top of page
Original.png

నెమలి పించం


నెమలి పించం, Nemali Pincham Telugu Story, Telugu Friendship Story, Emotional Telugu Story, College Friendship Telugu, Peacock Feather Story Telugu, Muchchi Dhanalakshmi Stories, Telugu Literature, Telugu Emotional Stories, Mana Telugu Kathalu

నెమలి పించాలతో చేసిన గ్రీటింగ్ కార్డును పట్టుకుని చిరునవ్వుతో నిలిచిన ఇద్దరు కాలేజీ స్నేహితురాళ్లు, స్నేహం మరియు జ్ఞాపకాలను ప్రతిబింబించే 'నెమలి పించం' కథ చిత్రం.
నెమలి పించాలతో చేసిన గ్రీటింగ్ కార్డును పట్టుకుని చిరునవ్వుతో నిలిచిన ఇద్దరు కాలేజీ స్నేహితురాళ్లు, స్నేహం మరియు జ్ఞాపకాలను ప్రతిబింబించే 'నెమలి పించం' కథ చిత్రం.

Nemali Pincham - Telugu Emotional Story | Mucchi Dhanalakshmi

నెమలి పించం తెలుగు భావోద్వేగ కథ | ముచ్చి ధనలక్ష్మి

Published in manatelugukathalu.com on 13/07/2026


“అక్కా! ఆ డ్రెస్ చూడు ఎంత బాగుందో! నెమలి పించాలతో.. ఒక్కసారి చూద్దామా?” సంభ్రమంగా అరిచింది మైనా.


షాపింగ్ ఉత్సాహమంతా రివ్వున ఎగిరిపోయింది నెమలి పించం పదం వినగానే.


ఏదో గుచ్చినట్టయింది గుండెల్లో అమాయకమైన నీలి

ముఖం కదలగానే.


అసలెంతలా అనుకుంటానో గుర్తు రాకూడదని అంతలా గుర్తుకొస్తుంది.


“అమ్మో! రెండు వేలంట!” వెళ్ళినంత వేగంగా వెనకొచ్చింది గిర్రున.


తలూపాను ‘అవునా?’ అన్నట్టు.


“ఏమైందే?” అడుగుతూ, “అబ్బా! నీకెన్ని సార్లు చెప్పాలి?

అవసరమైనవి మరిచిపోతావు. కానీ వద్దన్నవి మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటావే” అని తల కొట్టుకుంది.


“పదా! ఇంటికెళ్దాం.”


“ఏంటి ఇంటికెళ్లేది? ఇప్పుడు నిన్ను వదిలేస్తే దాని గురించి ఓ పుస్తకం రాసేస్తావు కానీ, పదా.. మాల్‌కెళ్దాం” అని లాక్కెళ్ళింది బలవంతంగా.


మనసు ఎక్కడెక్కడో తిరుగుతున్నా మైనా బలవంతం మీద ఏవో గేమ్స్ ఆడి, కనిపించినవన్నీ కొని ఇంటికొచ్చేసరికి తొమ్మిదయింది.

       

“ఏడు గంటలకే వచ్చేస్తామన్నారుగా” అని కోప్పడింది అమ్మ.


“ఏడు గంటలకే వచ్చేద్దామనుకుంటేనే ఈ టైమైంది” అని

చెప్తున్న మైనా మాటలకి అమ్మ కోపం ఇంకాస్త పెరిగింది.


“ఆపు, అసలు మీరు అమ్మాయిలన్నది గుర్తుందా?” అని అరిచింది.


“అమ్మా! ప్లీజ్ నాకు ఓపిక లేదు.”


“అవును, బయట తిరగటానికైతే ఉంటుంది ఓపిక, ఇంటికొచ్చేసరికి ఉండదు. అదీ నా ముఖం చూస్తే అసలు ఉండదు.” ఆగి, “అదేంటలా ఉంది?” అంది నన్ను చూసి.

“ఏం లేదులే, అలసిపోయిందేమో” అని తేలిగ్గా నవ్వేసింది.

  

“ఈ రోజు కాలేజీలో ఏమైందో తెలుసా? వింటే నమ్మలేవు”, మంచమెక్కగానే మొదలుపెట్టింది మైనా భోజనమయ్యాక.


ఏదో ఒకలా నన్ను ఆలోచనల నుండి లాగాలని దాని ప్రయత్నం.


గంట సేపు ఏదేదో చెప్తూ మెల్లగా నిద్రలోనికి జారిపోయింది.


అది పడుకుందని నిర్ధారించుకున్నాక చప్పుడు చేయకుండా లేచి బెడ్ రూమ్ లోనికెళ్లాను.


మళ్ళీ మళ్ళీ తీసి చూసే వీలులేకుండా పైన కప్ బోర్డు మీద పుస్తకాల అడుగున పడేసింది మైనా.


పిచ్చి కాకుంటే కళ్ళకి పరిమితులున్నాయి కానీ ఆలోచనలకు ఉండవు కదా?


అవి ఎక్కడికైనా వెళ్లగలవు, దేన్నయినా చూడగలవు. ఆలోచనలనెలా బంధించగలను?


పైకెక్కి కష్టపడి తీసాను.


నేను మరిచిపోవాలనుకున్నా అనుక్షణం గుర్తొచ్చే జ్ఞాపకాన్ని.


నెమలి కన్నులతో అందంగా డిజైన్ చేసిన గ్రీటింగ్.


“మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మయూరా! నీ పేరుకి సరిగ్గా సరిపోయే గ్రీటింగ్ కదా?”


నీలి గొంతు ఇంకా వినిపిస్తోంది చెవుల్లో.


మనసు బలంగా లాగింది గ్రీటింగ్ వైపు.


ఎంత బాగుంది! ఆ గ్రీటింగ్ చూసిన నా కళ్ళు కూడా మెరిసిపోయాయి నెమలి కన్నుల్లా.


“ఎవరు చేసారే?” నా చేతుల్లో నుండి లాక్కుంది రూప.


“ఎవరో చేసింది నేనెందుకిస్తానే, నేనే చేసా” అని నవ్వింది నీలి.


క్షణాల్లో ఆ గ్రీటింగ్ క్లాస్ మొత్తం, కాలేజీ మొత్తం తిరిగేసింది.


ఎన్ని ప్రశంసలో!


“ఎన్ని రోజులు చేసావే? అన్ని పించాలెక్కడివి? అసలా

ఐడియా నీదేనా? నీ ఫ్రెండ్ కేనా? మాకూ అలాంటివి ఇచ్చే అవకాశాలున్నాయా?”


సాయంత్రం వరకూ నీలి తల తింటూనే ఉన్నారు మా రాక్షసులు.


అన్నింటికీ దాని సమాధానం చిరునవ్వే.


“ఇందుకేనా వారం రోజుల నుండి సాయంత్రం నువ్వు మా ఇంటికి రావట్లేదు, నన్ను మీ హాస్టల్‌కి రానివ్వలేదు” అని చిరుకోపంగా అడిగాను సాయంత్రం.


“ఎందుకే అంత కోపం? అదీ  నీ బర్త్ డే నాడు?” నా బుగ్గలు లాగుతూ, “ఓ చిన్న గురుదక్షిణ ఇవ్వటానికి ఆ మాత్రం కష్టపడొచ్చు” అంది నవ్వుతూ.


“ఇది గురుదక్షిణా? శిష్యురాలిగా ఇచ్చావా? మరి ఫ్రెండ్ గా ఏమిస్తావ్?”


చేయి చాపాను.


“నక్షత్రాలు, హరివిల్లు, వెన్నెల…”


ఆలోచిస్తున్న నీలిని చూసి ఫక్కున నవ్వేసాను.


నీలికి నేను బెస్ట్ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నీ.


తను దగ్గర్లోని ఓ చిన్న విలేజ్ నుండి వచ్చింది ఫ్రీ సీటుతో.


తెలుగు మీడియం, తెలియని ప్లేస్ కారణంగా మా ఎవ్వరితో కలవలేకపోయింది.


