top of page
Original_edited.jpg

సరికొత్త నడక

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link


ree

'Sarikottha Nadaka' New Telugu Story


Written By Mohammad Afsara Valisha


రచన: మొహమ్మద్ అఫ్సర వలీషా



అందమైన ఆ ఇంటి ముందు మరింత అందమైన ముగ్గును చూసి ముకుంద రావు అన్నాడు "ఎవరో కొత్త వాళ్ళు అద్దెకు దిగారటుగుంది" అని.

'అవునవు'నని వంత పాడారు మన్మధరావు , రామ్మూర్తి, రమణా రావు.


పార్క్ లో వాకింగ్ చేస్తుంటే కొత్త ఆకారం ఎవరిదా అని నలుగురికీ కాస్త తెలుసు కోవాలనే కుతూహలంతో అతని దగ్గరకు వెళ్ళబోతుండగా వీళ్ళ కంటే ముందు అతనే ముందుకు వచ్చి "నా పేరు శ్రీపతి. నిన్ననే కొత్తగా దిగాము. పార్క్ దగ్గరలో మీరూ నా వయసు వారేనని చూడగానే సంతోషం కలిగి, పరిచయం చేసుకోవాలనిపించింది. మాది విజయవాడ. పిల్లలు అమెరికాలో ఉన్నారు." అంటూ ఆగాడు.


"చాలా సంతోషం మీ పరిచయం శ్రీపతి గారు, మేము నలుగురం స్నేహితులం. నా పేరు రామ్మూర్తి" అని మిగతా ముగ్గురిని పరిచయం చేశాడు.

"మేము నలుగురం ప్రాణ స్నేహితులం. నలుగురి ఉద్యోగాలు వేరైనా నలుగురం రిటైర్ అయ్యాము. ప్రస్తుతం పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి. కాస్తంత బాధ్యతలు తీరి ఏదో ఇలా పార్క్ లో కలుసుకుని వాకింగ్ చేస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాము.

సరే సాయంత్రం మళ్ళీ పార్క్ లో కలుద్దాం" అన్నారు నలుగురూ.


"చూస్తాను వీలైతే" అన్నాడు శ్రీపతి.


దారిలో ఇంటికి కావలసిన కూరగాయలు కొన్నాడు శ్రీపతి. అన్నిటికీ దగ్గరగా ఉంది ఇల్లు . పార్క్, బస్ స్టాప్, కూరగాయలు, పళ్ళు, పూలు, కిరాణా, హాస్పిటల్.. చాలు.. ఈ జన్మకు ఇది చాలు.. అనుకున్నాడు. సీతకు ఎంత ఇష్టమో ఇలా ఉంటే అనుకున్నాడు తృప్తిగా.


సాయంత్రం వాకింగ్ తరువాత పార్క్ బయటకు వచ్చిన నలుగురికీ మల్లెపూల బండి దగ్గర పూలు కొంటూ కనబడ్డాడు శ్రీపతి. నలుగురూ నవ్వు కున్నారు ముసిముసిగా 'గురుడు మహా రసికుడే' ననుకుంటూ.

శ్రీపతి వీళ్ళను చూసి "మా ఆవిడ సీతకు మల్లెపూవులంటే చాలా ఇష్టం. అందుకే సీజన్ లో ఏ రోజూ మిస్ చేయను" అంటూ "వస్తాను" అన్నాడు వెళ్తూ వెళ్తూ.


రోజూ వాకింగ్ కు ఐదుగురు కలిసి వెళ్తారు. వాకింగ్ అయ్యాక వచ్చేటప్పుడు దారిలో ఏదైనా భార్య కు ఇష్టమైనది కనబడితే భార్య కిష్టమని ప్రత్యేకంగా తనకోసం కొని తీసుకుని వెళ్ళటం వాళ్ళ కు కాస్తంత ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసే ఆమె ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలని మనసు లాగినా మర్యాద కాదని ఊరుకున్నారు.


ఓ రోజు ఆ సమయం రానే వచ్చింది. వాళ్ళు వేసే ప్రశ్నలకు శ్రీపతి టీకు రమ్మని ఇంటికి ఆహ్వానించాడు. ఎగిరి గంతేశారు నలుగురు.


'ఇన్నాళ్ళకి చెల్లెమ్మను చూపించాలనే కోరిక కలిగినందుకు చాలా సంతోషం శ్రీపతీ' అన్నారు నలుగురూ.


ఆ మరునాడు నలుగురూ సాయంత్రం వాకింగ్ అయిపోయాక శ్రీపతి ఇంటికి వెళదామనుకున్నారు. వెళ్ళేటప్పుడు దారిలో ఆగి పూలు కొన్నాడు శ్రీపతి. అతని ఆసక్తికి నవ్వుకున్నారు నలుగురూ.


"చెల్లెమ్మ కి స్వీటా.. హాటా.. ఏదిష్టం?" అన్నారు.


"స్వీటే బాగా ఇష్టం " అన్నాడు శ్రీపతి నవ్వుతూ.


అతనితో కలిసి నలుగురూ ఇంటికి వెళ్ళారు.


చక్కగా ఇల్లు సర్దేసి ఉంది. ఇల్లంతా చక్కని ధూప దీప సాంబ్రాణి తో ఘుమఘుమ లాడుతూ ఉంది..


శ్రీపతి వాళ్ళను కూర్చోబెట్టి లోనికి వెళ్లాడు మల్లెపూలు తీసుకుని. కాసేపటికి వంటగదిలో ఏదో పడిపోయిన చప్పుడు అయింది. శ్రీపతి నాలుగు ప్లేట్ లలో స్వీట్, హాట్ తీసుకుని వచ్చాడు.


