నిజమైన స్నేహితులు
- Munipalle Vasundhara Rani

- 4 hours ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #నిజమైనస్నేహితులు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 33
Nijamaina Snehithulu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 27/02/2026
నిజమైన స్నేహితులు - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
నీలిమ ఇప్పుడు హైస్కూల్‌కి వెళ్తోంది. తన చుట్టూ ఉన్న స్నేహితుల్లో ఎవరు మంచివారో, ఎవరు తనను నిజంగా ఇష్టపడుతున్నారో తెలియక తను అప్పుడప్పుడు అయోమయానికి గురయ్యేది. నీలిమ దగ్గర ఎప్పుడూ రంగురంగుల పెన్నులు, ఖరీదైన బ్యాగులు, రకరకాల కొత్త వస్తువులు ఉండేవి. క్లాసులో కొంతమంది అమ్మాయిలు నీలిమ దగ్గరకు వచ్చి ఆమె వస్తువులను పొగుడుతూ, ఆమెతో చాలా తీయగా మాట్లాడేవారు. నీలిమ మాత్రం వాళ్లంతా తనను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారని నమ్మేది. కానీ, ఏదైనా సాయం కావాలన్నప్పుడు లేదా నీలిమ దగ్గర కొత్త వస్తువులు లేనప్పుడు వారు మెల్లగా ముఖం చాటేసేవారు.
ఇది బామ్మ గమనించింది. నీలిమకు స్నేహంలోని అసలు రంగును ఎలా చూపించాలా అని బామ్మ ఒక చక్కని ఉపాయం ఆలోచించింది.
ఒక ఆదివారం ఉదయం నీలిమ తన స్నేహితురాళ్లు పిక్నిక్‌కి వెళ్తూ తనను పిలవలేదని బాధపడుతూ కూర్చుంది. ఇదే సరైన సమయం నీలిమకి గుణపాఠం నేర్పడానికి అనుకుని బామ్మ ఆమెను పిలిచింది. "నీలిమ, కాస్త వంటగదిలోకి వచ్చి నాకు సాయం చేస్తావా" అని అడిగింది. నీలిమ అక్కడికి వెళ్ళగానే, బామ్మ ఆమె ముందు రెండు ఒకేలా ఉన్న గాజు గిన్నెలు పెట్టింది. ఆ రెండింటిలోనూ తెల్లటి పొడి ఉంది. నీలిమ, ఈ రెండు గిన్నెల్లో ఉన్నది ఏమిటో సరిగ్గా చూసి చెప్పు అని బామ్మ అడిగింది.
నీలిమ వాటిని చాలా నిశితంగా పరిశీలించి, బామ్మ, రెండింటిలో ఉన్నది తెల్లగానే ఉంది, రెండూ పంచదార లాగే కనిపిస్తున్నాయి. ఇందులో అడగడానికి ఏముంది అంది. అప్పుడు బామ్మ నవ్వుతూ, చూడ్డానికి రెండూ ఒకేలా ఉన్నా వాటిలో ఏదో తేడా ఉంది. ఒకసారి నీ వేలితో రుచి చూసి చెప్పు అని అడిగింది. నీలిమ మొదటి గిన్నెలో ఉన్న పొడిని కొంచెం నాలుక మీద వేసుకుని, అబ్బా! ఇది ఉప్పు బామ్మ, చాలా ఉప్పగా ఉంది. పంచదార అనుకుని నోట్లో వేసుకుంటే ముఖమంతా వికారంగా అయిపోయింది అంది.
ఆ తర్వాత రెండో గిన్నెలో ఉన్నది రుచి చూసి, ఇది పంచదార బామ్మ, చాలా తీయగా ఉంది అంది.
అప్పుడు బామ్మ నీలిమ తల నిమురుతూ ఎంతో ప్రేమగా ఇలా చెప్పింది: చూశావా నీలిమ, ఉప్పు కూడా పంచదార లాగే తెల్లగా, మెరుస్తూ, చూడటానికి ఒక్క రవ్వ కూడా తేడా లేకుండా ఉంటుంది. కానీ రుచి చూస్తే కానీ ఏది ఉప్పో, ఏది తీపో మనకు తెలియదు. మన స్నేహితులు కూడా అంతేనమ్మా. కొంతమంది పైన చాలా తీయగా మాట్లాడుతూ, నీ దగ్గర ఉన్న వస్తువుల కోసం లేదా నీ తెలివితేటలను వాడుకోవడానికి నీ చుట్టూ తిరుగుతారు. వారంతా పంచదార లాగా కనిపిస్తున్న ఉప్పు లాంటి వారు. నీకు అవసరమైనప్పుడు వారు తమ అసలు గుణాన్ని చూపిస్తారు.
నిజమైన స్నేహితులు పంచదార వంటి వారు, వారు నీ దగ్గర వస్తువులు ఉన్నా లేకపోయినా నీకు తోడుగా ఉంటూ నీ జీవితంలో తీపిని నింపుతారు.
తెల్లగా ఉన్నదంతా పాలు కాదు, తీయగా మాట్లాడిన వారంతా స్నేహితులు కాదు. నీ స్నేహితులు నీకు కష్టాల్లో తోడు ఉంటున్నారా లేదా నీ దగ్గర ఉన్న వస్తువుల కోసమే వస్తున్నారా అనేది నువ్వే నీ విచక్షణతో గ్రహించాలి. వస్తువులను చూసి వచ్చే స్నేహం వస్తువులతోనే పోతుంది, కానీ గుణాన్ని చూసి వచ్చే స్నేహం జీవితాంతం ఉంటుంది అని బామ్మ వివరించింది.
బామ్మ మాటలు విన్నాక నీలిమకు కళ్లు తెరుచుకున్నట్లయింది. తన వస్తువుల కోసం తన చుట్టూ చేరిన వారిని, తనను నిజంగా ఇష్టపడే వారిని ఎలా గుర్తించాలో ఆమెకు అర్థమైంది. కేవలం మాటల తీపిని చూసి మోసపోకూడదని, మనిషి అంతరంగాన్ని గమనించాలని నీలిమ గ్రహించింది. ఆ రోజు నుండి ఆమె స్నేహితులను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టింది.
***
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments