top of page
Original.png

నీ పయనమెటు?

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

నీ పయనమెటు, తెలుగు కుటుంబ కథ, తాత మనవడు కథ, తల్లిదండ్రుల గౌరవం, కుటుంబ విలువలు, గ్రామీణ జీవితం, తెలుగు నీతి కథ, emotional Telugu story, grandfather grandson story, Telugu inspirational story, parenting story Telugu, family values

Telugu grandfather lovingly guiding his young grandson through a peaceful village while teaching family values, compassion, respect for parents and kindness toward animals.
Telugu grandfather lovingly guiding his young grandson through a peaceful village while teaching family values, compassion, respect for parents and kindness toward animals.

Nee Payanametu? - Telugu Emotional Family Story | Malla Karunya Kumar

నీ పయనమెటు - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In? manatelugukathalu.com On 27/06/2026


"మీ అబ్బాయిని ఏమీ అనలేకపోతున్నానమ్మా! అదే వేరేవాళ్లై ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది! ఆడుకోవడానికి మీ వాడి దగ్గరకు వస్తే నా కొడుక్కి పట్టిన గతి ఇది!" తన కొడుకు శరీరంపై ఉన్న గాయాలను చూపిస్తూ కాస్త ఉక్రోషంగానే పలికి అక్కడి నుండి వెళ్ళిపోయింది పార్వతి.


కొడుకు వికాస్ చేసే తుంటరి పనులు సహించలేని లక్ష్మికి ఇప్పుడు పార్వతి వచ్చి మందలింపుగా మాట్లాడడం అస్సలు నచ్చలేదు. పట్టలేని ఆవేశంతో వికాస్ ను వెతుక్కుంటూ వెళ్ళి రెండు చెంపలు వాచేలా కొట్టింది.


ఏడుస్తూ వెళ్ళి ఆ ఇంటి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. 


కొంత సమయం తర్వాత, లోపల నుండి ఏవో కూనిరాగాలు వినిపించడంతో తన ఏడుపుకి స్వస్తి చెప్పి ఇంటి లోపలి వైపు చూశాడు. తన ముత్తాత ఏదో రాగాన్ని ఆలపిస్తున్నాడు. ఆ రాగం వింటూ ఏదో ఆలోచనలో పడ్డాడు వికాస్.


"ఇంకెంత కాలం మమ్మల్ని సాధించుకు తింటావు! నీకు సేవ చేయలేక చస్తున్నాం!" ఇలాంటి మాటలు ఏవీ వినిపించడం లేదు. మూడు రోజులుగా మొత్తం పరిశీలనగా చూస్తూ ఉన్నాడు వికాస్. ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంది. ఎటువంటి అరుపులు, కేకలు లేకుండా మనస్సుకి హాయిగా ఉంది. 


"రేయ్ రాముడు!" అని తన ముత్తాత కేక వేస్తే, "వస్తున్నాను నాన్న!" అంటూ విసుగు లేకుండా పరిగెత్తే తన తాతను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.


ఎప్పుడూ అపార్ట్‌మెంట్‌లో తీరికలేని మనుషుల మధ్య, ఆడుకోవడానికి కూడా సమయంలేని స్నేహితుల మధ్య నలిగిన బాల్యానికి ఈ వేసవి సెలవుల్లో ఆ పల్లెటూరు ఎంతో హాయిని ఇచ్చింది! ఎప్పుడూ కోపంతో విసుగు చెందే మనస్సు నెమ్మదిగా ఊరట పడుతోంది. 


తన తాతలాంటి, ముత్తాతలాంటి మనుషుల్ని తన అపార్ట్‌మెంట్‌లో, పక్క ఇంట్లో, కింద ఫ్లోర్లో ఏదోక ఇంట్లో చూస్తూనే ఉండేవాడు వికాస్. వయస్సు మీద పడటంతో శరీరం సహకరించక ఇంట్లో వాళ్ళపై ఆధారపడుతూ, వాళ్ల చేత చివాట్లు తింటూ ఉండడం రోజు వికాస్ గమనిస్తూనే ఉన్నాడు. 


కానీ తన ముత్తాతకు మాత్రం తన తాత ఎటువంటి విసుగు లేకుండా సేవలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఈ విషయాన్నే తన తాతను అడగాలనుకున్నాడు. కానీ, తనలో ఉన్న మొహమాటం కారణంగా అడగలేకపోయాడు.


తన తండ్రికి సపర్యలు చేసి, "లక్ష్మి! లక్ష్మి!" అని కేకవేశాడు రాముడు. 


తండ్రి కేకతో, "ఏంటి నాన్న!" తండ్రి ముందు వాలుతూ అడిగింది లక్ష్మి.


"అలా మన తోట వైపుకు వెళ్ళి వస్తాను, పశువుల సంగతి కూడా చూడాలి కదా?" అని తన దినచర్య గుర్తుచేస్తూ అన్నాడు రాముడు.


"నాన్న! తాతకు సపర్యలు చేసినప్పటికే సగం రోజు గడిచిపోతుంది. దీనికి తోడు ఆ పశువులు, ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? నా మాట విని ఇకనైనా ఇటువంటి వాటి నుండి విశ్రాంతి తీసుకోండి." ఎప్పుడూ చెప్పే మాటనే తండ్రితో చెప్పింది లక్ష్మి.


"నాన్నకు చేస్తున్న సేవని నేను ఎప్పుడూ భారంగా అనుకోలేదు తల్లి. నాన్న చేసిన సేవ ముందు నేను చేసినది ఏమాత్రం విలువ చేయదు. ఇక పశువుల మాటకు వస్తావా! అవి నా నేస్తాలు తల్లి, వాటిని వదిలి ఉండలేను. కాళ్లుచేతులు ఆడే వరకు ఇలాగే సాగనివ్వు." అని నవ్వుతూ, "సరే. నాన్న నిన్నేమీ ఇబ్బంది పెట్టడులే, ఏవైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను." అని చెప్పి అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రాముడు.


అప్రయత్నంగానే రాముడు చూపు ద్వారం దగ్గర నిలబడి ఉన్న మనవడు వికాస్ దగ్గర ఆగింది. మనవడి దగ్గరకు చేరుకొని, "ఏరా మనవడా! నాతో పాటు వస్తావా?" అనునయంగా అడిగాడు.


తండ్రి మాటలు విన్న లక్ష్మి వేగంగా తండ్రి దగ్గరకు చేరుకొని, "నాన్న! వీడిని నీతో పాటు తీసుకువెళ్తాను అంటున్నావా? వద్దు నాన్న! వాడి గురించి మీకు తెలియదు. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. తెల్లవారే పక్కింటి పార్వతి వీడి మీద కంప్లయింట్ కూడా ఇచ్చింది! వీడిని గడప దాటనివ్వకూడదు" తండ్రిని వారించింది. 


తల్లి మాటలు విని కోపంతో తల్లి వైపు వికాస్ చూడటం గమనించాడు రాముడు.

కూతుర్ని వారిస్తూ, "ఏంటి లక్ష్మి? పిల్లల సంగతి నాకు తెలియనట్టుగా చెప్తున్నావు? అయినా నా మనవడు నువ్వు చెప్తున్నంత అల్లరివాడు కాదులే. ఆ పార్వతి కొడుకు ఏదో తుంటరి పని చేసి ఉంటాడు, వీడు కోపంతో చేయి చేసుకొని ఉంటాడు." అని లక్ష్మితో అంటూ, "రారా మనవడా! మనం అలా తిరిగి వద్దాం." అని వికాస్ చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకువెళ్ళాడు రాముడు. వికాస్ కూడా మరో మాట లేకుండా తాత రాముడు వెంట సాగాడు.


తన తోట వైపు నడుస్తూ దారంతా కనిపిస్తూ ఉన్న తోటలను చూపిస్తూ, వాటిలో ఉన్న రకరకాల చెట్ల గురించి చెప్తూ ఉన్నాడు. ఇంతలో నెమళ్ళు దూరంలో కనిపించడంతో వాటిని చూసి ఆనందంతో ఉరకలు వేస్తూ వాటిని అనుసరించబోయాడు. 


కానీ వికాస్ ను చూసి అవి అక్కడి నుండి పరుగు తీస్తూ ఎగిరిపోయాయి. ఆవేశంతో రాయి తీసుకొని వాటి మీదకు విసరడం ప్రారంభించాడు. మనవడు తీరుని చూసి వేగంగా వెళ్ళి వికాస్ ను వారిస్తూ, "వికాస్! వాటి పట్ల అలా ప్రవర్తించకూడదు! వాటికి హాని కలిగేలా చేయకూడదు. వాటికి కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా." అని ఒక నీతిని తెలియజేస్తూ మనవడిని తనతో పాటు తీసుకువెళ్ళాడు. 


కొంత సమయానికి తన తోటకు చేరుకున్నాడు. తోటలో ఉన్న ఆవులు రాముడ్ని చూసి పలకరించినట్టుగా "అంబా" అని అరవడం మొదలుపెట్టాయి. 


వాటిని చూసి తనను గట్టిగా పట్టేస్తూ తాత వెనుకకి వెళ్ళిపోయాడు వికాస్. వికాస్ వైపు చూస్తూ, "వికాస్! ఎందుకు భయపడుతున్నావు? అవేమీ చేయవులే. వాటితో ప్రేమగా నడుచుకుంటే మనల్ని ఏమీ చేయవు. సరే, నువ్వు ఈ శాలలో కూర్చో, నేను మళ్ళీ వస్తాను." అని చెప్పి ఆవులకు గడ్డి, నీరు పెట్టడానికి సిద్ధమయ్యాడు.


కొంత సమయం తర్వాత మళ్ళీ మనవడి దగ్గరికి చేరుకున్నాడు రాముడు. అప్పటికి వికాస్ శాలలో దొరికిన కొన్ని గోళీలను పట్టుకొని ఆడుతుండడం గమనించాడు రాముడు.


వికాస్ దగ్గరకు చేరుకొని, "వాటిని నీకోసమే సేకరించి ఉంచాను! నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నీతో కలిసి ఈ ఆట ఆడాలని నా ఆశ! ఇప్పుడైనా అది నెరవేరుతుంది, చాలా సంతోషం." అని మనవడి దగ్గర గోళీలు తీసుకుంటూ, వాటితో ఎలా ఆడాలో మనవడికి నేర్పుతూ, కాసేపు ఆడుతూ ఊరట చెందాడు. మొత్తం పనులన్నీ ముగిసిన తర్వాత వికాస్ ను తీసుకొని మరలా ఇంటికి చేరుకున్నాడు.


యథావిధిగా మరుసటి రోజు కూడా తోటకు బయలుదేరాడు రాముడు. రాముడు పిలవకుండానే వికాస్ కూడా రాముడు వెంట వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మనవడు తనతో రావడానికి ఇష్టం చూపడం రాముడికి చాలా ఆనందం కలిగింది.


హుషారుగా ముందుకు సాగుతూ ఎన్నో కబుర్లు చెప్తూ వెళ్తున్నాడు. రోజులాగే మనవడిని శాలలో కూర్చోబెట్టి, తాను ఆవుల దగ్గరకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. 

తాత వైపు చూస్తూ, "వాటి దగ్గరకు నేనూ వస్తాను తాతయ్య! నన్ను కూడా తీసుకువెళ్తావా?" అని అడిగాడు వికాస్. 


నవ్వుతూ, "తప్పకుండా." అని తనతో పాటు ఆవుల దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఒక్కో ఆవు దగ్గరకు తిప్పుతూ, రెండు నెలల దూడ దగ్గరకు తీసుకువెళ్ళి, "నువ్వు దీని దగ్గర ఉండు. నేను వెళ్ళి గడ్డిమోపు తీసుకువస్తాను." అని చెప్పి వెళ్ళాడు. 


కొంత సమయం గడ్డిమోపుతో తిరిగి వచ్చిన రాముడికి వికాస్ ఆ దూడను కొడుతూ ఉండడం కనిపించింది.


వేగంగా ఆ మోపు పక్కన పడేసి, "వికాస్!" అని మనవడి దగ్గరకు చేరుకొని, "ఏమిటి నువ్వు చేస్తున్న పని, అది చిన్న దూడ! దాన్ని అలా కొడుతున్నావు ఏమిటి?" అని సుతిమెత్తగా మందలిస్తూ, "చూడు బాబు! వాటిని అలా హింసించకూడదు. వీలైతే ప్రేమగా నిమరాలి." అని అంటూ వికాస్ చేయి తీసుకొని ఆ దూడ నుదుటిపై పామించాడు. 


కొంత సమయం అయిన తర్వాత తన పనులు ముగించుకుని, వికాస్ ను తీసుకొని శాల దగ్గరకు చేరుకొని కూర్చున్నాడు రాముడు.


రాముడు వైపు చూస్తూ, "తాత! నేను చాలా మంది ముసలివాళ్లను చూశాను. వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు. వాళ్లకు సేవ చేయడం కోసం వాళ్ల సొంతవాళ్లే చాలా ఇబ్బందులు పడుతూ తిడుతూ ఉంటారు. కానీ నువ్వు కూడా పెద్దవయస్సు ఉన్నవాడివే కదా, మరి మీ నాన్నకు ఎటువంటి కష్టం లేకుండా సేవ చేస్తున్నావు?" ఆశ్చర్యంతో అడిగాడు.


