top of page

సర్వ ధర్మాన్ పరిత్యజ్య


'Sarva Dharman Parityajya' New Telugu Story

Written By Lavanya Vinjamuri

'సర్వ ధర్మాన్ పరిత్యజ్య' తెలుగు కథ

రచన: లావణ్య వింజమూరి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సంజయ "


భగవద్గీత లోని శ్లోకాన్ని వల్లె వేస్తున్నారు పరంధామయ్య గారు. ప్రతిరోజూ సాయంత్రం గీతా పారాయణం చేయడం ఆయనకి ఎంతో ఇష్టమూ, అలవాటూ కూడా. రోజు మొత్తములో ఆయనకి నచ్చేది ఈ గీతా శ్లోకాలు చదివే సమయమే.


ఒక్కగానొక్క కొడుకు మురళి చదువు పూర్తయి, ఉద్యోగం వచ్చి పట్నంలో స్థిరపడ్డాక, మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కోడలు గంగ చాలా మంచి పిల్ల. పాపం తల్లీ తండ్రీ లేరు. మేనత్త ఇంట్లో పెరిగిన పిల్ల. చాలా అణకువైన అమ్మాయి. పల్లెటూళ్ళో ఉండి ఏం చేస్తారు అంటూ కొడుకు తల్లినీ, తండ్రిని పట్నం వచ్చేయమన్నాడు. ఇంత విశాలమైన ఇల్లు వదిలి అక్కడ డబ్బాల్లా ఉండే అపార్ట్మెంటుల్లో ఉండడం నా వల్ల కాదు అన్నాడు. కానీ భార్య రమణమ్మ, కోడలు గంగా కూడా మురళి మాటకే ఓటు వేయడంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేసి పట్నం వచ్చేసారు.


మొదట్లో ఏమీ తోచకపోయినా నెమ్మదిగా పక్క ఫ్లాట్ ల వాళ్ళతో మాట్లాడడం, పరిచయాలు పెంచుకున్నాక త్వరగానే ఇక్కడి జీవితానికి అలవాటు పడిపోయాడు పరంధామయ్య. ఒక సంవత్సరానికి మనవరాలు పుట్టింది. బారసాల కి నెల ముందు నుండీ చంటిదానికి ఏమి పేరు పెట్టాలా అని రోజుకి ఒకసారైనా చర్చించుకునేవారు. మావయ్యా, మీరే మంచి పేరు సెలెక్ట్ చేయండి అంది గంగ. లేదులే అమ్మా, నా మనసులో ఉన్న పేరు మీకు నచ్చదు. మీకు నచ్చింది పెట్టండి అన్నాడు. అలా కాదు అని పట్టు బట్టిన మీదట చెప్పాడు, "నాకు కూతురు పుడితే 'భగవద్గీత ' అని పేరు పెట్టుకుందాం అనుకున్నాను. కానీ వీడు ఒక్కడే పుట్టాడు. నా మనసులో అయితే ఆ పేరు ఉంది. మీకు నచ్చితే పెట్టండి, లేదంటే లేదు " అన్నాడు.


కాసేపు చర్చలూ- ప్రతిచర్చలూ అయ్యాక మొత్తానికి అదే పేరు నిర్ణయించారు. బారసాల రోజు పరంధామయ్య ఆనందానికి అవధులు లేవు. కోడల్ని పొగుడుతూనే ఉన్నాడు. రోజులు చక్కగాదొర్లిపోతున్నాయి. మనవరాల్ని నర్సరీ లో జాయిన్ చేసేటప్పుడు కొడుకూ, కోడలితో పాటు తను కూడా స్కూల్ కి వెళ్ళాడు. ప్రిన్సిపాల్ మేడం కి, టీచర్లకు, స్వీట్ ప్యాకేట్స్ ఇచ్చి అందరికీ మరీ మరీ చెప్పాడు - తన మనవరాల్ని భగవద్గీత అనే పిలవమనీ, షార్ట్ కట్ లో గీత అని పిలవద్దు అని.


రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా కాలం పరుగెడుతోంది. కొడుకూ, కోడలు ఉద్యోగాల నిమిత్తం ఉదయాన్నే వెళ్లి, సాయంత్రానికి వస్తారు. ఇంటి పనీ, వంట పనీ అత్తాకోడలు కలిసి చేసుకుంటారు. ప్రస్తుతం మనవరాలు డిగ్రీ సెకండ్ ఇయర్ కి వచ్చింది. సాయంత్రం అయింది. పల్లెటూళ్ళో అయితే పక్షులు కిలకిలారావాలతో ఆనందం గా గూళ్ళకి చేరుకుంటాయి. ఇక్కడ ఆఫీసుల నుండి ఇళ్ళకిచేరుతారు ఉస్సూరంటూ.


