్న శరత్ మాటకు సుతరాము ఇష్టపడలేదు వాళ్లు.


రమ్య తమ ప్రేమ విషయాన్ని చెప్పగానే రంగారావు దంపతులు " వాళ్లు ధనవంతులు. వాళ్ల స్ధాయికి మనము తగమమ్మా ! మనకు తగిన మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేస్తాము" అన్నారు. శరత్ మంచివాడని, తన మనసుని అతనికిచ్చేశానని, పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటానని రమ్య స్థిరంగా చెప్పింది.


ఒకనాడు శరత్ ని తమ ఇంటికి తీసుకొచ్చి వాళ్లకు పరిచయం చేసింది. అతని మాటతీరు, పెద్దల ఎడల అతనికున్న మర్యాద, రమ్య పట్ల అతనికున్న ప్రేమ వాళ్లకు అర్థమై వాళ్ల పెళ్లికి తమ అంగీకారాన్ని తెలిపారు. తరచూ వాళ్ల ఇంటికి శరత్ రాకపోకలు కొనసాగుతున్నాయి.

రమ్య, శరత్ లు ఇద్దరూ ఉద్యోగ ప్రయత్నాలను మొదలెట్టారు. వాళ్ల కృషి ఫలించి త్వరలోనే మంచి కంపెనీలో ఇద్దరూ ఉద్యోగాన్ని సంపాదించారు. విశ్వనాధం రమ్యనీ, ఆమె తండ్రిని అనేక విధాల బెదిరించాడు. "పెళ్లితో తమ కొడుకుని తమకు దూరం చేయద్దని, మీకు డబ్బెంత కావాలో చెపితే ఇస్తాను. మీ అమ్మాయికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయండి" అని ధనమదం చూపినా రంగారావు వాళ్లు ఏమాత్రం భయపడక " తమ కూతురి శ్రేయస్సు, ఆమె మనస్సే తమకు ముఖ్యం" అని చెప్పారు.

ఒకరోజున శరత్, రమ్యలు రిజిస్టర్ మారేజ్ చేసుకుని దంపతులయ్యారు. వాళ్లని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు రమ్య తల్లి తండ్రులు. శరత్ రమ్యని తీసుకుని తమ ఇంటికి వెళితే విశ్వనాధం పెద్దగా గోల చేసి కనీసం వాళ్లని ఇంట్లోకి కూడా రానివ్వలేదు. అవమానభారంతో శరత్, రమ్యలు వెనుతిరిగారు. వాళ్లు వేరే చోట ఒక ఇంటిని అద్దెకు తీసుకుని క్రొత్త కాపురం మొదలెట్టి రోజూ తమ ఆఫీసులకు వెళ్లి వస్తున్నారు.


అన్యోన్యంగా సంసారం చేసుకుంటున్నారు రమ్య దంపతులు. చూస్తూ ఉండగానే ఏడాది కాలం గడిచింది. రమ్య గర్భవతి అయింది. విషయం తెలిసి శరత్ ఆనందానికి అవధులు లేవు. రంగారావు దంపతులు చాలా సంతోషించి రమ్యకు సాయంగా ఉంటూ కూతురినీ అల్లుడినీ కనిపెట్టుకుంటూ ఉంటున్నారు.


రమ్య గర్భవతన్న విషయాన్ని శరత్ తన తలిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. విషయాన్ని విన్న శరత్ తల్లి జానకి చాలా సంతోషించి కొడుకునీ, కోడలినీ ఇప్పటికైనా ఆదరించి ఇంటికి పిలవమని భర్తని కోరినా విశ్వనాథం మనసు కరగలేదు. చేసేది లేక మిన్నకుండిపోయింది జానకి. కాలం గడుస్తోంది. నెలలు నిండి సుఖప్రసవం జరిగి రమ్య పండంటి మగబిడ్డను కన్నది ఆ శుభవార్తను విన్న జానకి సంతోషంగా ఉన్నా, విశ్వనాథం మాత్రం మౌనం వహించాడు. రంగారావు దంపతులు మనవడి ఆలనాపాలనా చూస్తూ రమ్యా వాళ్లని కంటికిరెప్పలా కనిపెట్టుకుంటూ ఉన్నారు.


