top of page
Original.png

పుట్టింటి పట్టుచీర

1 day ago
5 min read

పద్మ తన పుట్టింటివారు పెట్టిన కనకాంబరం రంగు–గ్రీన్ టెంపుల్ బోర్డర్ గద్వాల్ పట్టుచీరను పెళ్లి విందులో ఓ అపరిచిత మహిళ ధరించి ఉండటం చూసి ఆశ్చర్యంతో గుర్తిస్తుంది. పక్కనే రమేష్ అయోమయంగా చూస్తుండగా, ఆ మహిళ ఆందోళనగా వెనక్కి తిరిగి చూస్తున్న దృశ్యం.

Puttinti Pattucheera - Telugu Comedy Crime Story | Dr S. Rajesh Kumar

పుట్టింటి పట్టుచీర - తెలుగు హాస్య క్రైం కథ | డా. ఎస్. రాజేష్ కుమార్ 

Published in manatelugukathalu.com on 15/09/2026


ఒక్క పట్టుచీర రెండేళ్లుగా పోలీసులకు చిక్కని దొంగను పట్టించగలదా? అదీ పెళ్లి విందులో అనుకోకుండా కనిపించిన ఒక చీర!


ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి సోఫాలో కూర్చొని టీ తాగుతూ భార్య పద్మతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాడు రమేష్. వారిద్దరి సరదా కబుర్లకు అడ్డుపడుతూ ఫోన్ రింగయింది.


“ఈ వెధవ ఫోన్ హాయిగా మొగునితో ముచ్చట కూడా పెట్టనియ్యదు” అని గొణుగుతూ లోనికి వెళ్ళింది పద్మ. 


“హలో! రమేష్, ఈ సండే మా చెల్లి పెళ్లి.

ఇక్కడే AV ఫంక్షన్ హాల్లో. నువ్వు తప్పకుండా ఫ్యామిలీతో రావాలి” అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి.


పద్మకి తన ఫ్రెండ్ చెల్లి పెళ్లి సంగతి చెప్పి, “సండే పోదాం, ఏమంటావ్?” అని అడిగాడు.


పద్మ ముఖంలో అనాసక్తి గమనించి, “వాడు బంధువు కాకున్నా నాకు ఆత్మబంధువు. సండేనేగా, పోదాం ప్లీజ్!” అన్నాడు రమేష్.


సరేనన్నట్లు తల ఊపింది పద్మ.


ఉదయం పదకొండున్నరయింది. పద్మ మరియు రమేష్ హడావుడిగా ఫంక్షన్ హాల్ చేరుకునేసరికే జీలకర్ర-బెల్లం ఘట్టం ముగిసింది. ఇక తాళి కట్టే తంతు ముగిశాక స్టేజి పైన వధూవరులను ఆశీర్వదించి, తన ఫ్రెండ్ తో కలిసి ఓ గ్రూప్ ఫోటోకి పోజిచ్చి క్రిందికి దిగారు.


ఆకలి దంచేస్తుండడంతో డైనింగ్ హాల్ వైపు పరుగు లాంటి నడకతో వెళ్ళారిద్దరూ.

“రమేష్, అటు చూడు. ఆ కార్నర్లో తింటున్నామెను చూడు.”


“ఎవరు?”


“కనకాంబరం కలర్ శారీలో ఉన్నదే, ఆమెనే.”


“ఆ! చూస్తున్నా. బ్యూటీ ఏం కాదు, యావరేజ్. బాగా తయారుకావడం వల్ల అందంగా కనబడుతుందేమో నీకు. నీ అంత అందంగా అయితే లేదు పద్దూ.”


“నీ పాడు బుద్ధి కొద్దిసేపు పక్కన పెట్టు. ఆమె కట్టిన చీర చూడు రమేష్.”


“ఎప్పుడూ చూడు ఈ చీరల లొల్లి. కలర్ బాగానే ఉంది. నీకు కూడా అట్లాంటి చీర కొనివ్వాలా ఏంది?”

“అయ్యో! ఆ చీర నాదే. మా పుట్టింటోళ్ళు పెట్టిన పట్టుచీర.”


“అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావ్ పద్మా?” షాక్ నుంచి తేరుకొని నెమ్మదిగా అడిగాడు రమేష్.


“ఆ కనకాంబరం కలర్–గ్రీన్ టెంపుల్ బోర్డర్ డిజైన్ గద్వాల్ పట్టుచీర నా సీమంతానికి మా అమ్మగారోళ్ళు పెట్టింది. నన్ను అర్ధరాత్రి నిద్రలేపి అడిగినా అన్ని చీరల డిజైన్, కలర్, బోర్డర్ తో సహా అన్నీ టకటక చెప్తా.”


“నాకట్లాంటి చీరుందని నీకు యాదికిలేదా?” అని భర్తకు చిక్కు ప్రశ్న వేసింది పద్మ.


“నీ పిచ్చిగానీ, నిన్ను రోజూ నైటీలో చూసేటోణ్ణి, ఐదేండ్ల కిందటి సీమంతం చీర నాకెట్ల గుర్తుంటది పద్దూ? నాకు తెలిసి ఆ ఒక్కనాడే ఆ చీర కట్టివుంటవ్.”


“నీ కామెడీ టైమింగ్ బాగాలేదు. ఇగాపు రమేష్” అంటూ కోపంగా సగం తిన్న ప్లేట్ డస్ట్ బిన్లో వేసి, టిష్యూ పేపర్ తో సుతారంగా పెదాలు అద్దుకుంటూ,

“రెండేళ్ళ కింద మనం వారం పాటు యాత్రలకు పోయినప్పుడు, బీరువాలో దాచిన పది తులాల బంగారు నగలు, కాస్ట్లీ పట్టుచీరలు దొంగలెత్తుకపాయే గదా. ఆ కేసు అత్తీగతీ లేదు. ఇప్పుడు ఆ కేస్ సాల్వ్ అయింది” అంటూ రమేష్ వైపు గర్వంగా చూసింది.


“నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు. అదేందో సక్కగా చెప్పు పద్మా.”


“ఆవిడే నా పట్టుచీరల దొంగ.”


“నువ్వు నాతో రా రమేష్, దాని సంగతేందో తేలుద్దాం” అనుకుంటూ అపరిచితురాలి వైపు శరవేగంగా కదిలింది పద్మ.


ఆ దూకుడు, కాన్ఫిడెన్స్ కి నోరెళ్ళబెట్టాడు రమేష్.


“అబ్బో! లేడీ డిటెక్టివ్. ఆమ్మో! యమ యాక్టివ్” అని పాత సీరియల్ సాంగ్ పాడుతూ చిన్నగా పద్మను ఫాలో అయ్యాడు రమేష్.


పద్మ ఆ అపరిచిత మహిళను పైనుంచి కిందకీ చూస్తూ, “చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావ్?” అని అడిగింది. 


అడుగుతున్న తీరులో ఏదో అనుమానం ఉందన్నట్టు

పద్మ బాడీ లాంగ్వేజ్ తో అవతలి వ్యక్తికి స్పష్టంగా తెలుస్తోంది.

పెదాలపై బలవంతంగా నవ్వు పులుముకుంటూ, భృకుటి ముడివేస్తూ, ‘నీకెందుకు’ అన్నట్టు చూసిందామె.

‘నువ్వేమనుకుంటే నాకేంది’ అనే ఫీలింగ్ తో, “ఏ షాప్ లో?” అని కాస్త హెచ్చు స్వరంతో అడిగింది.


తన ముఖంలోని కంగారు, ఆందోళన బయటకు కనపడకుండా ప్రయత్నిస్తూ, “ఇక్కడనే” అంది అపరిచితురాలు.


సూటిగా సమాధానం రాకపోవడం మరియు ఆమె గొంతులో వణుకు గమనించిన పద్మ అనుమానం మరింత బలపడింది.


“నేను రైస్ పెట్టుకొని వస్తా” అని క్యూ లైన్లోకి వెళ్లిన అపరిచితురాలు అక్కడి జనం గుంపులో పద్మ కళ్ళకు కనబడకుండా పోయింది.


“ఓ! లేడీ డిటెక్టివ్ పద్మా. అయ్యిందా నీ ఇన్వెస్టిగేషన్? ఇగ నడువు, పోదాం ఇంటికి” అంటూ రమేష్ పద్మ చెయ్యి పట్టుకొని బయటకు నడిచాడు.


“అది ఖచ్చితంగా నా చీరే. మన ఇంటి దొంగతనంలో ఈమె చెయ్యి ఉందని నమ్ముతున్నా” రమేష్ కళ్ళలోకి ‘నన్ను నమ్ము’ అన్నట్టుగా చూస్తూ అంది పద్మ.


“మెడలో నెక్లెస్, చేతులకు గాజులు చూసినవా? అవి కూడా నీయ్యేనా?”


“లేదు, అవి నాయి కావు. కానీ చీర మాత్రం ముమ్మాటికీ నాదే!” అంటూ తన కుడి చేయి పిడికిలితో బైక్ సీట్ పై బలంగా గుద్ది తన వాదనలో బలాన్ని చూపింది పద్మ.


“ఆమ్మో! నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. పోదాం పా పోలీస్ స్టేషన్ కు.”


“నమస్కారం సీఐ సార్. రెండేళ్ళుగా మీరే ఇక్కడ సీఐగా ఉండటం మా దురదృష్టం…” లో వాయిస్ లో అన్నాడు రమేష్.


“ఏమంటున్నావయ్యా రమేష్?”


“ఆ.. ఆ.. అదే మా అదృష్టం అంటున్నా సార్.”


“మా ఇంటి దొంగతనం కేస్ ప్రోగ్రెస్ ఏంది సార్?” అని అడిగింది పద్మ.


“సీసీటీవీ లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ దొరకలేదు. ఫింగర్ ప్రింట్స్, పాదముద్రలు రెగ్యులర్ అఫెండర్స్ డేటాబేస్ తో మ్యాచ్ కాలేదు. దొంగ బంగారాన్ని కొనే కొన్ని బంగారు దుకాణాల తనిఖీ కూడా చేశాం. ప్చ్. లాభం లేదు. సో, ఫస్ట్ టైమ్ అఫెండర్ చేశాడనిపిస్తుంది” అని చెప్పాడు సీఐ.


“సార్, దొంగ దొరికింది.”


“అవునా? ఎలా?”


ఫంక్షన్ హాల్ విషయం పూసగుచ్చినట్టు చెప్పింది పద్మ.


సీఐ కుర్చీలో వెనక్కి వాలుతూ, “హా! హా! హా!” అని గట్టిగా వెకిలిగా నవ్వుతూ, “సేమ్ గద్వాల పట్టుచీరలు మార్కెట్లో బోలెడుంటాయి. మీ మాట పట్టుకొని వాళ్ళని విచారించలేం” అన్నాడు.


ఎట్లయినా సీఐని నమ్మించాలని డిసైడ్ అయింది పద్మ.


“సార్, ఆమె ముఖంలో భయం, సమాధానం చెప్పకుండా అక్కడినుండి తప్పించుకోజూస్తే ఆమే దొంగ అనిపిస్తుంది. నా చీరల డిజైన్లు జీవితంలో మర్చిపోను, అందునా పుట్టింటోళ్ళు పెట్టింది. మీరు తీగ లాగితే డొంక కదులుతుంది. మీ పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే తప్పకుండా దొంగతనం బయటపడుతుంది” అని బతిమాలుతూ రెండు చేతులు జోడించి దండం పెట్టింది పద్మ.


“నేను చూసుకుంటా. సరే, ఇక మీరు వెళ్ళండి” అని చెయ్యెత్తి బయటకు దారి చూపించాడు సీఐ.


“ఆ లేడీ దొంగను కనిపెట్టి, పట్టుకురండి” అని లేడీ కానిస్టేబుల్ కు ఆర్డర్ వేసాడు సీఐ.


మెకానిక్ యాదయ్య, ఆయన భార్యను స్టేషన్కు పట్టుకొచ్చి సీఐ గారి ముందు నిలబెట్టింది కానిస్టేబుల్. “వీళ్ళ ఇల్లు పద్మ, రమేష్ ల వాడకు దగ్గర్లోనే ఉంది సర్. చుట్టుపక్కల ఎంక్వైరీ చేశా, మెకానిక్ యాదయ్యది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయన భార్య మునుపెన్నడూ కాస్ట్లీ చీరలు కట్టిన దాఖలాలు లేవు.”


“ఆ పట్టుచీర మాదే. మా ఇంటికాడికి అమ్మడానికి వస్తే కొన్నాం సార్” అని రెండు చేతులు కట్టుకొని వినయంగా, అమాయకంగా చెప్పాడు యాదయ్య.


ఊపిరి సలపకుండా అడిగిన ప్రశ్నలకు తికమకపడి తలాతోకా లేని, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో,

యాదయ్య ఇంటి సెర్చ్ కోసం పోలీస్ టీంను పంపాడు సీఐ. 


తమ బండారం బయటపడుతుందని అర్థం చేసుకున్న యాదయ్య, “తప్పయింది సార్. నేను రమేష్ ఇంటి ఎదురుంగా ఉన్న ఇంట్లో ఏసీ రిపేర్ కు పోయినప్పుడు ఎదురిల్లు రెండు రోజులుగా తాళమేసి ఉండుడు చూసి, వారం వరకు తిరిగిరారని తెలిసి, దొంగతనం ప్లాన్ చేసి, పని పక్కాగా చేసిన” అంటూ నేరాన్ని అంగీకరించాడు.

ఇంట్లో దాచిపెట్టిన బంగారు నగలను రికవరీ చేసి సీఐ ముందుంచారు పోలీసులు.


“జూసినావే లక్ష్మి, నీ చీర ఎంత పని చేసిందో! రెండేళ్ళు బంగారం దాచిపెట్టినవి గానీ చీర దాయలేకపోయినవ్.


ఏం కాదని ముద్దుగా తయారయ్యి, ఖుషీ ఖుషీగా చీర చుట్టుకొని పోతివి, నన్ను జైలు పాలు జేస్తివి గదె లక్ష్మి” అని వాపోయాడు యాదయ్య.


రమేష్, పద్మ దంపతులను పిలిపించారు పోలీసులు.


“అమ్మా! మహిళామణి, నీకు వందనాలమ్మ. రెండేళ్ళుగా పోలీసులకు సవాల్ గా ఉన్న కేసుని పట్టుచీరల మీద నీకున్న పట్టుతో ఛేదించావమ్మా. హ్యాట్సాఫ్ టు యూ పద్మా!” అని సీఐ అనగానే చప్పట్లతో పోలీస్ స్టేషన్ మార్మోగిపోయింది.


@@@


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



డా. ఎస్. రాజేష్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



డా. ఎస్. రాజేష్ కుమార్

రచయిత పరిచయం: డా. ఎస్. రాజేష్ కుమార్



డాక్టర్ ఎస్. రాజేష్ కుమార్ గారు ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజ్గిరి, జిల్లా మేడ్చల్ లో విధులు నిర్వర్థిస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పట్టా పొందారు.వివిధ జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పరిశోధన పత్రాలు సమర్పించారు. గత రెండు సంవత్సరాలుగా కథలు రాస్తున్నారు.వీరి ‘ఆధార్ ఓటీపీ’ కథ gotelugu. com ఆన్లైన్ తెలుగు పత్రికలో ప్రచురితమైంది. నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ గారి ‘పెద్దక్క’ కథను తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఇతర రచనలు.‘సైబర్ వల’, ’సాగర మథనం’, ‘డోపామిన్ ట్రాప్’ కథలు మొదలయినవి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page