top of page

సన్యాసం


'Sanyasam' New Telugu Story(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

యాగంటి గారి ప్రవచనలకి వెళ్తానని బయలుదేరుతున్న భర్త సుబ్బారావు వంక ఆశ్చర్యంగా చూసి, “మీకు భక్తి ఎప్పటినుంచి వచ్చింది?” అంది రమణి.


“నాకు ఎన్నో ఏళ్ళ నుంచి గరుడపురాణం లో ఏముంటుంది, అందులో చెప్పినవి జరుగుతాయా అని అనుమానం. యిప్పుడు యాగంటి గారు ఎన్టీఆర్ స్టేడియం లో గరుడపురాణం చెపుతున్నారు. యిదే ఛాన్స్.. అందులో రహస్యాలు తెలుసుకుని జాగ్రత్తగా వుండటానికి” అన్నాడు సుబ్బారావు.


“నా పుణ్యం పుచ్చింది కాబోలో.. మీకు యింత మంచి బుద్ది పుట్టింది, జాగ్రత్తగా వెళ్లి రండి” అంది రమణి.


రాత్రి పది అయినా భర్త యింటికి రాకపోవడం తో కంగారుగా బయటకు వచ్చి రోడ్డు వైపు చూస్తో నుంచుంది. కార్లు వెళుతున్నాయి, వస్తున్నాయి కానీ మా కారు జాడ కనిపించలేదు. ఫోన్ తీసుకొని వెళ్తే డిస్టర్బ్ చేస్తారు అని ఫోన్ యింట్లో వదిలేసారు. ఏం మనిషో ఏమిటో అనుకుంటూ కారు లోపలికి రావడానికి గేటు తీసి లోపలికి వచ్చింది.


యింకో అరగంట తరువాత కారు హారన్ వినిపించడం తో తలుపు తీసి, “అమ్మయ్య, వచ్చారా? ఎందుకు యింత ఆలస్యం అయింది” అంది.


కారులోనుంచి సంచి తీసి భార్య చేతికి యిచ్చి, “యిదిగో! రేపు ఉదయం మంచి టైం చూసి, సన్యాసం తీసుకుంటాను” అన్నాడు సుబ్బారావు.


“సన్యాసం తీసుకునే వాళ్ళు ఈ సంచి నిండా కూరలు ఎందుకు తెచ్చారు?” అంది రమణి.


“నీ కోసం, నాలుగు రోజులు సరిపోతాయి, తరువాత నువ్వే తెచ్చుకోగలవు” అన్నాడు.


“ఒక్క రోజు ప్రవచనం వినగానే, సన్యాసం తీసుకోవాలి అనిపించిందా, ముందు చేతులు కడుక్కుని వచ్చి అన్నం తినండి, మీకిష్టమని కంది పచ్చడి, పచ్చిపులుసు చేసాను” అంది రమణి.


“రేపు ఉదయం వరకు నీకిష్టమైనవి ఎన్నీ అయినా చేసి పెట్టు, తింటాను” అన్నాడు కంచం దగ్గరికి లాకుంటూ.


ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని తను వాడుతున్న మందులు అన్నీ తీసి సర్దుకుంటున్న భర్తని చూసి, “ఏమిటి ప్రొద్దున్నే మందులు చూసుకుంటున్నారు?” అంది రమణి.


“సన్యసించినంత మాత్రనా షుగర్ కి, బీపీ కి మందులు వాడకపోతే, తపస్సు లేకుండానే స్వర్గానికి పోతాను, త్వరగా వెళ్లి సన్యాసి డ్రెస్ కొనుక్కోవాలి” అన్నాడు సుబ్బారావు.


“అయితే నిజంగానే హిమాలయాలకు వెళ్తారా” అంది కాఫీ కప్ తీసుకొని వచ్చి.

“సన్యాసులు అబద్దం చెప్పకూడదు, అది మొదటి నియమం” అన్నాడు.


“అయితే వేడి వేడి కాఫీ వద్దా” అంది రమణి.


“వద్దు, మానేసాను” అన్నాడు సుబ్బారావు.


“సరేలెండి, కలిపినందుకు పారపోయలేము కదా, నేను తాగుతాను లెండి” అని సుబ్బారావు కి ఎదురుగా కుర్చీలో కూర్చుంది.


“పోనీలే, కాఫీ బిక్ష స్వీకరిస్తాను. యిటు యివ్వు, యిహనుంచి బిక్ష మీదే బ్రతకాలి మా సన్యాసులు” అని భార్య చేతిలోని కాఫీ కప్ అందుకున్నాడు.


