top of page

శివోహం


'Sivoham' Written By Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


అది 'విజయనగరం కోట వీధి' లో గల 'మూడు గుళ్ల ఆలయం'. విజయనగర మహారాజావారు కట్టించిన అతిపురాతన ఆలయం, అందులో చిన్న చిన్న మూడు గుళ్ళు, ఒకటి లక్ష్మీనారాయణ స్వామి' వారి గుడి, రెండవది 'సిద్ధి వినాయకుడు గుడి', మూడవది 'సర్పాసనం మీద కూర్చున్న మహా శివలింగం 'ఉన్న గుడి.


ఆలయ ప్రాంగణం అంతా సరైన పరిచర్యలు లేక అక్కడ అక్కడ వెలిసిపోయి ఉన్నా ఆలయం మాత్రం చాలా ప్రసిద్ధి చెందినది ఆ రోజుల్లో. అందులోని పూజారులు కూడా వారసత్వ పద్ధతిలో ఈరోజుకి కొనసాగుతూ తరతరాలుగా పూజలు చేయిస్తూ ఉన్నారు. అందులో 'శంకరాచారి గారిది మూడవ ది అయిన శివుడి గుడి.


ఆరోజు వేకువజామునే 'శంకరాచారి గారు ' ఇంటి పెరట్లో ఉన్న బావి దగ్గర నీళ్లు తోడుకొని తల మించి చలికి వణుకుతూ ఒక్కసారిగా పోసుకుంటున్న తరుణంలో భార్య పార్వతమ్మ గారు లేచి పరుగు పరుగున వచ్చి "అయ్యో,ఏంటండీ! ఇంత చలిలో ఆ చన్నీళ్ళ స్నానం నాకు చెప్తే కుంపటి రాజేసి వేడి నీళ్లు పెడతాను కదా,! ఎందుకంత తొందర , అని ఆదుర్దాగా అడిగేసరికి , "పోనీ లేవే !రాత్రంతా నిద్ర పట్టలేదు ఆ బడలిక వదలాలని, చన్నీళ్ల స్నానం చేస్తున్నాను, అసలే "సూర్యారావు గారు "వచ్చే వేళ అయింది కాస్త సంకల్పం చెప్పుకొని సూర్య నమస్కారాలు చెయ్య కపోతే ఈ రోజు కూడా రూపాయి దక్షిణ కూడా రాదు" అంటూ దీనంగా చెప్తున్న భర్తను 'ఏమండీ ,మీరు మరీ దిగాలు పడి పోకండి, ఆ శివయ్య కరుణిస్తాడు మన అదృష్టం కొద్దీ ఏ భక్తుడైనా పది రూపాయలు దక్షిణ వెయ్య డా, మనకు వారం రోజుల పాటు గ్రాసం దొరకదా మంచి భోజనం చెయ్యమా, అంటూ పొయ్య రాజేసి, రండి , మంచి తులసి ఆకులతో చేసిన వేడివేడి టీ .ఇస్తాను కాస్త హుషారుగా ఆలయానికి వెళ్లొచ్చు అంటూ కంటి కొసన రా ల బోతున్న కంటి చుక్కను భర్తకు కనబడకుండా చీర కొంగుతో తుడుచుకుంటూ అన్నది పార్వతమ్మ గారు. 'అలాగే లే 'నువ్వు పద 'నేను సూర్య నమస్కారాలు చేసి వస్తాను అంటూ "సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం"అంటూ ప్రార్థిస్తూ తనపంచె సర్దుకుంటూ, ఉత్తరీయం భుజమ్మీద వేసుకుంటూ' పార్వతి, త్వరగా రా! సమయం మించి పోతుంది, భక్తులు వచ్చేస్తారు, అని అనగానే ఇదిగో వస్తున్నా నoడి, అంటూ వేడిగా తులసి ఆకుల' టీ ,తో వచ్చి భర్తకి ఇస్తూ చూడండి, ఇవాళ ఎలాగైనా దక్షిణంలో వచ్చిన సొమ్ములు తేకపోత ఈ రోజు వారి పస్తులు ఉండలేకపోతున్నాను, మన పచారీ కొట్టు కొమటయ్య కూడా నిన్న నేను వెళ్లి ఒక శేరు బియ్యం, కొంచెం కందిపప్పు, చింతపండు అరువు అడిగేసరికి నల్లని త్రాచుపాము ని తొక్కి నట్లు గట్టిగా అరుస్తూ' పోవామ్మా, పంతులుగారు రెండు నెలల నుంచి 'వంద రూపాయల 'వరకు వాడుకున్నారు ఒక్క పైసా జమ చేయలేదు ఇలాగైతే మేము దివాలా తీస్తాము, అంటూ అందరి ముందు అవమానపరిచి పంపేశాడు' అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకొంటూ చెప్తున్న భార్యను చూసి ,'"ఉండవే, ఏమైనా దక్షిణలు రానీ అంతో ఇంతో జమచేసి సరుకులు తెచ్చుకుందాం అంతా శివానుగ్రహం" అంటూ తులసి నీళ్లు టీ అమృతంలా తాగుతూ తనలో తనే సమర్ధించుకుంటూ తన ఉత్తరీయాన్ని సర్దుకుంటూ శంకరాచారి గారు మూడు ముళ్ళు ఆలయానికి బయలుదేరారు.


