top of page

స్నేహితుడిచ్చిన సెంట్ బాటిల్



'Snehithudicchina Cent Bottle' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 28/04/2024

'స్నేహితుడిచ్చిన సెంట్ బాటిల్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


చిన్న రెండున్నర ఏళ్ళ తర్వాత ఉద్యోగం నుండి స్వగ్రామమైన చింతలపల్లి వచ్చాడు. చిన్ననాటి స్నేహితుడు సూర్య.. చిన్నాని చూడ్డానికి వచ్చాడు. చిన్న దగ్గరకు వెళ్ళీ ఆప్యాయంగా హత్తుకున్నాడు సూర్య. సూర్య చెమటతో ఉండటం మరియు ఆ వాసనకు చిన్నా అసహ్యించుకుని సూర్యని విడిపించుకుని ముక్కు తుడుచుకుని తనకు అంటిన చెమటను చూసుకుని లోపలకు వెళ్ళిపోయాడు. 


ఈ ఘటనతో సూర్య బుర్ర గిర్రున తిరిగింది. అయినా బాధపడలేదు. ఇప్పుడే వచ్చాడు కదా చిరాగ్గా ఉంటాడు అనుకుని ముందుకు వెళ్ళాడు. ఇంతలో చిన్నా వాళ్ళ అమ్మగారి పిలుపు వినబడి ఆగాడు సూర్య. 


చేతిలో ఓ 250మిల్లి లీటర్లు సెంట్ బాటిల్ ఒకటి పట్టుకుని వచ్చి

"బాబు.. ఇది చిన్నా నీకు ఇవ్వమన్నాడు " చెప్పి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది చిన్నా తల్లి. ఇప్పుడు సూర్య మనసు కకావికలం అయింది. తన శరీరాన్ని తాను చూసుకున్నాడు. తన చొక్కా వాసనను కూడా చూశాడు. అప్పుడు అర్థం చేసుకున్నాడు సూర్య తన చెమట వాసనే వాడికి పడలేదని. 


ఇప్పుడు సూర్య మనసులో గతం కదలాడుతుంది. ఆ గతం గుర్తు చేసుకుని ఉద్యోగం వచ్చిందనే ఇలాంటి అహంకారం, వెర్రితనం చూపించిన చిన్నా పై కోపం వచ్చింది. చేతిలో ఉన్న సెంట్ బాటిల్ని చిన్నా ఇంటి ప్రహారి గొడకేసి బలంగా మరియు కోపంగా కొట్టాడు. అది టప్ మని శబ్దం చేసి విచ్చిన్నమైంది. అసలు దాని వైపు కూడా చూడకుండానే ‘ఉద్యోగం వచ్చింది కదా ఆ మాత్రం ఉంటుంది. నా అవసరం వాడికి లేనప్పుడు వాడి అవసరం నాకెందుకు’ అనుకుని గతాన్ని తలుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. 


చిన్నా, సూర్య ఇద్దరు చిన్ననాటి నుండే మంచి స్నేహితులు. చిన్నాది మధ్యతరగతి కుటుంబం కానీ.. తండ్రి లేడు. , సూర్యది పేద కుటుంబం కానీ.. తల్లిదండ్రులు ఉన్నారు. అసలు పల్లెటూరిలో అందరూ పేద మధ్యతరగతి వాళ్ళే కదా.. 


చిన్నాకి చదువు తప్ప ఏది అబ్బేది కాదు. అమాయకుడిలా ఉండేవాడు. తన తోటి స్నేహితులు చిన్నాని కొట్టడం, తిట్టడం, అల్లరి చేయటం చేస్తుంటారు. చిన్న ఏడిస్తే చూసి ఆనందించేవాళ్ళు. సూర్య వాళ్ళని కొట్టి చిన్నాని ఓదార్చి ధైర్యం చెబుతు అన్ని తానై తోడుండేవాడు. 


ఇక వాళ్ళు కాస్తా పెద్దవాళ్ళు అయ్యాక చిన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. చిన్నాకి చదువు తప్ప ఇంకేపని కూడా చేతకాదు. ఎంత ప్రేమలో ఉన్నా చదువు పై శ్రద్ధ పోకుండా ఉండేవాడు. 


సూర్య చదువుతో పాటు తన కుటుంబం పరిస్థితుల రీత్యా కష్టపడుతుంటాడు. వీరి పరిస్థితి ఎలా ఉన్నా.. స్నేహం విషయంలో బ్రహ్మదేవుడు వచ్చినా విడిపించలేరు అన్నట్టు ఉంటుంది. స్కూల్, కాలేజీలో ఒకే కంచంలో భోజనం తినేంతట గొప్ప స్నేహితులు వీళ్ళు. చిన్నాకైతే సూర్యానే అన్ని తనకు తోడు నీడై ఉంటున్నాడు కాబట్టి సూర్య అంటే ఇష్టం. మరీ.. ! సూర్యకు చిన్న అంటే ఎందుకు అంత ఇష్టమో ఎవరికి అంతుపట్టదు. నిజంగా సూర్యాలాంటి వారు, అతడిలాంటి స్నేహితులు ఎందరో ఉండొచ్చు కానీ.. మనకు దొరకకపోవచ్చు. 


చదువుతో పాటు, సూర్య, మరియు ప్రేయసితో ఎంచక్కా సరదాగా గడిపేవాడు చిన్నా. అలా తాను సూర్య నుండి అన్ని విషయాలు తెలుసుకుని, ధైర్యాన్ని అంటపెట్టుకుని తాను అమాయకుడిని కానని నిరూపించుకున్నాడు. అంతా సాఫీగా నడుస్తున్న తరుణంలో చిన్నా ప్రేయసి మోసం చేసి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అంతే.. !


