top of page
Original.png

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం


పెద్ద జీతం… కానీ సమయం, సంతోషం ఎక్కడ?

Software Udyogam - Telugu Emotional Story | Chilakamarri Rajeswari

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం - తెలుగు భావోద్వేగ కథ | చిలకమర్రి రాజేశ్వరి

Published in manatelugukathalu.com on 03/04/2026 


"హల్లో, మీనాక్షీ! శుభోదయం, నీకో శుభవార్త చెప్తాను" అంటూ ఎంతో ఉత్సాహంగా తన స్నేహితురాలికి ఫోన్ చేసింది శ్యామల. 


"ఏంటోయ్, చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి విషయం, తొందరగా చెప్పు" అంటూ బదులిచ్చింది మీనాక్షి. 


"మా అబ్బాయికి ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీ. వచ్చేవారం బెంగళూరు ఆఫీసులో చేరమన్నారు." అంది శ్యామల. 


"చాలా మంచి వార్త చెప్పావు. సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంత మంచి జీతంతో మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటే, అందరికీ ఐదు నక్షత్రాల హోటల్‌లో పెద్ద పార్టీ ఇవ్వాల్సిందే" అంది మీనాక్షి. 


"మా అబ్బాయిని ఉద్యోగంలో చేర్పించి రాగానే, పక్కాగా ఇస్తాను మన స్నేహితులందరికీ మంచి పార్టీ. సరేనా? ఇంక ఉంటాను. వాడికి కావాల్సినవన్నీ సర్దాలి" అంటూ ఫోన్ పెట్టేసింది శ్యామల. 


ఆ రోజు రానే వచ్చింది. శ్యామల తన భర్తతో కలిసి వాళ్ల అబ్బాయితో పాటు బెంగళూరు వెళ్లి ఉద్యోగంలో చేర్పించి, అక్కడ ఒక వారం రోజులు ఉండి వచ్చారు. రాగానే తను చెప్పిన మాట ప్రకారం తన స్నేహితులందరికీ మంచి పార్టీ ఇచ్చింది. పార్టీలో ఆఫీసు ఎలా ఉంది అని అడిగిన స్నేహితులకు, “చాలా బాగుంది. వాళ్లకు ఆఫీసు ప్రాంగణంలోనేఅన్ని సౌకర్యాలు—కాఫీ, టీతో పాటు సమోసా లాంటి చిరుతిళ్లు 24 గంటలూ దొరుకుతాయి. ఆఫీసు పని గంటలు దాటిన తర్వాత పని చేయాల్సి వస్తే, అదనపు భత్యం కూడా ఇస్తారు" అని తెగ పొగిడేసింది.


"బిస్కెట్స్, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పిస్తా, ఖర్జూరం, వాల్‌నట్—ఒకటేమిటి, అన్ని రకాలూ పనిచేసే చోటే అందుబాటులో ఉంచుతారు. మనం అసలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు" అని తన స్నేహితులతో చెప్పకుని మురిసిపోయింది.


"ఆహా! నీ అదృష్టమే అదృష్టం" అని స్నేహితులు అందరూ తనని మెచ్చుకున్నారు. 

అలా కొన్నాళ్లు గడిచింది. ఇంతలో అనుకోని విధంగా కోవిడ్ భూతం విరుచుకుపడింది. సాఫ్ట్‌వేర్ ఆఫీసులన్నీ తమ ఆఫీసులను మూసివేసి, ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమన్నారు. దాంతో అభిజిత్ ఎలాగో కష్టపడిఅంచెలంచెలుగా ఇల్లు చేరాడు. ఇంటి నుంచి పని చేయడం మొదలుపెట్టాడు. 