“బాగానే వుంది మీ సన్యాసం! కాఫీతో మొదలైంది అన్నమాట” అని నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది రమణి.


“యిదిగో.. తలుపు దగ్గరగా వేసుకో. నేను బజార్ వెళ్లి సన్యాసానికి కావలిసిన వస్తువులు కొనుక్కొని వస్తా” అని వెళ్తున్న సుబ్బారావు ని, “వచ్చేటప్పుడు మన యిద్దరికి రెండు ప్లేట్స్ వడ తీసుకుని రండి” అంటూ “అదేమిటి? చెప్పులు లేకుండా వెళ్తున్నారు” అంది.


“చెప్పులు వేసుకోకూడదు” అన్నాడు సుబ్బారావు.


“మీ యిష్టం, అసలే మీకు షుగర్. ఏ మేకు అయినా గుచ్చుకుంటే, యిహ చెప్పులు వేసుకోవడానికి కాలు కూడా వుండదు” అని తలుపు ధడేలున వేసుకొని వెళ్ళిపోయింది.


ఎందుకైనా మంచిది అని మద్రాస్ లో వున్న కొడుక్కి ఫోన్ చేసి, “మీ నాన్న సన్యాసం తీసుకుంటాను అని పట్టు పట్టి, డ్రెస్, కావలిసిన వస్తువులు కొనుకోవాడానికి బజార్ వెళ్లారు. నాకు ఎందుకో అనుమానం గా వుంది. నిజంగానే యింటినుంచి వెళ్ళిపోతారేమో” అని అంది రమణి.


కొడుకు ఆఫీసులో వున్న విషయం కూడా మర్చిపోయి గట్టిగా నవ్వుతూ, “భలేదానివి అమ్మా, యింట్లో నాన్నని నూనె వస్తువులు తిననీయడం లేదని, పూరీ తినడానికి హోటల్ కి వెళ్లి వుంటారు, వచ్చేస్తారు. కంగారు పడకు” అన్నాడు.


“వస్తే మంచిదే, ఏంటో ఈ గోల” అని ఫోన్ కట్ చేసి పూజ రూంలో కి వెళ్లి కూర్చుంది.


క్రింద కారు చప్పుడు విని, త్వరగా పూజగది లోనుంచి వచ్చింది రమణి.


“యిదిగో.. సన్యాసానికి కావలిసినవి అన్నీ దొరికాయి. ఋషులు చేతికింద పెట్టుకుంటారు, Y లా వుంటుంది.. అది ఒక్కటి దొరకలేదు” అన్నాడు.

“బాగా నీరసంగా వున్నారు. టిఫిన్ తింటారా” అంది రమణి భర్తతో.


“నీకు తమాషాగా వుందా, ఆ ఇంద్రుడు ఋషుల తపస్సు చెడకొట్టడానికి దేవతలని పంపినట్టు, నువ్వు నా తపస్సు నీ వంటలతో చెడకొడుతున్నావు” అన్నాడు.


“అబ్బో మీరు, మీ తపస్సు, చెడగొట్టడం, మరి పేరు ఏమిటి పెట్టుకున్నారు” అంది రమణి.


“శంకరానంద స్వామి అని పెట్టుకున్నా, ఎలా వుంది” అంటూ వంటగదిలో నుంచి కవ్వం తీసుకుని వచ్చి “యిది చూడు..ఋషులు చేతికింద పెట్టుకునే లాగానే వుంది. యిది నేను తీసుకుంటా” అన్నాడు సుబ్బారావు.


“సరే తీసుకోండి. కావాలంటే కుక్కర్, నాలుగైదు గిన్నెలు, దోస పెనం కూడా తీసుకుని వెళ్ళాండి శంకరానంద స్వామి” అంది నవ్వు ఆపుకుంటూ.


“నవ్వుతూ వుండు. నేను ఈ రోజు యింటినుంచి వెళ్ళిపోయినప్పుడు, యిలాగే నవ్వుతు ఉండాలి” అన్నాడు.


‘బాబోయ్ ఇదేమిటి.. నిజంగానే బయలుదేరేటట్లు వున్నారు’ అనుకుని, “నాకు ఆకలి వేస్తోంది.నేను టిఫిన్ తినేసి, రాత్రికి మీరు హిమమలయాలకు బయలుదేరిన తరువాత, నాలుగు వంకాయలు వేపుడు వేయించుకుని అన్నం తినేస్తా” అంటూ,ప్లేటులో నాలుగు మైసూర్ బజ్జీలు పెట్టుకుని సోఫాలో కూర్చొని, సాంబార్ లో నంచుకుంటో తినటం మొదలు పెట్టింది రమణి.


