రేపటి వెలుగు కోసం
- Kandarpa Venkata Sathyanarayana Murthy

- Oct 1
- 5 min read
#RepatiVeluguKosam, #రేపటివెలుగుకోసం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Repati Velugu Kosam - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 01/10/2025
రేపటి వెలుగు కోసం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
ఉదయం పది గంటలు దాటింది. ప్రభుత్వ పాఠశాల వద్దకు తోపుడుబండితో వచ్చాడు వెంకటస్వామి.
చెట్టు కింద నీడలో బండిని నిలబెట్టి కింద నుంచి గోనె సంచిలోంచి మక్కబుట్టలు పైకి తీసి, పైన ఉన్న డొప్పలు తీసేసి, ఒకవైపున పేర్చుకుని ఇనుప గమేలాలో బొగ్గులు పోసి కాగితం వెలిగించి, బొగ్గుల మద్య ఉంచి, మెల్లగా విసినకర్రతో గాలి విసిరి నిప్పులు రాజేస్తున్నాడు.
పచ్చి మక్కబుట్టలు ఒక్కొక్కటిగా నిప్పుల మీద కాలుస్తూ బండి మీద ఉంచుతున్నాడు.
పాఠశాలకు ఇంటర్వెల్ ఇచ్చారు. విద్యార్థులు గుంపులుగా బయటకు వచ్చి చెట్టు కింద వివిధ రకాల తినుబండారాల చుట్టు మూగి వారికి కావల్సిన వస్తువులు కొని తింటున్నారు.
వెంకటస్వామి కాల్చి ఉంచిన మొక్కజొన్నల కోసం బండి చుట్టుముట్టేరు. ఒక్కొక్కరు డబ్బులు ఇచ్చి మొక్కజొన్న పొత్తుల కొనుక్కుని తింటున్నారు.
ఒక అబ్బాయి దూరంగా నిలబడి మొక్కజొన్న పొత్తులు తింటున్న వారివైపు ఆశగా చూస్తున్నాడు. వెంకటస్వామి ఆ అబ్బాయిని పిలిచి కాల్చిన మొక్కజొన్న తీసుకోమన్నాడు.
అక్కడున్న అబ్బాయిల్లో ఒకడు "వాడి దగ్గర డబ్బులుండవు తాతా! వాళ్లమ్మ పనికి పోతాది. వీడు బువ్వ బడిలోనే తింటాడు" అని ఎగతాళిగా అన్నాడు.
విషయం అర్థమైన వెంకటస్వామి ఆ అబ్బాయిని దగ్గరకు పిలిచి మొక్కజొన్న తినమని చేతికి ఇచ్చాడు.
మొహమాట పడతునే మొక్కజొన్న కంకి అందుకుని తినబోతుండగా స్కూల్ గంట మోగింది. అందరూ తరగతి గదుల వైపు పరుగులు తీసారు. ఆ అబ్బాయి మక్కబుట్ట తినకుండా నిక్కరు జేబులో పెట్టుకుని వెళ్లేడు.
మర్నాడు కూడా వెంకటస్వామి మక్కబుట్టల బండి దగ్గరకు తోటి పిల్లలతో వచ్చిన అబ్బాయిని పిలిచి కాల్చిన కంకి ఇచ్చాడు. మొక్కజొన్న తిని తరగతికి పోయాడు.
ఒకరోజు ఏదో కారణంతో పాఠశాలకు మధ్యలోనే శలవు ఇచ్చేసారు. పిల్లలు మక్కబుట్టలు కొనకుండానే ఇళ్లకు పరుగులు తీసారు.
ఆ అబ్బాయి మాత్రం ఒక్కడు మిగిలాడు. మెల్లిగా బయటకు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు.
వెంకటస్వామి దగ్గరకు పిలిచి మొక్కజొన్న ఇచ్చి తినమన్నాడు. గబగబా మక్కబుట్ట తిన్నాడు.
"బడికి శలవు ఇచ్చినారు కదా, ఇంటికి పోవా" అన్నాడు తాత.
"పోను, సాయంకాలం వరకు ఇక్కడే ఉంటాను " అన్నాడు.
మధ్యాహ్నం బువ్వ సంగతి అడిగితే "ఈరోజు బడికి శలవు ఇచ్చేరు కదా, బువ్వ పెట్టరు. రేతిరి అమ్మ వండితె తింటాను" అన్నాడు.
"నీ పేరేంటి? ఎక్కడ ఉంటావు ? మీ అమ్మ ఏం చేస్తుంద”ని అడిగాడు తాత.
తనపేరు వెంకటేశమని, అమ్మ కొబ్బరిపీచు ఫేక్టరీలో పనికి పోతుందని, తనని మద్యాహ్నం బువ్వ కోసం బడికి తోలేస్తుందని, తను బడిలో బువ్వ తిని సాయంకాలం అమ్మ వచ్చేవరకు బయట ఆడుకుని రాత్రికి అమ్మతో ఉంటానన్నాడు. ఆదివారం శలవురోజులో ఇంటికాడ అమ్మతోనే ఉంటానన్నాడు. బడికి శలవులైతె దేవులోరి గుడి కాడ పూజారి గారు ప్రసాదం పెడతారని చెప్పేడు.