"అయ్యో మీరు తీసుకుని వచ్చారేమిటి" అన్నారు నలుగురూ.


"మీ చెల్లెమ్మకు కాస్త విశ్రాంతి కావాలట. అందుకే నేనే తెచ్చేశాను" అన్నాడు నవ్వుతూ.


"మీ ఇద్దరి అవగాహన, చాలా అభినందనీయం" అన్నారు నలుగురూ.


"ఇక వెళతాం" అన్నారు లేస్తూ .


నలుగురికీ సీత ఎలాగోలా కాస్త కనబడినా బాగుండేది అనిపించింది, వాళ్ళ అనోన్యతకు ముచ్చటేసి.


లోపల ప్లేట్లు సర్దుతున్న శ్రీపతికి వెళ్ళొస్తామని చెప్పడానికి లేచి లోపలి కెళ్ళారు . వంట గది చూసి దిగ్భ్రాంతి చెంది నోటమాట రాక అలా ఉండి పోయారు నలుగురూ.


సీత నిలువెత్తు ఫోటోకు మల్లెపూవు దండ జారిపోతే సర్దుతున్నాడు శ్రీపతి.


"శ్రీపతీ.. ఏమిటిది?" అని అన్నారు నలుగురూ బాధ మిళితమైన కంఠంతో.


అప్పటిదాకా 'అండి' అన్న ఆ గొంతులు దగ్గిరతనం వాటంతట అవే ఆపాదించుకున్నాయి.


అప్పటిదాకా లేని సంతోషాన్ని నటిస్తున్న ఆ కళ్ళు, నటన తెర విడివడగానే తెరలు దాటిన కన్నీటి నదికి ఆనకట్ట కట్టడం కరువయ్యింది.


నలుగురూ అనునయంగా చుట్టూ చేరి శ్రీపతి భుజం మీద చేయి వేశారు.


"ఎలా జరిగింది?" అన్నారు.


గొంతు పెగుల్చుకుని శ్రీపతి "మా ఇద్దరిదీ ప్రేమ వివాహం , ఇంట్లో ఒప్పుకోలేదు. బయటికొచ్చి పెళ్లి చేసుకున్నాము. ఇద్దరు పిల్లలు పుట్టాక తనకి క్యాన్సర్ అని తెలిసింది. ఈ జీవితం చీకటై పోయినట్లైంది నాకు. జీవఛ్ఛంలా బ్రతకాలని లేకపోయినా పిల్లల గురించి నా దేహానికి కొత్త ఊపిరి పోసుకుని తన జ్ఞాపకాల పుటలను తెరుస్తూ మూస్తూ కాలం గడువు తున్నాను. పిల్లలు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోమన్నారు. నా సీతే నా లోకం. ఆ స్థానం మరెవ్వరికీ ఇవ్వాలనుకోలేదు."అంటుండగా..


అంతలో తలుపు చప్పుడైంది. ఓ పది మంది పిల్లలు వచ్చారు. గబగబా కళ్ళు తుడుచుకుని వంటగదిలో స్నేహితులు తెచ్చిన స్వీట్స్, పళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ కిచ్చాడు, పక్కన పెట్టిన నవ్వుల తెరను మళ్ళీ ముఖంపై తగిలించుకుని.


ఆడవాళ్ళు ఏడవటం తెలుసు, కానీ మగవాళ్ళు మరీ ఇంతలా అదీ భార్య గురించి ఏడవటం వీళ్ళు నలుగురికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే అందులో మన్మధరావు ముందు నుండి స్త్రీ లోలుడు. ఆ అలవాటు పెళ్లి అయ్యాక కూడా కొనసాగింది గానీ భార్య మనసు ఎంత గాయపడిందీ గ్రహించలేదు. ముకుంద రావు భార్య అందగత్తె. అనుమానంతో ఎప్పుడూ సాధించడం అతని అలవాటు. రామ్మూర్తి కి తను చెప్పిందే వేదం . పల్లెత్తు మాట భార్య ఎదురు చెప్పకూడదు. ఎంత బాధ ఉన్నా లోలోపల దిగమింగుకోవలసిందే. ఇక రమణమూర్తి కట్నం బాగా తక్కువ ఇచ్చిన పేదింటి అమ్మాయని, భార్య అంటే చులకన. కోడళ్ళ ముందే తిట్టేస్తుంటాడు. తీరని మనోవ్యధకు గురవు తుంటుంది ఆమె.


నలుగురికీ తమ భార్యలు గుర్తుకు వచ్చారు. చని పోయిన భార్యను ప్రేమించే అతని సంస్కారం ముందు తామెంతో చిన్న బోయి భూమి అట్టడుగుకు పాతుకు పోయినట్లనిపించి సిగ్గుతో కుంచించుకు పోయారు. భర్త లేకపోతే భార్య బ్రతక గలదు. కష్టపడి సంపాదించి పిల్లల్ని పెంచగలదు, చదివించ గలదు. కానీ భార్యలు లేకుండా.. ఊహించుకుంటేనే ఆ బ్రతుకు భారమనిపించింది శ్రీపతిని చూస్తే.


తాము చాలా తప్పు చేస్తున్నా మనే అపరాధ భావం వాళ్ళల్లో అనిపించగానే శ్రీపతికి వీడ్కోలు పలికి భార్యలను క్షమించమని అడగటానికి బయలుదేరారు సరికొత్త నడకతో ......

********సమాప్తం *********

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


ree

రచయిత్రి పరిచయం:

మొహమ్మద్ అఫ్సర వలీషా

ద్వారపూడి (తూ.గో. జి)


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page