top of page
Original.png

బంధాలు

Updated: Jul 12


బంధాలు, తెలుగు కుటుంబ కథ, భావోద్వేగ కథ, అమ్మమ్మ మనవరాలు కథ, అరేంజ్డ్ మ్యారేజ్, తెలుగు ప్రేమ కథ, కుటుంబ బంధాలు, పెళ్లి నిర్ణయం, మహిళ స్వేచ్ఛ, తెలుగు కథలు, Mana Telugu Kathalu

పెళ్లి మండపంలో వధువు వేషంలో ఉన్న సరయు ప్రేమతో తన అమ్మమ్మ వైపు చూస్తుండగా, దూరంగా నిలబడి భావోద్వేగంతో ఉన్న అమ్మమ్మ, పక్కనే ఆందోళనగా చూస్తున్న తల్లిదండ్రులు కనిపిస్తున్న కుటుంబ బంధాలు, అపార్థాలు, ప్రేమను ప్రతిబింబించే హృద్యమైన దృశ్యం.
పెళ్లి మండపంలో వధువు వేషంలో ఉన్న సరయు ప్రేమతో తన అమ్మమ్మ వైపు చూస్తుండగా, దూరంగా నిలబడి భావోద్వేగంతో ఉన్న అమ్మమ్మ, పక్కనే ఆందోళనగా చూస్తున్న తల్లిదండ్రులు కనిపిస్తున్న కుటుంబ బంధాలు, అపార్థాలు, ప్రేమను ప్రతిబింబించే హృద్యమైన దృశ్యం.

Bandhalu - Telugu Emotional Family Story | Mcchi Dhanalakshmi

బంధాలు తెలుగు భావోద్వేగ కథ | ముచ్చి ధనలక్ష్మి

Published in manatelugukathalu.com on 10/07/2026


ప్రేమతో పెంచిన బంధాలు ఒక్క నిర్ణయంతో దూరమవుతాయా? జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ప్రతి వ్యక్తికీ ఉన్నప్పటికీ, కుటుంబ ఆశలు, పెద్దల అభిప్రాయాలు, భావోద్వేగాల మధ్య ఆ నిర్ణయం ఎంత పెద్ద సంఘర్షణకు దారితీస్తుందో హృదయాన్ని కదిలించే కథే "బంధాలు". ప్రేమ, స్వేచ్ఛ, అపార్థాలు, కుటుంబ బంధాల విలువను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ కథ ప్రతి పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.


బస్సు దిగి ఇంటి వైపు నడుస్తున్న సరయు మనసు గాలిలో తేలిపోతోంది.


కాలేజీ మొత్తంలో ఇరవై మందే సెలెక్టయ్యారు. అందులో తనుందా? ఆనందం పట్టలేకపోతోంది.


"అమ్మమ్మా!" అరుస్తూ సత్యవతి దగ్గరికెళ్ళింది.


"అరవకు, మీ మావయ్య పడుకున్నారు. మెల్లగా.." అంది.


"నేను చెప్పింది వింటే నువ్వు కూడా అరుస్తావు."


"ఏంటో అంత గొప్ప విషయం?" అక్కడే ఉన్న కమల అడిగింది.


"నిజంగా గుడ్ న్యూస్ అత్త!"


"అదేంటో చెప్పొచ్చు కదా! అందర్నీ పిచ్చెక్కించకు," అంటూ ఆదిత్య కూడా అడిగాడు ఫోన్ ప్రక్కన పెట్టి.


"నేను ప్లేస్మెంట్స్ లో సెలెక్టయ్యాను," గట్టిగా చెప్పింది.


సత్యవతికి అర్థం కాలేదు, కమలకి కూడా.


సరయు సంతోషం చూసి ఎందులోనో ఫస్ట్ వచ్చి ఉంటుంది అనుకున్నారు.


ఆదిత్య లేచి "కంగ్రాట్స్" అంటూ చేయిచ్చాడు.


"ఏ కంపెనీ? ప్యాకేజీ ఎంత?" వివరాలు అడిగాడు.