తాతయ్యా అంటూ వచ్చింది మనవరాలు.

"ఏమిటి తాతయ్యా, ఎప్పుడు చూసినా భగవద్గీత లోని శ్లోకాలు చదువుతూ ఉంటావు. అసలు నానమ్మతో మాట్లాడున్నవా లేదా ?"అంది కొంటెగా. "ఎన్నో సంవత్సరాలు గా చదువుతున్నావు. ప్రతిరోజూ మేము వింటూనే ఉన్నాం. ఆ పుస్తకం కూడా పాతది అయిపోయింది తాతయ్యా "


"భగవద్గీత అంటే పుస్తకం కాదు బంగారు తల్లీ. అది జీవిత పరమ ధర్మం."


"బాబోయ్, మొదలు పెట్టేసావా నీ ప్రవచనాలు.. నేను అమ్మాయి గా పుట్టాను కాబట్టి భగవద్గీత అని పేరు పెట్టావు. అబ్బాయి ని అయి ఉంటే ఏ రామాయణం అనో, మహాభారతం అనో పెట్టేవాడివేమో. నీ శ్లోకాలు నువ్వే చదువుకో. "అంటూ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ కాలం పిల్లలకి పురాణాలు అంటే ఏమి తెలుసులే అనుకున్నాడు.


భగవద్గీత కి కూడా తన పేరు అంటే ఇష్టమే. ఫ్రెండ్స్ అందరూ అలాగే పిలుస్తారు. తన బెస్ట్ ఫ్రెండ్ సలోని క్రిస్టియన్. తను మాత్రం గీత అని పిలుస్తుంది. రాత్రి భోజనాల సమయంలో చెప్పింది మనవరాలు, ' రెండు వారాల తర్వాత మా కాలేజ్ వార్షికోత్సవం ఉంది. అందులో ఒక నాటిక కి నేను సెలెక్ట్ అయ్యాను ' అని.

“వెరీ గుడ్. ఏమిటి ఆ స్కిట్?” అంది గంగ.

"అన్ని ధర్మాలు, మతాలూ ఒక్కటే అని ఆ నాటిక యొక్క సారాంశం. నేనూ, సలోని కూడా సెలెక్ట్ అయ్యాం. "


"అయితే నా బంగారు తల్లికి మంచి పాత్రే వచ్చి ఉంటుంది. "

' అవును నానమ్మా, మా ప్రిన్సిపాల్ మేడం అందరికీ మంచి పాత్రలు సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఇందులో లాజిక్ ఏమిటి అంటే నాకు ఒక క్రిస్టియన్ అమ్మాయి పాత్ర, సలోని కి హిందూ అమ్మాయి పాత్ర వచ్చింది. "


"అలా ఎలా ఇచ్చారు నీ పేరు తెలిసి కూడా ". అన్నాడు పరంధామయ్య.


"నాటకంలో మాత్రమే కాదు, బయట కూడా అందరూ కలిసి ఉండాలి అని వాళ్ల మేడం ఆలోచన అనుకుంటా. "


"కరెక్ట్ గా చెప్పావ్ నాన్నా, అందరికీ అలాగే ఇచ్చారు. ఒక సిక్కు అమ్మాయికి ముస్లిం అమ్మాయి పాత్ర, ముస్లిం అమ్మాయికి సిక్కు అమ్మాయి పాత్ర.. అలా అందరికీ మార్చి మార్చి ఇచ్చారు. ప్రోగ్రామ్స్ అన్నిటిలోకి ఇది ఒకటే స్కిట్. మిగిలినవి అన్నీ పాటలు, డాన్సులు. పైగా ఈ స్కిట్ లో బాగా చేసిన మూడు జంటలకు ప్రైజెస్ కూడా ఉన్నాయి.. తాతయ్యా, ఈ నాటకానికి నువ్వు మాకు కొద్దిగా హెల్ప్ చెయ్యాలి. "


"నేనా, నేనేం చెయ్యాలి ? "

"రేపటినుండే మేము సాధన చేయాలి. రోజూ సాయంత్రం సలోని ఇక్కడికి వస్తుంది. తను నాకు వాళ్ళ ప్రార్థనా విధానం, కొన్ని జీసస్ సూక్తులు నేర్పిస్తుంది. నువ్వు తనకి భగవద్గీత లోని కొన్ని శ్లోకాలు నేర్పించాలి. "


"తప్పకుండా నేర్పుతాను ఫస్ట్ ప్రైజ్ మీ జంటకే వస్తుంది చూస్తూ ఉండు"


"థాంక్యూ తాతయ్యా "అంటూ చాలా ఆనందించింది భగవద్గీత.


