top of page

రేపటి కోసం

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #RepatiKosam, #రేపటికోసం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

ree

Repati Kosam - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 30/08/2025

రేపటి కోసం - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


"ఏంటి ఈరోజు తొందరగా లేచారు?." అడిగింది సులోచన. 


"నిన్ననే చెప్పాను కదా. , ఒక సంస్థ వారు ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను వెళ్లాలని." అని అన్నాడు విష్ణు మూర్తి. 


"అవును, నేనే మరిచిపోయాను. సరే అలాగే కానివ్వండి. " అని వెళ్ళబోయింది. 


"సులోచన!, పుత్రరత్నం ఫోన్ చేసాడా?. " అడిగాడు. 


"ఇంకా లేదు?. "


"ఏమిటో వాడి పరిస్థితి చూస్తుంటే నాకు భయం వేస్తుంది?. వాడి ఇష్టంతోనే కదా సివిల్స్ కోచింగ్ కు పంపించాం. చూస్తుంటే అసలు బాబుగారికి ఏకాగ్రతే లేనట్టు వుంది?. ఎప్పుడు బాధ్యత తెలుసుకుంటాడో?. ఒకవేళ వాడు ఇలానే వుంటే నా పరువు ఏమి కాను?. " అని అసహనంతో అన్నాడు విష్ణు మూర్తి. 


"ఎందుకు మీరు అలా అంటున్నారు?. వాడు మరీ బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించే వ్యక్తి కాదు." కొడుక్కి వత్తాసు పలుకుతూ అంది సులోచన. 


"ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కదా. వీడు క్లాసస్ కు వెళ్ళడం లేదు అని తెలిసింది. క్లాస్ లుకు వెళ్లకుండా ఎక్కడ తిరుగుతున్నాడో?. " అన్నాడు విష్ణు మూర్తి. 


"యువత అన్నాక ఆ మాత్రం సరదాలు వుంటాయి కదా. ఎందుకు మీరు ఇంతలా కంగారు పడటం?. మీరు యూత్ గా ఉన్నపుడు ఎన్ని చేసుంటారో?. " అంది ఆమె. 


"ఏమి సరదాలు వుంటాయి. ఆ రోజుల్లో నేనొక అధికారి అవ్వాలని ధ్యాసే తప్ప మరేం లేదు. ఇంకా ఎంజాయ్ మెంట్ ఎక్కడ?. ఆ రోజుల్లో నేను ఎంతో కష్టపడ్డాను కనుకే ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో రిటైర్ అయ్యాను. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. " అన్నాడు విష్ణు మూర్తి. 


"మహానుభావా మీతో నేను వాదించగలనా?. సరే మీరు బయలుదేరండి. తర్వాత మనం తీరికగా మాట్లాడుకుందాం. " అని అంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది. 


అసహనంతో అక్కడ నుండి కదిలాడు విష్ణుమూర్తి. 


తయారయ్యి ప్రోగ్రాం కు వెళ్ళడానికి సిద్దమయ్యాడు. కొన్ని గంటలు తర్వాత అక్కడకు చేరుకున్నాడు. ప్రోగ్రాం నిర్వాహకులు విష్ణుమూర్తి ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. తనకు తెలిసిన ప్రముఖ వ్యక్తులు ఇంకో ఇద్దరూ కూడా ముఖ్య అతిథులుగా వచ్చారు. వాళ్ళకు కూడా విష్ చేసి తన సీట్ లో ఆశీనుడయ్యాడు విష్ణుమూర్తి. 


అనుకోకుండా తన చూపు వెనక్కి తిరిగింది. అక్కడే కూర్చొని వున్నారు రామేశం గారు. ఒకసారిగా ఆశ్చర్యపోతూ వేగంగా అతనికి దగ్గరకు చేరుకున్నాడు విష్ణు మూర్తి. 


"నమస్కారం సార్, మీరు ఇక్కడ?. మిమ్మల్ని చూసి చాలా రోజులు అయ్యింది!. " నవ్వుతూ అన్నాడు విష్ణుమూర్తి. 


"విష్ణు మూర్తి గారు!, మీరు ఇక్కడకు వస్తారని తెలుసు. మీరు ముఖ్య అతిథి అని ముందే తెలుసు. చాలా సంతోషం మీరు ఎలా వున్నారు?. నేను ఇక్కడకు కొందరి పిల్లలతో వచ్చాను. " చెప్పాడు రామేశం. 


రామేశం గారు కూడా ఒక ఐఏఎస్ అధికారి. ఎప్పుడు కూడా సమాజం బాగుపడాలని కోరుకోవడమే కాదు. దానికి కోసం ఎన్నో పనులు చేస్తూ, అందరిలో చైతన్యం నిండేలా చేస్తారు. 


"మీరు పిల్లలతో వచ్చారా?." ఆశ్చర్యంతో అడిగాడు విష్ణు మూర్తి. 


"అవును విష్ణు మూర్తి గారు, నన్ను వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సహాయం చేయక తప్పలేదు." అని అన్నాడు రామేశం. 


