కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Thalanilalu' written by Lakshminageswara R ao Velpuri
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
మానసిక వికలాంగుడైన కొడుకును కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లితండ్రులు వల్లి, కార్తీక్ లు.
వారి ప్రయత్నాలకు భగవంతుడి కరుణ కూడా తోడయింది.
వాళ్ళ బాబు రమేష్ కోలుకున్నాడు.
ఈ కథను ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మి నాగేశ్వర రావు గారు రచించారు.
సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటలకు, 'విశాఖపట్నం రైల్వే స్టేషన్' చాలా కోలాహలంగా ఉంది. ఎందుకంటే 'తిరుమల ఎక్స్ప్రెస్' విశాఖపట్నం నుండి తిరుపతికి బయలుదేరడానికి సన్నద్ధం అవుతుంది. ఇంతలోనే ఒక ఎనౌన్స్మెంట్-
"విశాఖపట్నం నుండి తిరుపతి బయలుదేరు 'తిరుమల ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం నెంబర్ 5 'లో ఉన్నది , మరో పది నిమిషములలో బయలుదేరుటకు సిద్ధంగా ఉంది” అన్న మాటలు మొదట తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ, హిందీలోనూ, వరుసగా మైక్లో చెప్తుండటం వల్ల ప్రయాణికుల్లో ఒక్కసారి అలజడి రేగింది. ప్లాట్ఫారం నెంబర్ 5కు చేరటానికి 'ఓవర్ బ్రిడ్జి ' లు దాటి తమ తమ సామాన్లతో ప్రయాణికులు పరిగెడుతున్నారు.
అప్పటికే ఆటో లేటయి పోవడం వలన తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కడానికి కార్తీక్, వల్లి, వారి కొడుకు రమేష్, ఆదరాబాదరాగా ఆటో దిగారు.
వల్లి కొడుకు చేయి పట్టుకుని నడుస్తుంటే, “ఏమిటి వల్లి? తొందరగా పద! చూడు జనాలు ఎలా ఉన్నారో.. వాడిని తొందరగా తీసుకురా” అన్నాడు కార్తీక్. లగేజ్ పట్టుకుని వడివడిగా ప్లాట్ ఫామ్ లో ఉన్న 'తిరుమల ఎక్స్ప్రెస్ ' దగ్గరకు వచ్చి జనాల్ని చూసుకుంటూ తన 'రిజర్వుడు 3 మూడు బెర్తల కింద సామాను సర్దాడు.
భార్య, కొడుకు కనిపించగానే, 'రండి రండి టైం అయిపోతుంది' అంటూ వాళ్ళిద్దర్నీ కూడా లోపలికి తీసుకెళ్లి బెర్త్ మీద కూర్చోబెట్టి, తన ఆయాసం తీర్చుకున్నాడు కార్తీక్.
విశాఖపట్నం నుండి బయలుదేరి మర్నాడు సరిగ్గా టైం కి చేరే తిరుమల ఎక్స్ప్రెస్ అంటే మహా ఇష్టం ప్రజలకు. అందుకని 365 రోజులూ నిండు గర్భిణిలా, ప్రయాణికులతో బయలుదేరుతుంది తిరుమల ఎక్స్ప్రెస్. అందులోనూ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరుగుతున్న రోజులవి. ఆ కలియుగ దేవుడు దర్శనార్థమై జీవితాంతం పరితపిస్తారు భక్తులు. ఎన్ని కష్టాలు పడినా ఓర్చుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే చాలు కష్టాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి అన్న నమ్మకం తో ఉంటారు. అటు ధనికులు, ఇటు పేదలు నిత్యము ఎప్పుడెప్పుడు దర్శిచుకుందామా అని ఎదురుచూసే ఆరాధ్య దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారు.
