సందేహం తీరింది

Sandheham Teerindhi - Telugu Family Story | Mucchi Dhanalakshmi
సందేహం తీరింది- తెలుగు కుటుంబ కథ | ముచ్చి ధనలక్ష్మి
Published in manatelugukathalu.com on 16/10/2026
తెలుగు కుటుంబ కథలు ఇష్టపడేవారికి ‘సందేహం తీరింది’ ఒక హృదయాన్ని తాకే కథ. ముచ్చి ధనలక్ష్మి రచించిన ఈ కథ తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ, అపోహలు, వృద్ధాప్యంలో ఆత్మగౌరవం, కుటుంబ బాధ్యతల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఉరమని పిడుగులా ఉదయం దిగిన అర్జున్‌ని చూసి అకస్మాత్తుగా ఎందుకొచ్చాడో అని తలకొట్టుకుంటుంటే, హెచ్చరిక లేని తుఫానులా రాత్రి ఊడిపడింది అమూల్య.
అసలేంటి విషయం? ఎందుకొచ్చారిద్దరూ? అదీ ఒకేసారి? అడగాలని నోటి వరకు వచ్చినా ఎందుకో ఆగిపోయాను.
అదే విషయాన్ని సరస్వతి దగ్గర కదిపితే అగ్గిమీద గుగ్గిలమైంది.
"ఏంటండీ? కాస్త పిచ్చిగానే పట్టలేదు కదా మీకు! రాకరాక పిల్లలొస్తే పరామర్శ చేయక ప్రశ్నలేంటి?" విసుక్కుంది.
నిజమే కదా? నేనేంటి మరీ ఇంత ప్రతికూలంగా ఆలోచిస్తున్నాను? సరస్వతి అన్నట్టు అనుమానాల మొక్క పెరిగిపోతుందా?
"ఏంటి నాన్నా విశేషాలు?" అడుగుతూ నేను కూర్చున్న కుర్చీ చేతి మీద కూర్చుంది అమూల్య.
"ఏముంటాయమ్మ?" అంటున్న నా ముఖంలోకి పట్టి పట్టి చూస్తూ, "ఏంటి, ఏదో మార్పు కనిపిస్తుంది మీలో? టాబ్లెట్స్ వేసుకుంటున్నారా?" అడిగింది అమూల్య.
ఎంత త్వరగా గుర్తు పట్టేసింది! నా కూతురు కదా, నవ్వొచ్చింది.
"ఆగాగు, నాన్న బాధ శరీరంగా కాదు, మానసికంగా అనుకుంటాను."
ఆశ్చర్యంగా చూశాను అర్జున్ వైపు.
ఇద్దరూ ఇద్దరే!
ఒక్క క్షణం ఏదో గర్వం కదిలింది వాళ్లనలా చూస్తే.
"మాక్కూడా చెప్పకూడని రహస్యాలున్నాయా నాన్నా?" అంటూ కుర్చీ మరో చేతి మీద కూర్చున్నాడు.
"ఏం లేదురా, బానే ఉన్నాను."
"బానే ఉన్నారా? మరెందుకింత ముభావంగా ఉన్నారు? మేం వచ్చామన్న ఆనందమే లేదు మీలో."
"అయినా, మీలో మీరే అలా బాధపడేంత సమస్య ఏమొచ్చింది? షేర్ చేసుకోవడానికి మేమున్నాము కదా! అమ్మ కూడా చాలా బాధపడుతుంది."
అమూల్య మాటలు ఏ వైపు ఆనందం కలిగిస్తున్నా, వాటిని నమ్మే స్థితిలో లేదు నా మనసు.
"మీ నాన్న సంగతి తెలిసిందే కదా! ఏదీ పైకి చెప్పరు. అన్నీ లోపలే దాచుకుంటారు. కానీ పదండి, భోజనాలు చేద్దాం." సరస్వతి ఆజ్ఞకు బద్ధులై లేచారు అయిష్టంగా.
"సరే పద నాన్నా, తిన్నాక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి."
ఇద్దరూ చెరొక చేయిని లాక్కుని వంటింటిలోనికి తీసుకెళ్లారు.
చాలా ఇంపార్టెంటా? ఏమై ఉంటుంది?
శరవేగంగా ఆలోచిస్తోంది నా మెదడు.
"ఏంటే? ఇంపార్టెంటా? కొంపదీసి హరితో ఏమైనా గొడవ పడ్డావా?"