నెమ్మదిగా కోవిడ్ తీవ్రత తగ్గి, సాధారణ పరిస్థితి నెలకొంది. అయినా సరే, కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉద్యోగులను ఆఫీసులకు పిలవలేదు. ఆఫీసు అద్దె, నిర్వహణ, విద్యుత్, కాంటీన్, రవాణా వంటి ఖర్చులు ఆదా చేసుకోవడం కోసం ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే పద్ధతినే కొనసాగించారు. వాటిలో అభిజిత్ పనిచేస్తున్న సంస్థ కూడా ఉంది. అభిజిత్ ఇంటి వద్ద నుంచే పని చేయసాగాడు. 


"ఏమోయ్, నీకే ఫోన్, నీ స్నేహితురాలు మీనాక్షి, మాట్లాడు" అంటూ ఫోన్‌ను శ్యామల చేతికి ఇచ్చాడు కేశవరావు. 


"ఏంటి, నువ్వు నాకు ఫోన్ చేసి ఎంత కాలమైందో తెలుసా? మీ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాతో మాట్లాడనేలేదు. అవునులే, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమ్మవు, అందులో ఇంటి నుంచి పని చేస్తున్నాడు కదా. హాయిగా మీ అబ్బాయి ఆఫీసు పని అవగానే షాపింగులు, సినిమాలకు వెళ్లిపోతున్నట్టున్నారు? అందుకే నీకు నాతో మాట్లాడటానికి ఐదు నిమిషాలు కూడా సమయం దొరకలేదు" అంటూ మీనాక్షి నిష్టూరాలాడింది. 


"అయ్యో, అంత అదృష్టం కూడానా! భలే చెప్పావు. అసలు విషయం విను. ఇంటి నుంచి పని చేస్తున్నాడని పేరుకే గానీ, ఇన్నాళ్లలో ఒకసారి కూడా వాడు మాతో కలిసి మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ భోజనమే చేయలేదు. ఉదయం, సాయంత్రం, రాత్రి తేడా లేకుండా ఇష్టం వచ్చినప్పుడు వినియోగదారులతో సమావేశాలు, ఏవో పనులు అప్పగిస్తున్నారు. ప్రాజెక్టు పని తొందరగా పూర్తి చేయాలనే ఒత్తిడి, ఆ ప్రాజెక్టు పని మీద మేనేజరు చేసే సమీక్షలకు తయారుకావడం—అదే సరిపోతోంది. మాతో మాట్లాడటానికే వాడికి సమయం దొరకడం లేదు. 


ఆఫీసులో అయితే లాగిన్/లాగ్ అవుట్ సమయం స్పష్టంగా ఉండేది. ఇప్పుడు ఉదయం మొదలుపెడితే, రాత్రి ఒక్కొక్కసారి 12 కూడా దాటుతోంది. వారానికి ఐదు రోజులే ఆఫీసు అని పేరుకు ఉన్నా, ఈ ఐదు రోజుల పని ఒత్తిడికి శనివారం ఎప్పుడో లేస్తాడు.


ఆదివారం అయినా ఎక్కడికైనా వెళ్దామంటే, "అబ్బ! వారానికి ఒక్క రోజైనా హాయిగా ఉండనీఅమ్మా" అంటున్నాడు.


పని సమయంలో పక్కన పెట్టిన కాఫీ తాగడానికే వాడికి సమయం దొరకడం లేదు. నా బాధలు ఏం చెప్పుకోమంటావు? ఏ నిమిషంలో వాడికి ఏం కావాల్సి వస్తుందోనని, నేను కూడా ఎక్కడికీ కదలడం లేదు. ఇదీ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమ్మ బాధ" అంటూ తన బాధను అంతా వెళ్లగక్కింది. 


"అవును, మనమంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఏముంది, ఏసీ గదుల్లో కూర్చుని పని చేయడమేగా అనుకుంటాం. వాళ్లు ఎంత తీవ్ర ఒత్తిడితో పని చేయాల్సి వస్తుందో, నువ్వు చెబితే అర్థమైంది" అంటూ ఫోన్ పెట్టేసింది మీనాక్షి.


***

చిలకమర్రి రాజేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి

 

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page