అసలే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. అందులోనూ పరమ పవిత్ర దినాలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడమే జీవిత సాఫల్యం అన్నట్లుగా ప్రజలు తండోపతండాలుగా వెళుతున్నారు. ఇది ప్లాట్ ఫాం నెంబర్ 5. అందులో 16 బోగిలలో నాలుగు బోగీలు జనరల్ కంపార్ట్మెంట్ ఉండడంతో ఒకరినొకరు తోసుకుంటూ సీటు కోసం తాపత్రయపడుతున్నారు.
ఎలాగోలా 'కార్తీక్ , భార్య వల్లి, కొడుకు రమేష్ తమ సీట్లలో కూర్చుని, హాయిగా ఊపిరి పీల్చుకున్నారు,
“చూడు వల్లి ! మనం ఎంత అదృష్టవంతులమో, మనకు కూర్చోడానికి ఆ దేవుడు చూపించాడు. లేకపోతే మన అబ్బాయికి 'తలనీలాలు ' ఇప్పించడానికి అది కూడా 'వైకుంఠ ఏకాదశి పర్వదినాన', ఆ ప్రత్యక్ష దైవం 'వెంకటేశ్వర స్వామి 'దర్శనం జరుగు జరగబోతు ఉండడం, అంతా మన అదృష్టం అన్నాడు కార్తీక్.
“అవును నిజమే నండి! నేను ఏనాడో చేసుకున్న పుణ్యం, ఈ రకంగా నెరవేరుతుంది, అదీ మన అబ్బాయి కూడా కోలుకొని, దేవుని దర్శనార్థం తిరుపతి కి వెళ్తున్నాము” అంటూ జవాబిస్తూ కొడుకు చేయి పట్టుకొని రాస్తూ చూసింది.
అప్పటికే 22 ఏళ్ల కొడుకు రమేష్ అన్నీ వింతవింతగా చూస్తూ, మధ్య మధ్యలో నవ్వుతూ, చాలా సంతోషం గా ఉండడం , ఆ తల్లిదండ్రులకు ఇద్దరికీ ఆనందంగా ఉంది.
అలా రెండు గంటలు ప్రయాణం జరిగేసరికి ఆ బోగీలోని కాఫీ టీ సమోసా అంటూ అమ్మేవాళ్ళ రొద, రైలు పట్టాల మీద పరిగెడుతూ చేస్తున్న శబ్దం.. మధ్య మధ్యలో రైలు హారన్.. అంతా కలిసిపోయి వింతైన లోకం లోకి వచ్చామా అనుకున్నారు ప్రయాణికులు.
అదే బోగీలో కొడుకు రమేష్ చక్కగా సమోసాలు తింటూ, 'నాన్నగారూ! నాన్నగారూ! చూడండి, ఆకాశంలో మబ్బులు ఎలా పరిగెడుతున్నాయో” అంటూ ఆనందంతో అరిచేసరికి, అక్కడే కూర్చున్న తోటి ప్రయాణికులు కార్తీక్ కొడుకు రమేష్ ని వింతగా చూస్తున్నారు.
ఎందుకంటే అతడు చూడ్డానికి ఎంతో పొడవుగా,తెల్లని ముఖ వర్చస్సుతో, నల్లని ఉంగరాల జుట్టుతో సినిమా హీరో లాగా ఉన్నాడు. కానీ అమాయకంగా అరుస్తూ, మూడేళ్ల అబ్బాయిలాగా, అప్పుడప్పుడే మాటలు వస్తున్న చిన్న పిల్లాడిలా అరుస్తూ ఉండడం, అక్కడున్న వారికి వింతగా అనిపించింది.
తండ్రి మెల్లిగా 'అవును నాన్నా! ఆకాశంలో మబ్బులు కూడా మనతోపాటు తిరుపతి వస్తున్నాయి, ఆ దేవదేవుడికి వర్షం తో స్నానం చేయించడానికి” అంటూ సర్ది చెప్పడం , కొందరికి చికాకుగా అనిపించింది.