అది చూసిన సుబ్బారావు, “రమణీ! నాకు దేముడు కనిపించగానే, నిన్ను నరకంలో పడేయమని కోరుకుంటాను. లేకపోతే నా కళ్ళ ముందు ప్లేట్ నిండా బజ్జీలు పెట్టుకుని తింటావా” అన్నాడు కోపంగా.


“సరే, ఒకసారి యిటు వచ్చి నా పక్కన కూర్చోండి” అంది.


“ఎందుకు?” అన్నాడు సుబ్బారావు అనుమానంగా.


“పరవాలేదు, మీరు యింకా సన్నాసి.. అదే సన్యాసి కాలేదు, రండి” అంది భర్తని.


‘సరే’ అని వచ్చి సోఫాలో కొద్దిగా దూరంగా కూర్చొని, ‘చెప్పు’ అన్నాడు.


ఒక బజ్జి ముక్కని సాంబార్ లో ముంచి, భర్తని నోరు తెరవమని, బజ్జి నోట్లోకి తోసి, “చూడండి, సడన్ గా మీరు ఇల్లు విడిచి వెళ్ళిపోతే, మీ అన్నదమ్ములు, మా వైపు చుట్టాలు ఏమనుకుంటారు? అప్పులు చేసి పారిపోయాడు అనుకుంటారు. యింత బ్రతుకు బ్రతికి యింటి వెనుక చచ్చినట్టు, మీకేమి ఖర్మ? అందుకే యింకో రెండు రోజులలో ఆదివారం వస్తోంది. ఆరోజు అందరికి భోజనాలు పెడదాం. మీరు అందరికి మెసేజ్ పెట్టి, సన్యాసం తీసుకుంటున్న సందర్బంగా అందరిని లంచ్ కి రమ్మని పిలవండి.


ఆరోజు మీరు, మీ కోరిక వాళ్ళకి ఉపదేశించి, వీలుంటే ఆ యాగంటి గారి మాటలు నాలుగు అందరికి చెప్పండి. ఆతరువాత వాళ్ళు మిమ్మల్ని హిమాలయాలకు సాగనంపుతారు” అంది రమణి.


“అవును.. మన చుట్టాలు అటువంటి వారే. నేను పారిపోయాను అని చాటింపు వేస్తారు. నీకు అవమానం కలగడం నాకు యిష్టం లేదు. నువ్వు చెప్పినట్టే అందరికి మెసేజ్ పెట్టి ఆదివారం లంచ్ కి రమ్మంటా” అన్నాడు.


“అయితే ఈ రెండు రోజులు హాయిగా మీకు కావలిసినవి వండి పెడతాను. మీ కాషాయపు బట్టలు, హిమాలయాలో మీకు చలి లేకుండా వుండటానికి వూలు బట్టలు కూడా సర్ది యిస్తాను” అంది.


“సరే, భక్తుల మాట మన్నించడం సన్యాసుల కర్తవ్యం. అలాగే కానీ! అయితే ఆదివారం సాయంత్రం యిహ నువ్వు నన్ను ఆపకూడదు” అన్నాడు సుబ్బారావు భార్య ప్లేట్ లోంచి బజ్జి తీసుకుంటూ.


అందరికి తను సన్యసిస్తున్న సందర్బంగా 26 వ తేది ఆదివారం ఉదయం లంచ్ కి వచ్చి తన హిమాలయాల ప్రయాణం కి సహకరించమని మెసేజెస్ పంపించాడు.

బాగా చనువున్నవాళ్లు, ‘నీకు యిదేమి బుద్ది, యిప్పుడు సన్యాసం తీసుకుని ఏమి సాధిస్తావు’ అన్నారు. కొంతమంది హాస్యం కోసం ఆలా రాసాడేమో అనుకున్నారు.


మొత్తానికి అరవై మంది వరకు ఆదివారం ఉదయం పదిగంటల కల్లా వచ్చేసారు. ఉదయమే తలంటుకుని, కాషాయ చొక్కా, పంచె కట్టుకుని, భగవద్గీత పుస్తకం చేతిలో పెట్టుకుని కూర్చున్నాడు సుబ్బారావు.


“ఏమిటీ.. అప్పుడే సన్యాసం తీసేసుకున్నాడా? మేము వచ్చే దాకా వుండచ్చుగా” అన్నాడు సుబ్బారావు పెద్దన్నయ్య.