"ఏంట్రా?" అర్థం కానట్టు అడిగింది సత్యవతి.


ఆదిత్య, సరయు నవ్వుకున్నారు.


"నాకు ఉద్యోగం వచ్చింది అమ్మమ్మా! ఈ రోజే ఇంటర్వ్యూ అయింది కాలేజీలో."


సత్యవతికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసింది.


అప్పటికే సత్యవతి మొహంలో నవ్వు ఎగిరిపోయింది.


"అయినా నీ చదువు ఒక సంవత్సరం ఉంది కదా?" అనుమానంగా అడిగింది.


"పరీక్షలు కూడా అవ్వలేదు. లాస్ట్ సెమిస్టర్ అయిపోగానే జాయిన్ అయిపోవచ్చు. రిజల్ట్స్ కూడా ఎర్లీగానే ఇచ్చేస్తారు."


సత్యవతి మైండ్ సరయు జాబ్ దగ్గరే ఆగిపోయింది.


నాన్నకు ఇంకా చెప్పలేదు. అమ్మకి చెప్తే గుండె ఆగిపోతుంది అనుకుంటూ ఫోన్ పట్టుకుని రూమ్ లోకి వెళ్ళింది.


"ఇంతకీ ఉద్యోగం ఎక్కడరా?" ఆదిత్య వైపు చూసింది.


"హైదరాబాద్ లో నానమ్మా!"


"హైదరాబాద్ లోనా?" ఆలోచనలో పడింది.


*********************


ఆదివారం ఉదయాన్నే దిగిన తల్లిదండ్రుల్ని చూసి షాకయ్యింది సరయు.


"నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదమ్మా వస్తున్నట్లు!" అంటూ వనజని పట్టుకుంది.


"సర్ప్రైజ్ చేద్దామని," అన్నాడు మోహన్.


ఇద్దరి మొహాల్లో ఏదో కంగారు.


"ఏమైంది?" అనుకుంటూ తండ్రి పక్కన కూర్చుంది.


ఆ ప్రశ్నకి సమాధానం ఆ రోజు సాయంత్రమే దొరికింది, ఎక్కువ వెయిట్ చేయక్కర లేకుండా.


సాయంత్రం అందరూ హాల్లో కనిపించడంతో ఏదో డౌటొచ్చింది సరయుకి.


"రామ్మా!" వనజ పిలిచేసరికి వెళ్ళి పక్కన కూర్చుంది.


కమల, వనజ ఏవో సైగలు చేసుకుంటున్నారు.


సరయు బ్రెయిన్ వేడెక్కిపోతోంది టెన్షన్తో.


చాలా సేపు కళ్ళతో మాట్లాడుకున్నాక నోరు విప్పాడు మోహన్.


"ఆదిత్యా! నీకు సరయు అంటే ఇష్టమేనా?" అని.


ఊహించని ప్రశ్నకి సరయుతో పాటు ఆదిత్య కూడా ఆశ్చర్యపోయాడు.


"ఏంటి మావయ్యా?" అయోమయంగా చూశాడు.


"నీకూ, సరయుకి పెళ్ళి చేద్దామనుకుంటున్నాం. మీ ఇద్దరికీ ఇష్టమైతే?" సూటిగా చెప్పేశాడు.


ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు ఆలోచిస్తూ.


సరయు అయితే ఫ్రీజ్ అయిపోయింది కాసేపు.


"అదేంటమ్మా?" సరయు ఏదో చెప్పబోతుంటే ఆపింది కమల.


"దీని గురించి మేం చిన్నప్పటి నుండే అనుకుంటున్నాం. రెండు రోజులు ఆలోచించుకుని చెప్పండి. వెంటనే చెప్పాలనేం లేదు."


సభ ముగిసింది.


నిశ్శబ్దంగా ఒక్కొక్కరూ ఒక్కో వైపుకి వెళ్ళిపోయారు.


ఆ రెండు రోజులు ఇబ్బందిగా, కష్టంగా గడిచాయి సరయుకి.


సరయు వాళ్ళది విలేజ్ కావడంతో టెన్త్ వరకే అక్కడ చదివి, ఇంటర్, డిగ్రీ సత్యవతి వాళ్ళ దగ్గరుండి పూర్తి చేసింది.


MBA లాస్ట్ లో ఇలాంటి బాంబ్ విసిరారు.


సరయుకి అమ్మమ్మంటే చాలా ఇష్టం. తనని చాలా గారాబం చేసేది. సెలవులిస్తే చాలు అమ్మమ్మ దగ్గరకే వెళ్ళేది.


అందుకే ఆదిత్యకి తనంటే కోపంగా ఉండేది. చిన్నప్పుడు.


తర్వాత తనతో ఫ్రెండ్లీగానే ఉండేవాడు.


చిన్నప్పటి నుండీ తనతో పాటే పెరిగిన ఆదిత్య అంటే ఇష్టమే కానీ అది పెళ్ళి చేసుకునే ఇష్టం కాదు.


ఆదిత్య మంచివాడే. డిగ్రీ అయ్యాక ఫొటోగ్రఫీ నేర్చుకుని ఫోటో స్టూడియోని రన్ చేస్తున్నాడు.


సరయు కి ఏం చెప్పాలన్న అయోమయం లేదు. తను క్లియర్ గా ఉంది.


రెండు రోజుల తర్వాత చెప్పిన సరయు నిర్ణయం ఇంట్లో అందర్నీ ఆశ్చర్య పరిచింది.


సత్యవతి, కమల అంత త్వరగా వదిలే రకం కాదు. సరయు బ్రెయిన్ వాష్ చేయడానికి గట్టిగానే ప్రయత్నించారు.


"ఆదిత్యకేం తక్కువ? బాగుంటాడు, మంచివాడు, చదువుకున్నాడు, సంపాదన కూడా బాగుంది, ఇంకేం కావాలి?"


"అవన్నీ నిజమే. నేను కాదనలేదుగా? చిన్నప్పటి నుండీ నాతో పెరిగిన వాడిని, కలిసి ఆడుకున్నవాడిని ఒక్కసారిగా భర్త అనుకోమంటే ఎలా?" వాదించింది.


"పెళ్ళి చూపుల్లో ఒక్కసారి చూసి, పది రోజులు ఫోన్ మాట్లాడిన వాడిని భర్త అనుకోమంటే అనుకోవడం లేదా?"


లాజిక్ తీసింది సత్యవతి.


ఆదిత్య మీద అలాంటి అభిప్రాయం లేదనీ, లైఫ్ పార్టనర్ లా ఊహించుకోలేనని వాళ్ళకర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియలేదు సరయుకి.


"అయినా జాబ్ వచ్చిన ఆనందంలో నేనుంటే ఇప్పుడీ పెళ్ళి మాటలెందుకు?


"సందర్భం వచ్చింది కాబట్టే చెప్తున్నా. నీ చదువు అవ్వగానే పెళ్ళి చేద్దాం అనుకుంటున్నా. పెళ్ళయ్యాక నువ్వక్కడ, వాడిక్కడ ఏం బాగుంటుంది?"


అంటే మాటల వరకే కాదు, పెళ్ళి పనులు కూడా మొదలు పెట్టేసేలా ఉన్నారే! సరయుకి పిచ్చి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంది.


తర్వాత నాలుగు రోజులూ ఒక్కొక్కరూ ఒక్కోరకంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.


ఇంత జరుగుతున్నా ఆదిత్య నోరు తెరవక పోవడం చిత్రంగా అనిపించింది.


ఆ మౌనం ఇష్టమా? అయిష్టమా?


అదే అడిగింది ఆదిత్యని.


"వారం రోజుల ముందు వరకూ నా మైండ్లో కూడా పెళ్ళి గురించి ఆలోచనే లేదు."


ప్రశ్నార్థకంగా చూస్తోంది సరయు.


"కానీ 'నో' అంటే నానమ్మ బాధపడుతుంది కదా?"


"నానమ్మ కోసం యస్ చెప్తావా?" అసంతృప్తిగా అడిగింది.


