top of page
Original.png

ద అన్‌కాంప్రమైజింగ్

ద అన్‌కాంప్రమైజింగ్, సంధ్య కథ, తెలుగు కథ, మహిళా సాధికారత, మెరిట్, కార్పొరేట్ కథ, ఆత్మగౌరవం, ఆర్కిటెక్ట్ కథ, ప్రేరణాత్మక తెలుగు కథ, professional ethics, inspirational Telugu story

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ద అన్‌కాంప్రమైజింగ్' కథలో ఆధునిక బోర్డ్‌రూమ్‌లో తన ప్రతిభతో భారీ నిర్మాణ ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న యువ తెలుగు ఆర్కిటెక్ట్ సంధ్య.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ద అన్‌కాంప్రమైజింగ్' కథలో ఆధునిక బోర్డ్‌రూమ్‌లో తన ప్రతిభతో భారీ నిర్మాణ ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న యువ తెలుగు ఆర్కిటెక్ట్ సంధ్య.

The Uncompromising - Telugu Emotional Story | Srini Paindla

ద అన్‌కాంప్రమైజింగ్ తెలుగు భావోద్వేగ కథ | శ్రీను పైండ్ల

Publishes in manatelugukathalu.com on 27/06/2026


ది ఫౌంటెన్ హెడ్ టవర్స్..

ఆకాశవాసి కంపెనీ నిర్మిస్తున్న ఎనభై అంతస్తుల భారీ భవనం. ఎన్ని డిజైన్లు చేసినా... కెరీయర్‌కే మకుటాయమానంగా నిలిచే ఇలాంటి ఒక్క మహా నిర్మాణాన్ని తీర్చిదిద్దాలని ప్రతి ఆర్కిటెక్ట్ తపించిపోతాడు. దాన్ని దక్కించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఎలాగోలా స్వప్నం సాకారమైందంటే.. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, కీర్తిప్రతిష్టలు ఒక్కసారిగా జెట్ స్పీడ్‌తో ఎవరెస్ట్ ఎక్కేస్తాయి. అలాంటి అవకాశాన్ని ఎవరికివ్వాలో నిర్ణయించే మీటింగ్ జరగబోతోంది. అందుకే ఆ ఆఫీసు బోర్డ్ రూమ్ అంత నిశబ్దంగా ఉంది!


నిజానికి నగరానికే నభోమణిలా నిలిచే ఈ ప్రాజెక్ట్ లీడ్ చేయడానికి ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఒకరు పదిహేనేళ్ళ అనుభవం ఉన్న సీనియర్ ఆర్కిటెక్ట్ శ్రీకర్ కాగా, మరొకరు ఐదేళ్ళుగా పనిచేస్తూ పదునైన ఆలోచనలతో గుర్తింపు తెచ్చుకున్న యువ ఆర్కిటెక్ట్ సంధ్య. ఇద్దరి డిజైన్స్ టేబుల్‌పై ఉన్నాయి. బోర్డ్ డైరెక్టర్స్, సీనియర్ పార్ట్‌నర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


కంపెనీ ఎండీ విశ్వనాథ్ మౌనం వీడి మాట్లాడటం మొదలుపెట్టారు.

“శ్రీకర్, సంధ్య.. ఇద్దరి డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయి. బోర్డ్ చాలా సుదీర్ఘంగా చర్చించింది. ఫైనల్‌గా మేం ఓ నిర్ణయానికి వచ్చాం. ఈ ప్రాజెక్ట్ లీడ్‌గా సంధ్యను ఎంచుకుంటున్నాం.”


బోర్డ్‌రూమ్‌లో చప్పట్లు మారుమ్రోగాయి. నింగిని తాకే అద్దాలమేడపై సూరీడి తొలికిరణం పడి పదింతలై ప్రతిఫలించినట్టు సంధ్య ముఖమంతా సంతోషకాంతులు పరుచుకున్నాయి.


విశ్వనాథ్ చిరునవ్వుతో కొనసాగించారు. “మన కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు. వాళ్ళకి ఓ పుష్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన విమెన్ ఇన్ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ కింద ఈ నిర్ణయం తీసుకున్నాం. ఓ యువతి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం మన కంపెనీ పబ్లిక్ ఇమేజ్‌కి, మార్కెటింగ్‌కు ప్లస్ అవుతుంది. కంగ్రాట్స్ సంధ్య!”


