top of page

సంస్కృతి


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

https://youtu.be/od6V9GwmNPw

'Samskruthi' New Telugu Story


Written By Kiran Jammalamadaka


రచన: కిరణ్ జమ్మలమడక(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


పుట్టినరోజు ప్రతిఒక్కరి జీవితంలో గొప్ప క్షణాలలో ఒకటి.

ధరణి , శేఖర్ లకు ఒక రెండేళ్ల పాప ‘పావని’.

పావని పుట్టినరోజు అనాధాశ్రమం లో జరపాలని

ధరణి ఏర్పాట్లు చెయ్యటం మొదలు పెట్టింది. శేఖర్ ఒకరిద్దరు మిత్రులను కూడా ఆహ్వానించాడు. అంతా కలిపి ఒక పదిమంది అయ్యారు.


ఆ ఆలోచన వచ్చిన దగ్గరనుంచి ధరణి కి ఎంతో ఆనందం గా వుంది. ఒక వారం క్రితమే తమకు దగ్గర్లో వున్న ఆశ్రమానికి ఫోన్ చేసి, అక్కడ వార్డెన్ సరస్వతి గారితో మాట్లాడింది. వార్డెన్ కూడా సరే అని అక్కడ పిల్లల వివరాలు చెప్పారు.


అప్పటినుంచి నుంచి ధరణి ఆ ఏర్పాటుల్లోనే వుంది.

అక్కడ పిల్లలకి కొన్ని బొమ్మలు కొంది. శేఖర్ కేటరింగ్ ఇద్దామన్నా , తనకు తృప్తి గా ఉండదని తానే చేస్తాను అని మొత్తం తానే చెయ్యటానికి పూనుకుంది. రేపటికి ఒక్క భోజనం తప్ప అన్ని రెడీ.


తెల్లవారుజామునే లేచి , యేభై మందికి బిర్యానీ చేసి , పాపని తయారు చేసి, భోజనం సమయానికి ఆశ్రమం చేరుకున్నారు. చెప్పినట్టుగానే శేఖర్ మిత్రులు కూడా వచ్చారు రాగానే శేఖర్, ధరణిలను వాళ్ళ మంచి ఆలోచనకు మెచ్చుకున్నారు.


అందరూ వెళ్లి వార్డెన్ని కలిసి, కేక్ కటింగ్ చేద్దామని పిలిచారు. వార్డెన్, అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరికి చెప్పి ఏర్పాట్లు చూడమని పురమాయించింది. ధరణి మొదటిసారి, ఫోన్ చేసినప్పటినుండి ఆ వార్డెన్ కొంత ముభావంగానే వుంది. ఆమెకు ఇష్టంలేదా? అన్న అనుమానం ఇప్పుడు మరింత బలపడింది ధరణికి.


కానీ ఎవరైనా ఎందుకు వద్దంటారు? పనిగట్టుకొని వొచ్చి పిల్లలకి బొమ్మలు, బిర్యానీ పెడతామంటే? అని తనని తానే

సముదాయించుకొని పనిలో పడింది.


పిల్లలంతా ఒక చిన్న హల్లో చేరారు. అక్కడ ఒక టేబుల్ పెట్టారు. దాని మీద ధరణి తెచ్చిన దుప్పటి పరిచి, ఒక అడుగున్నర ఎత్తున్న కేక్, దానిమీద ఒక అమ్మాయి బొమ్మ.. చూడడానికి చాలా బావుంది. అది దానిమీద పెట్టగానే, పిల్లలు అంత నోరెళ్ళబెట్టి చూడటం ధరణి గమనించి

నవ్వుకుంది సంతోషంగా. పాప చేత కేక్ కటింగ్ కి అన్ని సిద్ధం చేసారు.


కానీ వార్డెన్ సరస్వతి ఇంకా రాలేదు. ఆమెని పిలిస్తేకాని రాదనుకుంటా అని ధరణి కొంచెం అసహనంతో ఆమె దగ్గరకు వెళ్లి, పిలుచుకొచ్చింది. ఆమె రావటం, పాప కేక్ కట్ చేయటం, బుడగలు, కాగితపు బాణాసంచ కాల్చడము, శేఖర్, ధరణి పాపని ఆశీర్వదించటం.. శేఖర్ మిత్రులు పాప పైన అక్షింతలు వేసి గిఫ్ట్స్ ఇవ్వటం.. అంతా చక

చక జరిగిపోయాయి.

ఆ వెంటనే పిల్లలంతా, ఎవరో ముందే నేర్పించినట్టుగా ఒక బృందగీతంలాగా పాప కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే పాట పాడారు. వెంటనే పిల్లలకు బొమ్మలు , చాక్లేట్లు

పంచిపెట్టి , భోజనాలు కొసరికొసరి మరీ వడ్డించారు. ఈ తతంగం అంతా వీడియో తీసాడు శేఖర్.

