top of page

రావయ్య! కన్నయ్యా!

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #రావయ్యకన్నయ్యా, #రావేలమాధవా

గాయత్రి గారి కవితలు పార్ట్ 28

Ravayya Kannayya - Gayathri Gari Kavithalu Part 28 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 19/06/2025

రావయ్య! కన్నయ్యా! - గాయత్రి గారి కవితలు పార్ట్ 28 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


రావయ్య! కన్నయ్యా!

(కవిత )


**********************************


పాలు కుడిచిన నీవు పకపకా నవ్వక నలక చూపగ నందమే!

వేలునోటను బెట్టి వింతలను చూపితే ముద్దులిడు చుందుమే!


పెద్ద కుండలు కొట్టి వెన్నలను దోచితే వేడుకగు చందమే 

అద్దరిని శైలంబు నా గోటితో మోయ అంజలిఘటింతుమే!


చెట్టు చాటున దాగి చీరె సారెలు దోచ పూజించ చోద్యమే!

నట్టనడి వీధిలో నాతి కొంగును పట్ట నవ్వెదము పైత్యమే!


గోపాలురను కూడి గోవులను కాచితే కాంచుటే పుణ్యమే!

పాపాలు తొలగింప భక్తులకు తోడుగా పరిగిడుట సహజమే!


మామను మర్దించి వీరునివై నిల్వ స్మరియించి మ్రొక్కమే!

కోమలుల వెనువెంట కోలాట మాడగ  వేడుకనుకుందుమే!


రక్కసుల దునుమాడి రాజసంబుగ చూడ ధైర్యమును పొందమే!

చక్కగా నొజ్జకడ చదువులను వల్లింప సంతసంబున పొగడమే!


ఎన్నెన్ని లీలలో నీజగతిలో చేయ వినుచుండి సొక్కమే!

కన్నయ్య!రావయ్య!కనుపించితే చాలు మా జన్మ ధన్యమే!//


************************************















రావేల మాధవా!

(ఇష్టపది )

************************************

మరచిపోకుమ నన్ను మాధవా! నీ చెలిని!

పరవసించుచు నీదు పాదాల కడ విరిని!


పడమటింటికి భగుడు పరువెత్తుచున్నాడు.

కడగంటి చూపుతో కరుణ చిలికించాడు.


గోవులను మరలించి గోపాలురరుదెంచి

నీ వదనమును గాంచి నెనరుతో పూజించి


గొల్లభామలు పాలు కుండలందు నింపగా

చల్లనౌ నీరూపు సాక్షాత్కరింపగా


గోకులంబెల్ల నిను కొల్చుచూ పొగడింది.

ప్రాకటంబుగ నీదు వైభవము తెలిపింది.


జీవరాసుల కెల్ల చైతన్యమిడు దేవ!

నా వగను గుర్తించి నగవుతో రాలేవ!


కోపమేలర కృష్ణ!కూర్మిచూపగలేవ!

తాపమును శమియింప దరిచేరగారావ!


కొంటెతనమేలరా? గోవింద!నిను తలచి

కంట నీరిడి నిల్చి కరములను జోడించి


వేడుకొంటిని విభూ!వేషములు నీకేల?

తోడుగా రావేల? దొరవంటి నన్నేల!//


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page