"నువ్వాగమ్మ! నాకింకేం పని లేదనుకున్నావా? ఎప్పుడు చూసినా హరితోనే, వాళ్లమ్మ నాన్నలతోనే గొడవ పడటానికి!" అమూల్య మాటలతో తృప్తి పడకుండా టక్కున అర్జున్ వైపు తిరిగింది.
"నన్ను చూడకు తల్లీ! నాకసలు రమ్యతో మాట్లాడే ఓపికే లేదు, ఇంక తగువులెక్కడివి?"
"హమ్మయ్య!" దీర్ఘశ్వాస వదిలింది సరస్వతి.
ఇంటి తగువులు కాదు, ఉద్యోగానికి ప్రమాదం లేదు. మరేమై ఉంటుంది?
ఎంతలా ఆలోచించినా ఏం తట్టడం లేదు.
"దేని గురించి?" అడిగింది సరస్వతి.
"అదే అమ్మా, మొన్న చెప్పాగా నేను, అమ్మూ కలిసి ఇంకో ఫ్లాట్ తీసుకుంటున్నాం అని… నాన్న..." అంటున్న అర్జున్ నోటిని మూసేసింది అమూల్య.
"'సర్ప్రైజ్' అనుకున్నా కదా! అంతా చెడగొట్టేలా ఉన్నావ్, ఇంక కామ్‌గా ఊరుకో!" అని.
నాలిక్కరుచుకుని నవ్వాడు అర్జున్.
ఇప్పుడు వెలిగింది! వాళ్లున్న ఏరియాలో ఫ్లాట్ అంటే కనీసం ముప్పై లక్షలుంటుంది. సో, ఇద్దరూ కూడబలుక్కుని మనీ అడగడానికి వచ్చారా? అయినా అంత డబ్బు నా దగ్గర లేదుగా?
"ఏంటి నాన్నా! మనిషి ఇక్కడ, మనసెక్కడో! మేం చెప్పేది వింటున్నారా అసలు?" దీర్ఘం తీశాడు అర్జున్.
"ఏదైనా కొత్త పథకాలకి శ్రీకారం చుడుతున్నారా?"
"పాలిటిక్స్ లో చేరారా?"
"యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?"
విరామం లేకుండా సంధిస్తున్నారు ప్రశ్నల బాణాల్ని.
"మరీ అంత పెద్ద పెద్ద కోరికలేం లేవులే," అనేశాను.
"అయితే చిన్న కోరికలున్నాయా ఏంటి నాన్నా? అవి చెప్పవా?" చిన్నపిల్లలా అడిగింది అమూల్య చూస్తూ.
"అబ్బా! ఆపవే! వచ్చినప్పటి నుండి వాగుతూనే ఉన్నావ్!" సరస్వతి కోప్పడేసరికి నా వైపు చూసింది సపోర్ట్ కోసం.
"ఈ వాగుడు లేదనేగా వారం నుండి పిల్లల్ని చూద్దాం, పిల్లల్ని చూద్దామని చంపుతున్నావు? ఇప్పుడెందుకా అరుపులు?"
"నిన్నటి వరకు లైబ్రరీలా ఉండి, ఒక్కసారిగా వారానికొకసారి జరిగే సంతలా అయ్యేసరికి నా చెవులు తట్టుకోలేకపోతున్నాయి," నవ్వుతూ చెప్పింది.
అయితే ఆ నవ్వులో జీవం లేదు.
ఈ రోజు వాళ్లు వచ్చారన్న ఆనందం కన్నా రేపు వాళ్లు వెళ్తారనే బాధ కనిపిస్తోంది ఆ ముఖంలో.
పిల్లలెప్పుడూ కళ్లముందే ఉండాలని ఎందుకు కోరుకుంటుంది ఈ పిచ్చి మనసు?
ఇది స్వార్థమే, మేం ఇంత స్వార్థపరులం అయిపోయామేంటి?
"సరే అమ్మ! మీరు తినేసి పడుకోండి, మేం పైన పడుకుంటాం," అని చెప్పి మెట్ల వైపు నడిచాడు అర్జున్.
ఆ వెనుకే దిండ్లు, దుప్పట్లు పట్టుకుని అమూల్య కూడా.
పైన ముచ్చటించుకోవాల్సిన రహస్యమేంటి?
బుగ్గలు నొక్కుకుంది సరస్వతి.
"రహస్యం కదమ్మా! చెప్పకూడదు లే."
