top of page

రంగుల లోకం


'Rangula Lokam' New Telugu Story




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


నేనెప్పుడూ చూడని మా నాన్నకి ప్రేమతో,

ఈ రంగురంగుల లోకంలో ఎన్నో ఆశలతో ఎదగాలని ఉంది నాన్నా! కానీ ఈ విశాలమైన ప్రపంచంలో ఏ మూలకి పోయినా, నా కేర్ ఆఫ్ అడ్రస్ అడుగుతున్నారు. ఏమని చెప్పను. అమ్మని అడిగితే నీ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదు. "మోసగాడు" అంటుంది. ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటుంది. ఓదార్చే ధైర్యం చేస్తే, దూరంగా వెళ్లిపోతుంది. నీరక్తం నాలో ఉందని అసహ్యమేమో... అలాగని నాపై ప్రేమను చంపుకోలేకపోతోంది. అంటే నీమీద కూడా తన మనసులో ఏదో ఒక మూలన ప్రేమ ఉందనే కదా!


ప్లీజ్... ఒక్కసారి వచ్చి ప్రేమగా మమ్మల్ని దగ్గరకి తీసుకోవూ... ఓ తండ్రి కన్న కూతురుగా అమ్మ... తన జీవితంలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ, ఈ తండ్రి... తాను కన్న కూతురిని గెలిపించడానికి వస్తాడని ఆశతో చూస్తున్నాను. వస్తావు కదూ! నిన్ను తీసుకు వస్తానని అమ్మకి మాటిచ్చాను. కానీ, నీకోసం ఎక్కడని వెతకాలి? అందుకే ఈ లెటర్, దేవుడి హుండీలో వేస్తున్నాను. తప్పకుండా వస్తావు కదూ!

ఇట్లు,

నీ చిట్టితల్లి.

లక్ష్మీ నృసింహస్వామి గుడిలో పరకామణి సేవలో హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సుదర్శనానికి, నగదూ కానుకలతో పాటు, హుండీలో ఉన్న ఈ లేఖ దొరికింది.


"ఎవరు రాసి ఉంటారబ్బా?" అందమైన దస్తూరీతో ఉన్న ఆ తెల్లకాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసాడు. రాసినవారి పేరు లేకపోయినా, ఆర్ద్రత నిండిన అక్షరాల వెంబడి అతని కళ్ళు పరిగెత్తినప్పుడు, కళ్ళవెంట అప్రయత్నంగా నీళ్లు ఉబికి వచ్చాయి. మసకబారిన జ్ఞాపకాల వైపు ఆలోచన మళ్లింది.

'అంటే... ఛాయ ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. ఈ లెటర్ ఛాయ కూతురే రాసి ఉంటుంది' అనుకుంటూ ఆ కాగితం పట్టుకుని ఆలయ ప్రధాన అర్చకుడిని కలవడానికి వెళ్ళాడు.


"చూడండి బాబూ! నిత్యం ఎంతోమంది ఈ గుడికి వస్తూ, పోతూ ఉంటారు. అందులో ఈ లేఖ రాసినది ఎవరని చెప్పగలం? మీ ఆత్రుత నాకు అర్థమవుతోంది. కానీ ఈ విషయంగా నేనే సహాయమూ చెయ్యలేను" హుండీలో దొరికిన లేఖను ఆసాంతం పరీక్షగా చూస్తూ చెప్పాడు పూజారి.


కళ్ళు మూసుకుని, మనసులో ఆ నృసింహస్వామిని తలచుకొని, పూజారికి నమస్కరించి, అక్కడ్నుంచి కోనేరు వైపు వచ్చాడు సుదర్శనం. కోనేరులో దిగి, ఆ పవిత్ర జలాన్ని తలపై చల్లుకుని, తిరిగి మెట్లు ఎక్కుతుండగా, ఓ పక్కగా మెట్లపై విచారంగా కూర్చున్న ఓ పదహారేళ్ళ అమ్మాయి కనిపించి, ఆగిపోయాడు.


కోనేటిలో పడిన సూర్య కిరణం, నేరుగా ఆమె చెక్కిలిపై జారుతున్న కన్నీటి బిందువులో తళుక్కున మెరిసి, అంతలోకే మాయమయ్యింది. జారిన ఆ కన్నీటి బిందువు, చేజారిన ఆశలకు సాక్షీభూతంగా కనబడుతుంటే... "ఎవరమ్మా నువ్వు? ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టున్నావు? తెలుసుకోవచ్చా?" నిరాశ నిండిన ఆ లేత మొహంలోకి చూస్తూ అడిగాడు సుదర్శనం.


