top of page

సితార

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Sitara' Written By B V Latha

రచన: బి వి లత


ఆమె పేరు సితార.

జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినింది.

ఎన్నో అందలాలూ ఎక్కింది.

చివరికి ఆమె ఏ గమ్యాన్ని చేరుకుందో బి వి లత గారి కథలో తెలుసుకోండి. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


సితార ఒక చురుకైన, చక్కని, మధ్య తరగతి కుటుంబంలో తన అన్న శివ తేజతో కలిసి జన్మించిన ఒక చిన్నారి. చిన్నతనంనుంచి సితార ఎంతో చురుకుగా హుషారుగా పదిమందిని ఆకర్షించే తీరుగల పిల్ల. శివ స్వభావం ఇందుకు పూర్తివ్యతిరేకం. తనేంటో, తన పనేంటో, ఇంటిలో ఉన్నాడో లేడో కూడా ఎవరికీ తెలియదు. అంత శాంత స్వభావి. ఏ రోజూ శివ గురించి విచారించాల్సిన అవసరం తల్లి తండ్రులకు కలిగించేవాడు కాదు. తరగతిలో ఎప్పుడూ ముందు ఉండేవాడు, మంచి మార్కులతో పాసయ్యేవాడు. ఏ ఆటలైతే ఆడతాడో అందులో ముందు ఉండేవాడు.

కానీ సితార అందుకు పూర్తి విరుద్ధం. రోజుకు ఒకసారయినా అన్నతో పేచీ పడేది. అతని వస్తువులను చిందరవందరచేసి విసిగించేది. చివరికి తల్లి విమలే కలుగచేసుకుని సితారను మందలించేది. తల్లి వండిన వంటలకు వంకలు పెట్టి, తిననని మారంచేసి, చివరికి బతిమాలి బామాలగా తినేది. తరగతిలో అత్తెసరు మార్కులు తెచ్చుకునేది.

ఒకసారి తల్లి ‘ఇవేమి మార్కులు?’ అంటే ‘’అన్నిట్లో పాసయినా, అమ్మ చూడండి నాన్నా’,అంటూ తండ్రికి ఫిర్యాదు చేసింది.

“ఇంకొంచం తెచ్చుకోవచ్చు కదరా?” అన్న తండ్రితో, “ ఎంత? ఇంత కొంచెం సరిపోతుందా…” అంది వేళ్లని చూపిస్తూ.

అంతా నవ్వుకున్నారు. కానీ తరువాతి పరీక్షలలో ఏభై శాతం తెచ్చుకుంది. తల్లికి చూపిస్తూ, “చాలా? “ అని అడిగింది.

“ఏంటి చాలేది? మొదటి మార్కులు కాదు ఇవి”. “అందరికీ మొదటి మార్కులు ఎలా వస్తాయి?”, “అదేంటిరా?” అనే తండ్రితో “రూపకి రాకపోతేఅది ఏడుస్తుంది నాన్నా”.

“అమ్మో, చూశారా? ఎన్ని వేషాలో, అదెవరో ఏడుస్తుందని ఇది చదవదట”.

“నిజం నాన్నా”, “ సరేలేరా, నువ్వెళ్ళి ఆడుకో”

“విమలా, ఊరికే దాని వెనక పడకు, వదిలేయి, అది చురుకైంది, నాకు నమ్మకం ఉంది ఒక రోజు మనకు మంచి పేరుతెస్తుంది. నువ్వు చూస్తూ ఉండు” అన్నాడు సుందరేశ్వర్. “అలాగే లెండి, అదీ చూద్దాం, ఊరికే వెనకేసుక రాకండి”.