కొంత సమయం రామేశం తో మాట్లాడిన తర్వాత తన స్థానంలో తాను కూర్చున్నాడు విష్ణుమూర్తి. 

కొంత సమయంలో ప్రోగ్రాం ప్రారంభం అయ్యింది. 


"ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ స్వాగతం. పిల్లల్లో సమాజం పట్ల అవగాహన పెంచి వాళ్ల ఉన్నతికి పాటుపడేలా చేయాలని ఈ సంస్థ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. గెలుపొందిన వారికి ఎక్కువ మొత్తం లో డబ్బు ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ల విద్యకు మాత్రమే ఉపయోగించాలని నియమం కూడా వుంది. అది కచ్చితంగా అమలు చేస్తాం." అని సవివరంగా విషయాలు చెప్పాడు ఆ సంస్థ అధిపతి. 


తర్వాత పోటీ లు మొదలయ్యాయి. వేరే పాఠశాలల నుండి వచ్చిన పిల్లల బృందం తమకు నచ్చిన అంశం మీద ప్రదర్శన ఇస్తున్నారు. 


ఎన్నో ప్రదర్శనలు వస్తున్నాయి కానీ అవి అంతగా ఎందుకో నచ్చడం లేదు విష్ణుమూర్తికి. ఏదో కొత్తగా కావాలనిపిస్తుంది. కానీ తాను అనుకున్నది రావడం లేదు. వచ్చిన వాటిలో బాగా ప్రదర్శన చేస్తున్న వాటికి మార్కులు వేస్తున్నాడు విష్ణు మూర్తి. ప్రోగ్రాం చివరికి వచ్చింది. చివరికి మిగిలింది ఒక ప్రదర్శన మాత్రమే. కానీ విష్ణు మూర్తి చాలా నిరాశగా వున్నాడు. ఏ ప్రదర్శన లో కూడా కొత్తదనం లేదని. కనీసం ఈ ప్రదర్శనైనా బాగుంటుంది అని ఆశగా వున్నాడు. 


"అందరికీ నమస్కారం, ఈరోజు మేము చేయబోయే ప్రదర్శన పార్లమెంటరీ డెమాక్రసీ మరియు పార్టిసిపేటరీ డెమాక్రసీ" అని పిల్లలు చెప్పారు. 


ఒక్కసారిగా తన ఏకాగ్రత అటువైపుకు మళ్ళింది. ఏదో కొత్తగా అనిపిస్తుంది అనుకుంటూ అటువైపు చూస్తున్నాడు. ముఖ్యంగా యువత రాజకీయాలు తెలుసుకోవాలని ఆ ప్రదర్శన ముఖ్య వుద్దేశ్యం అని వాళ్ల ప్రదర్శన ఆధారంగా అవగతమయ్యింది విష్ణు మూర్తికి. 

పార్లమెంట్ వాతావరణం అక్కడ సృష్టించి బలమైన సమస్యలు మీద వాదిస్తున్నారు.


పార్లమెంట్ ముఖ్య ప్రాముఖ్యత వివరిస్తున్నారు. కొంత సమయానికి ఆ ఘట్టం ముగిసింది. వాళ్ళే తర్వాత సమావేశమై కొందరు తమ ప్రాథమిక హక్కులు గురించి మాట్లాడుతూ వినతి పాత్రలు సమర్పిస్తూ వున్న ప్రదర్శన అది, అది కూడా పంచాయితీ స్థాయిలో ప్రజలు ఎలా పాల్గొనాలని, తమ సమస్యలు ఎలా వినిపించుకోవాలని తెలియజేసేది. పిల్లలు స్పష్టంగా ఎటువంటి తడబాటు లేకుండా ప్రదర్శన చేశారు. 


విష్ణు మూర్తికి ఈ ప్రదర్శన ఊరట ఇచ్చింది. తాను అనుకున్న దాని కంటే మంచి ప్రదర్శన వచ్చిందని సంతోషించాడు. సంస్థ వారు, గ్రూప్ లకు నంబర్స్ మాత్రమే ఇచ్చి. వాళ్ళు ఏ పాఠశాల విద్యార్థులు అన్నది ఎవరికీ కూడా తెలియకుండా చూశారు. ఫలితాలు లో ఎటువంటి అవకతవకలు జరగకూడదని వాళ్ళు ఆ విధంగా చేశారు. 


"సందేహం లేదు, ఇంత చక్కని ఐడియా రామేశం గారిదే. " అని తనలోపల అనుకున్నాడు విష్ణు మూర్తి. 


కొంత సమయం తర్వాత ఫలితాలు ప్రకటించారు. విష్ణు మూర్తి లాగానే, మిగతా వారు కూడా ఆ ప్రదర్శన కు పట్టం కట్టారు. విష్ణు మూర్తి సంతోషించాడు. 