"చెబితే మాత్రం నా కష్టం తీరుతుందా?" అన్నట్టు మొహం పక్కకి తిప్పుకుంది ఆమె.

'ఈమె తాను వెతుకుతున్న ఛాయ కూతురే అయితే ఎంతబాగుణ్ణు!' మనసులో అనుకుంటూ... "చిట్టితల్లీ!" అని మెల్లగా పిలిచాడు.


ఆ పిలుపుకి ఉలిక్కిపడి, చివాలున తలెత్తి చూసిన ఆ అమ్మాయి పెదవులు ఆనందంతో విచ్చుకున్నాయి.


"నా న్నా!" అని పిలవబోయి, సంశయంతో ఆగిపోయింది.

చిట్టితల్లి కళ్ళల్లో ఎన్నో ఆశలు.


ఇన్నాళ్లూ తాను కలలు కన్న నాన్న రూపం ఎలావుంటుందో తనకి తెలీదు. ఎదురుగా నుంచున్న వ్యక్తిని ఇంతకుముందెప్పుడూ చూడలేదు. తటపటాయిస్తూ అలాగే నిల్చుండిపోయింది.


"నువ్వు... నువ్వు... మా ఛాయ కూతురివేనా?" అడుగుతున్న అతని గొంతు సన్నగా వణికింది.


అవునన్నట్టు తల ఊపుతున్న ఆమె తలపై చెయ్యివేసి, గుండెలకి హత్తుకున్నాడు సుదర్శనం. కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత, అతి కష్టం మీద మెల్లగా గొంతు పెగల్చుకుని... "అమ్మ ఎక్కడ?" అని అడిగాడు.


అప్పుడే లోకాన్ని చూసిన లేడిపిల్లలా, గెంతుకుంటూ గుడిలోకి పరుగుతీసి, ఆయాసపడుతూ కళ్ళుమూసుకుని, రెండు చేతులూ జోడించి, భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది.


"నాతో రండి" అన్నట్టు కళ్ళతోనే సైగచేసి, ముందుకి దారితీసింది.

***** ***** ***** *****

అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, తలనొప్పిగా ఉండడంతో, సోఫాలో వెనక్కి వాలి, కళ్ళుమూసుకుంది ఛాయ.


"అమ్మా! అమ్మా!! ఎవరొచ్చారో చూడు" కళ్ళు ఇంతింత చేసుకుని, తల్లి భుజాలు పట్టి, కుదుపుతోంది చిట్టితల్లి.


కళ్ళు తెరిచిన ఛాయ... ఎదురుగా నుంచున్న వ్యక్తివంక అయోమయంగా చూసింది. 'అతనిని అంతకుముందెన్నడూ చూసిన గుర్తు లేదు. మరి తనని వెతుక్కుంటూ ఇంతదూరం ఎందుకు వచ్చినట్టు?' ఆలోచనలతో ఆమె భ్రుకుటి ముడిపడింది.


తల్లి ముఖంలో భావాలకు అర్థం తెలియక, అయోమయానికి గురయ్యింది చిట్టితల్లి. 'అంటే... ఈయన తన తండ్రి కాదా? మరి తాను ఛాయ కూతురినని ఎలా పోల్చుకున్నట్టు?' సమాధానం దొరక్క సుదర్శనం వైపు చూసింది.


అప్పుడు నోరు విప్పాడు సుదర్శనం. "అమ్మా! ఛాయా! ఇన్నాళ్లూ మీరెక్కడున్నారో తెలీక మిమ్మల్ని కలవలేకపోయాను. పదహారేళ్ళ క్రిందట... నువ్వూ, రాంబాబూ వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున, లక్ష్మీ నృసింహస్వామి గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం నాకూ తెలుసు. మీ పెళ్లికి సాక్ష్యంగా నన్నూ, మరో స్నేహితుడినీ రమ్మని పిలిచాడు. మీ ఇద్దరూ ప్రేమించుకున్న సంగతీ, బంధం ముడివేసుకోవాలన్న సంగతీ నాకు మాత్రమే చెప్పాడు. అప్పుడే నీ ఫోటో చూసాను. మావాడికి సరైన జోడీ అనిపించింది. చాలా సంతోషించాను. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది" చెప్పడం ఆపి కాసిని మంచినీళ్లు కావాలన్నట్టు సైగ చేసాడు.