బోర్డ్ మెంబర్స్ అంతా సంధ్యను అభినందిస్తున్నారు. శ్రీకర్ ముఖంలో కాస్త అసంతృప్తి. అతని కళ్ళలో సంధ్యపై చులకన భావం.. సైలెంట్‌గా ఉండిపోయాడు. వెలుగులీనుతున్న అద్దాలమేడను కారుమబ్బు కబలించినట్టు సంధ్య ముఖంలో ఆనందం ఆవిరైంది. ఆమె మనసులో అలజడి రేగింది. మౌనంగా తలూపి ఈ ఆఫర్ తీసుకుంటే కీర్తి, డబ్బు అన్నీ వాటంతట అవే వస్తాయి. కానీ అద్దంలో చూసుకున్న ప్రతిసారీ కోటా ఆర్కిటెక్ట్ కనిపిస్తుంది. ఆ ఆత్మవంచనతో బతకడం ఆమెకు ఇష్టం లేదు. కుర్చీలోంచి లేచి నిలబడింది. చేతులు టేబుల్‌పై ఆన్చి...

“థాంక్యూ సార్.. కానీ నేను ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నా!”


గదిలో ఒక్కసారిగా పిన్‌డ్రాప్ సైలెన్స్. అంతా షాక్‌తో సంధ్య వంక చూశారు. వారికి ఏం అర్థం కావడం లేదు.

"ఏంటి సంధ్యా? ఇదో లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావ్?" అన్నాడు విశ్వనాథ్ ఆశ్చర్యంగా.


సంధ్య  చాలా స్పష్టంగా ప్రశ్నలతోనే సమాధానమిచ్చింది. “ఈ ప్రాజెక్ట్‌ను నా డిజైన్‌ను చూసి ఇస్తున్నారా? లేదా నేను మహిళను అన్న ఉద్దేశంతో ఇస్తున్నారా? మీ కళ్ళకు నేను నా పనితో నా అస్తిత్వాన్ని నిర్మించుకునే వ్యక్తిలా కనిపిస్తున్నానా..? లేక మీ కంపెనీ ఇమేజ్ పెంచుకోవడానికి వాడుకునే ప్రదర్శన వస్తువులా ఉన్నానా?" అంది.


విశ్వనాథ్ తడబడుతూ.. “అలా కాదు సంధ్యా.. నీ డిజైన్ కూడా బాగుంది.. దాంతో పాటు మన డైవర్సిటీ పాలసీ..”


సంధ్య అతన్ని మధ్యలోనే ఆపేసింది. “వద్దు సార్.. నేను ఆరు నెలల పాటు రాత్రింబవళ్ళు శ్రమించి ఈ డిజైన్‌కు ప్రాణం పోశాను. ఇదిగో నా అనాలిసిస్ రిపోర్ట్.” ఆమె ఫైల్‌ను టేబుల్ మధ్యలోకి నెట్టింది.


“నా డిజైన్‌లో వాడిన కొత్త పద్ధతులతో ప్రాజెక్ట్ కన్ స్ట్రక్షన్ కాస్ట్ 15 శాతం తగ్గుతుంది. అంతేకాదు, శ్రీకర్ గారి డిజైన్ కంటే నా డిజైన్‌లో స్ట్రక్చరల్ స్టెబిలిటీ 20 శాతం ఎక్కువ. ఈ నెంబర్స్ అన్నీ నా మేధస్సుకు, నా కష్టానికి నిదర్శనాలు.”


సంధ్య చూపుల్లో ఎక్కడా రాజీ లేదు. “నా డిజైన్ శ్రీకర్ గారి వర్క్ కంటే టెక్నికల్‌గా, ఎకనామికల్‌గా మెరుగైందని మీరు బలంగా నమ్మితే ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించండి. అంతేగానీ మహిళా సాధికారత అనే లేబుల్ వేసి నా ప్రతిభను, అర్హతను తక్కువ చేయకండి.”


అంతా మౌనంగా ఉండిపోయారు. శ్రీకర్ నెమ్మదిగా ఆ ఫైల్ తీసుకుని లెక్కలు చూశాడు. సంధ్య చెప్పినట్లే ఆ డిజైన్ పర్ఫెక్ట్‌గా ఉంది.


“నాకు సింపతీ వద్దు, సపోర్ట్ వద్దు.. నేను ఆడపిల్లగా పుట్టి ఉండొచ్చు. నా శ్రమతో నన్ను నేను 'ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్'గా మలచుకున్నాను. నా గుర్తింపును మీరిచ్చే కోటాలతో కాదు, నా పనితనంతో నేనే సంపాదించుకుంటాను. నా ఆలోచనలకి, నా అస్తిత్వానికి జెండర్ లేదు” అంది సంధ్య. భారం దిగిపోయిన నిశ్చింతతో ఊపిరి పీల్చుకుంది.


