బాల గేయాలు - మేమే పిల్లలం
- Gadwala Somanna

- 2 days ago
- 9 min read
బాల గేయాలు, Telugu children poems, Telugu moral songs, Gadwala Somanna poems, Telugu educational poems, Telugu literature for children

Bala Geyalu - Meme Pillalam | Gadwala Somanna
బాల గేయాలు - మేమే పిల్లలం | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 08/06/2026
మేమే పిల్లలం
---------------
బడికెళ్లే పిల్లలం
గుడిలోని గంటలం
అందరిని అలరించు
విహరించు గువ్వలం
చిరుమువ్వల రవళులం
సిరిమల్లెల సొగసులం
పాపపుణ్యాలు తెలియని
భగవంతునికి ఇష్టులం
ప్రవహించే యేరులం
ప్రకాశించే తారలం
గురుదేవుల మార్గంలో
సాగిపోయే జీవులం
మేమే మేమే పిల్లలం
కాంతులేనే దివ్వెలం
కన్నోళ్లకు ఆస్తులం
అందరికీ దోస్తులం

అమూల్యమైన అంశాలు
-------------------------------
మితిమీరిన కోరికలు
అవి ఆశాంతి కారకాలు
ఆదిలో నియంత్రిస్తే
కుదుటపడుతాయి మనసులు
ఎక్కువైతే ఆశలు
నెమ్మది ఎండమావులు
అంతా గందరగోళము
ఆనందం మటుమాయము
పొదుపు చేస్తే బ్రతుకులు
బాగుండును వాస్తవము
తగ్గిస్తే వట్టి మాటలు
అడుగడుగునా మేలులు
నింగికి నిచ్చెన వేయకు
అందరిని మభ్య పెట్టకు
చేతనైతే సాయము
కాసింత అందించుము

దివ్య ఔషధము దరహాసము
-------------------------------
నవ్వులే వదనంలో
తారలే గగనంలో
గుబాళించే పూవులు
ప్రకాశించే ప్రమిదలు
ప్రసన్న వదనం అందము
చూడగా చంద్రబింబము
మొగమే అగును తేజము
బంధాలకు సోపానము
నవ్వు దివ్య ఔషధము
అన్నింటికీ సాధనము
సమకూర్చును ఆరోగ్యము
మదినిండా ఆనందము
నవ్వుల పూలు పూయాలి
ముఖాలు కళకళలాడాలి
నవ్వుల నదిలో హాయిగా
ప్రపంచమంతా సాగాలి

అమ్మమ్మ హితోక్తులు
-------------------------------
అవహేళన చేయడం
అపనిందలు వేయడం
కాదు కాదు సముచితం
బాగుపడదు జీవితం
బద్ధకంగా ఉండడం
అభివృద్ధికి అవరోధం
అబద్దాలు చెప్పడం
బంధాలకు విఘాతం
చిన్నచూపు చూడడం
చిత్రంగా మారడం
చూపరులకు అసహ్యం
వదులుకుంటే క్షేమం
పంతాలకు పోవడం
పతనాన్ని కోరడం
హర్షింప దగినది కాదు
గౌరవం అందు లేదు

ఆణిముత్యాలు -బ్రతుకు పాఠాలు
-------------------------------
తొందరపాటు వద్దు
సర్దుబాటే ముద్దు
వెనుకడుగు వేయొద్దు
అశ్రద్ధ చేయొద్దు
విలువైనది సమయము
చేయరాదు వ్యర్థము
చేసుకుంటే మంచిది
ఇల సద్వినియోగము
శ్రమతత్వమే మలుపు
జీవితాల్లో గెలుపు
నోటిని చేస్తే అదుపు
ఉపయోగమే పొదుపు
అగ్నిలాంటిది అహము
చేస్తుందోయ్! భస్మము
జాగ్రత్త దానితో
జయించుము ఓర్పుతో