"రాక్షసి, అసలు తగ్గదు చూసారా?"
సరస్వతి మాటలకి రెస్పాండ్ అవ్వలేదు.
అసలు వీళ్లిద్దరి ఆకస్మిక ఆగమనానికి కారణమేంటి? తల బద్ధలైపోయేంత నొప్పి.
కళ్ల ముందు స్నేహితుల దీనమైన ముఖాలు,
చెవుల్లో వారి చేదు అనుభవాలు… ఇంక నిద్ర ఎలా పడుతుంది?
"పెంచే వరకు మన పిల్లలు, పెరిగాక మన పిల్లలవ్వరురా. మనం చేసేవన్నీ చాదస్తపు పనులు, చెప్పేవన్నీ సుత్తి మాటలు."
ఇలాంటివెన్ని చెప్పినా నా పిల్లల మీద నాకు నమ్మకం పోలేదు కానీ భయం మొదలైంది, వాళ్లు అలా మారిపోతారేమోనని.
ముఖ్యంగా శేఖర్ చెప్పినది విన్నాక నా భయం రెట్టింపు అయింది.
"మీరిద్దరూ ఇక్కడెందుకు నాన్నా? సిటీకి వచ్చేయండి అని నెల రోజులు పట్టు పట్టి మరీ తీసుకెళ్లాడు నా కొడుకు. మా మీద ప్రేమకి మురిసిపోయాం కానీ అక్కడికి వెళ్లాక మూడు రోజుల్లోనే అర్థమైంది వాడెంత పెద్దవాడయ్యాడో.
మా చుట్టూ కొన్ని సరిహద్దు రేఖలు, అన్ని గదులకు వెళ్లే హక్కు లేదు. కనీసం వాళ్ల పిల్లల గదిలోకి కూడా. మా గది మాకు బంధీఖానా అనిపించింది. మనకు నచ్చినట్లు వాళ్లు వండలేరు, వాళ్లు వండింది తినలేము మనం. 'పిల్లల్ని మీరే ముద్దు చేయొద్దమ్మా!' కొడుకు ఆర్డర్.
'చిన్నపిల్లలు కదా మావయ్య! నచ్చినట్టు చేయనివ్వండి, అన్నింటికీ అడ్డు తగలకండి' కోడలి సలహా లాంటి సూచన. 'పనిమనిషితో అన్నీ చెప్పొద్దు! అది పబ్లిసిటీ చేస్తుంది.' వాళ్లు మామూలుగానే చెప్పినా మనకు ఆజ్ఞల్లానే వినిపిస్తాయి. వాళ్లతో కలవలేం కదా, ఇక అదంతే. వాడి జీతం, కోడలి జీతం చాలడం లేదని ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేయమని ఒకటే గోల.
అప్పుడు మాత్రం భయమేసిందిరా, జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండాలా అని. అమ్మనని చెప్పగానే ఇంట్లో మౌనవ్రతం మొదలైంది, చివరకు చిన్నపిల్లలతో సహా. అందుకే వృద్ధాప్యంలో పిల్లల తోడున్నా, లేకున్నా మనకంటూ ఒక నీడ ఉండాలి, అది ఖచ్చితంగా మన సొంతమై ఉండాలి. ఇది నేను నా కొడుకు ఇంట్లో నేర్చుకున్న కొత్త పాఠం."
ఎంత వద్దనుకున్నా శేఖర్ మాటలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు దేన్ని నమ్మాలి?
నా పెంపకాన్నా? కళ్ల ముందు సాక్ష్యాల్లా కనిపిస్తున్న జీవితాల్నా?
ఆలోచిస్తుంటే పిచ్చెక్కినట్లవుతోంది.
నావి అనవసర భయాలేమో? అర్జున్, అమ్మూ అలా చేయరేమో? అని ఎంతలా మనసుకి సర్దిచెప్పుకున్నా మెదడు వినడం లేదే, ఏం చేయను?
సలహా ఇస్తుందేమో అని సరస్వతి దగ్గర చెప్తే గయ్‌మని లేచింది నామీద, "వాళ్లు మన పిల్లలండి, అనవసరంగా ఎవరెవరితోనో పోల్చి తక్కువ చేయొద్దు," అని.
అంతే, అనుభవమైతే కానీ అర్థం కాదెవరికీ.
రాత్రంతా ఏం మాట్లాడుకున్నారో గానీ ఉదయం లేట్‌గా లేచారిద్దరూ.
