top of page
Original.png

శిశుర్వేత్తి... పశుర్వేత్తి....

శిశుర్వేత్తి పశుర్వేత్తి, బంధకవి రమణ, తెలుగు హాస్య కథ, అమెరికా జీవితం, పెంపుడు కుక్కలు, Pet Culture USA, తెలుగు వినోదం, కుటుంబ హాస్యం, అమెరికా తెలుగు కథ, Humorous Telugu Story, NRI Telugu Story

అమెరికాలో పెంపుడు కుక్క స్కూల్ బస్సు ఎక్కుతుండగా ఆశ్చర్యంగా చూస్తున్న తెలుగు వ్యక్తి – శిశుర్వేత్తి పశుర్వేత్తి హాస్యకథ
అమెరికాలో పెంపుడు కుక్క స్కూల్ బస్సు ఎక్కుతుండగా ఆశ్చర్యంగా చూస్తున్న తెలుగు వ్యక్తి – శిశుర్వేత్తి పశుర్వేత్తి హాస్యకథ

Sisurvethhi Pasurvetthi - Telugu Comedy Story | Ramana Bandhakavi

శిశుర్వేత్తి... పశుర్వేత్తి....తెలుగు హాస్య కథ | రమణ బంధకవి

Published in manatelugukathalu.com on 16/07/2026


దేశం మారితే జీవనశైలి కూడా మారుతుంది. ముఖ్యంగా అమెరికాలో పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా ప్రేమించే విధానం మనకు కొత్తగా, కొన్నిసార్లు ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. "శిశుర్వేత్తి... పశుర్వేత్తి...." కథ అలాంటి సంస్కృతి భేదాలను చమత్కారంగా, హృద్యంగా, నవ్వులు పూయించేలా ఆవిష్కరిస్తుంది.


“చాలా తియ్యటి వార్త చెప్పావు పొద్దున్నే. మా తరపున వాళ్ళకి శుభాభినందనలు చెప్పు. పార్ధూ బుజ్జిగాడికి మా ముద్దులు, దీవనలు. నువ్వూ బావా, అమ్మమ్మ, తాత అయినందుకు అభినందనలు” హుషారుగా చెప్పాను.


వాళ్ళ అమ్మాయి రేవతి పెళ్లి నాలుగేళ్ల క్రితం కాలిఫోర్నియాలోని ‘నాపా వైన్ వాలీ’లో జరిగినప్పుడు మేమందరం వెళ్ళాం. పెళ్లి వైభవంగా జరిగింది. మా శ్రీమతికి విషయం చెప్పాను. చాలా ఆనందించింది. ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరు వెళ్లి పిల్లవాడిని చూసి వద్దామంది. తర్వాత వారం రోజుల వరకు సరోజ నుండి ఫోన్ లేదు. ఒక రోజు పొద్దున్నే వీడియో కాల్ చేసింది.


“వారం రోజుల నుండి ఏ కబురూ లేదు” అడిగాను.


“వాడు మొన్న రాత్రి చాలా హడావిడి చేశాడు. అర్జెంటుగా ఎమర్జెన్సీ కేర్‌కు తీసుకు వెళ్ళారు. ఏదో అలర్జిక్ రియాక్షన్ అట. బోలెడు టెస్టులు అవీ చేసి ఏవో మందులిచ్చి ఐదు వేల డాలర్ల బిల్లు చేతిలో పెట్టి పంపారు” అని వాపోతూ చెప్పింది.


“పోన్లే వాడు ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు కదా! అయినా డబ్బులు కట్టటం ఎందుకు... ఇన్సురన్సు ఉంటుందిగా” అడిగాను.


“వాడికి ఇంకా తీసుకోలేదు. ఇహ తీసుకుంటారు.. ఏదో కొద్దిగా పాలు తాగుతున్నాడు” అని చెప్పింది.


“చిన్న పిల్లలకి ఏవో బాలారిష్టాలు ఉంటాయి. దిష్టి తీయి” సలహా ఇచ్చాను.


“ఆ... హాస్పిటల్ నుండి రాగానే ఉప్పు, నిమ్మకాయతో దిష్టి తీశాను. ఇరుగు పొరుగు వాళ్ళు రావడం, అబ్బో ఎంత ముద్దుగా ఉన్నాడో అనటం. అనుకుంటాం కానీ నరదృష్టి తగులుతుంది” చెప్పింది.