మా వాళ్ళు కూడా ఊరికే ఏడిపించేవారు, కానీ ఫ్రెషర్స్ డే న సుధీర్ దాని మీద ఏదో జోక్ చేసేసరికి అందరూ గట్టిగా నవ్వారు.


మౌనంగా కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్తున్న నీలిని చూస్తే చాలా బాధనిపించింది మాకు.


ఇంకొకసారి తననలా ఏడిపిస్తే సర్ కి కంప్లైంట్ చేస్తా అని అందరికీ వార్నింగ్ ఇచ్చింది రూప.


“ఇలా అమాయకంగా ఉంటే అందరూ అలానే ఏడిపిస్తారు. నువ్వలా ఉండకూడదు మరి” అని మెల్లగా చెప్పాను తర్వాత.


“ఇంకెలా ఉండాలో నాకు తెలియదు.” 


తన కళ్ళలో నిస్సహాయత, మాటల్లో అమాయకత్వం చూసి మొదట కోపమొచ్చినా తర్వాత నవ్వొచ్చింది.


“నేను చెప్తాను ఎలా ఉండాలో.”


“నిజంగానా?” నమ్మలేనట్లు అడిగింది.


“నిజంగా…” నమ్మకం కలిగేలా చెప్పాను.


“థాంక్స్ చాలా చాలా!” నా రెండు చేతుల్ని పట్టుకుని వేగంగా ఊపింది ఆనందంగా.


ఇక ఆ రోజు నుండి నీలి నా బాధ్యతైపోయింది పూర్తిగా.


మా బంధానికి హద్దులేం పెట్టుకోలేదు. ప్రతీ విషయంలో సలహా తీసుకునేది.


కాలేజ్, చదువు, ఫ్రెండ్స్, కుటుంబం అన్నింటిలో.


ఇంటికి తీసుకెళ్ళాను. మా అమ్మకి నీలి నా కన్నా బాగా నచ్చేసింది.


“అలా ఉండాలి అమ్మాయంటే పద్ధతిగా, పొందిగ్గా. ఎంత సాంప్రదాయంగా ఉంటుంది? మీరూ ఉన్నారు ఎందుకు? అయితే తగువులు, లేకుంటే అలకలు.”


నీలిని చూసినప్పుడల్లా పొగడ్తలు, మా మీద అక్షింతల్లా తిట్లు.


“నీలి చాలా అమాయకురాలు మయూరా!” అమ్మ నాతో అంది ఓ రోజు.


“మొదలు పెట్టావా?” అని విసుక్కుంది మైనా.


అమ్మ సీరియస్గా చూసి నా దగ్గరకొచ్చింది.


“నువ్వేదో సరదాగానో, నీ టైంపాస్ కోసమో తనకి అన్నింటిలో సపోర్ట్ గా ఉంటున్నావ్, తర్వాత నీ పనుల్లో బిజీ అయ్యాక వదిలేస్తావా?”


“అది... నేను…” ఏదో చెప్పబోయాను.


“అది మాత్రం చేయకు” అని టక్కున అంది మధ్యలోనే.


“నిన్ను, మైనాని చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లోనూ మేము ప్రోత్సహించాం. ఆర్థిక సహకారం కానీ, ధైర్యం కానీ, ఆత్మ విశ్వాసం కానీ అన్నీ ఇచ్చాం, కాని నీలి అలా కాదు.


ఊర్లో ఉంది కనుక స్కూల్లో జాయిన్ చేసిన తల్లిదండ్రులు.


ఇరవయ్యేళ్ళు దాటితే అత్తారింటికి పంపించేయాలనుకునే సమాజంలో పెరిగింది.


మీ కరస్పాండెంట్ ఆ ఊరివాడు కనుక ఫ్రీ సీటు ఇచ్చారు. తన వరకూ ఆ ఊరు దాటి, ఈ కాలేజీలో అడుగు పెట్టటమే చాలా పెద్ద విషయం.


తెలియక తన బాధ్యత తీసుకున్నావు. మధ్యలో మాత్రం వదిలేయకు. తనంతట తాను నిలబడే వరకూ ఆధారంగా ఉండు. లేకుంటే ఇంత కష్టపడి నీలి వేసిన ముందడుగు వ్యర్థమైపోతుంది.”


