top of page

పున్నమి రాత్రి


'Punnami Rathri' New Telugu Story Written By D V D Prasad

'పున్నమి రాత్రి' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అగరొత్తుల సువాసన ఆ గదిలో మత్తుగా వ్యాపించింది. రాజ్యం కురులలో తురుముకున్న మల్లెపూలు, సన్నజాజుల గుబాళింపుతో ఆ అగరొత్తుల సువాసన కలిసి రాజుని మరింత మత్తులో ముంచెత్తింది. అతని కొంటె చేష్టలకి ఆమె మురిసిపోతోంది. ఇద్దరూ తన్మయత్వంలో మునిగిపోయి ఉన్నారు. ఏసీ చల్లదనం, పరుపు మెత్తదనం, పడుచు వెచ్చదనం వాళ్ళిద్దర్నీ గిలిగింతలు పెడుతున్నాయి, రెచ్చగొడుతున్నాయి.


వాళ్ళిదరిమధ్య ఏకాంతానికి ఏవీ అడ్డురావడం లేదు. ఆ ఏకాంతం వాళ్ళిద్దరిమధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది. ఆ సాన్నిహిత్యాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు ఆ దంపతులు.


రాజ్యం అందించిన తాంబూలం నోటితో అందుకుంటూ, "రాజీ...ఈ ఏకాంతం, ఈ ఆనందం జీవితంలో మరువలేమనిపిస్తోంది. ఈ మధుర స్మృతులు ఎల్లవేళలా ఇలాగే ఉండిపోతే బాగుండుననిపిస్తోంది. మరి నీకేమనిపిస్తోంది?" అడిగాడు ఆమె ఒడిలో సేదతీరుతున్న రాజు.


"ఈ క్షణం ఇలాగే నిలిచిపోతే బాగుండుననిపిస్తోంది." పరవశంగా చెప్పింది రాజ్యం.


"ఓహ్ఁ...! నేనెంత అదృష్టవంతుణ్ణి! నీలాంటి అందమైన, అనుకూలవతి అయిన భార్య లభించటం నా అదృష్టం." అమె చెక్కిలిపై సుతారంగా వేలితో మీటుతూ చెప్పాడు.


అతని చేయి తగలగానే ఆమె చెంపలు కెంపులయ్యాయి. అధరాలు వణకసాగాయి. నునువెచ్చని అతని స్పర్శ ఆమెని గిలిగింతలు పెడుతోంది. "నాకు మాత్రం అదృష్టానికి కొదవేముంది? మీలాంటి భర్త లభించడం నా అదృష్టం కాదా!" అందామె సిగ్గుపడుతూ.


ఇద్దరి మధ్య కాలం స్థంబించింది.


* * * * * * * * *


"లేవండి!...లేవండి! కుర్చీలో కూర్చొని ఏమిటా కునికిపాట్లు! ఇంట్లో ఫ్యానున్నా ఉక్కపోతగా ఉంది కదా అని డాబా మీద పక్క వేసాను. మంచినీళ్ళు కూడా చెంబుతో పెట్టాను. ఇవాళ వెన్నెల రాత్రే కాకుండా డాబామీద మంచి చల్లని గాలికూడా వీస్తోంది. పదండి." అంటూ కుర్చీలో కునుకుపాట్లు పడుతున్న రాజుని లేపింది రాజ్యం.


మధురమైన స్వప్నం నుండి మేల్కొన్న రాజు వాస్తవంలోకి వచ్చాడు. కళ్ళు నులుముకొని చూసాడు. ఎదురుగా రాజ్యం. రాజ్యం కలలోనే కాదు ఇలలో కూడా అద్భుత సౌందర్యవతే! ఇక తప్పదన్నట్లు పెద్దగా నిట్టూర్చి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అప్పటికే రాజ్యం డాబా మీదకి వెళ్ళింది. ఆమె వెనుకే రాజు కూడా వెళ్ళాడు.

అది పున్నమి రాత్రి! పైన పండువెన్నెల కాస్తోంది. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. ఉండుండి చల్లగాలి వీస్తోంది. మేఘాలులేని ఆకాశం నిండా నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. ఆ దృశ్యం నిరుపమానంగా ఉంది. డాబామీద ఓ మూలగా తమ ఇద్దరికోసం పక్క పరిచింది రాజ్యం. పక్కమీద కూర్చున్నాడు. పక్కన చక్కని చుక్కైన రాజ్యం. ఆమె అందించిన వక్కపొడి వేసుకున్నాడు. అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఆమె ఏదో గోముగా చెప్తోంది. ఆమె చెప్పేవాటికి అతను ఊ కొడుతున్నాడు.