బాగా అలసిపోవటంవల్ల, ఆరోజు తొందరగానే పడుకుండి పోయారు ధరణి శేఖర్ లు. మర్నాడు ధరణికి చాల తృప్తిగా అనిపించింది. మళ్ళీ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, "ప్రతి సంవత్సరం, మన పాప పుట్టినరోజు అక్కడే చేద్దాం శేఖర్" అని అంది.


“అలాగే” అన్నాడు శేఖర్ పేపర్ చదువుతూనే.


ఆ రోజు సెలవుకావటం తో శేఖర్ మొబైల్ తీసుకొని వీడియో చూడటం మొదలుపెట్టింది. మొదటిసారి ,ఆనందంగా అటుఇటు తిరుగుతున్నా తనని తాను చూసుకుని మురిసిపోయింది. ఈ సారి పిల్లల మోహంలో ఆనందం చూడాలని వీడియో పరిశీలనగా చూడటం మొదలు పెట్టింది. వీడియో చూస్తున్నంతసేపు తాను ఊహించినట్టుగా పిల్లలు పెద్దగా ఏమీ నవ్వులు,కేరింతలు కొట్టటంలేదు.


చాల మామూలుగా వున్నారు.. అంతే! ఆ కేక్ ని చూసినప్పుడు కూడా ఏదో కొంత ఆశ్చర్యపోయారు తప్ప ఆనందం ఏమీ కలగలేదు. ధరణి కి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజంతా ధరణి , అదే ఆలోచిస్తూవుంది , ఎందుకు పిల్లల మొహాల్లో తనకు ఆనందం కనపడటంలేదు? ఏపని చేస్తున్నా నిర్లిప్తంగా వున్న ఆ పిల్లల మొహాలే తన మనసులో మెదులుతూ వున్నాయి.


ఆ రోజంతా అలానే గడిచిపోయింది. అదే నిర్లిప్తత తను వార్డెన్ సరస్వతి గారి లోను చూసింది. వెంటనే ఏదో ఒక కనెక్షన్ ఉందనిపించింది. వెంటనే ఆ వార్డెన్ ని కలవాలని నిర్ణయించుకొని, ఎలాగో ఆ రాత్రి నిద్రపోయింది.


తెల్లవారుతూనే, ఆ ఆశ్రమానికి వెళ్లి వార్డెన్ సరస్వతి గారి కోసం ఎదురు చూడసాగింది. మరి కొద్దిసేపటికి సరస్వతి గారు వొస్తూనే ధరణి ని చూసి కొంచెం ఆశ్చర్యపోయారు, ఏమిటి విషయం అని అడిగారు.


దానికి ధరణి "సరస్వతి గారు, నేను మీకు ఫోన్ చేసినప్పటి నుండి గమనిస్తూవున్నాను.. నేను మీకు ఇలా మా పాప పుట్టినరోజు వేడుక జరపాలని అనుకుంటున్నాను అని చెప్పిన దగ్గరనుండి మీరు ఏదో ముభావంగా వున్నారు. ఏదో తప్పక సరే అన్నారు తప్ప, మీకు అంత ఉత్సాహం లేదు. నేను కేటరింగ్ కి కూడా ఇవ్వకుండా నేనే వండి పిల్లలకు పెట్టాలనుకోవటం, పిల్లలకి బొమ్మలు చాక్లేట్లు

ఇవ్వాలనుకోవటం తప్పా?


మొన్న ఆ వేడుక జరుగుతున్నంతసేపూ మీరు అలానే వున్నారు. పిల్లలు అలానే వున్నారు. నేనేం తప్పు చేసాను.. ఎందుకు అలా వున్నారు? " అని ఆవేశంగా ధరణి

మాట్లాడేసింది.


దానికి సరస్వతి గారు "చూడమ్మా, నీ ఉద్దేశం లో ఏమీ తప్పులేదమ్మా. పద్దతిలోనే చిన్న ఇబ్బంది వుంది. ఇంతకీ

నువ్వు అనాధ ఆశ్రమం లో మీ పాప పుట్టినరోజు ఎందుకు జరిపించాలని అనుకున్నావు ?"


"అదేంటి, ఇక్కడ పిల్లలకి మంచి భోజనం, బొమ్మలు ఇద్దామని"


"మరోలా అనుకోకమ్మ, దానికి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా, ఈ వేడుక ఎందుకు చేసారు? "


“పాప పేరుతొ సేవ చేద్దామని, వారికీ కుటుంబం అంటే ఎలా ఉంటుందో పరిచేయం చేద్దామని”


ఒక క్షణం ఆగి మళ్ళీ సరస్వతి "అసలు అనాధలంటే ఎవరు?" అని అని మరో ప్రశ్న వేసింది.

అప్పటికి ధరణి ఆవేశం కొంత తగ్గి స్థిమిత పడింది.

"ఎవరూ లేనివారు .. లేదా పట్టించుకునేవారు లేనివారు " అని మెల్లిగా చెప్పింది.


