సంపూర్ణ చంద్రగ్రహణం
- Sudha Vishwam Akondi
- Sep 7
- 3 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #SampoornaChandraGrahanam, #సంపూర్ణచంద్రగ్రహణం

Sampoorna Chandra Grahanam - New Telugu Article Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 07/09/2025
సంపూర్ణ చంద్రగ్రహణం - తెలుగు వ్యాసం
రచన: సుధావిశ్వం ఆకొండి
సైన్స్, ఖగోళశాస్త్రం ప్రకారం..
చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని పాక్షిక చంద్రగ్రహణం అనీ పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అనీ వ్యవహరిస్తారు.
భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్యకు వచ్చినప్పుడు మరియు దాని నీడ చంద్రుడిని కప్పినప్పుడు సంపూర్ణ చంద్ర గ్రహణం జరుగుతుంది. గ్రహణం పూర్తిగా ఏర్పడినప్పుడు చంద్రుడు ఎర్రగా మారడాన్ని గ్రహణ పరిశీలకులు చూడవచ్చు.
భారతదేశం ఒక అద్భుతమైన ఖగోళ సంఘటనను చూడబోతోంది. సెప్టెంబర్ 07, 2025 అదివారం రాత్రి, దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ కనిపిస్తుంది. ఈ అరుదైన చంద్రగ్రహణం చంద్రుడు ముదురు ఎరుపు రంగులోకి మారుతున్నాడు. గ్రహణం సమయాలు సెప్టెంబర్ 7న రాత్రి 9:58 ప్రారంభమవుతుంది. రాత్రి 1:41 లకు గరిష్ట సంపూర్ణతను చేరుకుంటుంది.
గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో దేవాలయాలలో పూజలు నిర్వహించరు. చంద్రగ్రహణం కారణంగా, దేవాలయాలలో దేవత దర్శనం సాధ్యం కాదు. అయితే గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం.
గ్రహణం నేపథ్యంలో ప్రముఖ ఆలయాలతో సహా అన్ని ఆలయాలు మూసివేస్తారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3. 30 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేస్తారు. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అయితే తోమల సేవ, అర్చన వంటి సేవలు ఆంతరంగికంగా నిర్వహిస్తారు.
అలాగే చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం గం. 1. 00 నుండి 8వ తేదీ ఉదయం గం. 5. 00 వరకు శ్రీశైలం ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేశారు. శ్రీ స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేస్తారు. అలాగే అన్నీ ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీస్వామివారి అమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేసి, భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. సాక్షిగణపతి, హాఠకేశ్వరం, పాలధార పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాలను కూడా మూసి వేస్తారు.
సెప్టెంబరు 8 వ తేదీన ఉదయం గం. 5. 00లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం గం. 7. 30 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతుల సమయం నుండే అనగా భక్తులకు అలంకార దర్శనం కల్పించడం జరుగుతుంది. సెప్టెంబర్ 8వ తేదీ నాటికి ఆన్‌లైన్‌లో శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం, బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం గం. 2. 15 నుండి సాయంకాలం గం. 4. 00 వరకు శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తారు.
ఇలా అన్ని ఆలయాలు మూసివేస్తారు.
కానీ తిరుపతి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో మాత్రం పూజలు జరుగుతూనే ఉంటాయి. గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా పేరు కలిగిన ఈ ఆలయంలో స్వయంభుగా వెలిసిన మహాలింగానికి 9 గ్రహాలు, 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉండమే ప్రత్యేకం. అందుచేత ఆలయం గ్రహణ కాలంలో కూడా తెరిచే ఉంచుతారు.
హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి, గ్రహణ సమయంతో పాటు గ్రహణం తరువాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందుగా సూతక కాలం మొదలవుతుంది. అంటే ఆదివారం (ఈరోజు) మధ్యాహ్నం 12. 57 నుంచి సూతక కాలం ప్రారంభం అవుతుంది.
ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు. పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమే చేసిన తరువాత తలుపులు తెరిచి యధావిధిగా పూజలు చేస్తారు. రాహుకేతు పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటాయి.
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు..
గ్రహణం రోజున సూతక కాలం మొదలు అయినప్పటి నుంచి గ్రహణం ముగిసేవరకు ఆహారం తీసుకోరు ఆరోగ్యం సరిగ్గా లేనివారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు, పండ్లరసం వంటివి తీసుకుంటారు. అలాగే గ్రహణం ముందు వండిబా ఆహారం, ఇతర తిండి పదార్థాలపై దర్భలు వేయడం ద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం. గ్రహణ సమయంలో వీలైనంత వారికీ భగవన్నామ స్మరణ, ధ్యానం చేయడం వల్ల పుణ్యం రెట్టింపుగా వస్తుందని చెబుతారు.
గ్రహణ సమయంలో, ఆ తర్వాత చేసే దానాలకీ విశేషమైన ఫలితాలు ఉంటాయి.
శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వర స్మరణ చేయాలి.
క్షీరసాగర మధనం అయ్యాక లభించిన అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతుండడం గమనించి, రాహువు అనే రాక్షసుడు దేవతల వరుసలో కూర్చుని అమృతం తాగబోగా, సూర్యచంద్రులు గమనించి శ్రీహరికి చెబుతారు.
ఆ కారణం చేత సూర్యచంద్రులపై కోపంతో ఇలా మింగడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అవే సూర్య, చంద్ర గ్రహణాలని మన పురాణాలు చెబుతున్నాయి.
చక్కగా ఈశ్వర నామం చెప్పుకుని, నియమాలను యదర్శకతో పాటిస్తూ ఉండి, ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాం!
శ్రీకృష్ణార్పణమస్తు

-సుధావిశ్వం
Comments