"మీ అమ్మ పేరేంటి? నాయన లేడా? " అడిగాడు వెంకటస్వామి తాత.
"మా అమ్మ పేరు వనజ. ఫేక్టరీకి పోయేటప్పుడు అమ్మతో పనిచేసే వాళ్లు "వనజా" అని కేకేసి పిలుస్తుంటారు. నాన్న లేడు. రేకుల షెడ్డులో అమ్మ, నేను ఉంటాము." వివరాలు చెప్పేడు వెంకటేష్.
వనజ పేరు వినగానే వెంకటస్వామికి కూతురు జ్ఞాపకం వచ్చింది. తమ కూతురు పేరు కూడా వనజే. చదువుకుంటానంటే హైస్కూలుకు పోనిచ్చాడు.
అక్కడే ఎవరో కుర్రాడు పరిచయం అయి ప్రేమంటు పట్నం తోలుకుపోయాడు. కూతురు పోయి ఐదు సంవత్సరాలైంది. ఎటుపోయిందో ఎక్కడ ఉందో ఏమీ జాడ లేదు. గతం జ్ఞాపకం తెచ్చుకుని కళ్లు తుడుచుకున్నాడు.
వెంకటస్వామి తాత కళ్లు తుడుచుకోవడం చూసి "ఎందుకు ఏడుస్తున్నా”వని వెంకటేష్ అడిగాడు.
"ఏం లేదు బాబు, మీ అమ్మలాంటిదే నాకూ కూతురు ఉండేది. చచ్చిపోయి నాది. అది యాదికి వచ్చినా”దని జవాబు చెప్పేడు.
వెంకటస్వామి తాత తను వండి వెంట తెచ్చుకున్న కేరేజీలోని అన్నం, పప్పు, ఉల్లిపాయముక్క పళ్లెంలో పెట్టి తినమని వెంకటేష్ కి ఇచ్చి ప్లాస్టిక్ బాటిల్ మంచినీళ్లు అందించాడు.
ముందు వద్దన్నా తాత బలవంతం చేస్తే అన్నం తిని నీళ్లు తాగేడు. భద్రంగా ఇంటికి పొమ్మని చెప్పి వెంకటస్వామి తోపుడుబండిని తోసుకుంటు వీధులంట అమ్మడానికి బయలుదేరేడు.
మామూలు రోజుల్లో స్కూలు దగ్గర అమ్మగా మిగిలిన మక్కబుట్టలు వీధులంట అమ్మి సాయంకాలం గుడిసెకు చేరుకుంటాడు. అమ్మిన డబ్బులో కొంత దాచి మర్నాడు మండీకెళ్లి పచ్చి మక్కబుట్టలు కొని మిగిలిన డబ్బులు తిండికి ఖర్చు చేస్తాడు.
తాతకి పొగాకు చుట్ట కాల్చడం తప్ప మరే దురలవాటు లేదు. వయసు వచ్చిన కూతురు రోడ్డు కాంట్రాక్టరు వద్ద కొలువు చేసే పట్నం కుర్రాడి ప్రేమలో పడి ఎటో వెళిపోయింది. ఊళ్లో తలెత్తుకు తిరగలేక వెంకటస్వామి తాత భార్య గంగమ్మతో గ్రామం నుంచి పట్నానికి వచ్చి లేబర్ కాలనీ బస్తీలో గుడిసె అద్దెకు తీసుకుని బ్రతుకుతెరువు కోసం సీజన్లో దొరికే పళ్లు మండీ నుంచి కొని తెచ్చి తోపుడుబండి మీద వీధులంట అమ్మి జీవితం సాగిస్తున్నాడు.
అనుకోకుండా జబ్బు చేసి గంగమ్మ కాలం చేస్తే వెంకటస్వామి ఒంటరిగా గుడిసెలో కాలక్షేపం చేస్తున్నాడు.
ఉదయం లేచి మండీకి పోయి కావల్సిన వస్తువులు కొని తెచ్చుకుని మధ్యాహ్నానికి బువ్వ వండుకుని కేరేజీలో పెట్టుకుని తోపుడుబండితో బయలుదేరి సాయంకాలం గుడిసెకు చేరుకుంటాడు. రాత్రికి కావలసింది
వండుకుని నిద్రపోతాడు. మూడ్ వస్తె చిన్నప్పుడు నేర్చుకున్న వీరబ్రహ్మంగారి తత్వాలు, భజనలు నెమరువేసుకుంటాడు. మిగతా గుడిసెల్లో జనం
తాగి తందనాలాడినా వెంకటస్వామి వారి జోలికెళ్లడు.
ఒక శలవురోజున వెంకటస్వామి కూరలు అమ్ముకుంటు వెళుతుంటే వీధిలో వెంకటేష్ ఆడుతూ కనిపించాడు.