కాపాడుకుంటే మంచిది
-------------------------------
పవిత్రమైన బంధాలను
శ్రేష్టమైన స్నేహాలను
కాపాడుకుంటే మంచిది
మేలు చేయు వృక్షాలను
వికసించే పూవులను
విహరించే పక్షులను
కాపాడుకుంటే మంచిది
ప్రవహించే యేరులను
రేపటి భారత పౌరులను
తరిగే వన్య ప్రాణులను
కాపాడుకుంటే మంచిది
పుడమిలోని సంపదలను
అనుభవజ్ఞులైన పెద్దలను
జ్ఞానం పంచే గురువులను
కాపాడుకుంటే మంచిది
సంస్కృతి, సంప్రదాయాలను
కడుపు నింపే రైతులను
సరిహద్దు సైనికులను
కాపాడుకుంటే మంచిది
మహిలో మహనీయులను
తల్లిదండ్రుల ప్రేమలను
వారు చూపే త్యాగమును
కాపాడుకుంటే మంచిది
భువిలో తోబుట్టువులను
ఇల ఆపద్భాంధవులను
మన శ్రేయోభిలాషులను
కాపాడుకుంటే మంచిది
ప్రేమించే వ్యక్తులను
విలువైన సంస్కారమును
బ్రతుకున నైతిక విలువలను
కాపాడుకుంటే మంచిది
ఘన ఆత్మగౌరవమును

చింతలు హరించు సుఖశాంతులు
-------------------------------
రేపటి గురించి చింతలు
హరించు నేటి ఆనందము
అతిసున్నితమైన మనసులు
అవుతాయి గందరగోళము
మితిమీరిన చింతలతో
మతి పోగొట్టు తలపులతో
మనశ్శాంతిని కోల్పోవద్దు
పనికిరాని విషయాలతో
ఆరోగ్యమే ప్రాముఖ్యము
ఆనందమే పరలోకము
రెండింటిని కాపాడుకో!
ఆదర్శంగా ఉండిపో!
గత కాలపు గాయాలను
మళ్ళీ మళ్ళీ రేపుకోకు
సూదుల్లాంటి మాటలతో
ఎదుటి వారిని నొప్పించకు

ఇంటికి అందము ఆడపిల్ల
-------------------------------
బాలికలుంటే సదనము
అవుతుంది బహు అందము
వారితోనే కుటుంబము
పొందుతుంది ఆనందము
బాలిక చదువుకుంటే
జీవితమగును దీపము
ఘన కార్యాలు చేస్తే
గుర్తిస్తుంది లోకము
ఎదగాలోయ్! బాలికలు
కావాలోయ్! ఏలికలు
ఈ సభ్య సమాజంలో
వారే ఆనంద గీతికలు
ఓ బాలికా! చదువుకో!
నీ తలరాతను మార్చుకో!
'ఆడపిల్ల కాదు అబల'
అని నిరూపణ చేసుకో!

ఓ బాబూ ! జాగ్రత్త!!
-------------------------------
ఉంటే ఓపికతో
ఏదైనా సాధ్యము
ఊగితే కోపంతో
ఊడుతుంది శాంతము
సృష్టిలోనే స్నేహము
పవిత్రమైన బంధము
కోల్పోకు బ్రతుకులో
ఓ బాబూ! ఏమాత్రము
కలతలతో బ్రతుకులు
సున్నితమైన మనసులు
ఓ బాబూ! జాగ్రత్త!!
కాకూడదు ముక్కలు
విచిత్రమైన మనుషులు
చూడగా లోకంలో
ఓ బాబూ! జాగ్రత్త!!
లేకుంటే ఇక్కట్లు

అంతే కదా!!
-------------------------------
కాదు మేలు ప్రతీకారం
మితిలేని అహంకారం
ఆదిలోనే వదిలితే
జీవితమంతా క్షేమం
చేయాలి మనస్ఫూర్తిగా
అందరికీ ఉపకారం
జీవించాలి గొప్పగా
అందించాలి సహకారం
చూపాలి మమకారం
వదలాలి తృణీకారం
తలపెట్టరాదు ఎన్నడు
ఎవ్వరికీ అపకారం
మానాలి ధిక్కారం
తరమాలి ఛీత్కారం
సద్గుణాలు ఉంటేనే
ఎంతైనా ఉపయోగం