విశ్వనాథ్ ఒక్కసారి ఆ ఫైల్‌లోని లెక్కల వైపు చూశాడు. 15 శాతం ఆదా అంటే కంపెనీకి వందల కోట్ల లాభం! అంతపెద్ద ప్రాజెక్ట్‌ను నడిపించడానికి కావలసింది తలవూపే ఉద్యోగి కాదు, నైపుణ్యంపై నమ్మకంతో ఏకంగా బోర్డునే ఎదిరించగల ధీశాలి అని ఆయన కార్పొరేట్ బుర్రకి అర్థమైంది. 


చిరునవ్వు ముఖంపై పులుముకుని... “వెరీ సారీ యంగ్ లేడీ.. నీ డిజైన్ ఫైల్ డీటేయిలింగ్స్ నేను గమనించలేదు. ఇట్ ఈజ్ బ్రిలియంట్. జెండర్ ఈక్వాలిటీ కోణంలో నిన్ను చూసి తప్పు చేశాం. ఈ ప్రాజెక్ట్ నీదే. ఏ కోటా కింద కాదు, ప్యూర్ మెరిట్ మీద!" అన్నాడు.


సంధ్య తన ఫైల్‌ను చేతిలోకి తీసుకుంది. శ్రీకర్ వైపు చూసింది. అతని చూపుల్లో గౌరవ భావం మెరిసింది. మగాడైనందుకు తనకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. సంధ్య అద్భుతంగా డిజైన్ చేసి కూడా జెండర్ పాలిటిక్స్‌తో పోరాడాల్సి వచ్చింది అనుకున్నాడు. 


నెమ్మదిగా లేచి నిలబడి.. “సార్, సంధ్య చెప్పింది నిజం. నా డిజైన్ కంటే తన డిజైన్ టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సరైన లీడర్ తనే” అన్నాడు. అక్కడ శ్రీకర్ మహిళను సమర్థించలేదు. తనకంటే మెరుగైన ఒక ప్రొఫెషనల్‌ను గౌరవించాడు.


ఇప్పుడు సంధ్య కళ్ళలో ఎవరో చేసిన మేలుకు చూపే కృతజ్ఞత లేదు. సమాజం గీసిన గీతలను చెరిపేసి, తనను తాను నిర్వచించుకునే స్వతంత్రురాలి గర్వం ఉంది. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, తన సృజననే ఆయుధంగా మలచి ఓ ప్రపంచాన్ని సృష్టించుకోగలనన్న ఆత్మవిశ్వాసంతో బోర్డ్ రూమ్ నుంచి బయటకు నడిచింది. ఆకాశం తనకోసం తలొంచిందేమో అనిపించే రాజసంతో..


***

శ్రీను పైండ్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


శ్రీను పైండ్ల
శ్రీను పైండ్ల

రచయిత పరిచయం: శ్రీను పైండ్ల

నా పేరు శ్రీను పైండ్ల. హైదరాబాద్ నివాసిని. సాహిత్యంపై మక్కువతో కొంతకాలంగా కథలు, కవితలు రాస్తున్నాను. నా రచనలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. కొన్ని బహుమతులు గెల్చుకున్నాయి. "తెలుగు సాహితీవనం కవితా పురస్కారం -2026" ను కూడా ఈసారి గెలుచుకున్నాను. బుల్లితెర ధారవాహికల కథాకథనాల పర్యవేక్షణ నా వృత్తి.  

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
saikiran mallapureddy
saikiran mallapureddy
24 minutes ago
Rated 5 out of 5 stars.

అద్భుతమైన కథ అండీ! . 'కోటా వర్సెస్ మెరిట్' అనే పాయింట్‌ను సంధ్య పాత్ర ద్వారా మీరు చూపించిన తీరు చాలా పరిపక్వతతో కూడి ఉంది. ముఖ్యంగా 'అద్దంలో చూసుకున్న ప్రతిసారీ కోటా ఆర్కిటెక్ట్ కనిపిస్తుంది' అనే లైన్ గుండెకు హత్తుకుంది. సంధ్య ఆత్మవిశ్వాసం, శ్రీకర్ ప్రొఫెషనలిజం.. రెండూ అద్భుతంగా మలిచారు. మీ సరళి, శైలి భళి భళి

Like
bottom of page