ఆ సంవత్సరాంత పరీక్షలలో సితార తరగతిలోనే ప్రథమురాలుగా వచ్చింది. కానీ ఎంతో దిగులుగా ఉన్న సితారను సుందరేశ్వర్ గమనించి కారణం అడగగా “రూప ఏడుస్తూ వెళ్ళింది, అదిక నాతో ఆడదు” అంది, “ ఎందుకురా, తప్పిందా?” “లేదు, రెండవదిగా వచ్చింది”, “మరెందుకట ఏడవటం” అనే తల్లికి, “నీకు చెప్పాను కదా? దానికి రెండవ ర్యాంకు ఇష్టముండదు. ఎప్పుడూ అదే మొదట ఉండాలి, అందుకే అది ఏ పోటీ ఆటలు ఆడదు.” అలా అంటూఉండగానే సితార నేస్తం కల్పన వచ్చింది. రూప ఆసుపత్రిలో చేరిందని, జ్వరంతో బాధ పడుతోందని చెప్పింది. సితార ఏడుపు చూసి సుందరేశ్వర్ రూపను చూడటానికి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. సితార రూప పక్కనే కూర్చుని ఓదారుస్తోంది. రూప తండ్రి చెప్పాడు తామెంత నచ్చ చెప్పినా వినదని, తక్కువ మార్కులు వస్తే సహించ లేదని, అది ఆమె బలహీనతని వైద్యులు చెప్పారని, నెమ్మదిగా అలవాటు కావాలని చెప్పారని చెప్పాడు. ఆరోజు తరువాత తల్లితండ్రులు సితారనెప్పుడూ మొదటి మార్కులు తెచ్చుకొమ్మని అడగలేదు.

సితారకు వయసు పెరిగిన కొలదీ ఆమె ఆకర్షణీయంగా తయారయింది. పెద్ద అందగత్తె కాకపోయినా, తలతిప్పి రెండవసారి చూడాలనిపించే అందం. సునాయాసంగా ఇంజనీరింగ్ చేసేసింది. చివరి సంవత్సరంలో స్నేహితులతో విహార యాత్రకు వెళ్ళినపుడు సినిమా షూటింగు చూడటానికి వెళ్ళింది స్నేహితులతో. అక్కడ ఈమెను చూసిన దర్శకుడు తన తదుపరి సినిమా కోసం సితార తల్లితండ్రులను కలిసి అడిగాడు. సితార అతనిని అడిగింది, “ఆ సినిమా లో నటించినందుకు ఆ నటికి ఎంత పారితోషికం ఇచ్చారు?” అని.

“ఏభై లక్షలు” అని చెప్పాడు.

“నాకెంత ఇస్తారు?”

“ఇరవై ఐదు అనుకుంటున్నాము.”

“సారీ, అరవై ఐతే, చేస్తాను” అంది.

“మొదటి సినిమాకే అంతంటే కష్టం, నిర్మాత ఒప్పుకోవాలి, ముందు స్క్రీన్ టెష్టుకు వస్తే, తరువాత మట్లాడవచ్చు.”

“సరే, ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పండి”.

చెప్పిన సమయానికి ఐదు నిముషాల ముందే అక్కడికి తన స్నేహితురాలు పావనితో కలిసి వెళ్ళింది.

ఏం చేయాలో ఎలా చేయలో తెలుసుకుని, చేసి చూపించింది. తన అభినయం మాట పలికే విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి సారే అందరితో శహభాష్ అనిపించుకుంది. నిర్మాత తన దగ్గరికి పిలిపించుకొని, అభినందించి, “ అరవై అడిగావట కదా? ఏభై ఇస్తాను, మా తదుపరి సినిమాలో నువ్వు అడిగినంత ఇస్తాను. ఇష్టమైతే అగ్రిమంటుఇంటికి పంపిస్తాను” అంటే, “ సరే, సర్, మీరు చెబుతున్నారు కదా? అలాగే” అనేసింది. పేపర్లు ఇంటికి వచ్చినపుడు, తనలాయర్ స్నేహితురాలిని పిలిచి, అన్నీ సరిగా ఉన్నాయనుకున్నాక సంతకాలు చేసి, అడ్వాంసును తల్లి చేతులలో ఉంచి, ఆశీర్వాదం తీసుకుంది. అది మెదలు సితార జీవితం తారాపథం వైపు పరుగులు తీసింది. మొదటి సినిమావిడుదలయ్యే లోపు ఇంకొక రెండు సినిమాలు వచ్చాయి.