అలా ప్రతి మాటు భోగి లోంచి లేచి, కిటికీ పక్క చూస్తూ, “నాన్నగారూ! మనతోపాటు కొంగలు, పిట్టలు కూడా వస్తున్నాయి, బలే బలే!” అంటూ చేతులు ఎగర వేస్తూ అరవడం, తోటి ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉన్నా భరిస్తున్నారు, కార్తీక్ భార్య వల్లి కూడా తన 22 ఏళ్ళ కొడుకును చెయ్యి పట్టుకుని లాగుతూ, “అలాగే నాన్నా, వచ్చి కూర్చో! అలా అరవకూడదు, అందరూ మనల్ని తిడతారు” అంటూ, బుజ్జగించి ఏదో తినడానికి ఇచ్చి ఎంతో ప్రయాసతో సీట్లో కూర్చో పెట్టింది తల్లి.
అలా ప్రయాణం సాగుతూ 'రాజమండ్రి గోదావరి బ్రిడ్జి' వచ్చేసరికి, రమేష్ గాభరా పడి పోతూ, “అమ్మ! మన రైలు పడిపోతుంది, నాకు భయమేస్తుంది! మనం చచ్చిపోతామా!?” అంటూ అరవడం పక్క భోగి లలోకి కూడా వినపడి, అందరూ వచ్చి రమేష్ ను ఒక వింత మనిషి లా చూసారు.
అది ఎంతో అవమానకరంగా భావించిన కార్తీక్, “లేదు నాన్న! ఇది 'గోదావరి బ్రిడ్జి '. ఇది దాటితేనే మనం తిరుపతి కి వెళ్తాము. రైలు పడిపోదు! భయపడకు” అంటూ రమేష్ ని కూర్చోబెట్టి తల నిమిరాడు.
అదిచూసి ఏవగింపుంగా, ఎవరికి వారు విసుక్కుంటూ 'ఏంట్రా బాబు! ఇలాంటి కుటుంబంతో మన ప్రయాణం సాగినట్లే” అంటూ ఎవరికి వారు వెళ్ళిపోయారు.
సాయంత్రం అయిపోతూ ఉండడంతో, అందరూ కబుర్లలో పడ్డారు. ఇంతలో మళ్ళీ రమేష్ ఒక్కసారిగా లేచి, “నాన్నగారూ, నాన్నగారూ! పెద్ద పెద్ద చెట్లు, మనతో రాకుండా వెనక్కి పరిగెడుతున్నాయి, చూడండి! అంటూ తండ్రిని కుదిపాడు.
లేని ఓపిక తెచ్చుకుని 'లేదు నాన్న ! అవి అలానే ఉంటాయి, మన రైలే ముందుకు పరిగెడుతుంది” అంటూ సముదాయించడం, ఎంత అల్లరి చేస్తున్నా, కొడుకుని సమర్థిస్తూ, మెల్లిగా బుజ్జగించడం, ఆ బోగీలోని ప్రయాణికులుకు అస్సలు నచ్చలేదు.
ఎదురుగా కూర్చున్న ఒక కుటుంబం విసిగిపోయి, “ఏంటి సార్ !! మీ అబ్బాయి చూడడానికి అంత బాగున్నాడు, కానీ వెకిలి చేష్టలతో మమ్మల్ని అందరినీ విసిగిస్తున్నాడు, ఇంత పెద్ద వయసులో మీ అబ్బాయి ప్రవర్తన, చిన్నపిల్లల మాదిరిగా ఉంది. ఏదైనా డాక్టర్ కు చూపించ లేక పోయారా? మమ్మల్ని శాంతంగా ఉండనీరా!” అంటూ ఒక్కొక్కరుగా ప్రశ్నల వర్షం కురిపించారు.
