top of page

అరచేతి వైకుంఠం


'Arachethi vaikuntam' written by Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

'శంకర్' చాలా తెలివైన విద్యార్థి. తన ప్రతిభ తో డిగ్రీ వరకు ఎంతో కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడై, ఉద్యోగాల వేటలో పడ్డాడు. ఎన్నో కంపెనీలలో ఇంటర్వ్యూ లకు వెళ్లడం, నిరాశగా సెలెక్ట్ కాక విసుగెత్తిపోయాడు. ‘నిరుద్యోగం ఎంత శాపమో మొదట తెలిసి ఉంటే, ఏదో ఒక వృత్తి పని నేర్చుకొని ఉన్న ఒక్క తల్లిని సుఖపెట్టేవాడిని. కానీ అమ్మ కష్టం మీద డిగ్రీ చదివి ఏమి చేతకాక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. కాని ఒక్క ఉద్యోగం రావటం లేదు’ అనుకోని రోజు లేదు శంకర్ కు.

అనుకోకుండా తను 10 రోజుల క్రింద అప్లై చేసిన పెద్ద కార్పొరేట్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. హడావిడిగా బయలుదేరుతూ, “అమ్మా!నేను సెలెక్ట్ అవుతాను. నీ కష్టాలన్నీ తీరుతాయి” అన్న కొడుకు తల నిమురుతూ 'శుభం' అంటూ ప్రేమగా సాగనంపింది.

శంకర్ ఆఫీస్ భవనం చూడగానే 'ఆహ,ఇందులో ఉద్యోగం వస్తే జీవితంలో తన తల్లి ని కష్తపడకుండా జాగ్రత్తగా చూస్తూ సెటిల్ అయి పోవచ్చు’ అనుకొంటూ మొదటి రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ అయ్యి, రెండవ గ్రూప్డిస్కషన్ కూడా అందరికన్నా బాగా చేసాడు. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో తన పేరు చూసుకొని మురిసిపోతున్న తరుణంలో 'డైరెక్టర్' ఆఫీస్ నుంచి కాల్ రాగానే ఫైనల్ ఇంటర్వ్యూ కి వెయ్యి దేవుళ్ళని మొక్కుతూ లోపలికి అడుగుపెట్టాడు.

ఆఫీస్ ఒక ఇంద్రభవన్నాని తలపిస్తుంది. ఒక పెద్ద నిగనిగలాడుతున్న టేబుల్లో రెండు రివాల్వింగ్ కుర్చీలలో ఇద్దరు డైరెక్టర్లు కూర్చొని, లోపలికి వచ్చిన శంకర్ ని చూస్తూ 'ప్లీస్ సిట్ డౌన్' అనగానే 'థాంక్యూ సర్' అంటూ సవినయంగా కూర్చున్నాడు.

"మిస్టర్ శంకర్! నీ ఆకాడమిక్ ఫైల్ చాలా బాగుంది. నువ్వు అన్ని విధాలా సెలెక్ట్ అయ్యావు. నీ గురించి కొంచెం చెప్పు” అని నవ్వుతూ అనేసరికి, తడబడకుండా తన చదువు, కుటుంబం గురించి చెప్పాడు. అన్నీ విన్న డైరెక్టర్ 'మీ అమ్మగారి వల్లే చదువు సాగింది అన్నావు. ఆవిడ ఏం చేస్తుంటారు?” అని అడిగిన వెంటనే 'మా అమ్మగారు ఒక చిన్న 'డ్రై క్లీనింగ్' షాప్ పెట్టి, అన్నీ తానే చేసుకొంటూ నన్ను దగ్గరకు కూడా రానీయకుండా చదివించారు. ఆవిడే బట్టలు ఉతికి, ఆరబెట్టి, మరకలు పోగొట్టి, ఇస్త్రీ చేసి కస్టమర్ లకు టైమ్ కి అందచేసేవారు. నాకు ఈ ఉద్యోగం వస్తే వృద్ధాప్యం లో ఉన్న అమ్మను సుఖఃపెట్టగలను సార్!' అని ముగించగానే,డైరెక్టర్ లేచి శంకర్ దగ్గరకొచ్చి 'వెరీగుడ్,మిస్టర్.” అంటూ కరచాలనం చేసి “ఒకే. నీకు వారం రోజులలో 'ఎప్పాయింట్మెంట్' లెటర్ వస్తుంది, గుడలుక్” అనగానే శంకర్ ఆనందం తో మరోసారి షేక్ హాండ్ ఇచ్చి వచ్చేసాడు.

