top of page
Original.png

పుణ్యం

30 minutes ago
4 min read

పేద గర్భిణికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన గ్రామీణ వైద్యుడు శివరాం – పుణ్యం తెలుగు నైతిక కథ

Punyam - Telugu Moral Story | Bhaskara Rao B. R. K. V.

పుణ్యం - తెలుగు నైతిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 16/10/2026


‘పుణ్యం’ బి. ఆర్. కే. భాస్కర రావు రచించిన హృదయాన్ని తాకే తెలుగు నైతిక కథ. పేదలకు నిస్వార్థంగా సేవ చేయడమే నిజమైన పుణ్యమని, మానవత్వమే దైవత్వమని ఈ కథ చక్కగా వివరిస్తుంది.


ఉదయం నుంచి శివరాం మనసు స్థిమితంగా లేదు. రాత్రి మూర్తి తనతో అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి:


"చూడు శివరాం! నువ్వు ఎంతో కష్టపడి వైద్యం చేసినా మన పల్లెటూరిలోని ప్రజలకు విశ్వాసం ఉండదు.


పైగా డబ్బు కూడా పెద్దగా రాదు. నువ్వేమో పుణ్యం, పాపం అని చూసి చూడనట్టుగా పేద ప్రజల దగ్గర డబ్బులు గుంజవు. పుణ్యం అంటే ఇలారాదయ్యా! మన ఊరి గుడిలోకి బురిడీ స్వామి వచ్చి ప్రజల్ని అనుగ్రహిస్తున్నారు.


రాత్రంతా ఉపవాసంతో ఆయన చెప్పే ప్రవచనాలు విని, తెల్లారి వాళ్లు ఇచ్చిన ప్రసాదం తిని, మనకు తోచిన కానుక బురిడీ స్వామికి సమర్పిస్తే మనం కోరుకున్న కోరికలు తీరి స్వర్గానికి వెళ్లే పుణ్యం వస్తుందట. నా మాట విని నాతో కూడా రా. ఒక్క పూట నువ్వు లేకపోతే పేషెంట్లకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదులే..."


"కానీ ఊరి చివర ఉన్న ఒక పేద అమ్మాయి ప్రసవ వేదనతో బాధపడుతోంది. నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని రమ్మని ఇప్పుడే వచ్చి వాళ్లు చెప్పారు. మన ఊరికో సరియైన రోడ్డు లేదు.


ఎడ్ల బండి మీద గతుకుల రోడ్డుపై పట్నం తీసుకెళ్లేలోపు ఆమె ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అటువంటి అమ్మాయిని వదిలి నీతో కూడా ఎలా రావడం? నా మనసు ఒప్పుకోవడం లేదు మూర్తి!" అంటూ గుడికి వెళ్లాలో, పేషెంట్ దగ్గరకు వెళ్లాలో తేల్చుకోలేక సంశయంతో సమాధానం చెప్పాడు శివరాం.


"ఎగిరెగిరి దంచినా అదే కూలీ, ఎగరకుండా దంచినా అదే కూలీ అన్నట్టు ఆ గుడిసెల వాళ్లు నువ్వు ఎంత కష్టపడి వైద్యం చేసినా చివరకు రూపాయో, పావలానో చేతిలో పెడతారు.


నేను చెప్పినట్టు విను. మీ అమ్మాయిలను డాక్టర్లను చేయాలని గంపెడు ఆశతో ఉన్న నువ్వు త్వరలో పెద్ద అమ్మాయి చేత 'నీట్' పరీక్ష రాయిస్తున్నావు.


మా అబ్బాయి చేత 'సివిల్స్' రాయిస్తున్నాను. మన కోరికలు, మన పిల్లల ఆకాంక్షలు తీరాలంటే బురిడీ స్వామి దగ్గరకు వెళ్లాల్సిందే. వెంటనే ఆ కిట్టు పక్కన పెట్టి రెడీగా ఉండు, ఇంటికి వెళ్లి వస్తాను," అని వెళ్లిపోయాడు మూర్తి.


మూర్తి చెప్పిన మాటలు వినడానికి కరెక్టుగానే అనిపించినా, వాస్తవానికి శివరాం మనసు అందుకు అంగీకరించలేదు. బాధలో ఉండే ఒక మనిషిని కాపాడటమే కర్తవ్యంగా భావించే వైద్య వృత్తికి న్యాయం చేయాలనిపించి, పేదరాలి ఆరోగ్యాన్ని కాపాడాలని నిర్ణయించుకుని మందుల బ్యాగ్ తీసుకున్నాడు.


తెల్లారుతుండగా పండంటి బిడ్డను ప్రసవించింది ఆ అమ్మాయి. రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నా ఆ అలసట కాస్తా బిడ్డ తల్లి కన్నీటిపర్యంతమవుతూ చేతులు జోడించి కృతజ్ఞతగా నమస్కరించేసరికి చలించిపోయాడు శివరాం. బాలింత తండ్రి అయితే శివరాం కాళ్లకు మొక్కేసరికి బాధేసింది.