      

నేను, మైనా ఒకరి వైపు ఒకరం చూసుకుని అమ్మ వైపు చూసాం.

దీర్ఘంగా చూస్తోంది ఎటువైపో,


అమ్మ కళ్ళలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు.


ఇన్ని రోజులు నేను నీలిలో ఒక కోణమే చూసాను, అమ్మ కదా! అమ్మలానే ఆలోచించింది.


అప్పటి నుండి నీలి మా కుటుంబంలో కూడా సభ్యురాలై పోయింది.


అమ్మ, నాన్న తనని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.


ఎగ్జామ్స్ కి ఇద్దరం కలిసే చదివేవాళ్ళం మా ఇంట్లో.


ఇంగ్లీష్ మీడియం కారణంగా చదువులో వెనుకబడ్డ తనకి ప్రతీది రెండు, మూడు సార్లు వివరించాల్సి వచ్చేది. దానికోసం నేను మరింత బాగా చదవాల్సి వచ్చేది.

మా అందరి ప్రోత్సాహం, నీలి పట్టుదల వల్ల ఆ సెమిస్టర్ లో ర్యాంక్ వచ్చింది.


అది మొదటి సారి తెలుగు మీడియం నుండి వచ్చిన స్టూడెంట్ కి ర్యాంక్ రావటం.

రిజల్ట్స్ తెలిసిన హడావిడిలో ఉన్నాం ఆ రోజు.


సడన్ గా క్లాస్ లోనికి మదన్ సర్ వచ్చేసరికి అంతా నిశ్శబ్దమైపోయింది.


'కంగ్రాట్స్ మయూర' అన్నారు నా దగ్గరకొచ్చి.


“థాంక్యూ సర్.”


“నువ్వు టాపరైనందుకు కాదు కంగ్రాట్స్ చెప్పింది.”


అర్థం కానట్టు చూసాను.


“అంతకన్నా గొప్ప పని చేసినందుకు. వెలుగుతున్న దీపం మరిన్ని దీపాలను వెలిగించినట్లు నువ్వు చదువుతూనే నీలిని నడిపించావు. నీకూ గురువైనందుకు గర్వంగా ఉంది.


ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు.”


సర్ చేయి నా భుజాన్ని స్పృశించింది ఆప్యాయంగా.


ఎవరో క్లాప్స్ కొట్టారు. మెల్లగా అలా క్లాస్ మొత్తం ప్రతిధ్వనించిపోయింది చప్పట్లతో.


ఏదో కలలో ఉండిపోయినట్టు ఉన్నా చాలాసేపు.


సర్ నీలిని రమ్మని చేయిచూపారు.


బెరుగ్గా, భయంగా వచ్చి నిలబడింది నా ప్రక్కన.


“ఇది మొదలు, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. నా నమ్మకాన్ని నిలబెడతావు కదా!”


“తప్పకుండా బాబాయ్” అని తలూపింది నీలి.



'బాబాయ్!' .. ఆసక్తిగా చూసాం.


సర్ చిన్నగా నవ్వేసారు మా మొహాలు చూసి.


"వీరిది మా ఎదురిల్లే, వాళ్ళ నాన్నతో గొడవపడి మరీ ఈ కాలేజీలో జాయిన్ చేసాను" అని నీలి తల నిమురుతున్న సర్ కళ్ళలో సన్నని కన్నీటి పొర.


సాయంత్రం ఇంటికెళ్తున్నపుడు పరుగెత్తుకుంటూ వచ్చి నా చేతుల్ని గట్టిగా పట్టుకుంది.


ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికీ.


ఇంతకు ముందు కూడా చాలా సార్లు టాపరయ్యాను, ఇలానే అభినందించారు. కానీ ఆ రోజు మదన్ సర్ ప్రశంస, నీలి కళ్ళలో కాంతి, భుజం తట్టిన స్పర్శ అలాగే మనసులో ఇంకిపోయాయి మరిచిపోలేనంతగా.