సితార అన్న శివ డాక్టరుగా అమెరికాలో స్థిర పడ్డాడు. అక్కడే తనతో పని చేసే రేష్మని ప్రేమించి, సితారకు పరిచయంచేశాడు. సితార తల్లిని, తండ్రిని ఒప్పించి, డెస్టినేషన్ వెడ్డింగు యూరప్ లో ఏర్పాటు చేసింది. శివ చిన్ననాటి స్నేహితులను తనతో తీసుకుని వెళ్ళింది. అలాగే తన స్నేహితులను, చుట్టాలలో దగ్గరివారిని కూడా తీసుకుని వెళ్ళింది. ఎన్నోఅశ్చర్యభరితమైన ఏర్పాట్లతో అందరినీ అబ్బురపరిచింది. అన్నకి వదినకు వాళ్ళ వివాహం ఒక అపురూపమైన జ్ఞాపికగా చేసింది.

సితార తన ప్రతి సినిమా పూర్తి కాగానే ఒక వినోద యాత్రకు వెళ్ళి, ఆహ్లాదంగా గడపటమనేది ఒక అలవాటుగాచేసుకుంది. ఆ సమయంలో ఏ స్నేహితులకు అవకాశం ఉంటే వారిని తీసుకుని వెళుతుంది. దానితో ఆమె పని సమయంలో తను పడ్డ శ్రమనంతా మరిచిపోయి, మళ్ళీ హుషారుగా పని చేసేది. తల్లి తండ్రి వారి ఇంటిని అన్నిసదుపాయలతో మార్పులు చేయించుకోవటానికి వారికి అన్ని ఏర్పాట్లు చేసింది. తను ఒక విలాసవంతమైన భవనం కొనుక్కొన్నది. ఐదారుగురు పనివారు, వారిని, ఇంటిని, తనను చూసుకోవటానికి ఒక మనిషిని నియమించుకుంది. తనకు వ్యాయామంలో సహాయం చేయటానికని ఒకరిని, తన అందానికి మెరుగులు దిద్దటానికి ఒకరిని, తన లెక్కలు అవి చూసుకోవటానికి ఒక ఛార్టర్డు అకౌంటెంట్‌ని, తన రోజవారీ పనులన్నీ చూసుకోవటానికి ఒక కార్యదర్శిని నియమించుకుంది. మొదటి నుంచి తన సంపాదనలో కొంత తన స్నేహితురాలు రేఖ నడిపే “భౌస్ & మ్యావ్స్” కి ఇచ్చి, తను కూడా సమయమున్నప్పుడల్లా అనాధ కుక్కలు పిల్లులతో గడిపి రావటం అలవాటు చేసుకుంది. తను విదేశాలకు వెళ్ళినప్పుడల్లా అక్కడి సంస్థలను సందర్శించి, అక్కడ వారు వాడే క్రొత్త విధానాలను స్నేహితురాలికి చెప్పి చేయించేది. అంతే కాకుండా ఒక మొత్తం సొమ్ము డిపాజిట్ వేసి దాని మీద వచ్చే వడ్డీ ఒక వృధాశ్రమానికి, ఒక అనాధశరణాలయానికీ వెళ్ళే ఏర్పాటు చేసింది. తల్లి తండ్రులకు కూడా ఒక నికర ఆదాయం వచ్చే ఏర్పాటు చేసింది.

కిరణ్ కౌశల్, సితారతో రెండు సినిమాలలో హీరోగా చేశాడు. ఎప్పుడూ అతని గురించి పెద్దగా ఆలోచంచలేదు. కానీ, ఒకపార్టీలో తన తోటి నటి చందనతో చూసినపుడు ఒక చిలిపి ఆలోచన ఆమె మనసులో చోటు చేసుకుంది. అంతే అతనిని తరచూ కలవటం, కబుర్లు, షాపింగులు, పార్టీలతో ఆకర్షించింది. అతను తన వెనకాలే ఉండటం సితారకు ఉత్సాహాన్నిచ్చింది. ఇద్దరూ ఒకరికొకరు ఎప్పుడు దగ్గరయ్యారో తెలియకుండానే బాగా దగ్గరయ్యారు. రెండు మూడుసార్లు ఇద్దరూ గోవా, సిమ్లా మరియు డార్జిలింగ్ వంటి ప్రదేశాలకు వెళ్ళి సరదాగా గడిపి వచ్చారు. ఒక రోజు కిరణ్ స్నేహితులందరి ఎదుట పెళ్ళికి సితార చేయి అడిగాడు. సితార తన సమ్మతి తెలియ చేసింది. పెద్దలందరి సమక్షంలో గోవాలో ఘనంగా పెళ్ళి చేసుకున్నారు.

