top of page

చెక్క కంచం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.'chekka Kancham' Written By Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

కార్పెంటర్ రాఘవయ్యకు డెబ్బై ఐదేళ్లు. చెయ్యి తిరిగిన వడ్రంగి..

కొడుకు నాగరాజు కూడా మంచి పనిమంతుడే.

కానీ పక్కా తాగుబోతు.

మద్యం మత్తులో తండ్రిని చులకనగా చూస్తాడు.

రాఘవయ్య మనవడు వేణు తాత పరిస్థితికి కరిగి పోతాడు.

తన తండ్రికి బుద్ధి చెబుతాడు.

ఈ కథను ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు గారు రచించారు.


"విశాఖపట్నం జిల్లా 'ఆనందపురం 'గ్రామం లో తన జీవితమంతా 'కార్పెంటర్ 'గా పని చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు 'రాఘవయ్య గారు, ఆ చిన్న ఊరిలో ఎవరైనా మంచి నగిషీ తో మంచాలు, కుర్చీలు చేయించాలన్నా ప్రత్యేకంగా రాఘవయ్య గారి దగ్గరికి వచ్చేవారు, ఆయన వృద్ధాప్యంలో కూడా అంతో ఇంతో చిన్న పనులు చేస్తూ కాలం గడపసాగారు. తన '75 వ సంవత్సరపు 'పడిలో ఇక ఏ పనీ చేయలేక, భార్య పోయాక, ఒక్కగానొక్క కొడుకు ' నాగరాజు ' తో ఉంటూ, కోడలు నసుగుతూ వండి పెడుతున్న రుచీపచీ లేని తిండి తింటూ, ఆ చిన్న ఇంట్లో ఒక నులక మంచం మీద పడుకుని గతించిన తన భార్య ఆప్యాయత, అనురాగం క్షణం క్షణం తలుచుకుంటూ, కాలం వెళ్లబుచ్చసాగాడు రాఘవయ్య.

ఇక కొడుకు నాగరాజు కూడా మంచి పనిమంతుడు, తండ్రి దగ్గర నేర్చుకున్న 'కార్పెంటర్ వర్క్' బాగానే చేస్తూ, తన భార్య లక్ష్మి, కొడుకు 'వేణు 'తో సంసారం నెట్టుకొస్తున్నాడు.

కానీ నాగరాజు కి ఒక చెడు అలవాటు ఉంది, సాయంత్రం అలా ఊరి చివర ఉన్న 'కల్లు పాకలో' రెండు మూడు కుండల కల్లు తాగి, ఇంటికి వచ్చి నానా హంగామా చేయడం, రోజువారి అలవాటయిపోయింది.

ఆరోజు కూడా పూటుగా కల్లు తాగి ఇంటికి వచ్చి, ఒసేయ్! లచ్చి ఏటి వండావు? నాకు ''నాటుకోడి కూర' సేశావా లేదా? అంటూ కాళ్ళు తడబడుతున్నా, కళ్ళు మూతలు పడుతున్నా, మంచి నషాలో, ఆసరాగా గోడ పట్టుకొని భార్యను అడిగాడు.

లేదయ్యా! 'ఎండు చేపల పులుసు' పెట్టా వచ్చితిని, తొంగో ! అని చెప్పే సరికి 'నీ ..! నీకు కోడి కూర సేయమని డబ్బులు ఇస్తే మీ బాబుకి ఇచ్చావా, ఉండు, నీ కాళ్లు విరగ కొడతా, అంటూ తూలుతూ భార్య జుట్టు పట్టుకుని గోడకేసి బాద బోయాడు.

“అయ్యో, రక్షించండి బాబు ! ఈ తాగుబోతు సచ్చినోడు … అంటూ అరుస్తుండే సరికి, ఆ పక్కనే ఉన్న ముసలి మామగారు' రాఘవయ్య ఓపిక తెచ్చుకుని, లేచి కొడుకు చేయి పట్టుకుని, ఊరుకో రా! నాగ తాగి సల్లగా తొంగోక, ఆడపిల్ల మీద సేయ్యేస్తావురా! నీకు సిగ్గుగా లేదురా! అంటూ అనేసరికి మంచి మత్తులో ఉన్న నాగరాజు తండ్రిని పట్టుకుని 'పోరా పెద్దోడా! అందుకే రా అమ్మ నిన్ను వదిలి పోనాది. ఛీ ఛీ నీ సిగదరగ, నీ వల్లే కదరా దీంతో లగ్గం అయింది! ముందు నిన్ను తన్నాలి రా, పెద్దోడా!” అంటూ అరుస్తూ 75 ఏళ్ల వయసున్న తండ్రిని కూడా తోసేసరికి ,వృద్ధుడు కింద పడి పోయి లేవలేక, ' ఛీ ఎదవ! నువ్వు పురిటిలోనే పోయి ఉంటే బాగుండేది రా! అంటూ మూలుగుతూ వెళ్లి మంచం మీద పడి కన్నీరుమున్నీరు కాసాగాడు ఆ వయోవృద్ధుడు రాఘవయ్య.