అక్కడి నుండీ ప్రతి సెమిస్టర్లో నీలికి ర్యాంక్ వచ్చేది, తనకి పట్టుదల చాలా ఎక్కువ. అనుకున్న దాని కోసం ఎంతైనా కష్టపడుతుంది.


ఫైనలియర్ లోనే క్యాంపస్ సెలెక్షన్ లో జాబ్ వచ్చింది నాకు, కానీ నీలికి ఆఖరి రౌండ్లో మిస్సయిపోయింది.


రెక్కలు తెగిన పక్షిలా ఢీలా పడిన నీలినెలా ఓదార్చాలో తెలియక నేను సతమతమవుతుంటే తనకి వరుణ్ణి  వెతకడం మొదలు పెట్టారు వాళ్ళ నాన్న.


“ఇంట్లో ఉంటే ఇంతేనే, వారానికి ఇద్దరు, ముగ్గుర్ని చూపిస్తున్నారు.


ఏదో ఒకటి ఖాయం చేసేస్తారేమో! ఈ చదువు, కష్టం అన్నీ వృధా అయిపోతున్నాయి. ఉన్న పొలామంతా అమ్మేస్తానంటున్నారు నాన్న.


తర్వాతెలా బ్రతుకుతారన్న ఆలోచన వాళ్ళకి లేదసలు” అని

నాకు ఫోన్ చేసి ఏడ్చింది.


తనకెలా చెప్పాలో అర్థం కాలేదు.


“పోనీ ఇక్కడికి వచ్చేయమనక్కా! ఎలాగో మూడు ఇంటర్వ్యూలకి వెళ్ళిందిగా! ఏదైనా ఓకే అవ్వచ్చు. అవ్వకున్నా నీ సర్కిల్ పెద్దదే కనుక ఏదో జాబ్ చూడచ్చు.”


మైనా సలహా నాకూ బాగానే ఉందనిపించింది. మా ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకున్నాం. మైనా కాలేజీ కూడా ఇక్కడికి దగ్గరే.


ఈ మాట చెప్పగానే ఎగిరి గంతేసింది నీలి. “కానీ నాన్న జాబ్ కోసం అంటే పంపించరేమోనే?” అంది ఇంతలోనే.


“అయితే జాబ్ వచ్చేసింది, మూడు నెలలు ట్రైనింగ్ అని చెప్పు. ఈలోగా ఏదో ఒకటి చూద్దాం” అని ధైర్యం చెప్పాను.


“నీకెలా థాంక్స్ చెప్పాలో…”


“నోరు మూసుకుని అంకుల్ని ఒప్పించి బయలుదేరే ప్రయత్నాలు మొదలుపెట్టు.”


కాల్ కట్ చేసాను నవ్వుకుంటూ.


నీలి ఇక్కడికి వచ్చేస్తుందంటే దాని కన్నా నాకే ఎక్కువ హ్యాపీగా ఉంది. అదొచ్చిందంటే ఈ సందడి ఇంకాస్త పెరుగుతుంది.


“అదేంటే అప్పుడే పెరుగు వేసుకుంటున్నావు, సాంబారు వేసుకో” అంటూ ప్రక్కన కూర్చుని వడ్డించటం, పనున్నా, లేకున్నా వెనుక వెనుకే తిరగటం.


“ప్రపంచంలో మీ ఇద్దరే ఉన్నారు గొప్ప ఫ్రెండ్స్” అని మైనా వెక్కిరించడం...


అన్నీ నా కళ్ళ ముందు కదులుతున్నాయి అప్పుడే.


“అమ్మో! మీ ఫ్రెండ్ వస్తే నా ముఖం కూడా చూడనివ్వదే” అని ఉదయమే అంది మైనా.


‘తొందరగా నీలికి ఏదో ఒక జాబ్ దొరికితే మదన్ సర్ తో చెప్పి అంకుల్ మరో సంవత్సరం వరకూ పెళ్ళి మాట ఎత్తనివ్వకుండా చూడాలి.’ ఆలోచిస్తూనే నీలి రెజ్యూమ్ కొన్ని కంపెనీలకు పంపించాను.


మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసింది నీలి.


రేపు బయలుదేరుతున్నానే అన్న డైలాగ్ కోసం ఎదురుచూస్తున్నాయి నా చెవులు.


