రాజకీయ పోలీట్రిక్కులు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 3 days ago
- 5 min read
#RajakeeyaPolitrikkulu, #రాజకీయపోలీట్రిక్కులు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #రాజకీయచతురంగం, #వ్యంగ్యరాజకీయరచన

Rajakeeya Politrikkulu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 05/07/2025
రాజకీయ పోలీట్రిక్కులు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
పంచాయతీ ఆఫీసు దగ్గర వీరాస్వామి టీ దుకాణం నడుపుతున్నాడు. వీరాస్వామికి జాతకాలు, సంఖ్యా శాస్త్రం మీద నమ్మక మెక్కువ. తన జన్మ నక్షత్రం ప్రకారం తొమ్మిది
లక్కీ నంబరని సంఖ్యాశాస్త్ర ప్రవీణులు నవనీతరావు చెప్పడంతో ఏ పని మొదలెట్టినా తొమ్మిదో తేదీనాడే ప్రారంభించేవాడు. తొమ్మిది తొలిసంఖ్యతో బోల్డు లాటరీ టికెట్లు కొన్నప్పటికీ ఫలితం కనబడక పోతే నవనీతరావును సంప్రదిస్తే అదృష్ట దేవత కరుణించే వరకు ఓపిక పట్టాలన్నారు.
ఒకసారి రాజకీయ మీటింగ్ లో ఎం. ఎల్. ఎ గారు వందటీలు కావాలని ఆర్డర్ ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా టీలు సప్లై చేస్తే అతని ఉదార గుణాన్ని మెచ్చుకున్నారు.
మరోసారి జాతకచక్ర చకోరం గారు వీరాస్వామి హస్తరేఖల్ని చూసి భవిష్యత్తులో నీకు రాజకీయ యోగం ఉందని చెప్పేరు.
అప్పటి నుంచి తను రాజకీయాల్లో కెళ్లి పెద్ద నాయకుడై, తన తండ్రి నుంచి బలవంతంగా భూమిని రాయించుకున్న రియల్ ఎస్టేట్ గుర్నాధం పని పట్టాలనుకున్నాడు. నీ రాజకీయ భవిష్యత్ బాగుండాలంటే ముందు పార్టీ
కార్యకర్తగా చేరి నీ ప్రతిభతో అంచెలంచెలుగా పైకి ఎదగాలని ఉపదేశం చేసారు చకోరం గారు. అందువల్ల యం. ఎల్. ఎ గారి సమక్షంలో పార్టీ కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నాడు.
టీ స్టాల్ నడిపిన తనలా చివర్న "స్వామి" పేరున్న పళని స్వామి కుప్పుస్వామి పెరియస్వామి నారాయణ స్వామి పెద్ద రాజకీయ నాయకులై పదవులు అనుభవిస్తున్నారని తెలిసి తనకీ ఆ భాగ్యం ఉందని తెలిసి తెగ మురిసిపోతున్నాడు.
టీ దుకాణాన్ని' వీరాస్వామి విలాస్' గా మార్చి టిఫిన్ సెంటర్ నవమి నాడు ప్రారంభించాడు. కష్టమర్ల రాక పెరిగి బిజినెస్ ఊపందుకుంది. సహాయంగా భార్య భాగ్యలక్ష్మిని కూడా రంగంలో దింపేడు.
రాజకీయ కార్యకర్తగా ఎదిగి పెద్ద పదవులు పొందాలంటే ముందు కొంత రాజకీయ పరిజ్ఞానం కావాలనగానె టిఫిన్ సెంటర్ భాధ్యత భార్య భాగ్యలక్ష్మికి అప్పచెప్పి తన రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు వీరాస్వామి.
ఆలశ్యం చెయ్య కుండా రాజకీయ పాఠశాల నడుపుతున్న మాజీ సస్పెండు మేయర్ పట్టభద్రం గారి దగ్గర కొన్ని పోలిట్రిక్కులు నేర్చుకోవాలనుకున్నాడు వీరాస్వామి.
"నమస్కారం, సార్ ! " వినయం ప్రదర్శించాడు.
"ఎవరయ్య, నువ్వు ?" హాల్లో సోఫాలో కూర్చున్న పట్టభద్రం గారి ప్రశ్న.
"నేను, టిఫిన్ సెంటర్ నడిపే వీరాస్వామిని సార్! మీరు నడుపుతున్న రాజకీయ పాఠశాలలో కొన్ని కిటుకులు, ఎత్తులు నేర్చుకోవాలని వచ్చా. మీ వద్ద శిక్షణ తీసుకున్న చాలమంది ఉన్నత రాజకీయ పదవుల్లో మంత్రులుగా ఉన్నారని తెల్సింది. " చేతులు కట్టుకు నిలబడ్డాడు వినయంగా.
"మంచిది, నీ వినయం చూస్తే పైకి వస్తావనిపిస్తోంది. సరే, దక్షిణ తెచ్చావా ? " మేయర్ గారి ప్రశ్న.
