సుబ్బలక్ష్మి గెలుపు
- Anisa Tabassum Sk

- 4 hours ago
- 3 min read
#అనిసాతబస్సుమ్, #AnisaTabassum, #SubbalakshmiGelupu, #సుబ్బలక్ష్మిగెలుపు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Subbalakshmi Gelupu - New Telugu Story Written By Anisa Tabassum Sk Published in manatelugukathalu.com on 27/02/2026
సుబ్బలక్ష్మి గెలుపు - తెలుగు కథ
రచన: అనిసా తబస్సుమ్ SK
కనుబొమ్మల మధ్య గుండ్రటి కుంకుమబొట్టు దిద్దినట్టు ఉదయించాడు సూర్యుడు. మేలుకొలిపే సూర్యకిరణాలు తన ముఖంపై పడడంతో నిద్రలేచింది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి@సుబ్బు చాలా చలాకీ అమ్మాయి. తెలివైనది, చదువులోనూ తక్కువ కాదు. తన కాళ్లమీద తాను నిలబడి బతకాలనే ఆలోచనతో ఉండే అమ్మాయి.
నిద్రమత్తులోనే హాల్లోకి వచ్చిన సుబ్బుకు ఎదురైన నాన్నగారు,
“అరేయ్ సుబ్బు… ఇవాళ సాయంత్రం నిన్ను చూసేందుకు అబ్బాయి వాళ్లు వస్తున్నారు. అబ్బాయి పేరు అనిరుద్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మంచి కుటుంబం,”
అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పారు.
ఇది విన్న సుబ్బు గుండెల్లో బాంబు పేలినంత పనైంది. అసలే సుబ్బుకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక. నాన్న మాటలు విని విసురుగా,
“మొన్నే కదా నాన్న డిగ్రీ పూర్తయ్యింది. ఉద్యోగం చేయాలి. పెళ్లి ఇప్పుడే వద్దు నాన్న,” అని చెప్పింది.
“అదికాదమ్మా… అబ్బాయికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వాళ్లది మంచి కుటుంబం. సెటిల్డ్ ఫ్యామిలీ. ఆస్తి ఉంది. ఒక్క అబ్బాయే. చెల్లికి పెళ్లయిపోయింది. ఉద్యోగం కూడా బాగుంది. అన్ని విధాలా మనకు తగ్గ సంబంధమే. నీకక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు బంగారం. నీ ఉద్యోగ విషయం నేను మాట్లాడతా… ఒప్పుకో బంగారం,” అంటూ ఆప్యాయంగా అన్నారు నాన్నగారు.
అయిష్టంగానే ఒప్పుకుంది సుబ్బు.
పెళ్లి చూపులు జరిగాయి. సుబ్బుకు అబ్బాయి (అనిరుధ్) నచ్చాడు. అబ్బాయి వాళ్లకూ సుబ్బు నచ్చింది.
“సుబ్బు ఉద్యోగం విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు,” అని అబ్బాయి కుటుంబం చెప్పింది.
శుభం… పెళ్లి చాలా బాగా జరిగింది. అత్తవారి ఇంట్లో ఎంతో ఆదరణ లభించింది సుబ్బుకు. సుబ్బు అత్త కనకం. ఆమె స్వభావం ఎలాంటిదంటే— ఆడవాళ్లు ఇంటిని, భర్తను చూసుకోవాలి; అత్త మాటకు ఎదురు చెప్పకుండా మెలగాలి అనే వ్యక్తి. కానీ, అది బయటికి కనిపించదు. మేకతోలు కప్పుకున్న గుంటనక్క కనకం. కనకం భర్త కూడా అదే కోవకు చెందినవాడు.
పెళ్లయిన కొన్ని నెలల తర్వాత సుబ్బు కనకంతో,
“అత్తయ్య… నేను ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలని అనుకుంటున్నాను,” అని చెప్పింది.
విన్న కనకానికి లోలోపల అసూయ పుట్టినా, పైకి కనిపించకుండా,
“మంచిదమ్మా… కానీ, నీకు ఉద్యోగం వచ్చేలోపు కొన్ని పనులు నేర్చుకో. నా తర్వాత ఈ ఇంటి బాధ్యత నీదే కదా,”
అని మాయమాటలు చెప్పి సుబ్బును మెల్లగా ఇంటి పనుల్లో దింపింది.
కనకం ఊహించినట్టుగానే సుబ్బు ఇంటి పనుల్లో మునిగిపోయింది. కొద్ది రోజులకు పని పిల్లను మాన్పించింది కనకం. ఇంటెడు చాకిరీ సుబ్బు నెత్తిన పడడంతో ఉద్యోగ ధ్యాసే మరిచిపోయింది.
తాను ఉద్యోగం చేయాలనుకుంటున్నానని భర్త అనిరుధ్కు ఎన్నిసార్లు చెప్పినా, అతను పెడచెవిన పెట్టేవాడు. అనిరుధ్కు ఇంటి ఆడవాళ్లు ఉద్యోగం చేయకూడదు, వాళ్ల పని కేవలం భర్తను, కుటుంబాన్ని చూసుకోవడమే అన్న తత్వం. భార్యతో ప్రేమగా ఉండడం, ఆమె అభిప్రాయాలను గౌరవించడం, ఆమెతో స్నేహంగా మెలగడం—ఇవేవీ అతనిలో లేవు. సుబ్బుపై విసుగు ప్రదర్శించేవాడు.