.. ఇది అంతా చూస్తున్న నాగరాజు 7 'ఏళ్ల కొడుకు' వేణు ' ఇదేదో సినిమా లాగా ఉన్నట్టు, ఆ చిన్నారి కళ్ళు ఆశ్చర్యంగా ఒక పక్క అమ్మ ఏడుస్తూ ఉండడం, మరోపక్క తాత పడిపోయి ఏడవడం ,నాన్న తాగేసి చిందులు వేయడం, ఏమీ అర్థం కాక ,చివరకు అమ్మ ని అనుసరిస్తూ, కొంగు పట్టుకొని తను కూడా గుక్క పట్టి ఏడవడం మొదలుపెట్టాడు, ఇలా ఏనాడు సుఖం ,శాంతి లేని ఆ ఇంట్లో ఒకపక్క కొడుకు అనాగరికం, మరోపక్క కోడలి కసుర్లు, విసుర్లు మధ్య జీవితం" నడి సముద్రంలో లో తుఫానుకు చిక్కుకున్న నావ లా ఊగిసలాడడం" పరిపాటి అయిపోయింది రాఘవయ్య కి.

త్రాగిన మత్తు, వదిలిన తర్వాత 'రాముడు మంచి బాలుడు' తన కార్పెంటర్ పని లో మునిగిపోయి, ఏమీ జరగనట్లు అందరితో ఉంటూ, మళ్ళీ చీకటి పడే సరికల్లా, 'నరరూప రాక్షసుడి లా' మారిపోతూ ఉంటాడు నాగరాజు. ఇక ఈ మనిషిలో మార్పు రాదని నిశ్చయించుకున్నా, భార్య కూడా ఆస్తమాను విసుక్కుంటూ, చివరకు మామ గారైన రాఘవయ్య మీద కూడా చిరాకు పడుతూ, “ఎలా కన్నావ్ రా ముసలి మామ? ఇలాంటి కొడుకుని, నా పీక కు తగిలించి, మీ ఆవిడ సక్కా పైలోకానికి పోయింది, నువ్వు ఎప్పుడు పోతావో? నీతో పాటు నీ కొడుకును కూడా తీసుకుపో!! నేను వెధవ ముండ నైనా పర్వాలేదు, నా కొడుకు ను బాగా చదివించి, మంచి మనిషిని చేస్తాను! అంటూ అరుస్తూ ఒక మట్టి కుండలో ఇంత అన్నం, మజ్జిగ వేసి ,రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, పక్కన ఒక చిన్న ఊరగాయ ముక్క పెట్టీ, ఇంద ఇది తిని సావు!” అంటూ ఒక' ఊరి కుక్క కు' పెట్టినట్లు పెట్టి, చిరుబురు లాడుతూ వెళ్ళిపోయింది కోడలు లక్ష్మి.

ఇంత అనాదరణకు లోనవుతున్నా రాఘవయ్య కు కోపం రాలేదు, ‘సహజమే ! ఏ ఇల్లాలు అయినా, నా కొడుకు పెడుతున్న బాధలకు ఇలానే అంటుంది, ఓరి దేవుడా! ఈ నరకం నుంచి నన్ను తొందరగా తీసుకుపో!’ అంటూ కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయేలా బాధపడ్డాడు రాఘవయ్య.

ఇన్ని మాటలు, శాపనార్థాలు పడుతున్న రాఘవయ్య లేని ఓపిక తెచ్చుకుని, కోడలు తెచ్చిన మట్టి కుండ తన వణుకు తున్న చేతులతో ఎత్తే సరికి, ఒక్కసారిగా చేజారి పోయింది, అన్నం కుండ. అది మట్టికుండ కావడం వలన, పగిలిపోయి అంతా చిందరవందరగా పడి పోయింది, ఆ శబ్దం విన్న నాగరాజు వచ్చి, “ఓరి ముసలోడా! నా సంపాదన అంతా నీ మట్టికుండలకే అయిపోతుంది రా! నాన్న ,ఇక నీకు ఈరోజు నుంచి ఎక్కడైనా ఆకులు తెచ్చి, అందులో అన్నం పెడతాను ,ఇష్టం ఉంటే తిను లేదా సావు! “ అంటూ తిడుతూ కన్నతండ్రి అని కూడా చూడకుండా, “నీకు ఈ పొద్దు మాడ్చేస్తాను! కనీసం ఆకలితో నైనా సత్తావు!” అంటూ తండ్రిని మంచం మీద పడేసి వెళ్ళిపోయాడు నాగరాజు.

ఇదంతా చూస్తున్న చిన్న పిల్లాడు, మనవడు అయినా 'వేణు 'నాన్న ! తాతని ఏమీ అనకు. నా అన్నం పెడతాను, తాత నడవలేడు కదా! “అన్న కొడుకుని కూడా ఒక దెబ్బ వేసి, “పోరా, 'ఎదవ, నువ్వు కూడా ముసలాడితో సావు!” అంటూ దయాదాక్షిణ్యాలు లేకుండా, కల్లు కుండలో కల్లును గడగడ త్రాగుతూ, “ఒసేయ్ లచ్చి! నీమావ నీ కొడుకు,నువ్వు, కలిసికట్టుగా సావండి!” అంటూ తూగుతూ బయటకు వెళ్ళిపోయాడు ఏమాత్రం కారుణ్యం లేని నరరూప రాక్షసుడు నాగరాజు.

