పుణ్యశీలుడు - గురువు
- T. V. L. Gayathri
- Sep 5
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #పుణ్యశీలుడుగురువు, #నీసఖినికేశవా

గాయత్రి గారి కవితలు పార్ట్ 36
Punyaseeludu Guruvu - Gayathri Gari Kavithalu Part 36 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 05/09/2025
పుణ్యశీలుడు - గురువు - గాయత్రి గారి కవితలు పార్ట్ 36 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
పుణ్యశీలుడు - గురువు
(తేటగీతి పద్యములు)
**********************************
విద్య బోధించు గురువులన్ వేల్పులనుచు
సజ్జనాత్ములై శిష్యులు చదివి నపుడు
ప్రగతి బాటలో దేశమ్ము పరుగు లిడును
జ్ఞానమొసగెడి గురునికి జయము జయము.//
జాతి భవితకై తపియించు సద్గుణ నిధి
మార్గదర్శకుడైనట్టి మహితశక్తి
చిన్మయానందరూపుడై జీవనమున
జ్ఞానమొసగెడు గురునికి జయము జయము.//
పుణ్యశీలుని కరుణతో భోగములను
పొందుచుందురు మనుజులీ పుడమియందు
తామసంబును తొలగించి దయను చూపి
జ్ఞానమొసగెడు గురునికి జయము జయము.//
పరమతత్త్వంబు నెఱిగించు ప్రాజ్ఞుడతడు
తెలియజేయుచు పరమాత్మ తీరుతెన్ను
భవ్య పథముకు చేర్చెడి వరదుడిలకు
జ్ఞాన మొసగెడి గురునికి జయము జయము.//
ప్రణవ మందున వసియించు పరమయోగి
బ్రహ్మవేద్యుడీ ధరణిపై వరలు చుండి
దివ్య తేజస్సుతో వెల్గు ధీమణి పర
జ్ఞాన మొసగెడి గురునికి జయము జయము.//
************************************

నీ సఖిని కేశవా!
(కవిత)
************************************
నీ మోము చూపవా మిత్రమా!పులకించిపోతాను!
నీ మురళి వినిపించు నేస్తమా!పుణ్యమనుకుంటాను!
నీ గాన లహరిలో నే మేను మరచి పోతుంటాను!
క్రీగంట నొకసారి చూడుమా!కైమోడ్పులిస్తాను!
వెనువెంట నడచి వస్తావా!నే భీతి వదిలేస్తాను!
మునుముందు ప్రతిభతో పుడమినే గెలిచి వచ్చేస్తాను!
నాతోడ పలుకవా!నవరాగ మాలికల నాలపిస్తాను!
నా తోడుగా రావా! నవ్య పథమును నీకు చూపిస్తాను!
నీదు పలుకులు వినుచు నే పదము లల్లేస్తాను!
నీ దివ్య చరితమును జగతికి నేను వినిపిస్తాను!
నీ ధ్యాసలో పడిపోయి లోకాన్ని వద్దు ఫొమ్మంటాను!
నీవె నా యూపిరని నీరూపు తలచి మురిసి పోతుంటాను!
మౌన రాగాలు ఎందుకో మనమధ్య మాటాడవా మాధవా!
ప్రాణసముడవు నీవు పంతాలు నీకేల ప్రియసఖిని కేశవా!
రావోయి!నా కొరకు నీవె నారమణు డనుకొంటున్నాను!
వేయేల? నీ కొఱకు నా బ్రతుకంత వేచి చూస్తున్నాను.!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments