మూఢనమ్మకం

Mudanammakam - Telugu Inspirational Story | Thokala Rajesham
మూఢనమ్మకం - తెలుగు ప్రేరణాత్మక కథ | తోకల రాజేశం
Published in manatelugukathalu.com on 16/09/2026
తెలియని విషయాన్ని చూసి భయపడటం కంటే, దాని వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. పిల్లల మనసుల్లో దయ్యాలు, భూతాలు అంటూ భయాలను నాటకుండా ప్రశ్నించడం, పరిశీలించడం, ఆధారాలతో నిజాన్ని తెలుసుకోవడం నేర్పించాలి.
మెట్పల్లి అనే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు భువన్. భువన్ కొంచెం పిరికివాడు. కుక్కలను చూస్తే భయం. బల్లులంటే భయం. రాత్రయితే చాలు, చచ్చేంత భయం. ఎందుకంటే రాత్రి దయ్యాలు నిద్రలేస్తాయని, అటూ ఇటూ తిరుగుతాయని వాళ్ళ నానమ్మ చెప్పింది.
వాళ్ళ నాన్నకు దయ్యాలు కనపడ్డాయట. ఈ విషయం భువన్ కి చెప్పినప్పటి నుంచి తాను రాత్రి టాయిలెట్ కి కూడా వెళ్ళటం లేదు. చలికాలం వస్తే చాలు దుప్పట్లు తడుపుతున్నాడు. ఈ సమస్య రాను రాను పెద్దగా మారింది. ఏం చేయాలో తోచక తలపట్టుకున్నాడు భువన్ తండ్రి మల్లేష్.
రోజులాగే ఆరోజు కూడా భువన్ లేటుగా బడికి వచ్చాడు. భువన్ వెనుకే మెల్లగా గదిలోకి చేరాడు మల్లేష్. ప్రేమగా పలకరించాడు ఉపాధ్యాయుడు చందు. కుశల ప్రశ్నలు ముగిసాయి. భువన్ గురించి టీచర్ అడిగేలోపే తానే చెప్పటం ప్రారంభించాడు మల్లేష్.
మొత్తం విన్న తరువాత భువన్ సమస్య ఏమిటో ఉపాధ్యాయునికి అర్థమయ్యింది. ఈ విషయం పిల్లల ముందు మాట్లాడటం సరికాదని బయటికి తీసుకెళ్లాడు చందు.
"ఈ సమస్యకు మూలం నువ్వే" అని చెప్పటంతో అవాక్కయ్యాడు మల్లేష్.
"పిల్లవానికి లేని దయ్యాల గురించి చెప్పి రాత్రి పడితే చాలు భయపడేలా చేసింది నువ్వే, ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది" అన్నాడు టీచర్.
"లేదు సర్. నేను నిజంగానే దయ్యాలు చూసాను" అన్నాడు మల్లేష్.
ఇప్పుడు ఆశ్చర్యపడటం టీచర్ వంతయింది. తాను స్మశానంలో దయ్యాలు రాజేసే మంటలు చూశానని, దయ్యాలున్నాయని చెప్పాడు మల్లేష్. మారాల్సింది భువన్ మాత్రమే కాదు అతని తండ్రి కూడా అని అనుకున్నాడు చందు.
భువన్ మామూలు పిల్లవానిగా మారాలంటే ఏం చేయాలో చెప్పాడు. ఇష్టం లేకున్నా కొడుకు మారుతాడన్న ఆశతో ఒప్పుకున్నాడు.
ఉపాధ్యాయుడు చందుది మెట్పల్లి పక్క ఊరే. ముందే అనుకున్నట్టు రెండు రోజుల తరువాత రాత్రి ఎనిమిది గంటలకు మల్లేష్ ఇంటికి వచ్చాడు టీచర్. ముందే చెప్పటం వల్ల అప్పటికే మల్లేష్ ఇంటిదగ్గర కొందరు విద్యార్థులు, ఊరి పెద్దలు ఎదురుచూస్తున్నారు.
అందరినీ తీసుకొని సూటిగా స్మశానం బాట పట్టాడు చందు. స్మశానం దగ్గరికి వెళ్లేసరికి అక్కడక్కడ మంటలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆరోజు ఎవరూ చనిపోలేదు. ఎవరినీ దహనం చేయలేదు. "ఆ మంటలు దయ్యం పనే" అన్నాడు మల్లేష్.
అతని భుజం మీద ప్రేమగా చెయ్యి వేసి నవ్వాడు చందు. చందు తప్ప మిగిలిన వాళ్లంతా భయం భయంగా నడుస్తున్నారు. మంటల దగ్గరగా వెళ్లారు. మండుతున్నవి బొక్కలు.
"చూసారా! ఇది దయ్యం పని కాదు. పాస్పరస్ అదే భాస్వరం పని" అన్నాడు నవ్వుతూ చందు.
అర్థం కానట్టు మొహాలు పెట్టారందరు.
"శవం కుళ్ళిపోయే ప్రక్రియలో (Decomposition) దానిలోని ఆర్గానిక్ పదార్థాల వల్ల ఫాస్ఫైన్ (Phosphine - \(PH_{3}\)), మిథేన్ (\(CH_{4}\)) వంటి వాయువులు విడుదలవుతాయి.
ఈ ఫాస్ఫైన్ వాయువు నేల పైకి వచ్చి గాలిలోని ఆక్సిజన్‌ను తాకగానే తక్కువ ఉష్ణోగ్రత వద్దే దానంతట అదే స్వయంచాలకంగా మండుతుంది (Spontaneous combustion). ఆ వాయువు మండటం వల్ల వచ్చే వెలుతురును చూసి, పాత కాలంలో ప్రజలు "దయ్యాలు రాజేసే మంటలు" అని తప్పుగా భావించారు."
అన్నాడు చందు.
'అవును నాన్న. నిన్న మా చందు సారు ఇదే పాఠం చెప్పాడు. ట్యాబులో పాస్పరస్ మండే వీడియోలు చూపించాడు. మేము అగ్గిపుల్ల గీకి పాస్పరస్ ను మండించాము కూడా' అన్నాడు వెలుగుతున్న కళ్ళతో భువన్.
భువన్ అలా ధైర్యంగా మాట్లాడుతుంటే మల్లేష్ కు ఎంతో ధైర్యంగా అనిపించింది. "నీ యవ్వ! గింత సిన్న ముచ్చట తెల్వక అరవై ఏళ్ళ సంది దయ్యం అని భయపడవడితి, చల్ దయ్యాలు లేవ్ గియ్యాలు లేవ్" అని తలగోక్కుంటూ అన్నాడు భువన్ తాత ఎల్లయ్య.
ఆయన మాటతోని అందరూ బిగ్గరగా నవ్వారు. అప్పటిదాకా రాత్రయితే చాలు స్మశానం దిక్కే రావటానికి భయపడిన జనాలు ఇప్పుడు అక్కడే మాట్లాడుకుంటున్నారు. ఈ మార్పు భలే అనిపించింది అక్కడికి వచ్చినవాళ్లకు. ఉపాధ్యాయుని వైపు కృతజ్ఞతగా చూసారందరు.
"ఇప్పటికైనా పిల్లలకు లేనిపోని భయాలు నూరిపోసి వాళ్ళను పిరికి వాళ్లుగా మార్చకండి. ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. వాటికి సైన్స్ కచ్చితమైన సమాధానాలు చెప్తుంది. వాటిని దేవుళ్ళకో, దయ్యాలకో ముడిపెట్టకండి.
మూఢనమ్మకాల జోలికి వెళ్ళకండి. పిల్లలను స్వేచ్ఛగా ఎదగనివ్వండి" అంటూ అక్కడి వాళ్ళను ఉద్దేశించి చెప్పాడు ఉపాధ్యాయుడు. ఆ సమయంలో వాళ్లంతా చిన్నపిల్లలయి పోయారు.
తెల్లారింది. తండ్రి తోడు లేకుండానే బడికి వచ్చాడు భువన్. మునపటిలా కాకుండా హుషారుగా, ఏదో విజయం సాధించిన వాడిలా ఉన్నాడు. చందు పలకరించాడు.
"నేను నిన్న రాత్రి ఒక్కడినే పెరట్లో ఉన్న బాత్రూమ్ కి వెళ్ళాను సార్. మా ఇంటి పక్కనే అరవింద్ ఉన్నాడు కదా, హోమ్‌వర్క్ కోసం ఒక్కడినే వాళ్ళింటికి వెళ్ళాను. ఇప్పుడు రాత్రంటే నాకు భయం లేదు సార్" అని గర్వంగా చెప్పాడు టీచర్ అడక్కుండానే.
చందు ప్రేమగా భువన్ భుజం తట్టాడు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.








Comments