దానికన్నా నాక్కూడా నువ్వంటే ఇష్టమే. అంటే ఆలోచించేదేమో? సినిమాల ప్రభావమో? ఫ్రెండ్స్ మాటలో? కానీ లైఫ్ పార్టనర్ తన కోసమే, తనని చూసే ఓకే చేయాలన్న కోరిక సరయుది.


"ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా?" అడిగాడు మోహన్.


"ఇంకా అడగలేదేంటా అనుకుంటున్నా, ఆదిని వద్దు అన్నానంటే నా మనసులో ఇంకెవరో ఉన్నట్టా?" చిరాకు పడింది.


అక్కడి నుండి కమల సూటిపోటి మాటలు, సత్యవతి చివాట్లు సరయుని ఆ ఇంట్లో ఉండనివ్వలేదు.


సరయుకి ఇష్టం లేకుంటే వదిలేద్దామని మోహన్ ఎంత చెప్పినా సత్యవతి వినలేదు.


మిగిలిన ఇద్దరు కొడుకుల్నీ పిలిపించింది సరయుని ఒప్పించటానికి.


ఫలితంగా సరయు అందరి దృష్టిలో చెడ్డదయింది ఎవరి మాటా వినక.


తర్వాత తండ్రి సలహాతో హాస్టల్లో జాయిన్ అయింది లాస్ట్ సెమిస్టర్ వరకూ.

ఎగ్జామ్స్ అయిపోవడం, జాబ్ లో జాయిన్ అవ్వడం టకటక అయిపోయాయి.


ఆదిత్యకి పెళ్ళి కుదిరిందని తెలియడంతో సరయు తల మీద నుండి పెద్ద బరువు దించుకున్నట్టే అనిపించింది.


ఇంక అమ్మమ్మ మళ్ళీ తనతో మామూలుగా మాట్లాడేస్తుందని తెగ ఆనందంగా పెళ్ళికెళ్ళింది.


సరయు మీద మొదటి నుండీ హోప్స్ లేవు కనుక ఆదిత్య బానే మాట్లాడాడు కానీ కమల బలవంతంగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంది. సత్యవతి అయితే మొహం కూడా చూడలేదు.


పెళ్ళికూతురు సరయు కన్నా బాగుంది, మంచి కుటుంబం, చక్కగా చదువుకుంది కనుక అమ్మమ్మకి కోపం పోతుందన్న సరయు ఆశ, ఆశగానే మిగిలిపోయింది.


 

"నా ఇంట్లో ఉన్నావు, తిన్నావు, చదువుకున్నావు కానీ నా మాటకి విలువివ్వనప్పుడు నీతో నాకేంటి?" అనేసింది సరయు మొహం మీద.


అమ్మా నాన్నల కన్నా అమ్మమ్మంటేనే ఇష్టమని సత్యవతి చుట్టూ తిరిగే సరయు ఆ తిరస్కారం తట్టుకోలేకపోయింది.


ఏడుపు మొహంతోనే బస్సెక్కింది.


తర్వాత రెండుసార్లు పండగలకి, ఆదిత్యకి పాప పుట్టినపుడు వెళ్ళి ఎంత బతిమాలినా కరగలేదు సత్యవతి.


అయిందేదే అయింది వదిలేయండత్తమ్మా! అంటున్న కోడలి వంక చురుక్కున చూసింది.


సరయు అంటే తనకెంతో ఇష్టం. చిన్నపుటి నుండీ అడిగినవేం కాదనలేదు. తన కళ్ళ ముందుండాలనే కదా ఈ పెళ్ళి నిర్ణయించింది.


దర్జాగా, రాణి హోదా ఇస్తామంటే కాదని, అక్కడ వాళ్లెవరి కాళ్ళ దగ్గరో పనిచేస్తుంది. ఇంత మోసం చేసినదాని మొహం చూడకూడదు గట్టిగా అనుకుంది.


*******************-


కళ్యాణ మండపంలోనికి అడుగుపెడుతున్న సత్యవతిని చూస్తూనే పెళ్ళి బట్టల్లో ఉన్న సరయు కళ్ళు పెద్దవయ్యాయి.