ఒక్కసారి రాజుకి తను కన్న కల గుర్తుకు వచ్చింది. పట్టు పరుపు లేకపోతేనేం! ఏసీ చల్లదనం, మత్తెక్కించే పరిమళాలు లేకపోతేనేం! పక్కన మాత్రం సౌదర్యం మూర్తీభవించిన రాజ్యం, ఆమె అనురాగం చాలవా తనకి! అంతటి అదృష్టం మాత్రం ఎంతమందికి పడుతుంది! రాజ్యాలు లేని రాజు తనైనా, తన పక్కనున్న రాజ్యానికి తనే రాజు. ఆమె తన సామ్రాజ్యం. తన జీవితం అత్యంత మధురంగా తోచింది ఆ క్షణం రాజుకి.


"ఏమండీ!..." గోముగా అందామె.


"ఊఁ...." పలికాడు రాజు.


"ఆకాశం చూసారా, ఎంత నిర్మలంగా ఉందో?" చెప్పిందామె చెవిలో గుసగుసగా.


"అవును! నీ మనసులాగే!" మనస్పూర్తిగా అన్నాడు రాజు.

"చుక్కలు చూసారా! ఆ నిండు చందమామ చూసారా ఎంత బాగుందో!"


"ఆఁ...చుక్కలు పొదిగిన నీలాకాశం నువ్వు కట్టుకున్న చుక్కల చీరలాగే ఉంది! మరి ఆ నిండు చందమామ..." ఆగాడు ఆమె మొహం వైపు మోహంగా చూస్తూ.


"ఆ… నిండు చందమామ?..." అతనివైపు చూసి అడిగిందామె.


మిలమిల మెరుస్తున్న ఆమె కళ్ళని చూస్తూ, "ఆ నిండు చందమామ నీ ముఖారవిందంలా ఉంది." అన్నాడు.


"అంటే నా మొహంలా ఉందన్న మాట! మీకీమధ్య కవిత్వం బాగే అబ్బినట్లుందే!" నవ్విందామె.


నవ్వుతున్నప్పుడు సొట్టలుపడే ఆమె బుగ్గలు చూసిన రాజు పరవశం చెందాడు.


"ఏమండీ!..." చెవిలో గుసగుసలాడింది రాజ్యం.


"ఆఁ!..." అన్నాడు అర్ధనిమిలితమైన నేత్రాలతో.


"ఏమండీ, వచ్చేనెల నా పుట్టినరోజుకి డైమండ్ నెక్లెస్ చేయిస్తానని అన్నారు గుర్తుందా?" అడిగిందామె.


"ఆ గుర్తుంది రాజ్యం! తప్పకుండా రాజ్యం! ఈ నెలాఖరుకి ఏరియర్స్ వస్తాయి, తప్పకుండా చేయిస్తాను. అసలు నువ్వే నా మేలిమి బంగారానివి, ఇంకా నీకు బంగారమెందుకు!" చెప్పాడు చిరునవ్వు నవ్వుతూ.


"అయినా ఆ బంగారమేకదా ఏ బంగారానికైనా వన్నె తెచ్చేది." అందామె.


"అవునునవును!" అన్నాడు రాజు.


అలా రాత్రి చాలా సేపటివరకూ ఆ వెన్నెల్లో ముచ్చట్లు చెప్పుకుంటూ పడుకున్నారు వాళ్ళిద్దరూ. నెలాఖరు వచ్చింది. ఏరియర్స్ కూడా వచ్చాయి. ఊళ్ళో రాజు తల్లికి ఒంట్లో బాగులేదని తండ్రి ఫోన్ చేసి చెప్తే ఇద్దరూ ఆదరాబాదరాగా వెళ్ళారు. ఆ ఏరియర్స్ బాపతు వచ్చిన డబ్బులు అక్కడ ఖర్చు కూడా అయిపోయాయి. రాజు తల్లికి నయమై హాస్పిటల్నుండి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది.