తాత వెంకటేష్ ని గుర్తు పట్టి "ఇక్కడున్నావేమిటని" అడిగితే అదే
మా ఇల్లు అంటూ రేకుల షెడ్డు చూపించాడు.
ఇంతలో వెంకటేష్ ని పిలుస్తూ వాడి అమ్మ గుమ్మంలోంచి పైకి వచ్చింది. వెంకటస్వామి ఆ అమ్మాయిని చూసి స్తబ్దుడయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు వెంకటస్వామి కూతురు వనజ.
పట్నంలో తండ్రిని ఇలా తోపుడుబండి మీద కూరలు అమ్మడం చూసిన వనజ తన కళ్లను తనే నమ్మలేకపోతోంది.
'ఐతే రోజు తన వద్ద మక్కబుట్టలు, అన్నం తిన్నది తన మనమడా!' అని ఆశ్చర్యానికి గురయాడు వెంకటస్వామి.
తండ్రి తను చేసిన పాపిష్టి పనికి ఎంత అసహ్యించుకుంటాడోనని వనజ భయపడుతోంది.
తలమీద తుండుతో మొహం తుడుచుకుంటు తోపుడుబండితో కూతురు ముందుకు వచ్చాడు వెంకటస్వామి.
"అమ్మా వనజా, నువ్వేనా? నా కూతురు వనజవేనా?" అంటు కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
ముసలి వయసులో తండ్రి రూపాన్ని చూసి వనజకు దుఖం ఆగలేదు. భోరున ఏడుస్తూ తండ్రిని వాటేసుకుంది.
పిల్లాడు వెంకటేష్ ఏమీ అర్థం కాక వారి వైపు చూస్తుండిపోయాడు.
ముసలి తండ్రిని తన వెంట రేకుల షెడ్ ఇంట్లోకి తీసుకుపోయి ఇనుప నవారు మంచం మీద కోర్చోబెట్టి చెంబుతో మంచినీళ్లు ఇచ్చింది. అప్పటికే మధ్యాహ్నమైంది. వేడిగా చాయ్ తయారు చేసి తెచ్చింది.
ఇద్దరూ తేరుకున్న తర్వాత అమ్మ గురించి అడిగింది వనజ. కళ్లు తుడుచుకుంటు కూతురు ఊరు వదిలిన తర్వాత నుంచి జరిగిన విషయాలు చెబుతూ భార్య జబ్బుతో చచ్చిపోయి రెండు సంవత్సరలైందని, ఒంటరిగా బ్రతుకుతెరువు కోసం ఇలా వీధులంట పళ్లు కాయకూరలు అమ్ముతున్నానని తన దైనందిన చర్య చెప్పేడు వెంకటస్వామి.
ఉండబట్టలేక నీ బతుకెలా ఉందని కూతుర్ని అడిగాడు.
"నాయనా, దేవుడు నాకు తగిన శిక్షే వేసినాడు. మోహన్ పట్నంలో తనకి సినేమా వాళ్లు తెలుసని సినేమాలలో నటింపచేస్తానని చెప్పి, పట్నం వెళ్లి పెళ్లి చేసుకుందామని లేవతీసుకుని వచ్చి ఇక్కడ గది అద్దెకు తీసుకుని
కొద్ది రోజులు నాతో గడిపి గర్భవతిని చేసి వంటరిగా వదిలి ఎటోపోయినాడు.
నేను చేసిన పనికి అసహ్యించుకుని నన్ను ఇంటికి రానివ్వరని తలిచి చచ్చిపోదామనుకున్నా కడుపులోని పిండాన్ని చూసి ఆపని చెయ్యలేక పోయాను. ఆ పేటలో ఉండే ముసలవ్వ నా కథ విని కూతురిలా చేరదీసి నెలలు నిండి పురుడు పోస్తె ఈ పిల్లగాడు పుట్టేడు. వాడికి నీ పేరే వెంకటేశని పెట్టేను.
ఆ ముసలవ్వ నాకు కొబ్బరిపీచు ఫేక్టరీలో కూలి పని ఇప్పించింది. ఇంటి దగ్గర ఈడిని చూసేవాళ్లు లేక గవర్నమెంట్ బడిలో వేయించినా. ఒకరోజు ఎవరో తాత మొక్కజొన్న కంకులు పైసలు తీసుకోకుండా తినిపించినాడని చెబితే ఎవరో మంచి మనసున్న
మనిషనుకున్నాను.
నీ మనవడికే బువ్వ కూడా తినిపించావట. నాయనా, అక్కడి గుడిసె వదిలి ఇక్కడికి వచ్చెయ్. ఇద్దరం కలిసి ఈ పిల్లాడిని సాకుదాం. నాకు సహాయంగా ఉంటావు " అంది ఏడుస్తూ.
"అలాగేనమ్మ, ఇన్నాళ్లకు మళ్ళీ నిన్ను చూసాను. మనం కలిసే ఉందాం. ఈ పిల్లగాడిని బాగా చదివించి పెద్ద కొలువులు చేయిద్దాం "అని నిర్దారణకొచ్చారు.
***
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.




Comments