సరాసరి ఇంటికి వచ్చి పరమానందం తో 'అమ్మా!’ అంటూ తల్లి చేతులు పట్టుకొని “నాకు ఉద్యోగం వచ్చేసింది. ఇక నువ్వు కష్టప డక్కర్లేదు. అంటూ చెప్పేసరికి ,'అంతా అ దేవుడి దయ. నీ కష్టం ఫలించిందిరా కన్నా' అంటూ కొడుకుని దగ్గరకు తీసుకొని నుదిటి మీద ముద్దు పెట్టింది. ఆ క్షణంలో ఎందుకో అమ్మ అరచేతులు వేడిగా,గరుకుగా, అక్కడక్కడ చర్మం పొరలు లేచిపోయి ఉండడం గ్రహించి “ఏంటమ్మా! నీ అరచేతులు ఇలా ఉన్నాయి” అంటూ నొక్కేసరికి బాధతో విలవిలాడుతున్నా, కొడుకుకు తెలియకుండా నవ్వుతున్న తల్లి ని అలాగే తీసుకెళ్లి పడుకోబెట్టి ఇంట్లో ఉన్న స్కిన్ ఆయింట్మెంట్

మృదువుగా రాసాడు. ఆ రోజు నుంచి వంట వండడం, బట్టలు ఉతకడం, అరేయడం, ఇస్త్రీ చెయ్యడం తదితర పనులన్నీ శంకరే చేస్తూ తల్లిని కాలు,చేయి కదపకుండా ఆరారా మందు తల్లికి రాస్తూ ఉండగా వారం రోజుల్లో 'జాయినింగ్ లెటర్' వచ్చింది.

ఆ రోజు హుషారుగా తల్లి పాదాలకు నమస్కరించి, 'అమ్మా! నేను ఉద్యోగంలో జాయినవ్వుతున్నాను అన్నాడు. ఆమె తన కుదుట పడిన చేతులతో నిండుగా కొడుకుని ఆశీర్వదించింది.

'డైరెక్టర్' గారి రూమ్ లోకి వెళ్లి 'సార్, నేను ఈ రోజు నుంచి జాయినావుతున్నాను’ అని అనేసరికి 'వెరీగుడ్,శంకర్!’ అంటూ షేక్ హాండ్ ఇస్తూ ‘చూసావా శంకర్, నువ్వు ఇంటర్వ్యూ కి వచ్చినప్పుడు నీ అరచేతులు ఎంతో మృదువుగా, మెత్తగా,ఉన్నాయి. కారణం తెలియాలనే నీకు వారం రోజులు టైమ్ ఇచ్చాను. నా అనుమానం నిజమయ్యింది. నువ్వు చదువుతున్న సమయంలో ఏ రోజూ కష్టపడుతున్న తల్లికి సాయం చెయ్యలేదు. నీ చదువు మీదే ఉన్నావు. కానీ ఈ రోజు నీ అరచేతులు ఎంతో గరుకుగా, బలంగా ఉన్నాయి. అంటే నీ తల్లికి సాయం చేసావు. నీ తప్పు సరిదిద్దుకొన్నావు. కనుక ఇప్పుడు నీ క్రింద పనిచేసేవాళ్ళ తప్పులు వారంతావారే తెలుసుకొనేట్లు చేసి కంపెనీని వృద్ధిలోకి తీసుకురా' అంటూ శంకర్ భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు డైరెక్టర్.

ఆ రోజు నుంచి తిరుగులేని వ్యక్తిత్వం తో కంపెనీని అంచలంచలుగా అభివృద్ధిచేశాడు శంకర్.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


66 views0 comments

Comments


bottom of page