రెండు వందల కుటుంబాలు ఉన్న ఆ పల్లెటూరిలో శివరాం పూర్వీకుల నుంచి వైద్యం ఆనవాయితీగా వస్తోంది. ఎంతో మంది కొత్తగా వైద్యం చేస్తామని ఆ ఊరు వచ్చినా చేయించుకునే వాళ్లు లేక కొద్ది రోజులు ఉండి వెళ్లిపోయేవారు.


ఇద్దరు అమ్మాయిలు ఉన్న శివరాం రోజురోజుకూ కొత్తగా పెరుగుతున్న వ్యాధులకు తన వైద్యం సరిపోదని, పట్నం వెళ్లి ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు సేవ చేయాలనే లక్ష్యంతో తన ఇద్దరు కూతుళ్లను డాక్టర్లను చేసి పల్లెల్లోనే వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నాడు.


అందుకు కూతుళ్లు కూడా ఒప్పుకున్నారు.

మూర్తి తనతో చదవకపోయినా ఇంటి పక్కనే ఉండటం వల్ల ప్రాణమిత్రుడయ్యాడు. ఒక్కడే కొడుకు కావడంతో అతన్ని ఐఏఎస్ చేయాలని ప్రతిన బూనాడు. అందుకు మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు.


రాత్రి నిద్ర బద్ధకం పోగొట్టడానికి భార్య రెండుసార్లు కాఫీ ఇచ్చినా, మూర్తి మాటలు తలుచుకుంటూ వచ్చిన వ్యాధిగ్రస్తులకు మనస్ఫూర్తిగా వైద్యం చేయలేకపోయాడు శివరాం.


బురిడీ స్వామి దగ్గరకు వెళ్లలేకపోయినందుకు మనసులోని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. వెళ్లకపోవడం వల్ల మూర్తి చెప్పినట్టు పెద్దమ్మాయికి మెడికల్ సీటు రాకపోతే ఏడాది వృథా అవుతుంది.


అది తనవల్లే అయితే...???

బాధవేసింది. శివుడు హాలాహలాన్ని మింగినట్టు కుటుంబ సభ్యులకెవరికీ చెప్పకుండా దాన్ని తనలోనే దాచిపెట్టుకున్నాడు.


రోజులు గడిచేకొద్దీ శివరాంలో బెంగ హిమాలయంలా పెరిగింది. ముందుగా మూర్తి కొడుకు హైదరాబాద్ వెళ్లి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత శివరాం పెద్ద కూతురు నీట్ ఎగ్జామ్ రాసింది.


కొన్ని రోజులకు సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. మూర్తి కొడుకు మెయిన్స్‌కు అర్హత సాధించలేక మొదట్లోనే బొక్కబోర్లా పడ్డాడు.


అది తెలిసిన శివరాం గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి... తన కూతురు రిజల్ట్ ఏమవుతుందోనని! అదే విషయాన్ని భార్యతో ప్రస్తావిస్తూ... "కొడుకు కోసం ఎన్నో గుళ్లు గోపురాలు చుట్టూ తిరిగి, చివరిగా మొన్న బురిడీ స్వామి దగ్గరకెళ్లి ఉపవాసం చేసి మరీ కానుక ఇచ్చిన మూర్తి కొడుక్కే సీటు రాలేదంటే, నిత్యం రోగుల మధ్య గడుపుతూ దైవాన్ని విస్మరించి, ఆఖరుకు పిలిచినా బురిడీ స్వామి దగ్గరకు వెళ్లని నాలాంటి వాడి కూతురికి డాక్టర్ చదివే యోగ్యత ఉంటుందా?" అని కళ్లమ్మట నీరు పెట్టుకున్నాడు.


"అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, మీరేమీ ఆందోళన చెందకండి," అని ధైర్యం చెప్పింది శివరాం భార్య.


నెల తిరిగేసరికి నీట్ రిజల్ట్స్ వచ్చాయి. శివరాం కూతురు ఆల్ ఇండియా స్థాయిలో ఎనభయ్యో ర్యాంకు తెచ్చుకుంది! శివరాం గుండెల్లో పేరుకుపోయిన బెంగ ఒక్కసారిగా కరిగిపోయింది. ఆనందంతో కూతురిని హత్తుకున్నాడు, తన కల నెరవేరబోతున్నందుకు మనసారా సంతోషించాడు.


ఒక్క గంట తర్వాత మూర్తి శివరాం దగ్గరకు వచ్చి కన్నీటిపర్యంతమవుతూ... "శివా! వృత్తినే దైవంగా భావించే నీకు దేవుడు అన్యాయం చేయడురా! ఎందుకంటే స్వార్థంతో నా కొడుకును కలెక్టరు చేయాలని ఆశపడ్డాను.


నువ్వు మాత్రం నిస్వార్థంతో పేద ప్రజలకు సాయం చేయాలని నీ కూతురిని డాక్టరు చదివించాలని నిర్ణయించుకున్నావు. దేవుడు గుళ్లల్లోనూ గోపురాల్లోనూ లేడని, ధర్మంగా నడిచే మనుషుల్లో ఉన్నాడని, వాళ్లకే సాయపడతాడని నువ్వు నిరూపించావు. ఐ యామ్ సారీ!" అనేసరికి...


"మన మధ్య సారీలు ఎందుకురా!" అంటూ మిత్రుడిని ఆలింగనం చేసుకున్నాడు శివరాం.


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page