ఆ ఇంట్లో అందరి అవసరాలు తీర్చే యంత్రంలా సుబ్బును చూసేవారు తప్ప, ఆమెను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. కాసేపు అయినా ఆమెతో సరదాగా మాట్లాడేవారు కూడా ఉండేవారు కాదు. కొన్ని సందర్భాల్లో కనకం, సుబ్బు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాటలు అనేది. సుబ్బు ఎదురు చెప్పినప్పుడల్లా అనిరుద్ ముందు ముసలి కన్నీళ్లు కారుస్తూ, లేనిపోని మాటలు చెప్పి ఇద్దరి మధ్య గొడవలు పెట్టేది.
రెండు మూడు సార్లు సుబ్బు తన కష్టాన్ని తల్లితో చెప్పుకున్నా, పెద్దగా ఉపయోగం ఉండేది కాదు.
“కుటుంబం అన్నాక గొడవలు సర్వసాధారణం. పాపో బాబో పుడితే అంతా సర్దుకుంటుంది,” అంటూ నచ్చజెప్పేది.
సుబ్బు మానసికంగా కుంగిపోయింది. కొద్ది రోజులకు గర్భవతైంది. అయినా అత్తారింట్లో పనులు మాత్రం తగ్గలేదు. భర్త అనిరుద్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇవన్నీ బాధ కలిగించినా, పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచించేది.
సుబ్బుకు బాబు పుట్టాడు. ఆ ఇంట్లో తనకంటూ తోడుగా ఉన్నవాడు బాబు ఒక్కడే. కనకం కాసేపు బాబును ఎత్తుకుని ఆడించినా, అనిరుధ్ ఇంట్లో లేనప్పుడు బాబు ఏడ్చినా కనీసం బుజ్జగించేది కాదు. బాబుని, ఇంటి పనుల్ని సుబ్బే చూసుకోవాలి. బాబు పుట్టిన తర్వాత కూడా అనిరుధ్లో ఎలాంటి మార్పు లేదు.
ఒకరోజు అనిరుధ్ స్నానం చేస్తుండగా అతని ఫోన్ వరుసగా మోగింది. సుబ్బు లిఫ్ట్ చేద్దామని వెళ్లింది. స్క్రీన్‌పై ఉన్న కాంటాక్ట్ చూసి షాక్‌లో నిలబడిపోయింది. అంతలో అనిరుధ్ వచ్చి ఫోన్ లాక్కొని,
“నీకెన్ని సార్లు చెప్పాలి నా వస్తువులు ముట్టుకోవద్దని?”
అని కసిరి వెళ్లిపోయాడు.
ఫోన్ చేసింది అనిరుద్ గర్ల్‌ఫ్రెండ్. సుబ్బు మనసు వెయ్యి ముక్కలైంది. ఇన్ని బాధలు భగవంతుడు తనకే ఎందుకు ఇచ్చాడో గుక్కపట్టి ఏడ్చింది.
రోజంతా ఆ గదిలోనే ఉండిపోయింది. ఆగకుండా కారే కన్నీళ్లు, విరిగిన మనసుతో పిచ్చిదానిలా ఏడుస్తూనే ఉంది. ఇప్పటివరకు జరిగినదంతా తలుచుకుని పూర్తిగా కుంగిపోయింది. ఆత్మగౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండలేనని అర్థమైంది.
పెళ్లికి ముందు తన ఆశయాలను గుర్తు చేసుకుంది. ఆ బాధలోనే తన బాబు ముఖాన్ని చూసింది. ఆ పసివాడి జీవితాన్ని పాడు చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ సాయంత్రం ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అనిరుధ్ కట్టిన తాళిని అక్కడే వదిలేసి, బాబును తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది.
“ఎక్కడికి వెళ్తుందిలే… చేసిన పనికి వాళ్ల అమ్మానాన్నే తీసుకొచ్చి వదిలేస్తారు,” అని కనకం, అనిరుధ్ అనుకున్నారు. వాళ్లు ఊహించినట్టుగా వచ్చింది కానీ… సుబ్బు కాదు—సుబ్బు పంపిన విడాకుల నోటీసు.
సుబ్బు తల్లిదండ్రులు తమ చేసిన తప్పును అర్థం చేసుకుని ఆమెకు అండగా నిలిచారు. బాబును ఎంతో ప్రేమగా చూసుకున్నారు. సుబ్బు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమై కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించింది. ఎంతో మంది ఆడవారికి ప్రేరణగా నిలిచింది.
సుబ్బులాగే ఇబ్బందులు పడుతున్న ఆడవారు ఎందరో ఉన్నారు. ప్రతి అమ్మాయి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అత్తారింట అడుగుపెడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎప్పుడూ తగ్గకూడదు. ప్రతి అమ్మాయి ఆర్థికంగా తన కాళ్లమీద తాను నిలబడాలి. సమస్య వచ్చినప్పుడు సుబ్బులా ధైర్యంగా ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలి.
Thank you❤
-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)
అనిసా తబస్సుమ్ SK గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
కథ సమాప్తం

అనిసా తబస్సుమ్ SK




❤❤