అలా రెండు కిలోమీటర్లు నడుస్తూ సన్నని వీధుల్లో కొందరు స్త్రీలు ఆవులకు బొట్టు పెట్టి అరటి పండ్లు తినిపించడం వాటికి ప్రదక్షిణాలు చేయడం చూస్తూ" 'ఆహా, ఆ ఆవు కున్న భాగ్యం కూడా నాకు లేదా, అనుకుంటూ కాలుతున్న కడుపుని రాసుకుంటూ నవ్వుకున్నారు శంకరాచారిగారు. అలా నడుచుకుంటూ ఆలయ ప్రాంగణంలోకి రాగానే అప్పటికే నలుగురైదుగురు భక్తులు లక్ష్మీనారాయణ స్వామి వారి గుడిలోనూ, ఒకరిద్దరు వినాయకుడి గుడి లోని ఉండడం చూసి 'అయ్యో లేట్ అయిపోయింది' అంటూ వడివడిగా మెట్లెక్కి తన గుడిలోని తలుపులు తీసి శుభ్రంగా శివలింగాన్నికడిగి భక్తిగా కొలుస్తూ , మధ్య మధ్యలో గుడి గంటలు మ్రోగిస్తూ భార్య పెరట్లో ఏరి కూర్చీన పూలదండను ఆ శివునికి దండగా వేసి గట్టిగా శివ స్తోత్రాలు చదువుతూ శివ లింగం పైన ఉన్న కంచు పాత్ర నుంచి నీళ్లు సన్నగా కారుతుండగా మెరిసిపోతూ నిగనిగలాడుతున్న శివలింగాన్ని ఎన్నిసార్లు చూసినా తనివితీరని అనుభూతి కలుగుతుంది.


అలా శివలింగం పైన విభూది జల్లుతూ 'శివాష్టకం పఠిస్తూ 'తన హారతి పళ్లెం లోని కర్పూర బిళ్ళలు, శుభ్రము గా తుడిచిన పాతకాలం నాటి శఠగోపం ఉంచి ,చిన్న వెండి పాత్రలో తులిసాకుల తీర్థం ఉంచి ఆశగా భక్తులకోసం ఎదురు చూడసాగారు పంతులుగారు. శంకరాచారిగారికి ఆ గుడి మీద వచ్చే ఆదాయం తప్ప మరే విధమైన సంపాదన లేక ఆ పెద్ద ఆలయంలో భక్తులు ముందు లక్ష్మీనారాయణ స్వామి వినాయకుడి దర్శనాలు చేసుకుని ఆ తర్వాత సమయం ఉంటే ' శివాలయం' కోస్తారు లేదా అట్నుంచి అటే ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోతుంటారు, అందువల్ల శివుడి కోవెలలో శంకరాచారి గారికి భక్తులు వేసే దక్షిణలు తక్కువగా వస్తాయి,కనుక ఎప్పుడు డబ్బులకు కటకట లాడుతుంటారు, ఆరోజు కూడా భక్తులు ఆ రెండు గుళ్ళు దర్శించుకుని తన వైపు చూడకుండానే నమస్కారం పెట్టి వెళ్ళిపోతు ఉండడం చూసి నిరాశ పడుతూ ఇంకా గట్టిగా గంట వాయిస్తూ శివ స్తోత్రం" ఓంకార మంత్ర సంయుక్తo, నిత్యం ధ్యానం తి యోగినః ,కామదం మోక్షదం తస్మై, శ్రీ ఓంకారాయ నమః "!అని మరి కొంచెం గట్టిగా చదువుతూ భక్తులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు శంకరాచారి గారు.


