'Pujafalam' - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri
Published In manatelugukathalu.com On 20/12/2023
'పూజాఫలం' తెలుగు కథ
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
విశాఖపట్నం లోని కొమ్మాది గ్రామంలో, ప్రసిద్ది గాంచిన అష్టలక్ష్మి దేవాలయ సముదాయం: నిత్యం కళకళలాడుతు ఉంటుంది భక్తులతో. అష్టలక్ష్మి విగ్రహాలు పాలరాతి చెక్కడాలతో, స్వచ్చంగా, పవిత్రంగా కొలువుతీరి ఉండడం వల్ల, అందులో 'స్పటిక శివలింగం’, స్వర్ణ కాంతులతో మెరిసిపోయే 'లక్ష్మీ నారాయణుల విగ్రహం', ఎన్నిసార్లు దర్శించిన తనివితీరదు, కనుక భక్తుల రద్దీ శ్రావణమాసం, . కార్తీకమాసం ఎక్కువుగా ఉంటుంది.
సువిశాలమైన పవిత్ర ప్రాంగణం ఈ అష్టలక్ష్మిఆలయం.
ఈ ఆలయానికి ప్రథమ పూజారి వయోవృద్దుడైన శ్రీ రామశాస్త్రి గారు. తన సర్వీస్ అంత చేసి రిటైర్ అయిన, తన మంచితనం, గొప్ప వాగ్ధాటి తో పూజలు చెయ్యడం వలన, ఎండోమెంట్స్ విభాగం వారు, ఎవరు లేని వారు అని, సహాయం చేస్తూ, ఆ కోవిలలోనే ఒక గది ఇచ్చి, ఏదో కొంత జీతం ఇస్తు ఆదరించారు.
పూజారిగారు ఉదయమే నిద్రలేచి, స్నానంఆచరించి అన్ని విగ్రహాలు కు అతి పవిత్రంగా 'పూలమాలలు, వస్త్రాలు ' ధరింప జేసీ, సరిగ్గా ఉదయం 6 గంటల కల్లా, భక్తుల దర్శనానికి సర్వం ఎంతో నిష్టగా చెయ్యడం ఆయనకు అలవాటు.
అందుకే ఆయన అంటే అటు భక్తులకు, యాజమన్యానికి అత్యంత గౌరవం. ఇక రామశాస్త్రి గారికి ఒక కొడుకు ఒక కూతురు, కొడుకు శేఖరు ను బాగా చదివించి ప్రయోజకుడ్ని చేశారు, ఉన్న ఒక్క కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించేశారు. ఇక ఆయన భార్య సీతాలక్ష్మి గారు దీర్ఘకాలం గా ఆరోగ్య స్థిమితం లేక మంచాన పడి పరమపదించారు, ఆ తర్వాత రామయ్య శాస్త్రి గారి కుటుంబ నేపథ్యం చెప్పనలవి కానీ సమస్యలతో ఉండేది.
ఎందుకంటే ప్రయోజకుడైన కొడుకు శేఖర్ మంచి ఉద్యోగము సంపాదించి, ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి, విదేశాలలో స్థిరపడి పోయాడు. అక్కడే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, పర్మినెంట్ గా సెటిల్ అయిపోయాడు. సంవత్సరానికి రెండు సార్లు తండ్రికి ఫోన్ చేసి 'నాన్నగారు! ఎన్నాళ్లు మీరీ వృద్ధాప్యంలో, పూజారిగా సేవలు చేస్తూ ఉంటారు? ఇక్కడికి తీసుకు రాలేను, మీకు మంచిగా డబ్బులు కట్టి 'అనాధాశ్రమంలో' జాయిన్ చేస్తాను. సమయానికి తిండి, బట్ట దొరుకుతుంది. మీకు ఏమి కావలసిన వాళ్లే చూస్తారు. అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తూ ఉంటాను!” అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన స్వార్థపరుడైన కొడుకుని తలుచుకుని బాధపడుతూ, “ఒరేయ్ శేఖర్ ! ఆ అష్టలక్ష్ముల దయవలన, నాకు డిపార్ట్మెంట్ వారు ఏ కొరతా లేకుండా చూసుకుంటున్నారు, నీ సహాయం ఇంకెవరైనా పేదవారికి చేయు పుణ్యం వస్తుంది.
కనీసం నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు.