లేవగానే పిల్లలు నా చుట్టూ చేరారు.
ఏం చెప్తారు ఇంకా?
ఎవరు మొదలు పెట్టాలా అని కళ్లతో చేసుకుంటున్న సైగలు నాకు తెలుస్తూనే ఉన్నాయి.
డైరెక్ట్‌గా డబ్బులడుగుతారా? ఇవ్వకుంటే వాళ్ల దృష్టిలో విలన్ అవ్వడం, అది పక్కన పెడితే సరస్వతి చేసే రాద్ధాంతం భరించగలనా?
"నాన్నా! మీతో మాట్లాడాలి," అమ్మూనే మొదలు పెట్టింది.
తలుపాను చెప్పమన్నట్టు.
"నువ్వు కూడా రా అమ్మ!" సరస్వతిని తీసుకువచ్చి కూర్చోబెట్టాడు అర్జున్.
"దేని గురించిరా?" అడిగింది సరస్వతి.
"మీ గురించే అమ్మ! మూడేళ్లు దాటింది మీ ఇద్దరినీ మాతో పాటు వైజాగ్ వచ్చేయమని అడిగి. ఆలోచిస్తాం అన్నారు కదా అని ఇన్ని రోజులు చూశాం. ఇంక మా వల్ల కాదు, ఈ రోజు మీ నిర్ణయం చెప్పాల్సిందే," అని నా వైపు చూశాడు అర్జున్.
"చెప్పాల్సింది కాదు అన్నయ్యా! రావాల్సిందే అను," సవరించింది అమ్మూ.
అంతా అనుకున్నట్టే అవుతుంది. వెళ్తే ఒక బాధ, వెళ్లకుంటే మరో బాధ.
"ఇంక మౌనంగా ఉండొద్దు నాన్నా! మీ జవాబు చెప్పండి."
వదిలేలా లేరు.
"ఈ ఊరు, ఇల్లు వదిలి నేను రాలేనురా, మీరేమైనా అనుకోండి."
"ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కదా! కొంచెం కొత్తదనం ప్రయత్నించొచ్చు కదా!"
"ఈ వయసులో నాకింక కొత్తదనం అక్కర్లేదు, అలవాట్లు చాలు." నేను కూడా తగ్గలేదు.
"అయినా ఎంత జర్నీ నాన్నా? మూడు గంటలేగా? మనం పూర్తిగా ఊరిని వదిలేస్తామా? పండగలకు, సెలవులకు అందరం ఇక్కడికి వద్దాం."
"అదేరా నేను చెప్పేది కూడా! పండగలకు, సెలవులకు ఎలాగూ మీరిక్కడికి వస్తారు. అలా కాకుండా మధ్యలో ఎప్పుడైనా చూడాలనిపిస్తే జర్నీ మూడు గంటలేగా?"
అమ్మూ వైపు చూశాడు అర్జున్, వాడి డైలాగ్స్ అయిపోయాయేమో?
"మరీ రోజూ చూడాలనిపిస్తే ఏం చేయాలి నాన్నా?" అమ్మూ ప్రశ్నకు క్షణం తడబడ్డాను.
రోజూ ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎవరి జీవితాలు వాళ్లకున్నప్పుడు.
"ఎంత సింపుల్‌గా అనేశారు! కొన్ని కొత్త బంధాలొచ్చాయని మిమ్మల్ని పక్కన పెట్టేశాం అనుకున్నారు కదా? రోజులో ఎన్నిసార్లు మీ ఇద్దరినీ తలుచుకుంటానో తెలుసా? వంటగదిలో ఉన్నంతసేపు అమ్మ జ్ఞాపకాలే, గార్డెన్‌లోకి వెళ్తే మీరే గుర్తొస్తారు. న్యూస్ ఛానల్స్ చూసినా, గుడి కనిపించినా, స్కూటీ చూసినా, ఏం చేస్తున్నా, ఖాళీగా ఉన్నా గుర్తొస్తూనే ఉంటారు." గిర్రున నీళ్లు తిరిగాయి దాని కళ్లలో.
"ఈ టైంలో అమ్మ ఏం చేస్తుంటుంది? తిన్నదా? టాబ్లెట్స్ వేసుకుందా? అసలు మీరు ఫోన్ చేస్తే టెన్షన్… ఏం చెప్తారో, ఎవరికి హెల్త్ బాలేదు అంటారో అని! చేయకపోతే మరింత భయం… ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని! ఇదేం మీకర్థం కాదు… లేదు లేదు, అర్థం చేసుకోరు. అసలు మీకోసం..." ఇంక ఆపైన గొంతు రాక ఆగిపోయింది, కళ్లు తిరుగుతుండగా.
