top of page
Original.png

కు-తంత్రం


Kuthantram - Telugu Folk Story | Kasivarapu Venkatasubbaiah

కు-తంత్రం - తెలుగు జానపద కథ | కాశీవరపు వెంకటసుబ్బయ్య

Published In manatelugukathalu.com On 03/04/2026


దురాశ… ఒక రాజ్యాన్ని కూల్చింది!

ఆద్యంతం ఆసక్తిని కలిగించే కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కు-తంత్రం కథను చదవండి.

   

                       

రేనాడు రాజ్యాన్ని, వల్లభాపురం రాజధానిగా త్రైలోక్యవల్లభుడు అను చోళరాజు పాలించేవాడు. ఈయన జనాదరణ, జనాభిమానం చూరగొన్న ప్రభువు. పరిపాలనాదక్షుడు. ఈయన కాలంలో పాడిపంటలతో పాటు గొప్ప వాస్తు, కళలు కూడా వర్ధిల్లాయి. ప్రజలు, పాలకులు చక్కని అవగాహనతో ముందుకెళ్లేవారు.


త్రైలోక్యవల్లభుడు ఏరులకు, వంకలకు ఆనకట్టలు కట్టి, చెరువులను, కుంటలను నీటితో నింపి, పొలాలు సమృద్ధిగా పండునట్లు చేసేవాడు. దానివలన ప్రజలు సుఖసంతోషాలతో జీవించడమే కాక, తమ పంటలను ప్రక్క రాజ్యాలకు కూడా ఎగుమతి చేసేవారు.


త్రైలోక్యవల్లభుడు పుష్పగిరి, వల్లూరు, ఎర్రగుడిపాడు, కలమల్ల, తిప్పలూరు, చిన్నచెప్పలి, పెద్దచెప్పలి, అంబవరం మొదలైన చోట్ల అద్భుత దేవాలయాలు నిర్మించాడు. తెలుగు భాషలో శాసనాలు రాయించాడు. తొలి తెలుగు శాసనాలు మొట్టమొదట రేనాటి చోళ రాజులే వేయించారు.


రేనాటి రాజ్యం సిరిసంపదలతో ఉన్నప్పుడే కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు సామ్రాజ్య విస్తరణ కోసం, అపారమైన సైన్యంతో రాజ్యాలను జయిస్తూ, ఓడిన ఆయా రాజులను సామంత రాజులుగా చేసుకుంటూ వచ్చి రేనాటి రాజ్యాన్ని కూడా ముట్టడించాడు. 


రేనాటి రాజ్యానికి పటిష్టమైన కోట, బలమైన రాజు ఉండడం వలన జయించడం అసాధ్యమైంది. నెలల పర్యంతం యుద్ధం చేసినా కోటను స్వాధీనం చేసుకోలేకపోయాడు ప్రతాపరుద్రుడు.


ప్రతాపరుద్రుడు సైనిక అధికారులను సమావేశపరిచి యుద్ధ వ్యూహాన్ని ఆలోచించారు. కోటలోకి నిత్యావసర వస్తువులు, నీరు పోనీయకుండా చేస్తే కొద్ది రోజులలోనే త్రైలోక్యవల్లభుడు లొంగిపోతాడని నిర్ణయానికి వచ్చారు రాజు, మంత్రులు, సైనిక అధికారులు. వెంటనే తదనుగుణంగా చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వారి వ్యూహం ఫలించలేదు. కోటలో నిత్యావసర వస్తువులు, ధాన్యం, కోనేటిలో నీరు పుష్కలంగా ఉండడం వలన కోటను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు.


కోటలోని కోనేటిలోనికి నీరు పోకుండా చేస్తే నీటి ఎద్దడి ఏర్పడి త్రైలోక్యవల్లభరాజు రాయబారానికి వస్తాడని తలచి, ప్రతాపరుద్రుడు కోటలోకి నీరు ఎక్కడి నుంచి వస్తున్నదో వెతకమని సైన్యాన్ని పురమాయించాడు. సైన్యం వంకలు, వాగులు, ఏర్లు, చెరువులు, కుంటలు ఎన్ని చోట్ల వెతికినా కోటలోకి నీరు తీసుకుపోయే గొట్టాల జాడ కనిపించలేదు. 


