top of page

సాంకేతిక సాగరంలో సంతాప సంసారం

#SankethikaSagaramloSantapaSamsaram, #సాంకేతికసాగరంలోసంతాపసంసారం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Sankethika Sagaramlo Santapa Samsaram - New Telugu Story Written By Dr. Brinda M N

Published In manatelugukathalu.com On 26/05/2025

సాంకేతిక సాగరంలో సంతాప సంసారం - తెలుగు కథ

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఓ పేరుమోసిన సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో అంబులెన్స్ మోత మోగడంతో రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది హుటాహుటిన ప్రవేశద్వారం వద్దకు పరుగులు తీశారు. చమటలు పట్టిన శరీరంతో ఆయాసపడుతూ అంబులెన్స్‌ దిగిన తల్లిదండ్రులు స్ట్రెచర్‌పై "నొప్పి! నొప్పి!" అంటూ అల్లాడిపోతున్న యువతిని లోనికి తీసుకెళ్లారు. అత్యవసర గదిలోకి తీసుకెళ్లి వెంటనే ప్రాణాలు కాపాడారు. వేకువజామున యువతికి మెలకువ రావడంతో వైద్యులు వివరాలు అడిగారు. ఆ యువతి నుండి ఎటువంటి సమాధానాలు రాకపోవడంతో తల్లిదండ్రులను ప్రశ్నించారు. గత మూడు రోజులుగా ఎడతెరపిలేని జ్వరం, ఒళ్లునొప్పులు, భీకర తలనొప్పితో అల్లాడిపోతోందని, నార్మల్‌గా మాత్రలు వేసామని, సీరియస్‌గా ఉన్నందున తీసుకొచ్చామని తెలిపారు. "ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా?" అడిగారు వైద్యులు. "లేదండీ! ఇదే మొదటిసారి. ఆ... మొన్న మధ్య విపరీత తలనొప్పి అన్నది. రెండు రోజుల తర్వాత తగ్గిపోయింది," తల్లి జవాబు. "సరే, కొన్ని పరీక్షలు రాస్తాను. ఇవి చేయించండి. రిపోర్టులు రావడానికి మూడు రోజులు పడుతుంది. అమ్మాయిని అడ్మిట్ చేసుకుంటాం," అన్నారు వైద్యులు.


చిట్టా చూస్తే దాదాపు 30 పరీక్షలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క కౌంటర్, బిల్లు మొత్తం ఒక కౌంటర్‌లోనే కట్టాలి, కానీ పరీక్షలు వేరుగా చేసుకోవాలి. వార్డ్బాయిని అడిగితే, "అమ్మాయి అడ్మిట్ అయింది. మీరే వచ్చి తీసుకోమని అడగండి," అని వినమ్రంగా చెప్పాడు. "స్కానింగ్, ఎక్స్‌రేలకు అమ్మాయిని తీసుకురండి. మిగతావి మేమే వచ్చి తీసుకుంటాం," అన్నారు సిస్టర్లు.


మూడు రోజుల అనంతరం రిపోర్టులు పరిశీలించిన పెద్ద డాక్టర్‌కు నోటిమాట రాలేదు. 15 నిమిషాలు ఆయన చాంబర్లో మౌనం తాండవించింది. "ఒక్క అరగంట పాటు మీరు అమ్మాయి దగ్గర ఉండి మరల రండి. మీతో దీర్ఘ సంభాషణ జరపాలి. ఈలోపు ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తిచేసుకుని వస్తాను," అన్నారు కారుణ్య. "సరే... డాక్టర్ గారు!" అరగంట తర్వాత అనుకోకుండా అత్యవసర సమావేశానికి హాజరు కావాల్సి వచ్చింది కారుణ్యకు. వెంటనే సిస్టర్‌తో విషయాన్ని చెప్పి, "వచ్చిన తర్వాత కబురు పెడతాను. వారిని రమ్మని చెప్పండి."


సమావేశ అనంతరం తన పాత స్నేహితుడు, పేరొందిన ఫిజీషియన్ కేదార్ని కలిశాడు. గత జ్ఞాపకాలు, కుటుంబ వివరాలు ముచ్చటించిన తర్వాత కారుణ్య మౌనం కేదార్‌కి అర్థం అయింది. "ఏంటి కారుణ్య? ఏమైంది? ఇప్పటిదాకా గలగల పారే గోదావరిలా పలికిన నీ పదాల ప్రవాహానికి ఆనకట్ట ఏంటో?" "చెప్పాలా... వద్దా...?" అని ఆలోచిస్తూ, సమావేశానికి బయలుదేరే ముందు చూసిన రిపోర్ట్ వివరాలు కేదార్‌ ముందు ఉంచాడు కారుణ్య. ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, "చివరికి ఈ కేసు ఇలా విషమిస్తుంది అనుకోలేదు, కారుణ్య."