నిత్య సాధన గెలుపు
-------------------------------
మేలుకు ప్రతిగా కీడు
చేసే వానికి దూరము
ఉంటేనే బహు క్షేమము
లేక బ్రతుకు వల్లకాడు
కృతఘ్నత దానవగుణము
కృతఙ్ఞత దైవగుణము
ఏది శ్రేష్టమో ఎరుగుము
మంచి దారిలో నడువుము
సద్గుణాలు హారంగా
ధరించాలి ఘనంగా
ఘనతకు కారణమదే
గుర్తించుకో పదే పదే
రాక్షస గుణాలు చెరుపు
మనసులో నుంచి చెరుపు
నిత్య సాధనే గెలుపు
జీవితాల్లో అది మలుపు
======================================

Bala Geyalu - kalpataruvu Chaduvu | Gadwala Somanna
బాల గేయాలు - కల్పతరువు చదువు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 21/05/2026
చిన్నారులలో మంచి విలువలను పెంపొందించేందుకు బాల గేయాలు ఉత్తమ సాధనం.
విద్య, క్రమశిక్షణ, మనోధైర్యం, కష్టపడే తత్వం గురించి ఈ గేయాలు చక్కగా వివరిస్తాయి.
సరళమైన పదాలతో గొప్ప జీవిత పాఠాలను అందిస్తాయి.
ప్రతి విద్యార్థి చదవదగిన ప్రేరణాత్మక గేయాల సంకలనం ఇది.
బాల గేయాలు - కల్పతరువు చదువు
-------------------------------
చదువుకున్న వ్యక్తులు
దేశానికి శక్తులు
అభివృద్ధికి బాటలు
పటిష్టమైన కోటలు
అందరూ చదవాలి
జీవితాన ఎదగాలి
అజ్ఞానం తొలగాలి
విజ్ఞానం పెరగాలి
చదువెంతో గొప్పది
చదుకుంటే మంచిది
మేధస్సు పెరిగితే
మహిలోన విజేతే
చదువుకున్న వారే!
లోకానికి వెలుగులు
వారికి సాటి లేరే!
గౌరవానికర్హులు
కామధేనువు చదువు
మేలులెన్నో కలవు
చదువుతోనే ప్రగతి
లేకుంటే అధోగతి

మనోధైర్యం గొప్పది
-------------------------------
కష్టాలు వచ్చినా
నష్టాలు తెచ్చినా
కోల్పోకు ధైర్యాన్ని
ఘనమైన నమ్మకాన్ని
తరమాలి కలవరాన్ని
చూపాలి కనికరాన్ని
కాస్త గుర్తించాలి
పేదోడి అవసరాన్ని
చేసిన సహాయాన్ని
చూపిన మమకారాన్ని
ఏమాత్రం మరువకు
కృతఘ్నతే చూపకు
కాసింత మంచితనము
అదేనోయ్! గొప్పతనము
పదే పదే శోధింప
అది ఘన దైవగుణము

చదువే కీలకం
-------------------------------
చదువు గనుక లేకుంటే
అభివృద్ధి కడు శూన్యము
అజ్ఞానము ముదిరితే
దాపురించును నాశనము
చదువు కదా కల్పతరువు
బ్రతుకు దిద్దే ఇల గురువు
ఎదిగేందుకు సోపానము
ఖరీదైన బహుమానము
విద్యతోనే అభివృద్ధి
జీవితాల్లో సమృద్ధి
అడ్డంకులు అధిగమించి
కలుగజేయు మనోసిద్ధి
చదువుకోండి చిన్నారులు
వదులుకోండి బద్ధకము
చదువు ఒక్కటే మార్గము
గెలిచేందుకు ఆయుధము

నమ్మకమే సాధనం
-------------------------------
కష్టాన్ని నమ్మితే
సాధ్యమే ఫలితాలు
సమైక్యత కోరితే
బాగుండును బ్రతుకులు
నిర్లక్ష్యం వీడితే
చురుకుదనం చాటితే
ఎంతైనా క్షేమము
ఉండదోయి క్షామము
నీచగుణం మానితే
గర్వాన్ని వదిలితే
బ్రతుకులగును హేమము
అందరికి ఆదర్శము
ప్రవర్తన మారితే
పరివర్తన చెందితే
ప్రయోజనం మెండుగా
ఉంటుంది గొప్పగా