భర్త మొండి పట్టుదల, మూర్ఖత్వం అర్థమైనా కూడా పుత్ర వాత్సల్యంతో జానకి తను కొడుకు వద్ద కొన్నాళ్లు ఉండి వస్తానన్నా విశ్వనాథం ఒప్పుకోలేదు. "నీవు అక్కడికి వెళితే నా పరపతిని ఉపయోగించి వాళ్లని ఇంకా బాధలకు గురిచేస్తాను. నీకు భర్త కావాలో, కొడుకు కావాలో తేల్చుకో " అని బెదిరించాడు. చేసేది లేక నిస్సహాయురాలై మౌనంగా తనలో తనే రోదించింది జానకి.


కొడుకు మీద, మనవడి మీద దిగులుతో కొన్నాళ్లకు జానకి కన్నుమూసింది. విషయం తెలిసి శరత్, రమ్యలు కొడుకు నెత్తుకుని బాధతో పరిగెత్తుకు వస్తే వాళ్లని కడసారి చూపుకి కూడా కూడా ఒప్పుకోలేదు విశ్వనాథం. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు నచ్చచెప్పిన మీదట అయిష్టంగా వాళ్లని ఆకాసేపు అక్కడ ఉండనిచ్చాడు. శరత్ తన తల్లికి తలకొరివి పెట్టాడు.


బాధతో భార్యను, కొడుకుని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు శరత్. శరత్ తన కొడుక్కి "జానకిరామ్" అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. వాడిని ముద్దుగా "జాకీ" అని పిలుచుకుంటున్నారు. వాడు తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరిస్తున్నాడు. రోజులు సాఫీగా గడుస్తున్నాయి.


కొన్నాళ్లకు జాకి పెరిగి పెద్దయి స్కూల్లో చేరాడు. ఒకనాడు విశ్వనాథం గారికి హార్ట్ ఎటాక్ వస్తే పనిమనిషి సాయంతో హాస్పిటల్ లో చేరాడు. డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ చేసి ఆయనని ఇంటికి పంపారు. పనిమనిషి ఫోన్ ద్వారా తండ్రి అనారోగ్యం తెలిసి శరత్ రమ్యని, జాకీని తీసుకుని తండ్రి ఇంటికి వెళ్లాడు. చచ్చి బ్రతికిన విశ్వనాధానికి ధనమదం కొంత తగ్గి మనసు కాస్త కరగగా వాళ్లని లోపలకి రానిచ్చాడు.


ఆయన చేసిన ద్రోహాన్ని మరిచి రమ్య, శరత్ లు కొన్నాళ్లు తమ ఆఫీసులకి శెలవుపెట్టి దగ్గరుండి ఆయనకు సపర్యలు చేయగా త్వరలోనే ఆయన కోలుకుని మామూలు మనిషయ్యాడు. ప్రాణం మీదకొస్తే గానీ మనుషుల విలువ తెలిసిరాదన్నట్టుగా విశ్వనాథానికి కొడుకు, కోడలు, మనవడి విలువ ఇప్పుడు తెలిసొచ్చి వాళ్లతో ప్రేమగా మాట్లాడుతున్నాడు.


జాకీ తన ముద్దుమురిపాలతో తాతను అలరించి ఆయనకు మరింత దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు ఆయన కోలుకున్నాక శరత్ తన భార్యని, జాకీని తీసుకుని తన ఇంటికి బయలుదేరగా విశ్వనాథం వాళ్లని తన వద్దే ఉండమని కన్నీళ్లతో వేడుకున్నాడు. తనను క్షమించమనీ, మారిన తన మనసుని అర్థం చేసుకోమని, లోగడ తాను ప్రవర్తించిన తీరుకి పశ్చాత్తాప పడుతున్నానని వేదన చెందాడు.


మానవత్వం గల శరత్, రమ్యలు ఆయనని ఓదార్చి అక్కడ ఉండేందుకు సుముఖత వ్యక్తం చేయగా తన ఒడిలో కూర్చున్న మనవడిని ముద్దుచేస్తూ మనసులోనే ఆ భగవంతుడికి కృతజ్ఞతలను తెలుపుకున్నాడు విశ్వనాథం.


సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏

83 views0 comments
bottom of page