తల్లిదండ్రులైన కార్తీక్, వల్లిలకు వారికి ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక, “చూడండి! మిమ్మల్నందరినీ మమ్మల్ని క్షమించమని కోరుతున్నాను, మా అబ్బాయి రాత్రి పడుకున్నాక మీకు వివరంగా చెప్తాను, అంతవరకూ దయచేసి ఓపిక పట్టండి!” అంటూ దీన వదనంతో చేతులు జోడించి అడిగారు.
అదిచూసి, “సరే, సరే! తొందరగా పడుకో పెట్టండి, రాత్రి కాసేపయినా పడుకోవాలి. ప్రశాంతంగా ' శ్రీ వెంకటేశ్వర స్వామి 'దర్శనం చేసుకోవాలి” అంటూ విసుగ్గా కూర్చున్నారు తోటి ప్రయాణికులు.
ఆ రాత్రి కొడుకు రమేష్ కు చిన్న పిల్లాడికి తినిపించినట్లు గోరుముద్దలు తినిపించి , శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను, కథలు ,కథలుగా చెప్తుండే సరికి, రోజంతా అరిచి అరిచి అలసిపోయిన రమేష్, తల్లి ఒడిలో తల పెట్టుకొని, తండ్రి ఒడిలో కాళ్ళు పెట్టుకుని, మగత నిద్రలోకి జారిపోయాడు.
అలా రాత్రి11 గంటల సమయంలో విజయవాడ దాటాక ,అందరూ పడుకునే సమయంలో ఎదురుగా ఉన్న కుటుంబం, కార్తీక్ ను చూస్తూ “ఏంటి సార్! మీ అబ్బాయి గురించి చెప్తానన్నారు కదా చెప్పండి. మళ్లీ రాత్రి లేచి గోల చేయడు కదా!” అంటూ ఆత్రుత గా అడిగారు.
“లేదు సార్! వాడు పడుకుంటే మళ్లీ ఉదయాన్నే లేస్తాడు. మీరు నిశ్చింతగా పడుకోండి’ అంటూ చెప్పాడు కార్తీక్.
“అసలు మీ అబ్బాయికి ఏమి జరిగిందో చెప్పండి?” అని వాళ్ళు అడిగేసరికి, “మరేం లేదు సార్! మావాడు చిన్నతనం నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకే 'విశాఖపట్నం మెంటల్ ఆస్పత్రి' లో చికిత్స పొందుతూ, కోలుకుంటూ, మెల్లిగా మాట్లాడటం, చదవడం నేర్చుకున్నాడు. సరిగ్గా పెరుగుతున్నాడు అని సంతోషించే లోపలే మరో ఉపద్రవం వచ్చిపడింది. వయసు వస్తున్న కొద్దీ మానసికంగా కుదుటపడినా, కొంచెం చిన్న పిల్లవాడి మనస్తత్వం మారలేదు. దానికి కూడా మందులు వాడుతున్న సమయంలో, ఆ విధి మా మీద పగ బట్టింది. వాడికి కొంచెం కొంచెం గా, కంటి చూపు పోసాగింది. 20 ఏళ్ల వయసు వచ్చేసరికల్లా ,ఎన్ని వైద్య సదుపాయాలు అందించినా లాభం లేక, వాడి రెండు కళ్ళు చూపును కోల్పోయాయి. మా అబ్బాయిని, మమ్మల్ని మరింత అంధకారంలోకి త్రోసి వేశాయి. రెండు సంవత్సరాల పాటు మేము తిరగని ఆసుపత్రి లేదు. అయినా లాభం లేక పోయింది. అలా మా మీద విధి పగబట్టిన త్రాచు పాములా వెంటాడుతూ, మరీ కాటేస్తున్న ఈ సమయంలో లో వైజాగ్ లో ఉన్న"L.V.prasad eye hospital" కి ఒక కంటి వైద్య బృందం వచ్చింది. అప్పటికే చాలా సార్లు ప్రయత్నం చేస్తుండడంతో, అక్కడి డాక్టర్లు మా అబ్బాయి గురించి చెప్పారు. వారు వెంటనే దయతో మమ్మల్ని పిలిచి, మా అబ్బాయి రమేష్ కి అన్ని విధాల 'లాజర్ టెస్ట్' లు చేసి అత్యంత అధునాతనమైన ట్రీట్మెంట్ తో ఎంతో శ్రమించి, రెండు కళ్ళకు చూపు వచ్చేటట్టు చేశారు. రమేష్ కుర్రవాడు కాబట్టి ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ కూడా తట్టుకొని నిలబడ్డాడు. ఆ విధంగా కంటి దృష్టి మరలా బాగా వచ్చే వరకు అక్కడే ఉంచి , మా అబ్బాయికి 'నేత్ర దానం 'చేసిన మహనీయులు ఆ కంటి వైద్యులు.