ఆ పిల్లలు బహుమతి తమ గురువు చేతుల మీదగా తీసుకోవాలన్నారు. రామేశం గారిని స్టేజ్ మీదకు ఆహ్వానించాడు విష్ణు మూర్తి. స్టేజ్ మీదకు చేరుకున్న రామేశం మాష్టారు, 


"పిల్లలు నన్ను ఆశ్రయించి మార్గదర్శనం చేయమని అడిగారు. నేను చేశాను కానీ ఆ ఆలోచన నాది కాదు. అది నాకు బాగా తెలిసిన వ్యక్తి.ది అతను మరెవరో కాదు అనిరుధ్. అనిరుధ్ మీకు ఎవరికీ తెలియకపోవచ్చు. తెలిసి వుండేది కానీ అతను తాను చేసిన మంచి గురించి ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదని ప్రచారం కు దూరంగా వున్నాడు. కానీ నాకు మనుసు ఒప్పడం లేదు. ఏది సాధించినా దానికి గుర్తింపు వుండాలి కదా, అందుకే ఈ వేదిక మీద అతని ఘనత ప్రశంసించాను." అని అంటూ, " అనిరుధ్ గారు మీరు వేదిక మీదకు రావాలి." అని పిలిచాడు రామేశం. 


వేదిక మీదకు రావడానికి సిద్దం అయ్యాడు అనిరుధ్. అక్కడ పిలిచిన పేరు, వేదిక మీదకు వస్తున్న వ్యక్తి తన కొడుకు అనిరుధ్ అని తెలిసి ఆశ్చర్యంతో వుండిపోయాడు విష్ణు మూర్తి. 


"అనిరుధ్!, మారుమూల గ్రామాల్లో పిల్లల దగ్గరకు వెళ్ళి, వాళ్ళకు చదువు పట్ల పూర్తిగా అవగాహన పెంచి, ఎందరో నిరక్షరాస్యులను విద్యావంతులు చేశాడు. 


ఎంతో శ్రమపడి తనకు ఖాళీ అయిన రోజుల్లో కొండ ప్రాంతాలకు వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని తీర్చడానికి కృషి చేశాడు. రాజకీయం పట్ల, దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల చిన్ననాటి నుండి తెలుసుకొని వాటిని మీద అవగాహన పెంచుకొని అవినీతి కి తావులేకుండా ఈ దేశాన్ని మార్చాలని అతని తపన. " అని అన్నాడు రామేశం. 


అక్కడ అందరూ చప్పట్లు కొట్టారు. విష్ణు మూర్తి కళ్ళు నీళ్లతో తడిసిపోయాయి!. తన కొడుకును సరిగ్గా అర్దం చేసుకోలేదని బాధపడ్డాడు. 


"అనిరుధ్ గారు!, మీ ఆలోచన అద్భుతం?. అసలు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కారణం ఏమిటి?. " అడిగాడు ఆ సంస్థ వారు. 


"నాకు ఈ ఆలోచన రావడానికి కారణం మా నాన్న. ఈ సమాజం. అవును, మా నాన్న ఒక ఉన్నత అధికారిగా విధులు నిర్వహించే సమయంలో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. విధి నిర్వహణలో అతను చాలా సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ ట్రాన్స్ఫర్ల కు గల కారణం ఏమిటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఈ ఆలోచన చేశాను.


ఎప్పుడైతే ప్రజలు వ్యవస్థ గురించి తెలుసుకొని ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు తప్పకుండా ఈ దేశం అభివృద్ధి పథంలోకి వెళుతుంది. అవినీతి అంతం అవుతుంది. అందుకే నేను పిల్లల్లో ఆలోచన శక్తి పెరగాలని వాళ్ల చేత ఇలాంటి ప్రదర్శన చేయించాను. కష్టాన్నే నమ్ముకోండని వాళ్ళకు చెప్పాను. కష్టం విలువ తెలిసిన వాడు తప్పు చేయడని నేను అనుకుంటున్నాను. అందుకే మార్పు రావాలంటే బాల్యం నుండే మొదలవ్వాలి. ఈ దేశం కోసం, మన అందరి వునికి కోసం ఆలోచన బాల్యం నుండే మొదలు అవ్వాలి. " అని తన స్పీచ్ ముగించాడు అనిరుధ్. 


చప్పట్ల తో ఆ ప్రాంతం మారుమ్రోగింది. 

"ఇప్పుడు విజేతలు అయిన పిల్లలకు అంటే వాళ్ల తరుపున అనిరుధ్ గారికి ముఖ్య అతిథులు చెక్, అలాగే మెమోంటో లు అందజేస్తారు. " అని సంస్థ వ్యక్తి చెప్పాడు. 


విష్ణు మూర్తి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు తన కొడుక్కి తన చేతుల మీదుగా చెక్ ఇవ్వడం. 

చెక్ అందిస్తూ, 

"అనిరుధ్!, నిన్ను తప్పుగా అర్దం చేసుకున్నాను. నీలా యువత ఆలోచిస్తే మన దేశం గతి మారిపోతుంది." ఆనందంతో అన్నాడు విష్ణు మూర్తి. 


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments


bottom of page