ఆ రోజుల్లో ఐదు పైసలు, పది పైసలు, పావలా, అర్ధరూపాయి, రూపాయి చలామణిలో ఉండేవి, అందుకనే భక్తులు ఆ చిల్లర అంతా తీసుకొచ్చి కొంచెం కొంచెం దక్షిణ ప్రతి కోవెలలో నే వేస్తుంటారు, అందుకనే రోజంతా శంకరాచారి కష్టపడిన ఐదు రూపాయలు కూడా రావు, ఎవరైనా వచ్చి అర్ధ రూపాయి, రూపాయి వేసిన ఒకవేళ ఐదు రూపాయలు వస్తే' నేను నా భార్య రెండు పూటలా నాలుగు రోజులపాటు చక్కగా 'గుత్తి వంకాయ కూర, మామిడి కొబ్బరి పచ్చడి, సాంబారు, మంచి పెరుగుతో కడుపునిండా భోజనం చేయొచ్చు, ఒకవేళ అ రెండు రూపాయలు వస్తే కూడా రెండు రోజులపాటు ఒక కూర, చక్కని ఇంగువ చారు, పల్చని మజ్జిగ తో రెండు పూటలా హాయిగా తినచ్చు అనుకుంటూ కళ్ళల్లోనే అరిటాకులు మీద భోజనం గుర్తుకు వచ్చి దిగాలుగా భక్తుల కోసం నిరీక్షించసాగారు పంతులుగారు.


ఇంతలో దూరంగా గా ఒక 'నవదంపతుల 'జంట నేరుగా తన దగ్గరికి రావడం చూసి పరుగుపరుగున మెట్లు దిగి '"రండి ,రండి శివార్చన చేస్తున్నాను మంచి సమయానికి వచ్చారు పుణ్య దంపతులు మీరు "అంటూ తీసుకుని వెళ్లి కూర్చోబెట్టి ఎలాగైనా వీరు మంచి దక్షిణ ఇవ్వరా, అన్న ఆశతో శివుడి మీద పూలు వేస్తూ విభూతి పెడుతూ ఎంతో నిష్టగా పూజ చేస్తూ చివరగా హారతి ఇస్తూ ఒక చేత్తో గంట మోగిస్తూ "సర్వమంగళ మాంగల్యే ,శివే సర్వార్థ సాధికే ,శరణ్యే త్రయంబకే దేవి, నారాయణీ నమోస్తుతే"! అని అంటూ గట్టిగా చెబుతూ మంగళ హారతి ముగించారు పంతులుగారు.


పూజ ముగించి హారతి పళ్లెం లో అతి పురాతనమైన వెండి శఠగోపం అమర్చి, ఇంకోపక్క తులసి దళాలతో నిండిన వెండి గిన్నెలో తీర్థం ఉంచి, హారతి కర్పూరం వెలుగుతుండగా గణగణ గంట వాయిస్తూ ఆ నవదంపతుల నామ గోత్రాలు చెప్తూ వారిద్దరి తలమీద అక్షతలు వేసి శఠగోపం పెట్టి మంత్రాలు చదివారు, వారిద్దరూ శంకరాచారి గారి పాదాలకు నమస్కరిస్తూ "పంతులుగారు, ఈసారికి ఏమనుకోకండి, తేచ్చిన డబ్బులు అన్ని ముందున్న రెండు గుడిల్లోనూ వేసాము, ఈ ఒక్క రూపాయి మాత్రమే మిగిలి ఉన్నది అని పళ్ళెం లో వేసి మరోసారి నమస్కారం చేసి వెళ్లిపోయారు, ఎంతో ఆశతో ఉన్న పంతులుగారు ఒక్కసారి నిర్ఘాంత పోయారు, అనుకున్నది ఒకటి ,జరిగేది ఒకటి అన్న మాటల్లోనే పరమార్థం ఆ శివుడే తెలిపాడు అనుకుంటూ పళ్లెం కింద పెట్టి నేల మీద కూర్చుండి పోయారు.


ఇక ఈ రోజు కూడా నిరాశే ఎదురయింది, సమయం అయిపోతున్నది ఇంకా ఎవరైనా వస్తే బాగుండు ను అనుకుంటుండగానే పచారీ కొట్టు కోమ టయ్య, తన గుడి వైపు రావడం గమనించి అయ్యో, ఎలాగరా దేవుడా, నేను ఇంటిదగ్గర ఉండను అని తెలిసి డబ్బుల కోసం నేరుగా గుడి కే వచ్చాడు ఏం చెప్పాలి, అనుకుంటుండగానే "పంతులుగారు ,మీ దర్శనం కరువైపోయింది ఈ పూలు శివయ్యకు అలంకరించండి, మీకోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తా, నా 'వంద రూపాయల బాకీ ఎప్పుడు చెల్లిస్తారు ?అని అడగగానే "కొంచెం వ్యవధి ఇవ్వండి అప్పు తీర్చే ఇస్తాను 'అని బతిమాలుతూ ఉండగానే తీర్థం తీసుకుంటున్న సమయంలో పళ్లెంలో ఉన్న ఆ 'ఒక్క రూపాయి' కూడా తీసుకుని 'మీ ఖాతాలో జమ చేస్తాను అంతగా కావలిస్తే రేపుమీ భార్యను కొంచెం బియ్యం పప్పు పట్టుకెళ్ళమనండి, అంటూ నమస్కరిస్తూ వెళ్ళిపోయాడు కోమటయ్య. ...


ఇక ఆ రోజు గుడి తలుపులు మూస్తూ "శివయ్య నిత్య పూజలు చేసే వాడికి ఈ అగత్యం ఏమిటి? ఏమి తిని బతకాలి స్వామి, 'విధి ,నన్ను బంతాట ఆడుకుంటుంటే నువ్వు ఏమీ చేయలేవా? స్వామి,అనుకుంటూ రెండు అరటి పళ్ళు చిన్న బెల్లం ముక్క సంచిలో వేసుకొని కాళ్ళీడ్చుకుంటూ తన ఇంటి వైపు నడవసాగాడు శంకరాచారిగారు.


వీధి లో నడుస్తున్న పంతులు గారికి ఒక దృశ్యం కనబడింది ,ఒక స్త్రీ అక్కడున్న బిచ్చగాడికి పళ్లెంలో కూర ,పచ్చడి అన్నంతోసహ వేయడం చూసి '"పోనీలే,ఆ బిచ్చగా డి పని మనము చేయలేము వాడినైనా బాగా చూడు శివయ్య",అనుకొంటు ఇంటికి వచ్చిన భర్తకు భర్తకు కాళ్లకు నీరు అందించి తుడుచుకోవడానికి తువ్వాల అందిస్తూ భర్త ముఖం చూసుకుని 'ఇవాళ కూడా ఏమీ లేనట్టే ఉంది 'అనుకుంటూ భార్య పార్వతమ్మ లేని చిరునవ్వు తెచ్చుకొని "రండి ,రండి కూర్చోండి ,అంటూ త్వరగా తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపం పెట్టి నమస్కరించి "చల్లగా చూడమ్మా! అని ప్రార్థిస్తూ నాలుగు రెమ్మలు కోసి ',ఇదిగోండి, ఇవి తినండి, అని తను కూడా కొన్ని తులసి ఆకులు తింటూ భర్త వైపు చూస్తూ "ఏమండీ ,ఈ తులసి ఆకుల రుచి ఎంత అమోఘం,పంచభక్షపరమాన్నలకైన ఆ రుచి రాదు కదండీ,"అంటూ చిరునవ్వుతో అంటున్న భార్యను చూసేసరికి పడిన కష్టం అంతా మర్చిపోయి ఆహ్లాదంగా మారిపోయింది శంకర అచారిగారి మనసు.

ఇద్దరు భార్యాభర్తలు తులసి ఆకులు తృప్తిగా తింటూ నవ్వుకుంటూ తమ మనసులోని బాధ ని మరిచిపోయారు.

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

71 views0 comments

Comments


bottom of page