సనా, సాపేక్ష — ఒక్కగానొక గారాల పట్టి — సావర్ణి. చాలా చురుకైన అమ్మాయి. ఆటపాటలు, తెలివితేటలు, విద్యలో ఎప్పుడూ టాప్ ఫైవ్‌లో ఉండేది. ఎన్నో మెడల్స్ గెలుపొందింది. అంతకుమించి ఒద్దిక, ఓపిక, లక్ష్యసాధన, శ్రమించే తత్వం మెండు. తల్లిదండ్రులను ఒప్పించి ప్రైవేట్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చేరింది. ప్రథమ సంవత్సరంలో డిస్టింక్షన్, రెండవ సంవత్సరంలో యావరేజ్ మార్కులతో పాసయింది. ఇప్పుడు మూడవ సంవత్సరంలో ముందంత శ్రద్ధగా చదవట్లేదని రెండు నెలల క్రితం సాపేక్ష కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు. తల్లి బ్యాంకులో క్లర్క్, ఇతనేమో వ్యాపారవేత్త. ఇంతకుమించి ఇద్దరూ ఎప్పుడూ ఏదో బిజీగా ఉంటారు.

సావర్ణి బాగా చదువుకోడానికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చారు. కళాశాలకు బస్సులో వెళ్లివస్తే కూతురు అలసిపోతుందని శాశ్వతంగా ఒక క్యాబ్‌నే ఏర్పాటు చేశారు. జిమ్‌ సదుపాయం కూడా ఇంట్లోనే. మంచి పౌష్టికాహారం, సమయానుకూలంగా పళ్లరాసాలు, డ్రైఫ్రూట్స్ — ఇలా ఎన్నో ఎన్నెన్నో. పొద్దున్నే ముగ్గురు ఒకేసారి బయలుదేరుతారు — మొదట సావర్ణి, సనా, సాపేక్ష. ఇలా రెండు గంటల తేడాతో ఇల్లు చేరుకుంటారు.


ముందు పాఠ్యపుస్తకాలు బాగా చదివేది సావర్ణి. తర్వాత లాప్‌టాప్‌కి అతుక్కుపోయింది. తనకు ఒక గది స్టడీ రూమ్‌గా వేరే ఉండేది. చదువుకునే సమయంలో అక్కడే ఉండేది. తన పరికరాల స్థానం కూడా అదే. రెండు గంటలకు ఒకసారి సనా గానీ, సాపేక్ష గానీ — "ఏం చేస్తున్నావమ్మా?" అని ఆరా తీస్తే, "ప్రాజెక్ట్ నాన్నా... సెమినార్ అమ్మ... అసైన్‌మెంట్ నాన్న... కంప్యూటర్లో మెలకువలు, గ్రూప్ డిస్కషన్ అమ్మ..." — ఎప్పుడు ఇలాంటి జవాబులే వచ్చేవి.


పేరంటానికి పంపమంటే సనా, "మా అమ్మాయి మీ పిల్లల్లాగా అక్కడ ఇక్కడ తిరుగుతూ సమయం వృథా చేయదు, బుద్ధిగా చదువుకుంటుంది," అని కూతురు గొప్పలు చెప్పేది. సనా వారి వదిన, "చూడమ్మా! సావర్ణినీ గదిలో బంధించకుండా అప్పుడప్పుడు పెళ్లిళ్లు, గుళ్ళు, గోపురాలు, విహారయాత్రలు, విజ్ఞానయాత్రలకు తీసుకెళ్లండి లేదా పంపండి. ఎప్పుడు అలా మూల్లో కూర్చోపెట్టడం మంచిది కాదు," అంటే — "ఏంటి వదిన! అందరూ నా కూతురిని ఆడిపోసుకుంటారు — వీధిలో అమ్మలక్కలు, బంధువులు, ఇప్పుడు నువ్వు కూడా," అంటూ వాపోయేది.


ఫోన్ మోగడంతో కేదార్ తక్షణమే వెళ్లాలని, "కారుణ్య, ప్రొసీడ్ దట్ కేస్," అని చెప్పి వెళ్లిపోయాడు. సావర్ణి ఆలోచనలతో వైద్యశాలకు చేరుకున్న కారుణ్య మరొకసారి రిపోర్టులు పరికించి సాపేక్షకు కబురు పంపాడు. "సార్! లోనికి రావచ్చా?" "రండి, కూర్చోండి. మీ ఆవిడ గారు రాలేదా?" "అమ్మాయి దగ్గరే ఉండిపోయింది డాక్టర్ గారు." "సిస్టర్! అమ్మాయికి అలాట్‌ చేసిన సిస్టర్‌ నుంచి వారిని పంపండి." "సరే, సార్." సనా కూడా వచ్చింది. "ఏం జరిగిందో చెప్పండి?" అడిగారు కారుణ్య.