“లేదు. ఈ డ్రెస్ లో ఎలా వుంటామో అని వేసుకున్నారు. తండ్రి తరువాత తండ్రి అన్నగారు అంటారు, మీరు దీవించి ఆయనకు సన్యాసం యివ్వాలిటా” అంది రమణి.


సరే తప్పుతుందా అని తనతో పాటు తెచ్చిన పూలదండ సుబ్బారావు మెడలో వేసాడు. దానితో వచ్చిన చుట్టాలు అందరు పూలదండలతో నింపేసారు.


ఈ లోపు కేటరింగ్ అతను ఆటోలో నుంచి అన్ని వంటలు నింపి టేబుల్ మీద సద్దేశాడు.

ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా లైన్ కట్టేసారు ప్లేట్స్ పట్టుకుని.


ప్లేట్ నిండా వడ్డించుకుని అందరు సుబ్బారావు ఉన్నగదిలోకి వచ్చి కూర్చున్నారు.


“అబ్బా.. పచ్చిమిరపకాయ బజ్జి అదిరింది’ అన్నాడు సుబ్బారావు అన్నగారు.


“అన్నం లో నంచుకుని తిను, బాగుంటుంది” అని యింకో తమ్ముడు అన్నాడు.


“పెద్ద బావగారు.. ఈ బిర్యానీ వేసుకోండి. బాగా వేడి వేడి గా వుంది” అన్నాడు సుబ్బారావు బావమరిది, సుబ్బారావు అన్నగారితో.


“అదేమిటే.. నీకు వంకాయ కారం కూర యిష్టమని ఆర్డర్ యిస్తే వేసుకోలేదే” అంటూ రమణి చివచివ లాడుతున్న కూర సుబ్బారావు కళ్ళముందు నుంచి తీసుకుని వెళ్లి చెల్లెలు కి వడ్డించింది.


“బాబూ! నాలుగు వేడి పూరీలు, కూర తీసుకుని రా నాయన, లేచి రాలేను” అంటూ సుబ్బారావు వియ్యంకుడు అరిచాడు.


సుబ్బారావు కోపంగా రమణి వంక చూసాడు. ‘ఏమిటి వీళ్ళకి నేను వెళ్ళపోతున్నాను అనే ధ్యాస కూడా లేకుండా గిన్నెలు మీద ఎగబడి తినటమే కాక వర్ణించడం ఒకటి’ అనుకుని సుబ్బారావు మెల్లగా లేచి కేటరింగ్ అతని దగ్గరికి వచ్చి, “మామిడికాయలు దొరుకుతోవుంటే, టమోటా పప్పు వేసావే” అన్నాడు.

అంతలో ఒక పిల్లాడు, “అంకుల్! మీరు సన్యాసి, వీటిని చూడకూడదు” అన్నాడు.


సుబ్బారావు అక్కడే వున్న కుర్చీలో కూర్చొని తులసి మాల తిప్పుతూ అందరిని చూస్తున్నాడు.


“వంకాయ కూరా, బజ్జి అయిపోతున్నాయి” అన్నాడు కేటరింగ్ కుర్రాడు.


ఆ మాట విని సుబ్బారావు ఉలిక్కిపడి, ‘అసలు యిప్పుడు ఈ సన్యాసం ఎవరి కోసం.. ప్రవచనాలు చెప్పిన యాగంటి గారే అన్ని వంటలు వేసుకుని తింటారు. ఆయన సన్యాసం తీసుకోలేదు. నేను ఎందుకు యిప్పుడే కంగారు పడటం? అంతగా అయితే తన బావమరిది జూన్ లో రిటైర్ అవుతున్నాడు, అతనికి కూడా సన్యాసం ఇప్పించి యిద్దరం ఒకరికొకరు తోడుగా హిమాలయాలకు వెళ్తాము’ అనుకుని లేచి, ఒక ప్లేట్ తీసుకుని రెండు బజ్జీలు, రెండు లడ్డులు వేసుకొని, కేటరర్ తో “వంకాయ కూర తీసి పక్కన పెట్టు, నేను వేసుకోవాలి” అని చెప్పి ప్లేట్ తో హాల్ లోకి వచ్చాడు.


బజ్జి కోర్కుంటో వచ్చిన సుబ్బారావు ని చూసి, ‘అమ్మయ్య.. తన ఉపాయం పనిచేసింది’ అనుకుని, భర్త ప్లేట్ లో గరిటెడు వంకాయ కూర వడ్డించింది.


***శుభం***

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

52 views0 comments

Comments


bottom of page