మూడు సంవత్సరాలు ఎంతో సంతోషంగా గడిపేశారు. ఒక అవగాహనతో ఎవరి పని వారు చేసుకుంటూనే ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉన్నారు. మూడవ సంవత్సరాంతానికి సితార షూటింగ్

నిమిత్తం అమెరికా వెళ్లింది. ఇంతలో కరోనా కారణంగా విమానాలన్నీ రద్దయ్యాయి. సితార అమెరికాలోనే ఆరు నెలలు ఉండిపోవలసి వచ్చింది. కిరణ్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూనే ఉండేది. నాలుగు నెలల తరువాతనుంచి పని వత్తిడి అంటూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కానీ సితారకు తెలుసు, అన్ని పనులు ఆగిపోయాయని. అడిగితే, కొత్తబిజినెస్ మెదలు పెడుతున్నానన్నాడు. అమెరికా నుంచి బయలు దేరిన తొలి విమానంలో బయలుదేరి వచ్చేసింది. పధ్నాలుగు రోజుల క్వారంటైన్ వల్ల తన సొంత బంగ్లాకి వెళ్ళి పోయింది. తన కార్యదర్శి ద్వారా చందన కిరణ్‌కి దగ్గరైన విషయం తెలుసుకుంది. ఒక రోజంతా ఏడ్చింది. కానీ, ఈ పధ్నాలుగు రోజుల సమయం తన మనసు స్ధిరపడటానికి పనికి వచ్చింది.

ఇంటికి వెళ్ళగానే కిరణ్ దగ్గరకు వెళ్ళి, పలకరించింది. అతని కోసం తెచ్చిన బహుమతి ఇచ్చింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. పనుందని కిరణ్ వెళ్ళిపోయాడు. పని వారందరికీ పేరు పేరున వారి వారి బహుమతులు పంచింది. అత్తగారింటికి వెళ్ళి వారందరిని కలిసి తనతో తెచ్చిన బహుమతులిచ్చి, రాత్రికి ఇంటికి వచ్చింది. ఆ రాత్రి కిరణ్ తో “ఒకసినిమాలో చేయమని అడుగుతున్నారు, కానీ మనం పిల్లల గురించి ఆలోచించాలనుకున్నాం కదాని, వద్దని చెప్పాను.” అని చెప్పింది. కిరణ్ ఏమి సమాధానం చెప్ప లేదు. తెల్లవారు ఝామున కిరణ్ బయట ఎవరితోటో ఫోనులో మాట్లాడుతూకన్పించాడు. మొహం కడుక్కొని కాఫీ తెమ్మని వంట మనిషికి చెప్పి తను కూడా బయటకు వెళ్ళి కూర్చుంది.

“ఏమైంది? అంతా బాగానే ఉందా”? అంటూ అడిగింది అతనికి కాఫీ కప్పు అందిస్తూ.

“ సితారా, మనం కొంచెం మాట్లాడుకోవాలి” అన్నాడు.

“ చెప్పు, వింటున్నాను”

“నీకు తెలుసు కదా, నా క్రొత్త సినిమా సరిగా ఆడలేదు. అందులో నేను డబ్బు కూడా పెట్టాను, అది కూడా పోయింది, నువ్వు లేవు, చందనే నాకు తోడుగా నిలబడింది. నన్ను ఓదార్చింది. మేము ఒకరికొకరం దగ్గరయ్యాము. చందనకిప్పుడు మూడవ నెల. “ అని సితార మొహంకేసి చూశాడు. సితార కళ్ళు వర్షిస్తున్నాయి. నోటికి చేయి అడ్డు పెట్టుకుని వచ్చే ఏడుపు ఆపుకుంటూ కనిపించింది.