"సరిగ్గా చెప్పావు, అనాధలంటే ఎవరూలేనివారు. వారికున్న లోటు అదే! మీలాంటి వాళ్ళు ఈ పుట్టినరోజు వేడుకలు అని , పెళ్లి రోజు వేడుకలని,ఇంకా మరేదో మరేదో అని ఇక్కడకి బంధు మిత్ర సపరివారంగా వొచ్చి, ఈ పిల్లలకి ఏమి లేదో అదే మరీ మరీ చూపిస్తున్నారు.

వారిముందు బంధువులు, తాతలు, అమ్మ , నాన్న అలా అన్ని బంధాల్ని ఒక క్షణం చూపించి, తమతో

తీసుకెళ్ళి పోతున్నారు. ఈ మధ్యన ఇది మరీ ఎక్కువ అయ్యిందమ్మా! నేను నాలుగు రకాల వంటకాలతో పిల్లలు భోజనం చేస్తారనే చిన్న స్వార్థం తో సరే అన్నాను కానీ నాకు అంత ఇష్టం లేదు.


ఈ పిల్లలు మీలాంటి వాళ్ళు వెళ్ళాక ఎంత బాధ పడతారో తెలుసా ? ఇలాంటి వేడుక జరిగిన ప్రతీ సారి, పాత గాయాన్ని రేపుతున్నారు.." అని తన ప్రవర్తనకు కారణాలు చెప్పింది.


ధరణి మౌనం గా కాసేపు వుండి పోయింది.

తాను చేసిన పని ఆ పిల్లలకు ఎందుకు నచ్చలేదో , తాను చేసిన పొరపాటు ఏంటో అర్థం అయ్యింది. మెల్లిగా లేచి కార్ దాకా వొచ్చిన ధరణి, ఒక్క ఉదుటున మళ్ళీ లోపలకు వెళ్లి సరస్వతి గారితో, "అమ్మా! నాకు కొంచెం ఈ పిల్లల పుట్టినరోజు తేదీలు ఇస్తారా? వీలైతే నేను ఇక్కడ పిల్లల

పుట్టినరోజు నాడు వొచ్చి మాకు తోచినంతలో వాళ్ళ పుట్టినరోజు వేడుక చేస్తాం" అని చెప్పింది.


ఆ మాట వినగానే, సరస్వతి కళ్ళలో ఆనందం కనపడింది , "ఇక్కడ కొద్దిమందికే వాళ్ళ పుట్టిన రోజులు తెలుసు. మిగిలిన వాళ్ళకి వారు ఆశ్రమం లోకి వొచ్చిన రోజునే వాళ్ళ పుట్టినరోజు గా రాస్తాం. చాలా సంతోషం! మీరు ఆర్బాటంగా ఈ పిల్లల పుట్టిన రోజు వేడుక చెయ్యనక్కర్లేదు, కాస్త మీ సమయం వారికి కేటాయిస్తే చాలమ్మా! ఆ చిన్ని మనసులకు తగిలిన గాయాలకు కాస్త ఊరట.. " అని చెపుతూ ఆ లిస్ట్ ధరణి చేతిలోపెట్టింది.


ఆ లిస్ట్ పట్టుకొని, ఇంటికి వచ్చి తన డైరీ లో ఆ లిస్ట్

ఎక్కించుకొని, తరవాత వొచ్చే పుట్టినరోజు కోసం ఆత్రంగా ఎదురు చూడసాగింది ధరణి. మనల్ని ప్రేమించే వారు , శ్రద్ధ వహించే వారు లేకుండా జరిపిన పుట్టిన రోజులు అసంపూర్ణంగా ఉంటాయి. ఆలోటును, ఆ పిల్లలకు కొంతవరకైనా తగ్గించాలనేదే ధరణి ప్రయత్నం .


"మనకు మాత్రమే అంటే వికృతి, అందరకి పంచి పెడితే సంస్కృతి, అన్నమైనా …ఆనందమైనా " అన్న సింధుతాయి మాటలు గుర్తుకొచ్చాయి ధరణికి.

***

కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


ఇక్కడ క్లిక్ చేయండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.రచయిత పరిచయం: కిరణ్ జమ్మలమడక

కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్స్ చేసి, GE లో సీనియర్ మేనేజర్ గా, భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. కిరణ్ , "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వుంటారు. తన సంస్థ ద్వారానే కాకుండా పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకుసాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం మొదలుపెట్టారు, ప్రముఖ పత్రికల్లో ఆయన కథలు కొన్ని ప్రచురితమయ్యాయి ,తెలుగు వెలుగు 'కథా- విజయం 2019' పోటీలో భాగంగాఎన్నిక అయ్యిన "మిరప మొక్క " ప్రజాదరణ పొందినది. పదేళ్లలోపు పిల్లల కోసం రాసిన "యాత్ర", పదేళ్ల పైబడినపిల్లల కోసం రాసిన నవల "అతీతం" లను తానా - మంచిపుస్తకం 2021 లో ప్రచురించింది.

https://www.manatelugukathalu.com/profile/kiranj/profile


63 views2 comments
bottom of page