"పువ్వుల్లో పెట్టి తెచ్చాను కొత్త నోట్లు" బేగులోంచి కొత్త కరెన్సీ
కట్టలు టీ పాయ్ మీద పెట్టాడు.
"పువ్వుల్లో పెట్టినా తమలపాకుల్లో పెట్టి తెచ్చినా అసలు నోట్లేనా?" ?"
"అసలైన రిజర్వ్ బేంక్ విడుదల చేసిన కొత్త నోట్లు సార్ ! "
"ప్రధాని నరేంద్ర మోదీ గారి పుణ్యం, ప్రస్తుతం అన్నీ కొత్త కరెన్సీ నోట్లే చలామణి అవుతున్నాయి. పెద్ద నోట్లు పాత బడాలంటే సమయం పడుతుంది. సందట్లో సడామియా అన్నట్టు కలర్ జిరాక్స్ నోట్లు వాడుకలో కొస్తున్నాయి. " తన సంశయం బయట పెట్టారు మాజీ మేయర్.
"ఆ, ఇంతకీ నీ వయసెంత బాబూ ?"
"ముప్పైకి అటు ఇటు సార్! "
"ఓకె, ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉందా ? "
"ఈ మధ్యనే రూలింగ్ ఎం. ఎల్. ఎ గారి సమక్షంలో కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నా"
"ఏవైనా పోలీసు కేసులు పెండింగులో ఉన్నాయా ?"
"ఇంకా ఆ స్టేజికి రాలేదు. మీ ఆశీర్వాదం ఉంటే అదీ దాటగలనన్న నమ్మకముంది. "
"వెరీగుడ్! కృషి చేస్తే పైకి వస్తావు. ఇంకా భ్యర్దులు వస్తున్నారు. మంచి రోజు చూసి క్లాసులు ప్రారంభిద్దాం. వెళ్లి, రా !"
*
అవినీతి ఆరోపణలతో సస్పెండైన మాజీ మేయర్ పట్టభద్రం గారి రాజకీయ కాలేజీ పేరు" పొలిటికల్ పోలీ ట్రిక్స్". పెద్ద హాల్లో విశాలమైన వేదిక, గోడలకు దేశ వివిధ రాజకీయ పార్టీ నాయకుల ఫాటోలు, రకరకాల పార్టీ జండాలు మధ్యలో కుర్చీలు వేసి ఉన్నాయి. అనుకున్న శుభ సమయం రోజున కొబ్బరి కాయ కొట్టి పొలిటికల్ క్లాసులు ప్రారంభించారు మాజీ మేయర్.
ప్రిన్సిపల్ పట్టభద్రం గారు సిలబస్ అంతా నెల రోజుల క్లాసుల్లో పూర్తి చేస్తానని స్వాగతోపన్యాసంలో చెప్పారు. ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న కార్యకర్తల్ని ఉద్దేశించి "చూడండి, రాజకీయాల్లో రాణించాలంటే ముందు వంటి చర్మాన్ని మందం చేసుకోవాలి.
ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీ డ్రెస్ కోడ్ అమలు చెయ్యాలి. నీ కెంత రక్తచరిత్ర ఉన్నా నుదుటున చందనంతో ఎర్రని కుంకుమబొట్టు కొట్టొచ్చినట్టు కనబడాలి.
ప్రత్యర్ధి పార్టీ వ్యక్తి మీద ఎంత ద్వేషం ఉన్నా ముఖం మీద చిరునవ్వు చిందిస్తూ వెనక గోతులు తవ్వాలి. రాజకీయాల్లో రాణించాలంటే ఆవేశం పనికిరాదు. నోటి దురద అదుపులో ఉంచుకోవాలి. అతి వినయం వికటించొచ్చు.
ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా మన కులం వాళ్లని మంచి చేసుకోవాలి. గ్రామాల్లో కాని పట్నాల్లో కాని మరే రంగంలో ఉన్నా మన కులం సెలబ్రిటీల్ని రప్పించి వారికి సన్మానాలు సత్కారాలు చేసి మీడియాలో మన పరపతి పెంచుకోవాలి.
రాజకీయ పెద్దల పాదసేవ చేసినా మీడియా కంట పడకుండా చూసుకోవాలి. జాగ్రత్త సుమా !
మరొక ముఖ్య విషయం, రాజకీయాల్లో నేతగా ఎదగాలంటే ఎప్పుడు చురుకైన కుర్రాళ్లని వెంట తిప్పుకుంటూ వైద్య శిబిరాలు, అన్నదానాలు, పర్వదినాల్లో దేవుడి ఉత్సవాలు నిర్వహిస్తూ, ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే అక్కడికి చేరుకుని బాధితుల్ని పరామర్శించాలి.
మరేదైన దుర్ఘటన జరిగినా మన సానుభూతి కనబర్చాలి. ఇలా పబ్లిక్ లో మన పరపతి పెంచుకోవాలి. నేతల పుట్టిన రోజులపుడు రక్తదాన శిబిరాలు, వృద్దాశ్రమాల్లో పళ్లు స్వీట్లు పంచాలి. ముందు కొంచం చేతి చమురు వదిలినా తర్వాత చందాల రూపంలో సమకూర్చుకో వచ్చు.
పాదయాత్రలో కనబడిన ఆడా మగ వ్యక్తుల వయసును బట్టి
పెద్దమ్మ పెద్దయ్య అన్నా తంబీ అక్కా చెల్లీ లాంటి బంధుత్వాలు కలిపి ప్రాంతీయ సానుభూతి కనబర్చాలి. స్మార్ట్ మొబైల్ ఫోన్ ఎప్పుడు చేతిలో ఉంచుకుని, చేతి మణికట్టుకి కడియం లేదా ఎర్రదారం ఉండి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు బిజీగా కనబడాలి.
పోరగాళ్లకు మందు పార్టీలకు జల్షాలకు చిల్లర విసురుతూండాలి. నేతలతో పాటు ఫ్లెక్సీల మీద లోకల్ న్యూస్ పేపర్లలో మన ఫోటో కనపడాలి. అధిస్థానం దృష్టిలో పడాలంటే ఈ కిటుకులు అమలు చెయ్యాలి. పబ్లిసిటీ కావాలంటే మీడియా వాళ్లని మంచి చేసుకుని సాయంకాలం పార్టీలు ఏర్పాటు చెయ్యాల్సిందే.
చాటుమాటు దంధాలు ఎన్ని చేసినా బయప పడకూడదు. ఏ ఎండ కా గొడుగు అన్నట్టు ఏ రాజకీయ పార్టీలో చేరితే ఆ పార్టీ కండువా మెడలో వేసుకోవాలి. పరిస్థితులు అవుసరాన్ని బట్టి ఎన్ని కండువాలైనా మార్చుకోవచ్చు.
ప్రత్యర్దులుగా ఉన్నప్పుడు తిట్టుకున్నా ఒకే పార్టీలో కలిసి ఉన్నప్పుడు ఆలింగనం చేసుకోవాలి. అవుసరాన్ని బట్టి రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచినా తప్పు కాదు. కుటుంబ సభ్యు పోలీసు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు పాత పరిచయాలు ఉపయోగించుకోవాలి. ప్రాంతీయ పోలీసు స్టేషన్ స్టాఫ్ తో టచ్ లో ఉండాలి.
రాజకీయ మీటింగుల్లో స్టేజి మీద మాట్లాడేటప్పుడు, ప్రెస్ కాన్ఫరెన్సులు జరుగుతున్నప్పుడు ప్రత్యర్దుల నుంచి చెప్పులు, రాళ్లు, కాళీ వాటర్ బాటిల్సు పడినా గాభరా పడకూడదు. వ్యక్తుల దిష్టిబొమ్మలు దహనం జరిగినా లైటుగా తీసుకోవాలి. కోపంలో ఎవరైనా దుర్బాష లాడినా కళ్లు, నోరు తెరిచి చెవులు మూసుకోవాలి.
ఎన్నికల సమయంలో ఓట్లకోసం మురికి వాడల్లో చీపురు పట్టాలి. చీమిడిముక్కుతో రోతగా ఉన్న చిన్నపిల్లలు బట్టల మీద మూత్రం పోసి ఖరాబు చేసినా ముఖం మీద చిరునవ్వు కనబర్చాలి. గుడిసెల్లో ముసలి అవ్వల్ని చేతులు పట్టుకుని యోగక్షేమాలు అడిగి పరామర్శ చెయ్యాలి. ముసలి తాతలకు నోట్లో పొగాకు చుట్ట లేక బీడీ పెట్టి నిప్పు వెలిగించాలి.
బార్బర్ షాపులో మాసిన గెడ్డం గీకుతూ ప్రెస్ కెమేరాలకు పోజులివ్వాలి. మౌలిక సదుపాయాలు అంటే మంచినీళ్లు, రోడ్డు, మురుగుకాలువలు వంటివి అమలు జరిగినా లేకపోయినా వాగ్దానం చెయ్యాలి. రాజకీయాల్లో పెట్టిన పెట్టుబడికి తరాలకు సరిపడా సంపాదించుకోవాలి. ఏదైనా నేరం జరపాలన్నా మన చేతికి మట్టి అంటకుండా
చూసుకోవాలి. దొరికిన రాజకీయ పదవిని సద్వినియోగం చెయ్యాలి. విపక్ష రాజకీయ నేతలతో టచ్ లో ఉంటూ సమయం వచ్చి నప్పుడు జంప్ చెయ్యాలి.
ఎంత బ్లాక్ మనీ కూడబెట్టినా సింపుల్ గా కనిపించాలి. ఒక రాజకీయ నాయకుడిగా అంచలంచలుగా పదవిలో ఎదగాలంటే నేను నేర్పబోయే రాజకీయ పాఠ్యాంశాల్లోని నియమ నిబంధనల్ని పాటించాలి.
"బాబూ, వీరాస్వామి, బెస్టాఫ్ లక్ ! మనోకార్య సిద్ధిరస్తు!!"
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comentários