“పోన్లే... ఇంతకీ వాడికి తల్లిపాలా... ఫార్ములా పాలా?” అడిగాను.


“తల్లి పాలు ఎలా వస్తాయి బాబూ.. వాణ్ణి కేన్నెల్ నుండి కొనుక్కుని పెంచుకుంటుంటే!” అంది విస్తుపోతూ.


“కేన్నెల్ ఏమిటే నీ మొహం... మతి పోయిందా... బుజ్జిగాడు పుట్టాడని వారం క్రితం చెప్పావు కదా, మర్చిపోయావా?” విస్తుపోవడం నా వంతైంది.


“బుజ్జిగాడు ఏమిటీ నా బొంద! నేను చెప్పేది ‘బ్లిజ్జు’ గాడి గురించి..” విసుక్కుంటూ చెప్పింది.


“ఓసి నీ అసాధ్యం గూల! వాడు వాడు అంటుంటే, బుజ్జిగాడు పార్ధూ గురించి అనుకున్నా! ఇంతకీ నువ్వు చెప్పిన హారర్ స్టొరీ వాళ్ళ పెంపుడు కుక్క పిల్ల బ్లిజ్జు గాడి గురించా? మరి ఆ మాట చెప్పకపోతివి!” విస్తుపోతూ అడిగాను.


వాళ్ళు మూడు నెలల క్రితం చక్కటి కుక్కపిల్లని తెచ్చుకున్నారని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.


“అవును...వాడు కూడా పిల్లవాడే కదా! అయినా వాడ్ని కుక్క అని పిలవ కూడదు. అది మర్యాద కాదు. వాళ్ళకి నచ్చదు. ఇక్కడ అందరూ అలాగే మర్యాదగా పేరు పెట్టి పిలుస్తారు”


“అంటే 911 కి కాల్ చేసి హడావిడిగా ER కి తీసుకువెళ్ళి, అక్కడ రక్తపరీక్షలు, ఎక్ష్ రే లు, CT స్కాన్లు, అన్నీ తీసి గుండు గీకటం అన్నీ సదరు కుక్క గారికే...సారీ...బ్లిజ్జు మహాశయుడుకేనన్నమాట! అందుకే అన్నారు...మీది అత్యాధునిక దేశం అని!” చురక వేసాను.


“ఏం చేస్తాం బాబూ...ఇక్కడ కుక్క కైనా, మనిషిలాగే కేర్ తీసుకోవాలి. వాళ్ళకీ ఇన్సురన్సు గట్రా తీసుకోవాలి. లేకపోతే కొంప గుల్ల అవుతుంది” చెప్పింది ఉదాసీనంగా.


“అంటే కుక్కని మనిషిలాగా, మనిషిని కుక్కలా చూస్తారన్నమాట” బిగ్గరగా నవ్వుతూ చెణుకు విసిరాను.


“అదేమీ కాదు బాబూ ...” చిన్నబుచ్చుకుంది సరోజ.


“నాకు తెలియక అడుగుతాను...వాళ్ళకి డెలివరీ టైం కదా...అలాంటప్పుడు కుక్కని సరిగ్గా డెలివరీ ముందు ఎందుకు తెచ్చుకున్నారంటావ్? అది ఒక పెద్ద బాధ్యత కదా?” అడిగాను.


“నాకేం తెలుసు బాబూ...వాళ్ళు మన మాట వింటారా ఏమన్నానా! వాళ్ళకి పెంచుకోవాలని ఎప్పటి నుండో ఉందిట. ఎప్పుడో రిజిస్టర్ చేసుకుంటే ఇప్పటికి దొరికిందిట. చాలా డబ్బు పోసి తెచ్చుకున్నారు” చెప్పింది సరోజ.


“అయితే దాని తిండీ తిప్పలూ, మందూ మాకులు అవీ చూసుకోవాలన్నమాట. అన్నట్టు అది ఇల్లంతా ఉచ్చలు, పెంటలూ వెళ్లేస్తే అవి ఎవరు తీస్తారూ?”