“ సితారా, తాగిన మత్తులో జరిగి పోయింది. లాక్ డవును వల్ల నేను తన ఇంటిలోనే ఉండి పోవలసి వచ్చింది. ఏం చేయాలో తెలియటం లేదు”, అని చెప్పాడు.

“ చేసేదేముంది? అబార్షన్ చేయించమని నేను చెప్పను. చేయించుకునేదైతే ఈ పాటికే చేయించుకునేది. నేను నిన్ను ఇంకొకరితో కలిసి పంచుకోను, ఏం చెయ్యాలి… ఎలా చెయ్యాలన్నది నువ్వే నిర్ణయించి నాకు చెప్పు, నేను మా అమ్మావాళ్ళని చూడటానికి వెళుతున్నాను.” అని లోపలికి వెళిపోయింది.

సాయంత్రానికి సితార తల్లి తండ్రుల వద్దకు వెళ్ళింది. వారికి అన్నా , వదిన, మేనళ్ళుడు చింటూ గురించినవిశేషాలన్నీ చెప్పింది. అన్నకి వీడియో కాల్ చేసి, అందరూ కలిసి ఉన్నట్లుగా కబుర్లు చెప్పుకున్నారు. మూడవ రోజు కిరణ్నుంచి ఫోన్ వచ్చింది. “మనం విడాకులు తీసుకుందాం, నీకు మన ఇల్లు, 20 కోట్లు” అన్నాడు కిరణ్

“ నువ్వు ఎంత ఇస్తావు, ఏమిస్తావన్నది నేనడగను, నాకు ఒకటే కావాలి, మీ వారికి, మావారికి ఇద్దరం కలిసి చెప్పాలి, వారికి నచ్చ చెప్పి, అప్పుడు విడిపోవాలి.”

“సరే, నువ్వు మీ వారికి నువ్వు చెప్పు, నేను మా వారికి చెపుతాను.”

“లేదు, ఇద్దరం కలిసే తెలియ చేయాలి.”

“ఎందుకు?”

“నా తృప్తి కోసం, నువ్వు ఇక్కడికి రా, తరువాత ఇద్దరం మీ ఇంటికి పోదాము. రేపు పని మెదలు పెట్ట వచ్చు.”

“సరే”

కిరణ్ వచ్చాడు. సితార తల్లీ, తండ్రీ అతనిని ఆహ్వానించి, కాఫీ ఇచ్చారు. వంట చేయించటానికి లేచిన తల్లిని “కిరణ్ మీతో మాట్లాడటానికి వచ్చాడు, కూర్చో” అంది సితార.

కిరణ్ సితార వంక ఇబ్బందిగా చూశాడు. కానీ, సితార పట్టించుకోలేదు. దూరంగా చూస్తూ కూర్చుంది. కిరణ్ గొంతుసవరించుకొని “ మీరు నన్ను క్షమించాలి. నేను సితార విడిపోవాలనుకుంటున్నాము” అంటూ ఉండగానే, సితార తల్లి, “ఎందుకు? ఏమైన గొడవ పడ్డారా? సితారకు మేము నచ్చ చెబుతాం, తొందర పడకండి”, అంటూ కంగారు పడింది.

“అదేం లేదు, సితార తప్పేంలేదు. మేము ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము” అనే కిరణ్ తో సుందరేశ్వర్ “ఈ రోజుఇక్కడ ఉండండి, మాట్లాడుకుందాం” అన్నాడు. తప్పనిసరై ఉండిపోయాడు కిరణ్. భోజనాలయ్యాక అల్లుడిని విడిగాతీసుకుని పోయి మాట్లాడాడు. కిరణ్ జరిగినదంతా చెప్పాడు. సుందరేశన్ భార్యకు జరిగింది వివరించి, సితారను ఇబ్బంది పెట్టదని నచ్చ చెప్పాడు. మర్నాడు బయలుదేరి వెళ్ళే కూతురికి అల్లుడికి భారంగా వీడ్కోలు చెప్పారు.