చదువు ఒక్కటే మార్గం
-------------------------------
చదువుకుంటే జీవితం
అవుతుంది బంగారం
పదిమందికి తెలుస్తుంది
చదువులోని గొప్పతనం
తొలగించును అజ్ఞానం
వెలిగించును మస్తకం
చదువు ఒక్కటే మదిలో
కల్గించును సంతసం
దొరుకుతుంది ఉద్యోగం
ఎక్కించును అందలం
ఉండొచ్చును హాయిగా
సమాజంలో గొప్పగా
అందరు చదువుకోవాలి
బ్రతుకులు మార్చుకోవాలి
చదువు ఒక్కటే ఆయుధం
చేసుకో సద్వినియోగం
బ్రతుకులో ఎదిగేందుకు
అద్భుతాలు చేసేందుకు
చదువు ఒక్కటే మార్గం
విజ్ఞానం పొందేందుకు

కష్టే ఫలి!
-------------------------------
శ్రమించని జీవితం
అభివృద్ధికి దూరం
దొరకదోయి ఫలితం
ఉండదోయి మోదం
కష్టించే తత్వం
తెచ్చునోయ్! గౌరవం
చేస్తుంది గొప్పగా
ఉంచుతుందితృప్తిగా
బ్రతుకులో శ్రమదానం
ఎంతైనా అవసరం
అభివృద్ధికి మార్గం
విజయానికి సాధనం
నష్టాన్ని నమ్మితే
దక్కుతుంది ఫలితం
జగతి ప్రగతి కోరితే
కోరు దాని స్నేహం

ధైర్యమే ముఖ్యం
-------------------------------
కల్గియుంటే ధైర్యం
ఏదైనా సాధ్యం
లేదంటే జీవితం
అవుతుంది బలహీనం
ధైర్యమే ఔషధం
కల్గించు ఉపశమనం
కోల్పోతే మాత్రం
అడుగడుగునా ఖేదం
ఎదురైనా అడ్డంకులు
వీడరాదు ధైర్యం
ఏమాత్రం మనసులు
పడకూడదు కలవరం
ధైర్యమే ఇల దుర్గం
ఇస్తుంది ఆశ్రయం
కంచెలా కాపలా
ఉంటుందోయ్!ధైర్యం

పెద్దవారి మేలి మాటలు
-------------------------------
పెద్దవారి మాటలు
కాంతులీను ప్రమిదలు
ఆలకిస్తే గనుక
బాగుపడును బ్రతుకులు
అభివృద్ధికి బాటలు
మేలి పసిడి మూటలు
పెద్దల గద్దింపులు
దిద్దుబాటు చర్యలు
పెద్దలను సేవిస్తే
సదా అనుసరిస్తే
ఎంతైనా క్షేమం
ఉండదోయి క్షామం
పెద్దోళ్ల ప్రేమలో
వారు చూపు దారిలో
సాగిపోతే మేలు
సంతోషం బ్రతుకులో

ఆధ్యాత్మిక ప్రపంచంలో...
-------------------------------
భగవంతుని సన్నిధిలో
గడపాలి నిరంతరం
ఆధ్యాత్మిక క్షేత్రంలో
పొందాలి సంతోషం
దేవునికి ఇష్టంగా
అత్యంత సమీపంగా
బ్రతకాలి లోకంలో
పరమ పుణ్య ధామంలో
దైవ దివ్య నామంలో
శ్రేష్టమైన ధ్యానంలో
మేలులెన్నో దొరుకును
ప్రశాంతంగా ఉండును
నమ్మకమే కీలకం
ఆధ్యాత్మిక జగతిలో
అది మిక్కిలి అవసరం
కల్గియుండాలి మనసులో
భగవంతుడు తోడుగా
జీవితాన ఉండగా
భయమేల ఓ మానవా!
చింతలన్నీ మానవా!