ఆ 'కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి' కృపవల్ల మా అబ్బాయి కి కంటి దృష్టి వచ్చింది. అందువలన ఆస్పత్రిలోనే రమేష్ తల్లి, కంటిచూపు వచ్చిన వెంటనే ఏడుకొండలవాడికి "తలనీలాలు " సమర్పిస్తామని మొక్కులు మ్రొక్కింది.
ఆ కారణంగా మేము ముగ్గురము, ఆ ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవడానికి, 'తలనీలాలు ' అర్పించడానికి, తిరుపతి బయలుదేరాము. మా అబ్బాయి రమేష్ వయసులో పెద్దవాడు అయినా. ఎన్నో ఒడిదుడుకులు పడుతూ తేరుకొంటున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఒక్కసారి చూపు రావడంతో, కనిపించినవన్నీ అద్భుతాలుగా ఊహిస్తూ, ఆనంద పడుతున్నాడు తప్ప మరేమీ లేదు సార్ !!” అంటూ కళ్ళనీళ్ళు కారుస్తూ చెప్పారు వల్లి, రమేష్ లు.
అందరూ ఆశ్చర్యంతో వింటూ, 'అయ్యో అయ్యో! మేము చేసిన పని ఎంతో స్వార్థపూరితమైనది , మమ్మల్ని క్షమించండి!” అంటూ భోగి లో ఉన్న వాళ్లంతా కార్తీక్, వల్లి ల చేతులు పట్టుకుని “మేము ఎంతో బాధపడుతున్నా ఉన్నాం సార్,! మమ్మల్ని మీరు మనసారా క్షమించకపోతే, ఆ కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు! “అంటూ బ్రతిమలాడారు.
వారిని చూస్తూ, “పర్వాలేదండి! మీ అందరికీ ఆ కలియుగ దేవుడు "శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వైకుంఠ ఏకాదశి పుణ్యదినంలో మంచిగా జరగాలని మేము కూడా మనసారా కోరుతున్నాము!”. అని వల్లి కార్తీక్ అన్నారు.
ప్రతి ఒక్కరూ రమేష్ దగ్గరకు వచ్చి, పడుకున్న రమేషు తలను ప్రేమగా రాస్తూ, ‘మమ్మల్ని క్షమించయ్యా,!! ఎప్పుడూ మనిషి ముఖం బట్టి, ప్రవర్తన బట్టి, వారి విలువలను తక్కువ అంచనా వేయకూడదు! ఏనాడూ మనం ఎదుటి మనిషిని చులకనగా చూడకూడదు. అలా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ,తాము గౌరవం పొందాలి!’ అని మనస్సులోనే అనుకున్నారు. ‘స్వామి !! మమ్మల్ని క్షమించు, ఆ అభం శుభం తెలియని అమాయకుడైన రమేష్ ను సర్వదా రక్షించు!’ అంటూ తమలో తామే పశ్చాత్తాప పడుతూ, ప్రయాణం సాగించి, ఆ మర్నాడు తేలిక పడిన హృదయంతో వైకుంఠ ఏకాదశి "శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
శుభం
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Comentarios