ఎంత మామూలుగా ఉందామన్నా నా కళ్లూ చెమ్మగిల్లాయి.
ఇంక సరస్వతి పరిస్థితి చెప్పక్కర్లేదు.
ఇక నా వంతు అన్నట్టు ముందుకొచ్చాడు అర్జున్.
"ఒప్పుకుంటున్నా నాన్నా! నాకు కోపమొస్తే అరుస్తాను, నాకు నచ్చినట్టే చేయమని మీతో పోట్లాడతాను. కానీ ఇది ఈ రోజే కొత్తగా మొదలుపెట్టలేదు కదా! చిన్నప్పటి నుండి ఉందిగా? మరి అప్పుడు క్షమించిన మీరు ఇప్పుడు ఎందుకని క్షమించలేకపోతున్నారు?" ఆగి నా వైపు చూశాడు.
"ఎందుకంటే అప్పుడు మీ పిల్లలం, మీకు మాత్రమే సొంతమైన వాళ్లం. ఇప్పుడు వేరెవరికో జీవన భాగస్వాములం, పరాయి వాళ్లం కదా?" నవ్వాడు నిర్వేదంగా.
"ప్లీజ్ నాన్నా! అర్థం చేసుకోండి, ఈ వయసులో మీ ఇద్దరినీ ఇలా ఒంటరిగా ఎలా వదిలేస్తాం?"
మనసు అటూ ఇటూ ఊగకుండా స్థిరంగా ఉంది.
వాళ్ల మీద నమ్మకం, అనుమానం రెండూ ఏదీ ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉన్నాయి.
"అసలు మీరు జీవితాంతం ఇదే ఊళ్లోనే ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు మరి మిమ్మల్ని ఎందుకంత దూరం పంపించి పెద్ద చదువులు చదివించారు? హాయిగా ఇదే ఊళ్లో చిన్న టైలరింగ్ షాప్, ఏదైనా మెకానిక్ షాప్ పెట్టుకునేవాళ్లం కదా? ఒకరి మీద ఆధారపడకుండా, మన కాళ్లపై మనల్ని నిలబెట్టే ఏ ఉపాధైనా విలువైనదని మీరే చెప్పారుగా? అంటే మీరు కష్టపడి మమ్మల్ని తీర్చిదిద్ది, ఆకాశాన కూర్చోబెడితే, మేం మిమ్మల్ని మరిచిపోయాము అన్నట్లుగా వదిలేయాలి… అంతే కదా?"
ఆవేశంగా అరుస్తున్న అమ్మూ కళ్లు ఎర్రబడ్డాయి.
ఆ తర్వాత నేనింకేం మాట్లాడలేదు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఎవరూ. నా మౌనాన్ని అంగీకారం అనుకుని, ఎక్కడ మళ్లీ మారిపోతానో అని భయపడుతున్నట్టు అప్పటికప్పుడే బయలుదేరదీశారు బలవంతంగా.
దీని పరిణామాలు ఎలా ఉంటాయో?
డైరెక్ట్‌గా వైజాగ్ వరకు కార్ మాట్లాడేశాడు అర్జున్.
దిగాక అలవాటు ప్రకారం అర్జున్ ఫ్లాట్ వైపు నడిచాం. ఆ ఇద్దరి ఫ్లాట్స్ పక్క పక్కనే ఉన్నాయి.
"అటు కాదు నాన్నా, ఇటు!" వెనుక నుండి పిలిచింది అమ్మూ.
ఇటా? అంటే ఏంటి? అర్థం కాలేదు నాకు.
"అదంతే, మీరు రండి అని చెప్తాను," అని లోపలికి తీసుకువెళ్లింది.
అది అమ్మూ ఫ్లాట్ కూడా కాదు, కొత్తది.
తోరణాలను బట్టి గృహప్రవేశం చేసి రెండు మూడు రోజులే అవుతుందని గ్రహించాను.
"బాగున్నారా?" లోపలి నుండి పలకరించారు హరి, రమ్య గుమ్మం దగ్గర నిలబడి.
"ఏంటి ఇది? అయోమయంగా, అర్థం కాకుండా, పిచ్చిపిచ్చిగా ఉంది!" అడుగుతోంది సరస్వతి.