చిన్నారులు ఉంటేనే అందము
-------------------------------
చిన్నారుల వదనము
విరిసిన పూలవనము
చూడగా ఇంద్రచాపము
అందాలకే అందము
మాటల్లో మాధుర్యము
మనసేమో నవనీతము
పసి పిల్లలు ఉంటేనే
కోలాహలమే సదనము
అల్లరిలో తొలి స్థానము
అద్వితీయం అనురాగము
అవనిలోన చిన్నారులు
అలరించును హృదయాలు
పిల్లలను జాగ్రత్తగా
అత్యంత సుకుమారంగా
ఉన్నతంగా చూడాలి
క్రమశిక్షణతో పెంచాలి

ముఖ్యం స్థిత ప్రజ్ఞత
-------------------------------
ఉండవోయి కలకాలం
కష్టనష్టాలు ఇలలో
వాటి ఆయుష్షు స్పల్పం
సదా తలచకు మదిలో
కలతలతో ఆరోగ్యం
హృదయంలో ఆనందం
అవుతుంది మటుమాయం
అక్షరాల నిజం నిజం
చింతలే చితిమంటలు
తగలబెట్టును బ్రతుకులు
ఆదిలోనే త్రుంచాలి
సంతృప్తిగా ఉండాలి
చిన్న చిన్న సమస్యలకు
ఆందోళన చెందరాదు
పనికిరాని విషయాలకు
పదే పదే స్పందించకు

అవ్వ హితవు
-------------------------------
పేరాశే గలవాడు
రేపునోయి ! కలహాలు
చాడీలు చెప్పువాడు
కూల్చునోయి! కాపురాలు
చేయరాదు అన్యాయము
చెప్పరాదు అబద్దము
ఆ రెండు దుర్గుణాలు
దైవానికి అసహ్యము
ప్రతీకార జ్వాలలతో
అసూయ ద్వేషాలతో
రగిలిపోయే మనుషులు
ఉండరు స్థిర మనసుతో
అదుపులేని మనసులతో
ఏదీ సాధించలేరు
అమితమైన ఆశలతో
నెమ్మదిగా ఉండలేరు

వాస్తవాలు
-------------------------------
బుద్ధిలేని పుత్రుడు
తెచ్చును అవమానము
జ్ఞానమే ఉన్నోడు
నిలుపు వంశ గౌరవము
ఉంటే సోమరిగా
వృద్ధి ఉండదుగా
ఉంటేనే చురుగ్గా
అన్నీ సాధ్యమేగా
చూస్తే కన్నోళ్లను
గుర్తిస్తే ప్రేమలను
దీవెనలు మెండుగా
ఉంటాయి నిజముగా
సాహసము చేస్తేనే
విజయాలు సులభము
ముందడుగు వేస్తేనే
దగ్గరవుతుంది గమ్యము

అమ్మ నోట అక్షర సత్యాలు
-------------------------------
ఉంటే ఓపికతో
ఏదైనా సాధ్యమే
గొప్ప పనులకు నాంది
శక్తిగలది మౌనమే
అధరాలపై నగవులు
విరబూసిన పూవులు
ముమ్మాటికీ నిజమే
వెదజల్లును సొగసులు
బ్రతుకులోన విలువలు
కొలనులోన కలువలు
ఉంటేనే గౌరవము
బాగుపడును బ్రతుకులు
అమూల్యమైన ముత్యము
అవనిలోన స్నేహము
చేయరాదు ద్రోహము
చేస్తే కడు నష్టము

తాతయ్య చెప్పిన జీవిత సత్యాలు
-------------------------------
చదువు ద్వారా సంస్కారము
అనుభవంతో గుణపాఠము
నేర్చుకుంటే జీవితాన
బహు గౌరవమే సమాజాన
అనవసరపు విషయాల్లో
ప్రక్క వారి కుటుంబాల్లో
పదే పదే జోక్యం తప్పు
దూరంగా ఉంటే ఒప్పు
తెలిసి తెలిసి చేస్తే తప్పులు
అవుతాయి చివరికి నిప్పులు
ఖచ్చితంగా నాశనమే
నిండు నూరేళ్ల జీవితాలు
అన్నింటిలో జాగ్రత్తగా
ఇల ఆదర్శప్రాయంగా
జీవిస్తేనే విజయాలు
నలుగురికి స్ఫూర్తిదాయకాలు
================================================