తర్వాతి రోజు సలోని భగవద్గీత కి జీసస్ సూక్తులు కొన్ని నేర్పిస్తోంది.."ప్రక్కవాడి కంటిలో నలుసు తీసేముందు నీ కంటిలో దూలాన్ని ( తప్పులేంచే లక్షణం ) తొలగించుకో.

"సూది బెజ్జం లోంచి ఒంటె అయినా దూరగలదు కానీ, స్వర్గ ద్వారంలోకి ధనవంతుడు, లోభి, అహంకారి మాత్రం పోలేడు".


చక్కగా నేర్చుకుంటోంది భగవద్గీత.

"తాతయ్యా, చాలా బాగున్నాయి కదా ఏసు ప్రభువు సూక్తులు ".

"అన్ని ధర్మాలు, మతాలు చెప్పేవి ఒకటే. పదాలు, ఉచ్చారణ లో తేడాలు ఉంటాయి కానీ అన్నింటి సారం ఒకటే "అని అన్నాడు కానీ ఆ మాటలు మనసు లోతుల్లోంచి రాలేదు.


ఇప్పుడు సలోని వంతు. పరంధామయ్య గారు శ్లోకం నేర్పుతున్నారు.


"తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః || ”

పలకడంలో మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడినా చురుకైన పిల్లేమో, సలోని కూడా బాగానే నేర్చుకుంటోంది. ప్రతిరోజూ పిల్లలిద్దరూ చక్కగా సాధన చేస్తున్నారు.


వార్షికోత్సవం రోజు రానే వచ్చింది. సలోని తన తెల్లటి గౌన్ తెచ్చి భగవద్గీత కి ఇచ్చింది. భగవద్గీత కూడా తన లంగా, ఓణీ ఇచ్చింది. ఆ గౌన్ లో భగవద్గీత అచ్చం క్రైస్తవ అమ్మాయి లాగ ఉంది. జుట్టు వదిలేసి, స్టిక్కర్ తీసేసింది. ఇంక భరించలేకపోయాడు పరంధామయ్య. బొట్టు మాత్రం తీయడానికి వీల్లేదు అన్నాడు.


"అలా ఎలా కుదురుతుంది తాతయ్యా, నేను క్రైస్తవ అమ్మాయిలా కనిపించాలి కదా. "


"ఏది ఏమైనా సరే, నేను మాత్రం దీనికి ఒప్పుకోను. "

"ప్లీజ్ తాతయ్యా.."


"బొట్టు తీయడం మన ధర్మం కాదు, నేను ఒప్పుకోను "అన్నాడు మొండిగా.

"తాతయ్యా,


సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || ”

( అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. ) అని

భగవద్గీత రోజూ చదువుతావు కదా. "అంది. ఇంక ఏమి చేయలేక మౌనంగా ఉండిపోయాడు.


ఇంతలో సలోని ప్రక్కగది నుండి వచ్చింది. ఆకుపచ్చటి పరికిణీ, రోజ్ కలర్ ఓణీ వేసుకుని, చక్కగా పువ్వులూ, బొట్టూ పెట్టుకుని పదహారణాల హిందూ అమ్మాయిలా తయారు అయింది.


అందరూ కలిసి కాలేజ్ కి వెళ్లారు. ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. ఒక్కొక్కటి గా అన్నీ జరుగుతున్నాయి. స్కిట్ టైం రానే వచ్చింది. మొత్తం ఎనిమిది రకాల చిన్నా, పెద్దా మతాలని తీసుకుని చేసిన స్కిట్ అది. అందరూ చాలా బాగా చేశారు.


భగవద్గీత, సలోని కూడా అద్భుతం గా చేశారు. మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక స్కిట్ కి సంబంధించిన విజేతల పేర్లు చదువుతున్నారు. 'థర్డ్ ప్రైజ్ గోస్ టూ అనూష జైన్ అండ్ మైత్రి బ్రహ్మకుమారి.. పరంధామయ్య చిన్న పిల్లవాడిలా ఎదురు చూస్తున్నారు. ఎలాగయినా భగవద్గీత కి మొదటి స్థానం రావాలని ఆయన తాపత్రయం.