అప్పటి నుండి చిన్నా చదువు సంధ్య, తిండి తిప్పలు, నిద్ర మానుకుని మానసికంగా కుంగిపోయాడు. అలా నెలల తరబడి మానసిక వేదనకు గురై తనలో తాను లేనంతగా మారిపోయాడు. స్నేహితుడి పరిస్థితి చూసి 

"అమ్మాయిలదేముంది బెదరూ. ఈరోజు ఉంటారు రేపు పోతారు. హ్యాపీగా అందరితో గడిపెద్దాం. నిన్ను దూరంగా ఉంచాలనుకున్నవారికి నువ్వు కూడా దూరంగా ఉండు. వాళ్ళకి లేని ఇష్టం నీకెందుకు.. ? నువ్వు ఏదైనా గొప్పగా సాధించి చూడు. నిన్ను వద్దనుకున్నందుకు వాళ్ళు జీవితాంతం కుమిలిపోతారు. 


ఒక స్త్రీ నిన్ను తిరస్కరించినపుడు ఆమెకు దూరంగా ఉండటమే ఉత్తమం. లేకపోతే నీ జీవితాన్ని నీవు కోల్పోతావ్. ఆ అమ్మాయి చేసింది నిజంగా మంచిదే. చదువు తప్ప ఏ పని చేతకాని నీకు ఆ చదువుతోనే ఏదైనా ఉద్యోగం సాధించేలా గొప్ప ప్రేరణ, కసిని నీలో పెంచి వెళ్ళింది. 


నిజంగా నీలో పౌరుషం అంటూ ఉంటే లే! నీ ఉద్యోగ శిక్షణ కోసం నేను కొంత సహాయం చేస్తా.. సాధిస్తానంటే ఇప్పుడే డబ్బు కూడా తెస్తా " అంటు చిన్నాలో ఏదో తెలియని కసి రగిల్చాడు సూర్య. తాను పగలంతా పనికి వెళ్ళి సగం కూలి తన కుటుంబానికి, మిగిలింది చిన్న చదువుకు, ఖర్చు చేసేవాడు సూర్య. రాతపరీక్షకు వెళ్ళినప్పుడు సూర్య ఎదురు రావాలని పట్టుబట్టాడు చిన్నా. చిన్నా తన స్నేహాన్ని గుర్తించాడని సూర్య ఆనందించాడే తప్ప ఉద్యోగం వస్తే ఏదైనా సహాయం చేస్తాడని ఆశించలేదు. 


కొంతకాలానికి చిన్నాకి ఉద్యోగం వచ్చింది. ఆ కబురు తెలపటానికి ఎండతో పొలంలో పని చేసుకుంటున్న సూర్య వద్దకు వెళ్ళి చెప్పాడు. తాను ఆనందించాడు. చిన్నా ఆనందం పట్టలేక సూర్యని హత్తుకోబోతాడు. సూర్య దూరం జరిగి 

"బురద, చెమటతో ఉన్నానురా" అంటాడు. 


"హే పర్వాలేదురా నీ ప్రాణమే నా ప్రాణం అయినప్పుడు ఈ బురద, చెమటతో మనకేం పని " అంటూ హత్తుకున్నాడు. 


ఉద్యోగానికి బయలుదేరే రోజు రాగానే రవాణా చార్జీలకు కూడా సూర్య ఇచ్చి, ఆనందంతో స్నేహితునికి సాగనంపాడు. అలా రెండున్నర ఏళ్ళు తర్వాత తొలిసారిగా ఉద్యోగం నుంచి ఇంటికి వస్తున్నప్పుడు భారీగా ఉన్న తన లగేజీని మోయలేక తంటాలు పడుతు ఊరి పొలిమేర వెంట వస్తుంటే పొలంలో ఉన్న సూర్య చూసి తన లగేజీ అంతటని తీసుకుని ఇంటి వరకు మోసి దించి వెళ్ళాడు. 


ఎలాగూ ఇంటికి వచ్చామని కాస్త చల్దన్నం తినేసి చిన్నాని కలిసి మరలా పొలానికి వెళ్దామని నిర్ణయించుకుని చిన్న వద్దకు వస్తే.. ఇంత అవమానకరంగా చెమట వాసన వచ్చిందని సెంట్ బాటిల్ పంపిన ఇలాంటి స్నేహితుడు మనసులో మాలిన్యం ఉంచుకుని పైకి సువాసనలు పూసుకునే వాళ్ళు మనకెందుకని ముందుకు వెళ్ళాడు సూర్య. 


ఇప్పుడు సూర్య మనసులో ఉన్న బాధ గతంలో చిన్నా ప్రేమ ఫెయిల్ అయినప్పుడు పడిన బాధ కంటే వందరెట్లు ఎక్కువే. ఉద్యోగస్తుడైన చిన్నా నుండి సూర్య ఏమీ ఆశించటం లేదు. కేవలం చిన్నా స్నేహాన్ని మాత్రమే ఆశిస్తున్నాడు. అయినా ఇప్పుడు అది కూడా కష్టమేనని సూర్యకి తెలుసు. 


అందరికీ ధైర్యం చెప్పే తనకు ఇప్పుడు ధైర్యం చెప్పల్సినవారు కవలసి రావటం నిజంగా దురదృష్టం. అన్ని మనసులో మొదులుతున్న వేళ పొలంతో కుస్తీకి బయలుదేరాడు సూర్య. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం




43 views0 comments
bottom of page