రాజ్యంకి ఇంటి పరిస్థితులు తెలుసు. ఆమె రాజీ పడింది, అంతేగాని భర్తని తను కోరిన డైమండ్ నెక్లెస్ కోసం నిలదీయలేదు, పట్టుబట్టలేదు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళీ వాళ్ళిద్దరికీ ఏకాంతం చిక్కింది. ఆ రోజు కూడా రాజ్యం డాబా మీద ఇద్దరికీ పక్క వేసింది. రాత్రి భోజనం చేసి ఇద్దరూ డాబా మీదకి వెళ్ళారు. ఆ రోజు కూడా వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది.


అలసటగా పక్కపై వాలి దిండుపై తలవాల్చి, "రాజ్యం! నీకోసం కొంటానన్న డైమండ్ నెక్లెస్ కొనలేకపోతున్నందుకు నన్ను మన్నించు. డబ్బులన్నీ అమ్మ అనారోగ్యంవల్ల హాస్పిటల్లో ఖర్చు అయిపోయాయి. నా కొచ్చే జీతంతో మనం జీవితంలో రాజీ పడక తప్పదు! వచ్చే ఏడు తప్పకుండా నీ కోరిక తీరుస్తాలే!" అన్నాడు రాజు అనునయంగా.


"అయ్యో!...మీ కష్టాలు మాత్రం నావి కావా! నా బంగారు గొలుసుకన్న అత్తగారి ఆరోగ్యమే ముఖ్యం కదా! నా గొలుసుకోసం తొందరేమొచ్చిందిప్పుడు! వీలైనప్పుడే కొందురుగాని!" నొచ్చుకుంటూ అంది రాజ్యం.


"ఓహ్! రాజ్యం, నువ్వెంత మంచిదానివి? నన్ను, నా పరిస్థితిని ఇంత బాగా అర్ధం చేసుకున్న నీ రుణం నెనెలా తీర్చుకోగలను?" రిలీఫ్గా అన్నాడు రాజు.


"భార్యా భర్తల మధ్య రుణాల ప్రసక్తి ఎందుకండీ..." అందామె అతని ఎదలో తలదాస్తూ.


ఆమెని దగ్గరగా హత్తుకున్నాడతను. ఇలా చాలా ఏళ్ళు దొర్లిపోయాయి, కానీ రాజు మాత్రం ఆమెకి మాట ఇచ్చినట్లు నెక్లెస్ కొనలేకపోయాడు. రాజు చిరు ఉద్యోగంలో పైకి ఎదగడటంతో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. సంసారం పెరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. ఒక కొడుకు, ఒక కూతురూను. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ చదువులు, ఖర్చులు ఇలా కాలచక్రం కదులుతూనే ఉంది.

అమ్మాయి పెళ్ళి ఈ మధ్యనే అయింది. అబ్బాయి కూడా చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరాడు. రాజ్యం కోరిన నెక్లెస్ కొంటానని ప్రతీ ఏడూ రాజు చెప్తూనే ఉన్నాడు. అయితే తనకున్న బాధ్యతల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడు. రాజ్యం పరిస్థితులతో రాజీ పడి మనుగడ సాగిస్తూనే ఉంది. చివరికి రాజుకి ఉద్యోగ విరమణ చేసే రోజు రానే వచ్చింది. ఆ రోజే ఉద్యోగ విరమణ చేసాడు. ఆఫీసులో తోటి ఉద్యోగులు వీడ్కోలు చెప్పారు.


ఇంటికి తిరిగివచ్చిన రాజు, "రాజ్యం!..." అని పిల్చాడు.


తను తెచ్చిన వస్తువు ఆమెకి అందించాడు. అది తీసి చూసిన ఆమె కళ్ళు మిలమిల మెరిసాయి. ఎన్నో ఏళ్ళకిందట ఆమె కోరిన డైమండ్ నెక్లెస్ అందులో ఉంది. ఆమె కళ్ళల్లో సంభ్రమంతో కూడిన ఆనందం తొణకిసలాడింది. అయితే బాధ్యతల వలయంలో పడి ఆమె ఆ విషయమే పూర్తిగా మర్చిపోయింది.


"ఎందుకండీ ఇప్పుడు ఇది!..." అందామె.


"నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు ఆ పున్నమి రాత్రులు, నువ్వు కోరిన కోరిక కూడా! అయితే చిత్రంగా ఇన్నాళ్ళు పట్టింది నీ కోరిక తీర్చడానికి." అన్నాడు రాజు.


ఆమె కళ్ళు సంభ్రమతో తళతళ లాడాయి. ఆ రాత్రి మళ్ళీ వాళ్ళిద్దరికీ పున్నమి రాత్రయ్యింది.

***

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


68 views0 comments

Comments


bottom of page