"అమ్మమ్మా!" అరుస్తూ రివ్వున పరిగెత్తింది.


"కోపం పోయిందా?" అడుగుతూ చేయి పట్టుకోబోయింది.


వెంటనే దూరం జరిగింది సత్యవతి.


"నా మనవడి కన్నా ఏం ఎక్కువ ఆ అబ్బాయిలో?" సూటిగా చూసింది సరయు వైపు.


సరయు తలదించేసింది తప్పు చేసినదానిలా.


ఇప్పుడెందుకమ్మా అవన్నీ ! వనజ విసుక్కుంటే ఊరికే అంది సత్యవతి.


సరయుకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. అమ్మమ్మ క్షమించడం జరగని పనని.


అసలు అంత పెద్ద తప్పేం చేసింది తను? నిజంగా అర్థం కాలేదు. ఆదిని పెళ్ళి చేసుకోను అంది అంతేగా? తన జీవితం పై తనకామాత్రం హక్కు లేదా? దీనికే అమ్మమ్మకి తనపై ఉన్న ప్రేమంతా వేడి తగిలిన వెన్నలా కరిగిపోయిందా ?


అంటే అంతకు ముందున్న అభిమానం అంతా అబద్ధమేగా?

అంటే అంతకు ముందున్న అభిమానం అంతా అబద్ధమేనా?

ఎవరెన్ని చెప్పినా సత్యవతి ముహూర్తం వరకూ ఉండలేదు. అక్షింతలేసి వెళ్ళిపోయింది తన పని అయిపోయినట్లు.


దిగులుగా కూర్చున్న సరయు ని చూస్తే జాలేసింది మోహన్ కి.


"అయినా అమ్మకి ఇంత పట్టింపేంటి? పెళ్ళికొడుకు వాళ్ళ ముందు ఎంత చులకన? ఇలా వచ్చి, అలా వెళ్ళిపోతే?"


మండిపడింది వనజ.


"తప్పు మనది. దీన్ని అక్కడుంచి చదివించడమే మనం చేసిన తప్పు."


"ఇంక అమ్మమ్మ నాతో ఎప్పటికీ మాట్లాడదా?" అంటున్న సరయు కళ్ళనిండా నీళ్ళు.


దీనికంతటికీ కారణం ఎవరు?


పెద్దల మాట కాదని నా జీవితం, నా నిర్ణయం అన్న సరయుదా?


పిల్లల అభిప్రాయానికి విలువివ్వకుండా నా మాటే అవ్వాలని శాసించిన సత్యవతిదా ? ఎవరి వల్లనైతే ఏంటి! ఒక్క నిర్ణయం వల్ల రెండు కుటుంబాల మధ్య కలహాలు,


ఇంత మంది మనుషుల మధ్య అపార్థాలు అనుకుంటూ కూతురి దగ్గరకెళ్ళాడు.


"అమ్మమ్మ సంగతి తెలుసు కదరా! టైం పడుతుందిలే."


"మళ్ళీ నాతో మాట్లాడుతుందా?" ఆశగా అడిగింది.


"ఖచ్చితంగా, పదా, పదా రెడీ అవ్వు," తొందర పెట్టాడు.


తండ్రి మాటకి మళ్ళీ చిగురించిన ఆశతో మండపానికి కదిలింది సరయు.


********************** 



ముచ్చి ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



ముచ్చి ధనలక్ష్మి
ముచ్చి ధనలక్ష్మి

పరిచయం: ముచ్చి ధనలక్ష్మి


  కధలు చదవటం అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి ఏ కథల పుస్తకం దొరికినా ఆఖరి వరకు చదివేదాన్ని. ఇంటర్ చదువుతున్నప్పటి నుండీ రాయటం మొదలు పెట్టాను.

నేను రాసిన  Short stories ఈనాడు, సాక్షి, స్వాతి, చతుర, విపుల లో పబ్లిష్ అయ్యాయి. కొన్ని యాప్స్ లో నవల్స్ కూడా రాస్తున్నాను.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page