“వాడు కొంచెం పెద్దయ్యేదాకా సమస్యే. కానీ అల్లుడే చూసుకుంటున్నాడు అవన్నీ”


“పోన్లే దానివలన పార్ధూ గాడి డైపర్లు మార్చటం, వాడ్ని క్లీన్ చేయటానికి ఎక్స్పీరియన్స్ లా పనికి వస్తుంది.”అన్నాను నవ్వుతూ.


“అన్నట్లు నేను అమెరికా, దుబాయి వెళ్ళినప్పుడు, ఈవెనింగ్ వాక్ చేసేప్పుడు వొళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు చూసేవాడిని. కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళుతుంటే, అవి మధ్యలో ఈ పని చేయటం, దాని తాలూకా ఓనర్ వెంటనే చేతికి ఒక ప్లాస్టిక్ బాగ్ తొడుక్కుని, మెరుపులా వొంగి, ఆ పదార్ధాన్ని పదిలంగా ఒడిసిపట్టి, దగ్గరలో ఉన్న గార్బేజ్ బిన్ లో వేసేవారు. 


ఇదేమి ఖర్మ రా బాబూ...విదేశాల్లో పెద్దపెద్ద మేడల్లో ఉంటూ, కార్లలో షికార్లు చేస్తూ ...ఇలా కుక్క పీతుళ్ళు ఎత్తుకుని బతుకుతున్నారేమిట్రా అనుకునే వాడిని...వీళ్ళ ఇంట్లో పెద్దలకి కదలలేని స్థితిలో అలాంటి అవసరాలు వస్తే మాత్రం చస్తే ఈ పని చేయరు. దానికి వేరే మనిషిని పెడతారు. ఏం చేస్తాం...కలికాలం సరోజా...” అన్నాను ఓదార్పుగా.



“సరేలే ...వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి...రేపు ఫోన్ చేస్తా...”

“వాడు ..అంటే...ఎవరు?” నా ప్రశ్న పూర్తి కాకుండానే పెట్టేసింది.


ఈ చోద్యం గురించి నేను మా ఆవిడా ఆ రోజంతా మాట్లాడుకున్నాం. ఆ మర్నాడు పొద్దుటే మా ఊళ్లోనే ఉన్న మా అక్క వాణి ఫోన్ చేసింది. తనకి గిరిజ అని ఒకతే కూతురు. దానికి ఇద్దరు కూతుళ్ళు. వాళ్లకి సహాయంగా అక్కా బావ కూడా వాళ్ళ దగ్గరే ఉంటున్నారు.


“ఎల్లారూ సౌఖ్యమా? బావ ఎలా ఉన్నాడు? నీ సంగతులు ఏమిటీ” అడిగాను.


“అందరూ బానే ఉన్నాము. ఈ రోజు పనిమనిషి ఎగ్గొట్టింది. అన్నట్లు, ఒకవారం సెలవు పెట్టి అల్లుడు గిరిజను, పిల్లల్ని తీసుకుని ఢిల్లీ వెళ్ళాడు విహారయాత్రకి. ఎదో కాలక్షేపం చేస్తున్నా” అంది.


“అన్నట్లు బ్రేక్ఫాస్ట్ ఏమిటీ? ఇడ్లీ, వడ లేక పూరీ కూరా?” అడిగాను.


“ఆ నా మొహం! నిన్నటిది ఎదో పుల్ల పిండి మిగిలితే, దాంతో నాలుగట్లు పోసుకున్నాం.”


“మరి గిరిజ రోజూ ఫోన్ చేస్తుందా?”


“ఆ రెండు పూటలా చేస్తుంది. ఇదిగో ఇందాకే చేసింది. ‘బిట్టు’ కి బ్రేక్ఫాస్ట్ పెట్టావా అని అడిగింది”


“ఈ బిట్టూ గాడు ఎవడే? కొంపదీసి ఇంకో పిల్లాడ్ని పెంచుకుంటున్నారా?”


“ఆ ..పెంచుకుంటున్నారు...ఒక గ్లాస్ బౌల్లో గోల్డ్ ఫిష్” చెప్పింది వెటకారంగా.


“ఏమిటీ గోల్డ్ ఫిష్ ని పెంచుకోవడం. దానికి నువ్వు టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్ పెట్టడం..హా..హా..జగమే మాయ!” అంటూ నవ్వేను.