కనీసం వారినైనా నా తుది దశలో ఒక్కసారి తీసుకొచ్చి చూపించు. నేనెవరి మీద ఆధారపడి బతకను. అమ్మ ఉన్నన్నాళ్ళు ఎంతో నాకు సేవ చేసింది. ఆవిడ పోయిన తర్వాత నాకు దేవుడే దిక్కు అనుకున్నాను. కాబట్టి నువ్వేం కంగారు పడకు. పిల్లాపాపలతో కలకాలం సుఖంగా ఉండు” అంటూ ఫోన్ పెట్టేసి కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, మౌనంగా ఉండి పోయారు పూజారి రామయ్య శాస్త్రి గారు.
ఇక కూతురు వివాహం చేసిన తర్వాత, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ “నాన్నగారు, మీరు ఎలా ఉన్నారు?, మీరు ఎన్నో అప్పులు చేసి, ఇల్లు అమ్మి నిలువ నీడ లేకుండా, చాలా పెద్ద కుటుంబంలో వివాహం చేసి పంపించారు. ఇక వారి అభిప్రాయాలు, కుటుంబ నేపథ్యం మనకన్నా ఎంతో ఎక్కువగా ఉండడం వలన, మిమ్మల్ని ఎక్కువగా కలవలేక పోతున్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని చూద్దామన్న వీలులేనంతగా ఉంది.
నా అభిప్రాయాలు, నా తల్లిదండ్రులు వారికి అక్కర్లేదు. ఎప్పుడైనా మిమ్మల్ని కలుద్దామని అన్నా కూడా, ఇప్పుడు ‘ఎందుకులే!, మీ నాన్నగారికి ఉండడానికి ఇల్లు లేక, ఆలయంలోని తలదాచుకున్నారు, మనం వెళ్లి ఏం చేస్తాం? వదిలేయ్!’ అనే వారే తప్ప, నా ఇష్టానికి అమ్మ పోయిన మిమ్మలని, చూడాలని ఉన్నా, రాలేకపోతున్నాను, నెలకు ఒకసారి ఫోన్ చేయడానికి అనుమతిస్తారు, కనుక మాట్లాడు తున్నను, మీ ఆరోగ్యం జాగ్రత్త!” అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న, కూతుర్ని సముదాయిస్తూ “పర్వాలేదు అమ్మ!, నీ సంసారం జాగ్రత్త, నీకు అన్నివేళలా అష్టలక్ష్మి ల దీవెన ఉంటుంది, నా గురించి బెంగపడకు” అంటూ తన కుటుంబాన్ని తలుచుకుని, మనసులోనే 'కన్నీళ్లు కడలి తరంగాలు 'ఎగిసిపడుతున్న, తన కర్తవ్య నిర్వహణలో కించిత్తు లోపాలు లేకుండా నిర్వహిస్తున్నారు పూజారి రామశాస్త్రి గారు.
అసలే 'శ్రావణమాసం భక్తుల రద్దీఎక్కువగా ఉంది. పూజారి రామయ్య శాస్త్రి గారు వచ్చిన భక్తులకు తీర్థం ఇచ్చి, శఠగోపం పెడుతూ, "నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని "ఆశీర్వచనం చేస్తూ దీవించడం, అనేక సంవత్సరాలుగా భక్తులకు అలవాటయిపోయింది. ఆయన దీవెన అక్షరాల ఫలిస్తుందన్న నమ్మకం ఆ భక్తులకు తెలుసు కనుక ఆయన పాదాలకు కూడా నమస్కారం చేసి మరీ వెళ్తారు..
ఆరోజు' శ్రావణ శుక్రవారం' ఘనంగా పూజలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి, పూజారి గారు ఎంతో భక్తితో శ్రద్ధలతో గుడిని శుభ్రం చేయించి, ఆలయ ప్రాంగణమంతా మామిడి తోరణాలు, పూలమాలలతో అంగరంగ వైభవంగా అలంకరింప జేశారు, అతి రుచికరమైన 'చక్ర పొంగలి, పులిహారా' ప్రసాదాలు భక్తులకు అందించారు, మరికొందరు ఇతర పూజారులను పిలిపించి, అన్ని విగ్రహాల దగ్గర పూజలు జరిపి, భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా, మొత్తం పర్యవేక్షించేవారు పూజారి రామశాస్త్రి గారు.