కిరణ్, సితార అతనింటికి వెళ్లారు. పరుగున వచ్చిన కుక్కలను దగ్గరకు తీసుకుని ముద్దు చేసి వీడ్కోలు చెప్పింది. నేరుగా కిరణ్ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి, ఆమెతో మాట్లాడి, తనిక కనిపించక పోవచ్చుననీ, ఆరోగ్యం చూసుకోమని చెప్పి, ఆమె ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వచ్చేసింది. అతని తల్లి, తండ్రికి చెప్పగానే వారు ఆశ్చర్యపోయరు. అది తప్పుఆలోచనని తొందరలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు.

అత్తగారు సితార చేయి మీద చెయ్యి వేసి,”బాగాఆలోచించుకున్నావు కదా?” అని అడిగింది. సితార తల ఊపింది. “ జ్యూస్ తాగుతావా? చక్కర లేనిది.” అంటూ వెళ్ళిరెండు గ్లాసులు తెచ్చి కూర్చుంది.

“నాకు తెలుసు, నువ్వు తెలివైనదానివి. జరిగింది తలచుకుని బాధ పడేకంటే, దాన్ని అధిగమించి ముందుకు పోతావనిఅనుకుంటున్నాను.” అంది. తండ్రీ కొడుకులు విడిగా పోయి చాలాసేపు మాట్లాడుకున్నారు. వారు వచ్చాక, చివరిసారిగాఅందరం కలిసి ఆ రోజు గడుపుదామనుకున్నారు. ఆ రాత్రి వారందరూ, తామంతా కలిసి గడిపిన క్షణాలు, ఫొటోలుచూస్తూ గడిపారు. చివరిసారిగా వారితో గడిపి, మరునాడుదయమే , బయలుదేరి వారింటికి వెళ్ళి పోయారు. తనలాయరు స్నేహితురాలికి కబురు చేసింది. తన తరఫున అన్నీ చూసుకోమని చెప్పి, తన ఇంటికి వెళ్ళి పోయింది.

సాయంత్రానికి పేపర్లతో లాయరు వచ్చింది. “సితారా, నువ్వు ఇంకా ఎక్కువగా అడగచ్చు, ఎందుకు వద్దన్నావు?”, “సంతోషంగా ఇచ్చింది చాలు, రెండేళ్ళు ఆనందంగా గడిపాం. మరిచిపోవటానికి ఎంత సమయం కావాలో తెలియదు. నేను ఇంకా నా జ్ఞాపకాలని పెంచుకో తలచుకోలేదు.” అంది.

మరునాడే ఇద్దరూ త్వరలో విడిపోతున్నట్లు మీడియా ముందు ప్రకటించారు. కోర్టులో పేపర్లు వేశాక, వారిద్దరినీ కోర్టు కలిపిమాట్లాడింది. ఫలితమేమి లేదు. వారిద్దరూ అధికారికంగా విడిపోవటానికి సమయముండటంతో, సితార తనస్నేహితుడు ఒకతను చెప్పిన హిమాలయాలలోని స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళింది. స్వామీజీని కలిసి మాట్లాడాక, ఆయన ఒకనెల రోజులు అక్కడ గడపమనీ, అన్నీ సర్దుకుంటాయని చెప్పటంతో అక్కడే ఉండిపోయింది. రోజూ ఆ వెండి కొండల వెంటపరుగులు, యోగా, ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు, నెల అనుకున్నది రెండు నెలలు ఉండిపోయింది. స్వామీజీఅనుమతితో తిరిగి వచ్చింది.

సితార రాక, ముందే తెలియటంతో ఆమె కార్యదర్శి సమావేశాలు అవి ఏర్పాటు చేసి ఉంచాడు. సితార వస్తూనే పనిలో నిమగ్నమై పోయింది. అనుకోకుండా ఒక హిందీ సినిమాలో స్వామీజీ చెప్పారంటూ ఒక అవకాశం వచ్చింది. దాన్నిఅందిపుచ్చుకొంది సితార. వరుసగా రెండు మూడు బాలీవుడ్ అవకాశాలు రావటంతో బాంబేలో ఒక ఫ్లాట్ కొనుక్కుంది. కిరణ్ ఇచ్చిన ఇంటికి మార్పులూ, చేర్పులూ చేసి, సినీ కళాకారుల వృధాశ్రమంగా మార్చింది.