"సర్ప్రైజ్ అమ్మా!" అంటూ కీస్ నా చేతిలో పెట్టాడు అర్జున్.
"మీ ప్రాబ్లెమ్ ఏంటి? మాతో ఉండటమే కదా? ఇది మీ ఫ్లాట్, మీరు మాత్రమే ఉండే మీ సొంత ఫ్లాట్! మీరెక్కడికో వచ్చి ఇబ్బంది పడక్కర్లేదు. మీరు గుర్తొచ్చినప్పుడు, మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు మేమే ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ఓకేనా?" అర్జున్ కళ్లు మెరిసిపోతున్నాయి ఆనందంతో.
నా మనసుకి పట్టిన మబ్బులన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి.
వాళ్లిద్దరూ మా కోసం అంత బాధ్యతగా, పెద్దరికంగా ఆలోచిస్తుంటే, నేనెందుకింత అల్పంగా స్వార్థం కోసం, డబ్బు కోసం అనుకున్నాను? ఛ…
"అటు చూడమ్మా! అది రామాలయం, ఇక నుండి నువ్వు రోజూ మా ముగ్గురితో పాటు నీ కోడలు, అల్లుడి మీద కూడా కంప్లైంట్స్ చెప్పుకోవచ్చు! ఆ పక్కనే పార్కు కూడా ఉంది. అక్కడ యోగా, మెడిటేషన్ చేస్తుంటారు. మీరు వెళ్లడం ఆలస్యం, మిమ్మల్ని ఆ గ్రూప్‌లో కలిపేసుకుంటారు. ఫుల్ టైమ్ పాస్!"
అమ్మూ గడగడా చెప్పుకుపోతుంటే, గట్టు తెగిన సెలయేరులా దూకింది కన్నీటి ప్రవాహం.
నేనెంత అదృష్టవంతుడిని! ఇదే నా పెంపకం. ఇక మారాల్సింది మేమే.
కోడలు, అల్లుడు కూడా మా పిల్లలే అనుకుంటే పరాయి వాళ్లు ఉండరు, ఇబ్బంది ఉండదు.
వాళ్లు పుట్టినప్పుడు కలిగినంత ఆనందం మళ్లీ ఇప్పుడు కలిగింది. శేఖర్‌లా, మా ఫ్రెండ్స్‌లా ఎవరికీ భయపడి బతకక్కర్లేదు.
ఇంక ఒంటరిగా వాళ్ల జ్ఞాపకాలతో బాధపడక్కర్లేదు, గుర్తుకొచ్చినప్పుడు డైరెక్ట్‌గా వాళ్లతోనే మాట్లాడొచ్చు.
"ఏమైంది?" గబగబా దగ్గరకు వచ్చారిద్దరూ నా కన్నీళ్లు చూసి.
"సారీ రా! నా మొండితనంతో మీ ఇద్దరినీ చాలా విసిగించాను కదా! నన్ను ఇలా వదిలేశారనే కోపం, రోజూ మీతో మాట్లాడకుండా, రోజుకొక్కసారిగా ఏదో ఒక దాని గురించి మీతో వాదించకుండా ఉండలేను. కానీ అదేదీ బయటపెట్టని బలహీనత నాది. ఇంక ఎప్పటికీ మీతోనే ఉంటాను," ఆనందంతో మాటలు రాలేదు.
"పదండీ లోపలికి. ఇల్లు చూడరా?" నా భుజం మీద చెయ్యేశాడు అర్జున్.
ఆ స్పర్శలో ఎంత హాయి! మేమున్నామన్న ధైర్యం, ఎప్పటికీ ఉంటామన్న నమ్మకం…
"నేను చెప్పానా? వాళ్లు మన పిల్లలండి!" వెనుక నుండి మధురంగా వినిపించింది సరస్వతి గొంతు.
**********************
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
ముచ్చి ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: ముచ్చి ధనలక్ష్మి
కధలు చదవటం అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి ఏ కథల పుస్తకం దొరికినా ఆఖరి వరకు చదివేదాన్ని. ఇంటర్ చదువుతున్నప్పటి నుండీ రాయటం మొదలు పెట్టాను.
నేను రాసిన Short stories ఈనాడు, సాక్షి, స్వాతి, చతుర, విపుల లో పబ్లిష్ అయ్యాయి. కొన్ని యాప్స్ లో నవల్స్ కూడా రాస్తున్నాను.








Comments