కానీ ఒక్క ఆలోచన ఆయనను బాధ పెట్టేది,
ఏమిటంటే ప్రభుత్వం వారు దక్షిణల రూపంలో వచ్చే ధనాన్ని కానీ, వెండి గాని, బంగారం కానీ అన్ని ప్రభుత్వం నియమించిన హుండీలలోనే వేయవలెను, తగిన రసీదులు కూడా ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగులుచే ఇవ్వబడును, ఎవరు పూజారులకు దక్షిణ పళ్లెంలో డబ్బులు వెయ్యవద్దని మనవి!!' అంటూ అన్నిచోట్ల బోర్డులు పెట్టి భక్తులకు సూచనలు ఇచ్చారు, అది ఒక అందుకు మంచిదే అయిన, పాపం రామయ్య శాస్త్రి గారి లాంటి పేద పూజారులకు చిన్న జీతగాళ్లకు ఎక్కడ ఒక్క పైసా కూడా దక్షిణాల పళ్లెంలో పడకపోవడంతో, నిరాశగా “అయ్యో దేవుడా!, కనీసం చిల్లర ఖర్చులకైనా భక్తులు ఇచ్చే విరాళాలతో సంసారం సాగేది, ఇప్పుడు అది కూడా లేదయ్యే”, అంటూ బాధ పడడం ప్రతి పూజారికి మనసులో వేధిస్తున్న ప్రశ్న. నిజమే, ప్రభుత్వం వారు భక్తులు ఇచ్చిన కానుకలు, ధనంతో, ప్రజా రంజక పాలన చేస్తున్నారు. మాలాంటి నిరుద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. కానీ మా బతుకులు ఈ చిరు జీతాలతో ఎలా గడపాలి రా బాబు? అంటూ బాధపడే వారిలో పూజారి రామయ్య శాస్త్రి గారు కూడా ఉన్నారు.
అలా శ్రావణమాసం నిత్య పూజలతో 75 ఏళ్ల పూజారి రామయ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది, ఆ నెల అంతా లక్ష్మీనారాయణ లను, అష్టలక్ష్ములను నిత్య పారాయణం చేస్తూ, తన శ్రావ్యమైన కంఠంతో "విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం' పఠిస్తూ భక్తుల ప్రశంసలు అందుకునేవారు రామయ్య శాస్త్రి గారు.
రాత్రి, పగలు పూజా సేవా కార్యక్రమాలు శ్రావణమాసం అంతా చేసే సరికి, ఆ వయోవృద్ధుడైన పూజారి గారు నీరసంతో ఒక రోజు అలిసిపోయి గాడ నిద్రలోకి జారుకున్నారు.
ఆ రాత్రి కలలో 'అష్టలక్ష్మి దేవతలు' కలలోకి వచ్చి “ఓయి రామశాస్త్రి!, నువ్వు చేసిన సేవలు కు అందరమూ మిక్కిలి సంతోషించినాము, కానీ నీ వయసుకు ఇక మా అవసరము లేదు”, అంటూ మొదట ఆదిలక్ష్మి వెళ్ళిపోతుండేసరికి, ఒక్కసారి ఉలిక్కిపడి, “అయ్యో నన్ను వదిలి వెళుతున్నావా తల్లి!” అంటూ చూసేసరికి రెండవ లక్ష్మి, ధాన్యలక్ష్మి
కూడా “భక్తా, నీకిన్ని సంవత్సరాలు అన్న పానాదులకు లోటు లేకుండా నీ దగ్గరే ఉన్నాను, ఇక నేను మిగతా భక్తులకు చేరువ కావాలి కనుక నేను కూడా వెళ్తున్నాను” అంటూ ఆ దేవత కూడా నిష్క్రమించేసరికి, పూజారి గారు గతుక్కు మన్నారు. ఇక మూడవ లక్ష్మి 'గజలక్ష్మి 'కూడా ఆయనను ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయింది, నాలుగవ లక్ష్మి 'సంతాన లక్ష్మి' కూడా వెళ్ళిపోతూ, “పూజారి గారు, మీకు ఎంతో మంచి సంతానాన్ని ఇచ్చాను, కానీ దురదృష్టవశాత్తు వారు మంచిగా మిమ్మల్ని చూడలేదు, విధి వ్రాతను ఎవరూ మార్చలేరు, కనుక నేను ఉండలేను వస్తాను!” అంటూ వెళ్ళిపోయింది ఆ దేవత. ఇక ఐదవ లక్ష్మి విజయలక్ష్మి వెళ్లిపోతు, “ప్రపంచంలో శాంతిభద్రతలు కరువయ్యాయి, వాటిని పునరుద్ధరించడానికి వెళ్తున్నాను వస్తాను” అంటూ మాయమైపోయారు.