అది నడపడానికికావలసినంత ఆదాయం వచ్చే ఏర్పాటు చేసింది, అతనిచ్చిన సొమ్ముతోనే. తన తో పని చేసేవారందరికి వారిఅవసరాలకనుగుణంగా సొంత గృహాలు ఏర్పాటు చేసింది. ‘భౌస్&మ్యావ్స్’ కి, అనాధ శరణాలయానికీ, ముఖ్యమంత్రినిధికి మిగిలింది విరాళంగా ఇచ్చేసింది. ఇక్కడ తను వప్పుకున్న సినిమాలు ముగించుకుని, ముంబాయికి మారిపోయింది. మొదటి సినిమాతోనే జాతీయ బహుమతి సంపాదించుకుంది. నాలుగేళ్ళలో మంచి పేరు తెచ్చుకుంది.

అజయ్ జైన్ అనే క్రికటర్ తో పరిచయం, ఆమె జీవితాన్ని ఇంకొక మలుపు తిప్పింది. అతని ఆహ్వానంతో అతనిగుఱ్ఱపుశాలను చూడటానికి వెళ్ళిన సితారకు అతను గుఱ్ఱపు స్వారీ నేర్పాడు. క్రికట్ గురించి చెప్పి, తన ఆట చూడటానికిఆహ్వానించి దానిమీద ఉత్సుకతను పెంచాడు. ఒకానొక శుభముహూర్తంలో పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు. సితారకుకాదనటానికి కారణం ఏమీ కనిపించ లేదు. స్వామీజీ తో చర్చించి ఆయన ఆశీర్వాదంతో వారు గుళ్ళో పెళ్ళి చేసుకొని, స్నేహితులకూ, హితులకూ విందు ఇచ్చారు. వారి వైవాహిత జీవితం ఎంతో సంతోషంగా సాగిపోయింది. వారికి ఒకకొడుకు నవీన్, కూతురు నర్మద జన్మించారు. వారు ఒక సినిమా నిర్మాణ సంస్థ, ఒక క్రికట్ ట్రయినింగ్ సెంటరు స్ధాపించారు. పిల్లలతో ప్రపంచమంతా తిరిగారు. వారేది చదవాలనుకుంటే అది చదివించారు. మంచేమిటో చెడేమిటో చెప్పి నిర్ణయంవారికే వదిలేవారు. ఎప్పుడన్నా అజయ్ కోప్పడినా సితార ఒక్క చిరునవ్వుతో అతన్ని వారించేది.

పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. నవీన్ సినిమాటోగ్రఫీ లో యూఎస్ పట్టా పుచ్చుకున్నాడు. బిజినెస్ మేనేజ్మంటు లో బ్యాచిలర్ కూడా చేసి తిరిగి వచ్చాడు. ఒక వ్యాపార వేత్త కూతురిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. నర్మద ఎయిరోనాటికల్ ఇంజనియరింగ్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్సులో చేరింది. అందులోనే పని చేసే ఒక ఆఫీసరుని పెళ్ళి చేసుకుంది. అంతా ఆనందంగా ఉండి, జీవిత సుఃఖాన్ని ఆస్వాదించే సమయాన, తన అరవయై ఐదవ ఏట కాన్సర్ వ్యాధితో అజయ్ కన్ను మూశాడు. సితార ఆ బాధ నుంచి కోలుకుని, ఆస్థులన్నిటినీ పిల్లలకు పంచి, కొంత సొమ్ము మీద రాయితీ తనకు వచ్చే ఏర్పాటు చేసుకుని, తన తదనంతరం ఆ రాయితీ ఆశ్రమానికి చెందేటట్లు వీలునామా చేసి, తన శేష జీవితం స్వామీజీ ఆశ్రమంలో ప్రశాంతంగా గడపటానికి పయనమైపోయింది.

***. **** ***

రచయిత్రి పరిచయం:

పేరు: బండారు విద్యుల్లత, (బి వి లత), M.A., L.L.B.,


128 views1 comment
bottom of page