“నాన్న ఒప్పుకోవటం లేదు మయూరా!” అని కీచుగా వినిపించింది దాని గొంతు.


“చదివింది చాలు మరిక ఉద్యోగాలంటూ లేనిపోని తలనొప్పి తీసుకురాకు. ఎలాగో ఈ సంవత్సరంలో పెళ్లి చేసేస్తాం. ఇంటి పట్టునే ఉండు’ అంటున్నారు.”


“అబ్బా!” తల కొట్టుకోవటం నా వంతయింది.


“నేను మాత్రం ఇక్కడుండను” అంది సీరియస్ గా.


“చిన్నప్పటి నుండి వాళ్ళు చెప్పిందేదీ జవదాటలేదు. నా ఇష్టమంటూ ఏమీ ఉండొద్దా నా జీవితంలో? జాబ్ చేసేది కేవలం నా కోసమే కాదుగా! వాళ్ళ జీవితాలు కూడా కాస్త బాగుపడాలనేగా! అర్థం చేసుకోరు, వాళ్ళంతే” అని వెక్కిళ్ళ మధ్య ఆగుతూ ఆగుతూ చెప్పింది.


“నీలి…”


“ఇంకేం చెప్పకు” అని నా మాటలకు అడ్డొస్తూ, “సాయంత్రం బయలుదేరతాను, అడ్రెస్ పంపించు” అంది.


అయోమయంలో ఉంది నా మెదడు. అంతా గందరగోళం.


వాళ్ళింట్లో వాళ్లకి ఇష్టం లేకుండా తీసుకురావడం కరెక్టేనా?


ఏవేవో ప్రశ్నలు జనించాయి ఒక్కసారి.


“ప్లీజ్ మయూరా! ఇదే నిన్నడిగే ఆఖరి సహాయం, ప్లీజ్” అని

నిస్సహాయంగా  అర్థించింది.


ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఎందులో దూకాలి?

ఊగిసలాడింది మనసొక క్షణం.


ఏదైతే అదవనీ. పరిస్థితులు మరీ చేయి దాటితే మదన్ సర్ ఉన్నారుగా?


“సరే ,ఆఫీస్ నుండి క్యాబ్ బుక్ చేసి అక్కడికే వస్తాను. రెడీగా ఉండు” అని ధైర్యంగా అనేసాను, భయం వెనక్కి లాగుతున్నా.


“బ్రిడ్జ్ దగ్గరుంటా” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.


పెద్ద రాయి పడింది తల మీద. దీని వల్ల ఇంకెన్ని సమస్యలు రావటానికి రెడీగా ఉన్నాయో?


'ఏంటి మయూరా ఇది' అని వరుణ్ కోపంగా వచ్చాడు

డోర్ దగ్గర  దబ్ మని వేసి.


తుళ్ళిపడి చూసాను.


తను మా టీం లీడర్. “అన్నీ ఎర్రర్స్, రేపే సబ్మిట్ చేయాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు.”


ఫైల్ నా మొహాన కొట్టి వెళ్లిపోయాడు.


టెన్షన్ గా వర్క్ లో పూర్తిగా మునిగిపోయిన నా మైండ్ లోకి నీలి ఆలోచనే రాలేదా రోజంతా.


నా ఆనందాన్నంతా హరించేస్తూ నీలి బాడీ వాగులో దొరికిందన్న వార్త చేరింది ఉదయాన్నే.


సూసైడ్ చేసుకుందో? యాక్సిడెంటల్ గా పడిందో?

ఇంకా తేలలేదు అప్పటికి.


నా జీవితాన్ని గట్టిగా కదిపేసిన వార్త,


నన్ను పూర్తి దుఃఖ సంద్రంలో ముంచేసిన వార్త,


నీలి లేదన్నది నమ్మలేనట్లుంటే, నా వలనేనా అన్న బాధ మరో వైపు.


గుచ్చి గుచ్చి గునపాల్ని దించుతుంది గుండెలో.


సాయంత్రం ఇంట్లో గొడవపడి బయటికొచ్చి బ్రిడ్జ్ దగ్గర

వెయిట్ చేసిందంట చాలాసేపు .