జ్వరం రావడానికి ముందు అమ్మాయి చెప్పిన విషయాలు విని విస్తుపోయాడు కారుణ్య. సావర్ణి బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక అబ్బాయితో పరిచయం అయింది. అది రోజువారి అలవాటుగా చాట్ రూపంలో సాగేది. ఇరువురు పర్సనల్ విషయాలు కూడా తెలుసుకున్నారు. లాప్‌టాప్‌లో నిత్యం జరిగే తంతు ఇదే. పెద్దలు వెళ్లినప్పుడు మాత్రం సెమినార్, ప్రాజెక్ట్ అంటూ డిస్‌ప్లే పెట్టేది. ఈ విషయం తెలుసుకోవడంలో విఫలమయ్యారు తల్లిదండ్రులు.


అబ్బాయి మాటలకు పూర్తిగా పడిపోయింది సావర్ణి. పదిహేను రోజుల క్రితం పెద్దలిద్దరూ ఒకరోజు పెళ్లికి వెళ్లారు. తనను కూడా రమ్మంటే "క్లాస్ టెస్ట్ ఉంది," అని రానంది. స్వేచ్ఛా వాయువును పూర్తిగా పీల్చుకున్న సావర్ణి, "ఒంటరిగా ఉన్నానని... నీతో రోజంతా మాట్లాడతానని," సందేశం పంపింది. అబ్బాయి ఆనందం పైశాచికత్వంగా దాపురించింది. "నిన్ను పూర్తిగా చూడాలంటూ, చూపించమంటూ," చిన్న చిన్న చిలిపి పదాలతో వీడియో కాల్‌లో మాట్లాడి ఆకర్షించాడు. "ఇది తప్పు కదా?" అంటున్నా — "ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం కదా! మరి ఈ అందాలరాశిని చూడాలని ఉండదా? నువ్వు నన్ను కూడా చూడొచ్చు. అప్పుడు మన ప్రేమ ఇంకా పెరుగుతుంది. ప్లీజ్... ప్లీజ్..." అంటూ బలవంతం చేయడంతో సావర్ణి ఒప్పుకుంది. అంతా అయిపోయాక, "నాకు అర్జెంటుగా ఫోన్ వస్తుంది, మళ్లీ చేస్తాను," అంటూ కాల్ కట్ చేశాడు. వయసు వేడి చల్లబడింది. నిద్రలోకి జారుకుంది సావర్ణి.

తెలతెలవారుతున్న తరుణంలో కాలింగ్ బెల్ మోతతో మెలకువ వచ్చింది. తల్లిదండ్రులు వచ్చారు. కూతురు ముఖం ప్రసన్నంగా ఉండడం చూసి బాగా నిద్రపోయిందని అనుకున్నారు. సావర్ణి యథావిధిగా కళాశాలకు వెళ్ళింది. వారం రోజులైనా అబ్బాయి నుండి సందేశాలు రాలేదు. చాట్‌లో సందేశాలు పంపి పంపి అలసిపోయింది.


ఒకరోజు తన స్నేహితురాలు ఒక ఫోటో చూపించి, "సావర్ణి! ఇది నువ్వే కదా?" అంటే — "అవును... నీకు ఎలా వచ్చింది?" "ఈ ఫోటోలు మొత్తం వైరల్ అయ్యి తిరుగుతున్నాయి తెలుసా...?" అనడంతో షాక్‌కి గురైంది. ఇరుగుపొరుగువారు వచ్చి, "ఏమ్మా! మా కూతుళ్లు పేరంటాలకో సినిమాలకో మాత్రమే పోతారు, నీ కూతురిలా గదిలో కూర్చునే ఊరూరా తిరగరు. నీ... జిమ్మడ!" అంటూ దుమ్ము పోసేసరికి సనకు అర్థం కాలేదు. కూతురు ఇంటికి వచ్చి ఏడుస్తూ విషయం చెప్పడంతో, తల్లిదండ్రులు లాప్‌టాప్ చెక్ చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం? షాక్ వలన సావర్ణికి తీవ్రమైన జ్వరం, తీవ్ర తలనొప్పి రావడంతో తీసుకొచ్చాము. కారుణ్య మంద్రస్వరంతో, "దీనివలన రక్తప్రసరణ ఆగిపోయి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది."


ఈ విషయాన్ని జీర్ణించుకోలేక సనా పిచ్చిదై మౌనం ఆవహించింది. ఇంట్లో తల్లి కూతుళ్లకు ఇద్దరికీ సేవ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు సాపేక్ష. సాంకేతిక సాగరంలో సంతాప సంసారాన్ని సారంలేని సాంబ్రాణిలా సాగదీస్తున్నాడు.


నీతి: సాంకేతికతను అవసరమైతే ఉపయోగించండి. మితిమీరి, అతిగా వాడితే వేలకువేల జీవితాలు శృతి మీరుతున్నాయి. సంతాప సంసారాలు కోకొల్లలు. "జై తెలుగు తల్లి! జై భరతమాత!"


 సమాప్తం


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


Comments


bottom of page