“రాత్రి డిన్నర్ కూడా పెట్టాలి. వాళ్ళు వచ్చేప్పటికి అది ఈతలు కొట్టకుండా నీరసంగా కూచుంటే నా పని పడతారు. ఫోన్ చేసి నా సంగతి అడక్కుండా బిట్టుకి బ్రేక్ఫాస్ట్ గురించి అడిగావు అని గిరిజతో అంటే, నీకే...కావలసింది చేసుకుని తింటావు...పాపం అది చేసుకోలేదుగా, అని చురక వేసింది”


“ఆహా...ఏమి భూత దయ! ఈ కలవారి ఇళ్ళల్లో కుక్కలు, చేపలూ దర్జాగా బ్రతికేస్తున్నాయి” అన్నాను.


***

రెండురోజుల తరవాత సరోజ ఫోన్ చేసింది. అది ఇదీ మాట్లాడుకున్నాం.

ఇంతలో “స్కూల్ బస్సు వచ్చింది...వాడ్ని ఎక్కించి వస్తాను”  అని పెట్టేసింది.


నెలల వయసులో ఉన్న పార్ధూ స్కూలికి వెళ్ళలేడు.. మరేవరబ్బా స్కూల్ కి వెళ్ళేది అని తలపట్టుకు కూర్చున్నాను. ఫోన్ మోగింది. సరోజ ఫోన్. తీసిన వెంటనే “స్కూల్ కి వెళ్లే పిల్లలేవరున్నారు సరోజా” అని ఆత్రంగా అడిగాను.


“వాడే...బ్లిజ్జూ గాడిని స్కూల్ బస్సు ఎక్కించి వస్తున్నాను” అంది.


నా బుర్ర గిర్రున తిరిగి మా శ్రీమతిని గ్లాసుడు మజ్జిగ తెమ్మన్నాను.

“మళ్ళీ చెప్పు... బ్లిజ్జూ గాడిని స్కూల్ బస్సు ఎక్కించటం ఏమిటి తల్లీ?”


“అవును. ఇక్కడ వాటికి స్కూల్ ఉంటుంది. స్కూల్ బస్సులో ఇంటింటికీ  వచ్చి తీసుకు వెళ్తారు. అక్కడ ఎక్స్పర్ట్ స్ వాటికి పాటీ ట్రైనింగ్, సోషల్ బిహేవియర్, క్రమశిక్షణ అన్నీ నేర్పుతారు. బ్లిజ్జూ గాడిని రెండు వారాలు పంపిస్తున్నారు. మళ్ళీ సాయింత్రం బస్సులో దింపుతారు. అన్నీటికీ డబ్బులు బాగానే ఛార్జ్ చేస్తారు” అంది.


నేను మజ్జిగ మెల్లగా తాగుతూ, “ఇంతకీ సిలబస్ సిబిఎస్ సి నా, ఐసి ఎస్సి నా లేక ఐ బి నా...” అన్నాను దిమ్మరపోయి.


“అలాంటి స్కూల్స్ లేక పోతే వాటికి ట్రైనింగ్ ఎవరు ఇస్తారు బాబూ? నేను ఈ వారాంతంలో సాన్ హోసే వెళ్ళిపోతాను. పిల్లవాడు బానే ఉన్నాడు. అన్నట్లు బ్లిజ్జూ గాడికి నిన్నేనే మా అల్లుడు హెయిర్ కట్ చేయించాడు. లేకపోతే వాడికి విపరీతమైన బొచ్చు ఉంటుంది. పాపం రోజూ తల దువ్వి పోనీ టైల్స్ వేస్తాడు.”


“అంటే సలూన్ కి తీసుకుని వెళ్లి చేయించాడా?”


“కాదు పెట్ సర్వీసెస్ వాన్ వచ్చింది. దాంట్లో కూర్చోబెట్టి ఓపిగ్గా మూడుగంటలు ఒళ్లంతా బొచ్చు ట్రిమ్ చేసింది చైనీస్ అమ్మాయి. వంద డాలర్లు పోతే పోయాయి కానీ మహా ముద్దుగా ఉన్నాడు బిజ్జూ గాడు.” అంది.