మనవడి ప్రశ్నకు ఆశ్చర్యంతో చూస్తూ ఒక్కసారిగా నవ్వి, "ఓరి బడవ! మొత్తానికి నేను ముసలివాడిని అని గుర్తు చేస్తున్నావు." అని మనవడిని దగ్గరకు తీసుకొని,

"మా నాన్న అంటే నాకు ప్రాణం రా, పుట్టినప్పుడే నా అమ్మ మరణించింది. అప్పటి నుండి తల్లిగా, తండ్రిగా మా నాన్నే నన్ను చూసుకున్నాడు. ఏ కష్టం లేకుండా, ఏ బాధా లేకుండా పెంచుకున్నాడు. ఎప్పుడైనా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే చూడాలి మా నాన్న కంగారు.


 దేవుళ్ళందరికీ మొక్కేసేవాడు. తర్వాత ఎంత కష్టమైనా ఆ మొక్కులు తీర్చేవాడు. నేనే అతనికి సర్వస్వం. నాకోసం ఇన్ని చేసిన నాన్నకు నేను చేస్తున్న సేవ ఏపాటిది? ఇది నా బాధ్యత కదా. నా బాధ్యతే కాదు, తల్లితండ్రులను దైవంగా భావించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది." అని అన్నాడు రాముడు.


"పిల్లల్ని కొట్టి, కోపంతో తిట్టే తల్లితండ్రులను కూడా దైవంలా భావించాలా?." తాత వైపు చూస్తూ ప్రశ్నించాడు వికాస్.


వికాస్ ప్రశ్నకూ అంతరార్థం రాముడికి తెలుసు, లక్ష్మి ఆఫీసు ఒత్తిడిలో ఉంటూ ఆ కోపాన్ని పిల్లలపై చూపిస్తుందన్న విషయం కూడా చాలాసార్లు రాముడు దృష్టికి వచ్చింది. ఎన్నోసార్లు నచ్చజెప్పడానికి చూశాడు. కానీ తన తీరు మార్చుకోవడానికి ఏమాత్రం సుముఖత చూపడం లేదు. 


లక్ష్మి కారణంగా వికాస్ మనస్తాపం చెంది ఒకసారి రాయితో లక్ష్మిని కొట్టాడు. ఈ విషయం తెలిసిన దగ్గర నుండి రాముడి మనస్సు మనస్సులో కలవడం లేదు. తల్లిని ఆరాధ్యదైవంగా భావించాల్సిన కొడుకు ఇలా తల్లిని కొట్టడం సమంజసం కాదు. 

ఇలాంటి సమాజం మనకు వద్దు, ఇలాంటి వారసత్వం మనకు వద్దు అని ఒక నిర్ణయానికి వచ్చి, రోజు పత్రికల్లో వస్తున్న వార్తలను చూసి వాటి నుండి ఒక పాఠం నేర్చుకుని మనవడిని దారిలో పెట్టాలని, అలాగే కూతుర్ని కూడా దారిలో పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. తన ప్రయత్నం కొంతవరకు సఫలమైంది.


"వికాస్! అమ్మకి నీపై చాలా ప్రేమ ఉంది! ఏదో పని ఒత్తిడిలో అలా నిన్ను కొట్టి ఉంటుంది. అలా అని నువ్వు అమ్మని కొట్టడం ఎంతవరకు సమంజసం? అలా చేయకూడదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. వీళ్ళను గౌరవించాలి. వాళ్ళు మన మంచి గురించే కదా ఆలోచిస్తారు." అని నెమ్మదిగా వికాస్ లో మంచి ఆలోచనలు కలిగేలా ప్రేరణ ఇస్తూ, "మీ అమ్మకి కూడా గట్టిగా చెప్తాను, ఈసారి నీపై చేయి పడితే నేను ఊరుకోను అని." అంటూ వికాస్ ను దగ్గరకు తీసుకొని, వికాస్ కోసం భద్రంగా దాచిపెట్టిన మామిడిపళ్ళు వికాస్ చేతిలో పెట్టాడు.


 ***సమాప్తం****

ఈ కథ మీకు నచ్చితే, మీ పిల్లలతో తప్పకుండా పంచుకోండి. తాతలు, అమ్మమ్మలు చెప్పే జీవిత పాఠాలు తరతరాలకు మార్గదర్శకాలు అవుతాయి.


మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మళ్ళ కారుణ్య కుమార్
మళ్ళ కారుణ్య కుమార్

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page