Bala Geyalu - Amma Goppa Sandesam | Gadwala Somanna
బాల గేయాలు - అమ్మ గొప్ప సందేశం | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 21/05/2026
చిన్న చిన్న పదాలు…పెద్ద పెద్ద జీవిత సత్యాలు…
“బాల గేయాలు - అమ్మ గొప్ప సందేశం” అనే ఈ గేయాల సమాహారం, పిల్లలకు మంచి అలవాట్లు, వినయం, సత్యం, క్షమ, దయ, మరియు కుటుంబ విలువలను ఎంతో సరళంగా, మధురంగా నేర్పిస్తుంది.
ప్రతి గేయం ఒక జీవితం పాఠం…ప్రతి పంక్తి ఒక మార్గదర్శకం.
అమ్మ గొప్ప సందేశం
-------------------------------
సహనంతో విజయము
వినయంతో గౌరవము
వచ్చును ఖచ్చితంగా
కష్టపడితే ఫలితము
సజ్జనుల సహవాసము
జీవితాన మంచితనము
ఎంతైనా క్షేమకరము
నిలుపుకున్న గొప్పతనము
క్షమాపణతో శత్రుత్వము
దోషానికి ప్రాయశ్చిత్తము
తప్పకుండా కలుగుతుంది
మది మలినం తొలగుతుంది
గురుదేవుల బాటలోన
కన్నవారి మాటలోన
దాగుంది గొప్పతనము
అనురాగాల కోటలోన

మహిళామణులు ఘనులు
-------------------------------
వసుధలోన వనితలు
వెలుగుతున్న దివ్వెలు
దేదీప్యమానమే
వారి మోవిని నగవులు
సదనంలో సొగసులు
గగనంలో తారలు
అత్యంత కోమలము
ఆడవారి మనసులు
ఇంటికి ఆధారము
అందాల మందారము
జగతిలోన మహిళలు
గౌరవింప మాన్యులు
అమూల్యమైన అతివలు
అవనిలోన వెలుగులు
వారుంటే స్వర్గము
లేదంటే నరకము

కన్నవారి ప్రబోధం
-------------------------------
వాడాలి పొదుపుగా
డబ్బును జీవితాన
ఉండాలి గొప్పగా
నీతితో సమాజాన
నవ్వుతూ హాయిగా
వెలుగుతూ దివ్వెగా
సాగాలి లోకంలో
పదిమందికి స్ఫూర్తిగా
మాటలను అదుపులో
విలువలను బ్రతుకులో
ఉంచుకుంటే మేలు
అదే కదా పదివేలు
గురువుల సన్నిధిలో
వారు చూపు త్రోవలో
కొండంత ఎదగాలి
వినయంతో ఒదగాలి
---------------------
నాయనమ్మ మేటి వాక్కులు
-------------------------------
అదేపనిగా పొగిడితే
యోచించుము కొద్దిగా
అతి చనువే ముదిరితే
ప్రవర్తించుము తెలివిగా
పదే పదే వాదిస్తే
ఉంచాలి దూరంగా
మాటలతో వేదిస్తే
త్రిప్పికొట్టాలి మౌనంగా
ఆశ్రయం కోరితే
ఇవ్వాలి ఉన్నతంగా
సహాయం అడిగితే
చేయాలి వినయంగా
దుస్సాహసం చేస్తే
వెకిలి వేషాలు వేస్తే
బుద్ధి చెప్పాలి గట్టిగా
జవాబివ్వాలి ధీటుగా

మేటి సూక్తులు
-------------------------------
అందుకున్న సాయము
ఎన్నడూ మరువరాదు
శ్రేష్టమైన స్నేహము
కారాదు బహు దూరము
ప్రక్క వారి దోషము
పదే పదే చూడొద్దు
పేదలపై నేరము
ఎప్పుడూ మోపొద్దు
కష్టాల్లో ధైర్యము
కోల్పోకు ఏమాత్రము
గుండెల్లో కనికరము
కాకూడదు శూన్యము
విశ్వసిస్తే మోసము
కలనైనా ద్రోహము
చేయొద్దు చేయొద్దు
అవమానం పొందొద్దు