నేను రాలేదన్న బాధతో సూసైడ్ చేసుకుందా?


నా మీద నమ్మకం పోయిందా?


ఇప్పటికీ నమ్మలేక పోతున్నా నీలి లేదని. రెండు నెలలు దాటినా.


“అక్కా!” 


నా పిలుపు జ్ఞాపకాల సుడిగుండం నుండి బయట పడ్డాను.


ఇది చూస్తే మళ్ళీ క్లాస్ మొదలుపెడుతుంది. లోపలికెళ్ళాను గ్రీటింగ్ దాచేసి.


                  *****************


'దిగు'


సర్ పిలుపుకి తుళ్ళిపడి చూసాను.


పచ్చని పొలాలలో కళకళలాడుతున్న పల్లె.


అర్థం కానట్టు చూసాను.


“మయూరా అంటే నువ్వేనా?” అంటూ ఎదురొచ్చారిద్దరూ.


“నీలి అమ్మ నాన్నలు” వెనుక నుండి చెప్పారు సర్.


“మదన్ చెప్పాడు నీలి చనిపోయిన నాటి నుండీ అదంతా నీవల్లేనని బాధపడుతున్నావని.”


నీలి తండ్రి గొంతు రుద్ధమైంది.


“దాని చదువు, ఉద్యోగం పిచ్చి తెలిసి కూడా అందుకు అడ్డుపడ్డానని నా మీద కోపం తో వెళ్ళిపోయింది.


టీవీలో, పేపర్లలో ఏవేవో వార్తలు చూసి ఆడపిల్లని బయటికి పంపించటానికి భయపడ్డాను, కానీ అది బాగుపడితే చూడాలని నాకు మాత్రం ఉండదా? నన్ను అర్థం చేసుకోలేకపోయింది” అని నిట్టూర్చారు.


“కాలేజీ నుండి ఇంటికొచ్చినప్పుడంతా నీ గురించి చెప్పేది. మా అందరి కన్నా నీ మీదనే అభిమానం, నిన్నెలా అపార్థం చేసుకుంటుంది?


నువ్విలా దాన్ని తలుచుకుని బాధపడుతున్నావని తెలిస్తే పైన కూడా ప్రశాంతంగా

ఉండదు నా బిడ్డ.”


ఇక దుఃఖం ఆపుకోలేక ఏడ్చేసింది వాళ్ళమ్మ గట్టిగా.


సాయంత్రం వరకూ అక్కడే ఉండి బయల్దేరాం.


“జీవితంలో కొన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొన్ని మరిచిపోవాలి.”


సర్ గొంతు మంద్రంగా సాగిపోతుంది.


“నీలిని మరిచిపోమని అనను, తను నీకు చేదు

జ్ఞాపకం కాకూడదు. నీలి గుర్తోస్తే నీ మొహం ఆనందంతో, ప్రశాంతంగా ఉండాలి. మీ పరిచయం, మాటలు, చేసిన అల్లరి అన్ని గుర్తు రావాలి,

అది మాత్రమే. తర్వాత జరిగింది నీవు మార్చలేవు.”

            

అందుకే మరిచిపోవాలి. తప్పదు.


దానికెంత కాలం పడుతుంది? ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను.


కారు వేగంగా దూసుకుపోతుంది గతం నుండి భవిష్యత్తు వైపు.


********************** 



ముచ్చి ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



ముచ్చి ధనలక్ష్మి
ముచ్చి ధనలక్ష్మి

పరిచయం: ముచ్చి ధనలక్ష్మి


  కధలు చదవటం అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి ఏ కథల పుస్తకం దొరికినా ఆఖరి వరకు చదివేదాన్ని. ఇంటర్ చదువుతున్నప్పటి నుండీ రాయటం మొదలు పెట్టాను.

నేను రాసిన  Short stories ఈనాడు, సాక్షి, స్వాతి, చతుర, విపుల లో పబ్లిష్ అయ్యాయి. కొన్ని యాప్స్ లో నవల్స్ కూడా రాస్తున్నాను.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page