ఇక ఆరవ లక్ష్మి 'విద్యాలక్ష్మి ' వెళ్ళిపోతూ, “ఓయ్ రామశాస్త్రి, నీకు నీ సంతానానికి విద్యాబుద్ధులు మెండుగా ఇచ్చాను, నువ్వు నీవిద్యను దైవాత్మిక ధ్యానంతో మమ్మల్ని సంతుష్టిపరిచావు. ఇక నేను నిరక్షరాస్యులను అక్షరాశ్యు లను చేయడానికి వెళుతున్నాను” అంటూ ఒక్కొక్కరిగా దేవతలందరూ వెళ్లిపోతుండగా, రామయ్య శాస్త్రి గారు కలవరపడుతూ ప్రార్థిస్తున్నా, ఏడవ లక్ష్మి
'ధైర్యలక్ష్మి' కూడా ఆశీర్వదించి వెళ్ళిపోతుండగా,
“అయ్యో తల్లి! ఒక్కొక్కరుగా మీ అష్టలక్ష్ములు వెళ్లిపోతే. నా బ్రతుకు ఏమి గాను?, ఇన్నాళ్లు నీ ధైర్యంతోనే సంసారాన్ని ఈదగలిగాను, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలా?” అంటూ ప్రాధేయపడుతున్న పూజారి గారు, “నేను ఇచ్చిన ధైర్యంతోనే ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేలమంది కి దైవభక్తిని ప్రసాదించారు, ఇక నేను ఉండలేను, మీకు స్వర్గ ప్రాప్తి కలగాలని ఆశీర్వదిస్తూ వెళ్తున్నాను!” అంటూ వెళ్లిపోయింది ధైర్యలక్ష్మి.
ఇక చివరి అష్టలక్ష్మిలలో ఉన్న' ధనలక్ష్మి' కూడా వెళ్ళిపోతుండడంతో, “అమ్మ.. అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ ముసలి వయసులో మీ ఆది దంపతులు లక్ష్మీ నారాయణులను, నిత్యం అహర్నిశలు పూజలు చేస్తూ, మీ పాదాల కింద బతికిన వాడను. ఈ చివరి దశలో నాతో నీవైనా ఉండవమ్మా!” అంటూ కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతున్న పూజారి రామయ్యశాస్త్రి గారినీ ఓదారుస్తూ, “నా అక్కలు అందరూ వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్లాలి, నన్ను కూడా పోనివ్వు” అనేసరికి “అమ్మ ధనలక్ష్మి! ఇన్నాళ్లు ధైర్యలక్ష్మి సహాయంతో జీవితం సాగించాను, కానీ ఈ కలియుగంలో ధనం లేకపోతే మానవ జీవితం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు, మీ సహాయం లేకపోతే క్షణం క్షణం నరకమే, తల్లి, ధనలక్ష్మి నువ్వైనా శ్రీమన్నారాయణ తో కలిసి నాతో ఉండిపో అమ్మ, కలియుగంలో మానవజాతి అడుగడుగునా 'ధనం మూలం మిదం జగత్, " అన్న విధంగా అడుగు తీసి అడుగు వేయాలన్న ధనలక్ష్మి లేకపోతే మనుగడే లేదు! కనుక ఈ వృద్ధ పూజారిని వదిలిపోవద్దమ్మా”, అంటూ ఎన్నో విధాలుగా ప్రాధేయపడుతున్న పూజారి రామయ్య శాస్త్రి గారి ప్రార్థనను మన్నించి, ధనలక్ష్మి అక్కడే ఉండిపోయేసరికి మిగతా లక్ష్మీ లందరూ వెనక్కి వచ్చి ”ఓయి రామశాస్త్రి, ! చాలా తెలివిగా భక్తితో వెళ్ళిపోతున్న మమ్ములను మళ్లీ మీ దగ్గరకు వచ్చేలా చేసుకున్నావు, ఎందుకంటే మా అష్టలక్ష్మిలలో ఏ ఒక్క లక్ష్మి లేకపోయినా మేము శ్రీమన్నారాయణ ని సన్నిధికి చేరుకోలేము. కనుక మేము కూడా నీతోనే ఉన్నాము. ఇదంతా నువ్వు చేసుకున్న పూజాఫలమే,” అంటూ ఒదార్చేసరికి, రామయ్య శాస్త్రి గారు పరమానంద భరితుడై, ఆ రాత్రంతా కలలో కూడా అష్టలక్ష్మి వైభవాన్ని, విష్ణు సహస్రనామాన్ని స్మరిస్తూ హాయిగా నిద్రపోయారు..
**************
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కథ వెరైటీ గా బావుంది.