మౌనంగా రోదిస్తున్న ఛాయ మనసులో భావాలను చదివినట్టుగా... " వాడు నువ్వనుకుంటున్నట్టు మోసగాడు కాదమ్మా! అప్పటికే తనవల్ల గర్భవతి అయిన నిన్ను పెళ్లి చేసుకుని, సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఎన్నో కలలు కన్నాడు. అంతేగానీ, నిన్ను ఒంటరిదాన్ని చేసి పారిపోవాలనుకోలేదు. ఆరోజు వాడికి తలకి దెబ్బ తగలకపోయివుంటే... ఈరోజు మీరిద్దరూ సంతోషoగా ఉండి ఉండేవారు. పొరపాటున బాత్రూములో కాలు స్లిప్ అయ్యి పడిన రాంబాబు, స్పృహతప్పిపోయాడు. హాస్పిటల్ లో చేర్చినా నాలుగు రోజుల వరకూ స్పృహలోకి రాలేదు. వచ్చాక, అయోమయంగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు.


డాక్టర్లు డిమెన్షియాకు గురైనట్టు చెప్పారు. మెదడులో నియోప్లాసియాలో మార్పులవల్ల మతిభ్రంశం కలిగిందని చెప్పారు. నీపేరు చెప్పినా, వాడికేమీ గుర్తురాలేదు. పదహారేళ్లుగా వాడి పిచ్చి ప్రపంచంలో, తనలో తనే మాట్లాడుకుంటూ బతుకుతున్నాడు. జరిగినదంతా నీకు తెలియచేద్దామంటే నీకు ఫోన్ లేకపోవడం, ఆ చుట్టుపక్కల ఆరోజు సాయంత్రం ఎంత వెదికినా నీ జాడ తెలియలేదు. ఎక్కడని వెతకాలి? ఏదో ఒకనాటికి నిన్ను, మా రాంబాబు దగ్గరకి తీసుకెళ్లగలను అన్న ఆశతోనే ఇన్నాళ్లూ గడిపాను."


సుదర్శనం చెప్పినదంతా విన్న ఛాయ హతాసురాలయ్యింది. భగవంతుడు తమకు చేసిన అన్యాయానికి చేతుల్లో ముఖం దాచుకుని, కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.


"అంకుల్! మమ్మల్ని ఒక్కసారి మా నాన్న దగ్గరకు తీసుకువెళ్లండి ప్లీజ్..." బ్రతిమాలుతూ అడుగుతున్న చిట్టితల్లిని దగ్గరకు తీసుకొని, ఓదార్చాడు సుదర్శనం.

------సమాప్తం-----

వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

నేను రాసిన "రంగుల లోకం" కథను మీ పత్రికలో ప్రచురణకు స్వీకరించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

విశాఖపట్నం కు చెందిన వేలూరి ప్రమీలాశర్మ అను నేను, వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా, న్యూస్ కరెస్పాండెంట్ గా ఉన్నాను. నా రచనలు ఇంతవరకు ఆకాశవాణిలో 2 సీరియల్స్, పలు నాటికలతోపాటు, వివిధ పత్రికలలో వందకు పైగా కథలు ప్రచురించబడ్డాయి. తొలి ప్రచురణ "గజల్ సౌరభాలు" 2022 నవంబర్ లో రిలీజ్ అయ్యింది. కృష్ణమాలికలు శతకం అముద్రితం.


వారం రోజుల్లో 25 కథలతో కూడిన కథాసంపుటి ఒకటి ఆవిష్కరణకు రానుంది. నా భర్త వేలూరి గోపాలకృష్ణ శర్మ (విశాఖ కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సయిజ్ dept), మరియు నా కుమార్తెలు నిఖిత, సంహితల సహకారం, ప్రోత్సాహంతో మరిన్ని రచనలు చేయాలన్న ఆకాంక్షతో, తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో ముందుకు సాగుతున్నాను. మా తెలుగు కథలు.కామ్ ద్వారా నా కథలు పరిచయం అవుతున్నందుకు మరోసారి ధన్యవాదాలు.

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.



100 views0 comments

Comments


bottom of page