'Anthima Vancha' written by Lakshminageswara Rao Velpuri
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
జార్జ్ ఫెర్నాండిస్,మేరీ రోస్ లు ఎంతో అన్యోన్య దంపతులు,జీవితమంతా తమ శ్రమతో పిల్లలను ప్రయోజకులను చేసి తమ 50 వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు.
జార్జ్ గురించి కొంచెం చెప్పాలి. అతను మొదట్నుంచి చాలా పొదుపరి. జీవితమంతా ఒక్కొక్క పైసా ఎంతో పొదుపు తో ఖర్చు పెట్టుతూ అందరి దగ్గరా ‘మహా పిసినారి’ అన్న బిరుదు సంపాయించాడు, చివరకి భార్య మేరీ కూడా శతవిధాల భర్త ని మార్చడానికి ప్రయత్నించి విసిగిపోయింది. ఎవరైనా ఆ విషయంలో మాట్లాడితే కోపంతో అరిచేస్తాడు.
ఆ రోజు జార్జ్, మేరీల 50వ సంవత్సర పెళ్లిరోజు. ఉదయాన్నే ఇద్దరు తయారై చర్చ్ కి వెళ్లి ప్రార్థనలు చేసి ఇంటికి వచ్చి భోజనం చేసి నడుం వాల్చారు.
జార్జ్ గారు, ఒక్కసారి లేచికుర్చోని
'మేరీ! ఆ బీరువా వెనకాల ఒక బ్యాగు ఉంది. వెతికి పట్టుకురా' అని లేపేసరికి
"ఎందుకండీ, అలా విసిగించేస్తారు! వెధవ చాదస్తంతో చచ్చిపోతున్నాను. హాయిగా పడుకోవచ్చుగా! ఇప్పుడెందుకు ఆ బ్యాగ్?” అంటూ చిరాకుగా లేచింది. బీరువా వెనకాల సీక్రెట్ అరలో ఒక నల్లని బాగ్ చూసి ఆశ్చర్యపోయింది మేరీ.
కొంచెం బరువుగా ఉన్న బ్యాగ్ ని లాక్కొచ్చి జార్జ్ కి ఇఛ్చి, “ఏమండీ! ఏంటిది ఇంత బరువు ఉంది? నాక్కూడా తెలియకుండా దాచారు.” అనగానే "ఎంలేదే మేరీ! ఒకసారి జిప్ తీసి చూడు” అనగానే ఆత్రంతో తెరిచి చూస్తూనే నోటమాట రాక నిశ్చేష్టురాలయింది.
'మేరీ! నా జీవితంలో ఆస్తిపాస్తులు పిల్లలకు పంచాను, నీ క్కావాల్సిన డబ్బు కూడా ఫిక్సడ్ వేసాను. ఇక నా చివరి రోజుల కోసం నేను ఎంతో కష్టపడి ,పదిమంది నన్ను పరమ పిసినారి అన్నా సిగ్గుపడకుండా, ప్రతి రోజు ఎంతోకొంత కూడ పెట్టి దాచిన డబ్బు ఇది. అక్షరాల 8,80,080 రూపాయలు. ఇవి నీక్కూడా తెలియకుండా పోగేసాను” అనిఅనేసరికి, తన కళ్ళను తానే నమ్మలేకపోయింది మేరీ.
"ఓసి, మీ పిసనారితనం తగలడినట్టే ఉంది. పప్పులు, ఉప్పులు కూడా సరిగ్గా కొనక తూచితూచి ఖర్చు పెట్టి ఇంత దాస్తారా! జీవితంలో ఎన్నో సరదాలు ఆపుకొని ఈ డబ్బుని పైకి తీసుకెళ్తారా! పోనీ పిల్లలకు ఇద్దామండీ” అనగానే, చిర్రున కోపం వచ్చి , “నీ కేమైన పిచ్చా! ఈ డబ్బు నాది. నాతోనే సమాధి అవ్వాలి. నేను పోయిన తర్వాత నా శవపేటిక బాక్స్ లో ఎవ్వరికీ తెలియకుండా ఉంచు. నేను స్వర్గానికి పోయిన తరువాత నా ఖర్చులకు ఉంటాయి” అన్నాడు ఆవేశంగా.
భర్త చాదస్తానికి కోపం వచ్చిన మేరీ 'సరే! ముందు పడుకోండి. చాలా నీరసంగా ఉన్నారు” అని కేషబ్యాగ్ ని లోపల దాచేసింది.
ఆ మర్నాడు మేరీ తన పనులు చేసుకొంటూ భర్త జార్జ్ కోసం బెడ్ కాఫీ చేసి రూము లోకి వచ్చి తట్టి లేపింది. కానీ ఎంతకీ
లేవకపోవడంతో గాభరాపడ్తూ పక్కనే ఉన్న డాక్టర్ గారిని పిలిచింది.
డాక్టరు గారు పరీక్షలు చేసి 'అమ్మా! ఐయాం సారీ. జార్గ్ గారు రాత్రి 2 గంటలకు పోయారు. మీ వాళ్ళందరికీ కబురుపెట్టండి” అనగానే కుప్పకూలిపోయింది మేరీ.
ఆ తర్వాత కొడుకులు, కోడళ్ళు, బంధువులు చేయవలసినవన్నీ చేసి, జార్జ్ గారి పార్థివ దేహాన్ని శవపేటికలో పెట్టి పూడ్చే సమయంలో ఎవ్వరికి తెలీకుండా క్యాష్ బ్యాగ్ ని భర్త బాడీ కింద పెట్టి కన్నీరు మున్నీరవుతూ వెళ్ళిపోయింది మేరీ.
ఆ మర్నాడు మేరీ ప్రాణ స్నేహితురాలు ఉష , మేరీతో “ఒసే! నువ్వు జీవితంలో ఏదీ మా దగ్గర దాచలేదు. నిన్న స్మశానంలో నీ భర్త శవపేటికలో నువ్వు ఒక వస్తువు దాచడం చూసాను.ఇంకెవరూ చూడలేదు. అది ఏంటి? నా క్కూడా చెప్పవా..” అని నిలదీసేసరికి, తప్పని సరై 'ఉషా! మీ అన్నయ్యగారి 'అంతిమ వాంఛ' అది. జీవితాంతం మా అందరికీ అన్నీ ఇచ్చి, ఎవ్వరికీ తెలియకుండా పైసా పైసా కూడబెట్టి, చివరి క్షణం లో నాతొ తను దాచిన డబ్బు 8,80,080 రూపాయలు జాగ్రత్తగా పోయాక తన శవపేటికలో పెట్టమన్నారు,పై లోకం లో ఖర్చులకు కావాలని. అందుకే అలా చేసాను” అని ఏడుస్తూ చెప్పింది మేరీ.
“అదేంటి, పిచ్చ్చిమొహమా! అంత డబ్బు పాతి పెట్టేశావా? నీకేమైనా బుర్ర ఉందా” అని ఉషా ఆడిగేసరికి, "లేదే ! ఆ బరువు ఆయన మోయలేరని నా అకౌంట్ లో వేసాను. అయన పేరుతో 8,80,080 రూపాయలకు చెక్కు రాసి ఆయన బాడీ కింద ఉంచాను, అక్కడ మార్చుకుంటాడని!” అని మేరీ అనేసరికి నిర్గాంతపోయింది ఉష.
"అబ్బా! దీని తెలివి తేటలు అమోఘం. చాలా గడుసుది మేరీ” అనుకోంది ఉషా.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను. కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Comments