ఆ మర్నాడు ప్రొద్దున్నే మళ్లీ పని ప్రారంభించి, తన కార్పెంటరీ పనిలో నిమగ్నమయ్యాడు నాగరాజు. కానీ పెరట్లో నుంచి ఏదో కొడుతున్న శబ్దం వినిపించి అటువైపుగా వెళ్ళాడు, తన కొడుకు 'వేణు 'ఒక చెక్కని ఒక గుండ్రంగా ఉన్న ప్లేట్ లా చెక్కుతూ, నానా కష్టాలు పడుతున్నాడు, ఆ చిన్ని చేతులు ఎంతో జాగ్రత్తగా 'పళ్ళెం సైజు ఒక చెక్క కంచం' తయారు చేస్తూ, మధ్య మధ్య ఆ చిన్నారి నుదిటి మీద పడుతున్న చెమటను తుడుచుకుంటూ, ఎండలో కొడుకు పడుతున్న కష్టాన్ని చూస్తూ, తండ్రి నాగరాజు చలించిపోయాడు.

“ఏంట్రావేణు! నా సామాన్లు లోంచి సుత్తి, రంపం, మేకులు తీసావా? ఏం చేస్తున్నావు? ఏదైనా బొమ్మ చెక్కుతున్నావా?” అని అడుగుతూ దగ్గరకు వచ్చి చూసేసరికి ,చక్కగా మంచి అంచుతో చెక్కిన ఒక అన్నం తినే కంచం చెక్కాడు.

అది చూసిన నాగరాజు ఎంతో అందంగా ఆ చిన్నారి ఊహకు ఆశ్చర్యపోతూ, “ఏంట్రా ఇది?” అని అడిగాడు ,

“ఏం లేదు నాన్న! నీకోసం అన్నం తినే కంచం తయారుచేశాను” అని చూపించాడు. “నాకెందుకురా? నాకు ఉన్నది కదా! ఎందుకు సామాన్లు పాడు చేస్తావ్?” అనేసరికి 'లేదు నాన్న ! నువ్వు కూడా తాత గారిలా ముసలివాడు అయిన తర్వాత, నీకు నేను మట్టికుండలో అన్నం పెడతాను, అది అస్తమాను పగిలిపోతుంది కదా! తాతగారు చూడు, భోజనం ఆకుల మీద తింటున్నారు, అసలు తినలేక ఏడుస్తున్నారు! అది చూసి నువ్వు కూడా పెద్దయ్యాక, నీకు అలా జరగకూడదని, నేను ఒక మంచి 'చెక్క కంచం' తయారుచేశాను, పాపం తాతగారు ఎంత బాధ పడుతున్నారో కదా !!” అని అనేసరికి, అక్కడే ఉన్న తల్లి లక్ష్మి, తండ్రి నాగరాజు లకు "కాళ్ళ కింద భూమి కరిగిపోయి అగాధంలోకి పడిపోతున్నట్టు"' అనిపించింది.

' ఒరేయ్ వేణు, చిన్నవాడివి అయినా మాకు బాగా బుద్ధి చెప్పావు రా! నేను ఇక ముందు మందు తాగను, మిమ్మల్ని తిట్టను, మీ అమ్మను ఎంతో ప్రేమగా చూసుకుంటాను, ముఖ్యంగా మీ తాత గారిని... అదే మా నాన్న గారిని కంటికి రెప్పలా చూసుకుంటాను, ఆయనకు మనతోపాటే మంచి కంచంలో భోజనం పెడతాను !నా భవిష్యత్తు నా కళ్ళకు కనిపించేలా ఆ దేవుడు నీతోనే నా కళ్ళు తెరిపించాడు” అంటూ కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతూ, తన తండ్రి దగ్గరకు వెళ్లి, 'నాన్న నన్ను క్షమించండి ! మీ మనవడు నా కళ్ళ మత్తు వదిలేలా బుద్ధి చెప్పాడు, ఇక మీకు మా వల్ల ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను! రండి అందరం కలిసి భోజనం చేద్దాం!” అంటూ ఆప్యాయంగా తండ్రిని పొదవి పట్టుకుని, తీసుకువెళ్లి అందరూ ఒకే దగ్గర కూర్చుని సంతుష్టిగా భోజనం చేశారు.

" (నాగరాజు లాంటి వారందరూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను "కలియుగ������������������ దేవతల " లా, భావించి గౌరవించడం నేర్చుకోవాలి)"

శుభం

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.133 views1 comment

1 Comment


Idi copied story, original idea kadu. English lo chala famous story "The wooden bowl". Konchem plot marchi rasaru.

Like
bottom of page