సెకండ్ ప్రైజ్ గోస్ టూ భగవద్గీత అండ్ సలోని.


చప్పట్లతో హాలు మారుమ్రోగుతోంది. కానీ పరంధామయ్య మాత్రం ఆనందం గా లేడు. తన మనవరాలికి కాకుండా ఇంక ఎవరికి వచ్చింది మొదటి బహుమతి అని చెవులు రిక్కించి వింటున్నాడు.


అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ బషీరా అండ్ ప్రతిమా సింగ్.

భగవద్గీత, సలోని వాళ్ళ వాళ్ళ ప్రైజెస్ తో ఆనందం గా వచ్చారు. రమణి, మురళి, గంగ కూడా ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు.


"తాతయ్యా, థాంక్యూ సో మచ్. నీ వల్లనే మాకు ప్రైజ్ వచ్చింది. "


సలోని కూడా థాంక్యూ తాతగారు అని నమస్కారం చేసింది.

పరంధామయ్య మాత్రం ఆనందం గా లేడు. తను ఎంతో ఆశ తో చక్కగా నేర్పించాడు కానీ మొదటి బహుమతి రాలేదు. చిన్నపిల్లవాడిలా చిన్నబుచ్చుకున్నాడు. సలోని ని ఇంటి దగ్గర దింపి వీళ్ళు ఇంటికి వచ్చేసారు. రాత్రి చాలా సేపటి వరకు పరంధామయ్య కి నిద్ర పట్టలేదు. కార్లో సలోని అన్న మాటలే తన చెవుల్లో వినపడుతున్నాయి.


కార్లో తన వెనక సీట్లో కూర్చున్న సలోని అంది..

"థాంక్యూ గీతా, నిజంగా మీ తాతగారి వల్లనే మనకి ప్రైజ్ వచ్చింది. ఐ యామ్ సో హ్యాపీ.."


"అవును సలోని. కానీ మా తాతయ్య హ్యాపీ గా లేరు. మనకి మొదటి బహుమతి రావాలని ఆశించారు. అందుకే చాలా ఉదాసీనంగా ఉన్నారు".


"లేదు గీతా, నువ్వు పొరబడుతున్నావ్, మీ తాతగారు అలా అనుకోరు".

"నీకెలా తెలుసు?"

"ఎందుకంటే మీ తాతగారు నాకు నేర్పించిన శ్లోకం మర్చిపోయావా ?


"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి"


“అంటే, నువ్వు కర్మ -అంటే పని మాత్రమే చేయి. ప్రతిఫలం ఆశించకు, దాని మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని. మనకి ఇంత మంచి శ్లోకం, భావం నేర్పిన తాతగారు ఆయన ఎందుకు ప్రతిఫలం గురించి బాధ పడతారు. ?"


ఇవే మాటలు పరంధామయ్య చెవిలో మళ్ళీ మళ్ళీ వినపడుతున్నాయి. తను ఎన్నో సంవత్సరాలు గా భగవద్గీత చదువుతున్నాడు, మనవరాలికి భగవద్గీత అని పేరు కూడా పెట్టుకున్నాడు. కానీ ఏమిటి ఉపయోగం?చిన్న పిల్ల అయినా, వేరే మతానికి చెందిన అమ్మాయి అయినా ఎంత చక్కగా భావాన్ని గ్రహించి అనుసరించింది. నిజమే, ఏ ధర్మం, ఏ మతం అన్నది ముఖ్యం కాదు. ఎంత వరకూ పాటిస్తున్నాము, ఎంత మంచిగా ఉన్నాము అనేది ముఖ్యం.


ఆనందం అనేది మతాలలో, ధర్మాలలో లేదు వాటి ఆచరణ లో ఉంది అన్న జీవిత ధర్మం నాకు ఇంత కాలానికి తెలిసింది. అనుకుంటూ మనసులోనే పిల్లలిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుని భగవద్గీతలోని తనకి ఇష్టమైన "సర్వ ధర్మాన్ పరిత్యజ్య.. " శ్లోకం వల్లె వేస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

***

లావణ్య వింజమూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Name : లావణ్య వింజమూరి

Home town : Raja mahendra varam

Proffession : Teacher

177 views0 comments
bottom of page