ఎంత నిశిత పరిశీలనగా చూసినా, అణువణువునా గాలించినా కోటలోకి నీరు పోయే అనుపానులు కనుగొనలేకపోయారు. చివరి ప్రయత్నంగా ప్రతిరోజూ కోటలోనికి ఎవరు పోతున్నారో, బయటికి ఎవరు వస్తున్నారో గమనించడం మొదలు పెట్టారు. కోటలో ఉదయం, సాయంత్రం పాలు పోసే ఆమెను గుర్తించారు. పాలు పోసి వస్తుండగా ఆమెను అటకాయించి తీసుకుని పోయి రాజు ప్రతాపరుద్రుడి సమక్షంలో ప్రవేశపెట్టారు సైనిక అధికారులు.


ప్రతాపరుద్రుడు ఆమెతో "అమ్మా! నీవు మాకు కోటలోకి నీరు ఎక్కడి నుండి వస్తున్నదో తెలిపితే నీవు ఊహించనంత బంగారం, భూములు, పాడి పశువులు ఇస్తాం. నీవు సుఖంగా, ఆనందంగా బ్రతుకుతావు" అని ప్రలోభ పెట్టాడు. 


ఆమె ఆశోపాశల మధ్య ఊగిసలాడింది. "నీవు కేవలం నీరు వచ్చే చోటు చూపిస్తే చాలు. తరువాత మా సైనికులు చూసుకుంటారు. నీకు అష్టైశ్వర్యాలు అందుతాయి. నీవు హుందాగా కాలుమీద కాలు వేసుకుని జీవించవచ్చు" అని ఆమెలోని ధన వ్యామోహాన్ని పెంచి చెప్పాడు రాజు.


ఆమె ఆశకు లొంగిపోయి "చూపిస్తాను రండి" అని సైనికుల్ని వెంటబెట్టుకుని పోయింది. 


కోటకు ఐదు ఆమడల దూరంలో ఉన్న పెన్నానదికి ఉపనదైన పాపాఘ్ని నదీ మలుపు దగ్గరకు తీసుకుపోయి చూపింది. అక్కడ ఇనుప గొట్టాల ద్వారా నీరు కోటలోని కోనేరులోకి పోతుండడం చూశారు సైనిక అధికారులు. సైనికులు గొట్టాల గుండా నీరు పోకుండా అడ్డంగా గోడ కట్టారు. దానితో కోటలోకి నీరు పోవడం ఆగిపోయింది. 


కోనేటిలో ఉన్న నీరు కోటలోని ప్రజలకు, పశువులకు, గుర్రాలకు, ఏనుగులకు చాలలేదు. ఒక నెల రోజులకు నీరు అయిపోయింది. తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది.

త్రైలోక్యవల్లభుడు ఏ అవకాశం లేక, విధిలేని పరిస్థితుల్లో ప్రతాపరుద్రుడికి లొంగిపోయాడు. "త్రైలోక్యవల్లభా! నా సామ్రాజ్యాధిపత్యాన్ని అంగీకరించి కప్పం కడుతూ సామంత రాజుగా నీ రాజ్యాన్ని నీవే ఏలుకో" అని త్రైలోక్యవల్లభుడి రాజ్యాన్ని అతనికే ఇచ్చివేశాడు ప్రతాపరుద్రుడు. అప్పటి నుండి త్రైలోక్యవల్లభుడు ప్రతాపరుద్రుడిని చక్రవర్తిగా అంగీకరించి కప్పం కడుతూ తన రాజ్యాన్ని సామంతుడిగా పాలిస్తూ ఉండిపోయాడు.


ప్రతాపరుద్రుడు తన రాజ్యానికి పోతూ పోతూ పాలామె నమ్మకద్రోహానికి, రాజద్రోహానికి పాల్పడినందుకు, ఇలాంటి వాళ్లు ఉంటే రాజ్య భద్రతకు ముప్పని భావించి, ఆమెను ఒక కొండ గుహలో బంధించి, సంవత్సరం బత్తెం (తినుబండారాలు) అందులో ఉంచి గుహ ముఖద్వారం రాతి కట్టడంతో మూసివేసి ప్రతాపరుద్రుడు తన కాకతీయ రాజధాని ఓరుగల్లుకు తన సైన్యంతో తిరుగు ప్రయాణమై పోయాడు.


దురాశ దుఃఖానికి చేటు అంటారు. పాలామె విషయంలో అదే జరిగింది..

                           ----------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page