ఇంతలో సరోజకు వాళ్ళ అబ్బాయి వివేక్ నుండి ఫోన్ వచ్చిందని పెట్టేసింది. నాకు రెండు నెలలకొకసారి రెండువందల రూపాయిలు పెట్టి చేయించుకునే హెయిర్ కట్ గుర్తుకు వచ్చింది. ఇదంతా చూస్తే వచ్చే జన్మలో అమెరికాలో బ్లిజ్జూ గాడి లాంటి కుక్కగా పుట్టటం చాల లాభసాటిగా ఉండేట్టు ఉంది అనుకున్నాను. కాసేపటికీ మళ్ళీ ఫోన్ చేసింది.


“ఏమంటున్నాడు వివేక్ ...వాళ్ళు బానే ఉన్నారా?” కుశలం అడిగాను.


“ఆ బానే ఉన్నారు. పదిరోజుల తరవాత వాళ్ళు ఆరిజోనా టూర్ కి వెళ్తారుట. ఒక నాలుగు రోజులు ఫెలిక్స్ ని చూసుకోమని చెప్పాడు....”


“ఆగాగు ...ఈ ఫెలిక్స్ ఎవడు..? వాళ్లకి పిల్లాడు కూడా పుట్టేసాడా? కనీసం మాకు చెప్పనైనా లేదు” అన్నాను నొచ్చుకుంటూ.


“నా మొహం! పిల్లాడు కాదు..పుచ్చకాయ కాదు...వాళ్ళు  ఒక పిల్లిని పెంచుకుంటున్నారు. వాడిని నేను చూడాలిట. ఈ పిల్లిని పెంచటం నా వల్లకాదు అంటే, ఏం, వాళ్ళ బ్లిజ్జూ ని ప్రేమగా చూస్తావు కానీ, మా ఫెలిక్స్ ని చూడవా? నీకు అంతా పార్శియాలిటీ ముందునుంచి అని సాధిస్తున్నాడు” అంది.


నేను పగలబడి నవ్వి....

“అయిందమ్మా పెళ్లి...ఈ కుక్కల్ని, పిల్లుల్ని పెంచటమేమిటో, వాటిని ఆస్పత్రులకు తీసుకు వెళ్ళటం ఏమిటో, స్కూల్ బస్సు ఎక్కించటమేమిటో, డే కేర్ లో దించటం ఏమిటో...నాకు ఏమీ అర్ధం కావడం లేదు...పరమాత్మా ...” అన్నాను.


“ఇక్కడ అవన్నీ మామూలే బాబూ...మీకు అన్నీ వింతగా వుంటాయి కానీ. అన్నట్లు పార్దూని నిద్ర పుచ్చేప్పుడు నేను జో అచ్యుతానందా, రామా లాలీ ...మేఘశ్యామా లాలీ ..అని పాడుతూ ఉంటే వాడు, అదే పార్ధూ, కళ్ళప్పగించి ఎంత శ్రద్ధగా వింటాడో, అదే సమయంలో బిజ్జూ గాడు కూడా ఎక్కడనుండో వచ్చి, నా మోకాలి మీద తల పెట్టుకుని, చెవులు రిక్కించి వింటాడు.” అంది ఆనందంగా.


“ఇంకేం, శిశుర్వేత్తి...పశుర్వేత్తి...అని అన్నారు కదా...అదే నిజం చేస్తున్నారు” అని బై చెప్పి పెట్టేసాను.


ఇంతలో శ్రీమతి పక్కగది నుండి వచ్చి, “అమ్మాయి ఫోన్ చేసింది వచ్చే నెలకి టిక్కెట్లు కొనుక్కో మంటోంది. మంచి తిథి చూడండి” అని క్యాలెండరు చేతికి ఇచ్చింది.


“చూస్తాగానీ, ముందుగా వాళ్ళని సీజర్, రాంబో, స్నోయీ, బ్రౌనీ, టామ్ అండ్ జెర్రీ లాంటి శాల్తీలను పెంచుకుంటున్నారేమో కనుక్కో. చేతికి ప్లాస్టిక్ బాగ్ తొడుక్కుని పేవ్మెంట్ మీద కుక్కల పీతుళ్లు ఎత్తే ఉద్దేశ్యం నాకు అసలు లేదు” అని చెప్పి చేతిలోకి టీవీ రిమోట్ తీసుకున్నాను.


*** 

రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రమణ బంధకవి
రమణ బంధకవి

రచయిత పరిచయం: రమణ బంధకవి

రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.

bottom of page