ఎంతైనా మంచిది
-------------------------------
ఉండాలి నమ్మకంగా
ఎదగాలి ఉన్నతంగా
దైనందిన జీవితాన
వెలగాలి ప్రపంచాన
ఒదగాలి వినయంగా
బ్రతకాలి క్షేమంగా
ఉంటూ ఐకమత్యంగా
నిలవాలి ఆదర్శంగా
పదిమందికి తోడుగా
ఎదిగేందుకు వంతెనగా
ఉంటేనే గొప్పతనము
అక్షరాల నిజము నిజము
దైవానికి ఇష్టంగా
గురువులతో ప్రేమగా
నడుచుకుంటే మంచిది
సజ్జనులతో స్నేహంగా

తల్లి చల్లని పలుకులు
-------------------------------
అమ్మ మాట తీయన
అవు పాలు తెల్లన
పెద్దల మాట వినిన
జీవితాన దీవెన
మంచు గడ్డ చల్లన
నత్త నడక మెల్లన
విలువలు కోల్పోతే
అంతులేని వేదన
అహర్నిశలు సాధన
ఎదిగేందుకు నిచ్చెన
స్వయం కృషి ఉన్నతము
సమకూర్చును విజయము
మితిమీరిన వాదన
చివరికదే ఖేదము
సమైక్యత భావన
సృష్టించును స్వర్గము

కన్నవారు కనిపించే వేల్పులు
-------------------------------
కన్నవారి సేవలో
మిన్నగా ఆశీర్వాదము
వారు చూపు ప్రేమలో
వెన్నెలమ్మ చల్లదనము
తల్లిదండ్రుల పలుకులో
ఉన్నవి తేనెధారలు
వారి గొప్ప మనసులో
కోకొల్లలు శుభములు
అమ్మానాన్నలు మహిలో
కనిపించే దైవాలు
నిరంతరం హృదయంలో
స్మరిస్తే తొలగు విఘ్నాలు
తల్లిదండ్రుల మనసులు
పరికింపగ నవనీతము
చేయరాదు గాయాలు
చేస్తే అపార నష్టము

"సత్యమేవ జయతే"
-------------------------------
వాస్తవాలు చేదుగా
ఫలితాలు తీయగా
ఉంటాయి చూడగా
అక్షర సత్యమేగా
తేనె పూసిన కత్తులు
పరికింప అబద్దాలు
హరించును జీవితాలు
కూల్చును కుటుంబాలు
పదే అదే అబద్దము
ఆడితే కడు నష్టము
చివరికి నాశనము
చేస్తుంది ఖచ్చితము
అవరోధాలు వచ్చినా
కష్టాలే తెచ్చినా
సత్యమే! గెలుస్తుంది
చిరకాలం నిలుస్తుంది
====================================

Bala Geyalu - Kannavari Bodhanalu | Gadwala Somanna
బాల గేయాలు - కన్నవారి బోధనలు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 17/05/2026
పిల్లల్లో మంచి ఆలోచనలు, నైతిక విలువలు, ప్రేమ, గౌరవం, క్రమశిక్షణ వంటి గుణాలను పెంపొందించేందుకు గద్వాల సోమన్న గారు రాసిన ఈ బాల గేయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సులభమైన పదాలతో, మధురమైన భావాలతో రాసిన ఈ గేయాలు పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా స్ఫూర్తినిస్తాయి.
కన్నవారి బోధనలు
-------------------------------
విశ్వాస ఘాతుకులను
విద్రోహ శక్తులను
కనిపెట్టి ఉండాలోయ్!
దూరంగా తరమాలోయ్!
వదరబోతు వ్యక్తులను
వట్టి నోటి మాటలను
వదిలిపెట్టాలోయ్! సదా
లేకుంటే బ్రతుకు వృథా
నీతి లేని మనుషులను
కఠినమైన మనసులను
మార్చుకుంటే మంచిదోయ్!
శిక్షణతో బ్రతుకులను
జీవితాన వెలుగులను
ఇల నైతిక విలువలను
పెంచుకుంటే శ్రేష్టము
పంచుతుంది గౌరవము

అమ్మ చెప్పిన నిజాలు
-------------------------------
కొండెగాళ్ళను తరిమితే తొలగిపోవును కలహాలు
ప్రేమవిరులు చల్లితే
వ్యాపించును పరిమళాలు
గురుదేవులను అడిగితే
దొరుకునోయి! సలహాలు
కన్నోళ్లను పూజిస్తే
బ్రతుకున ఆశీర్వాదాలు
పేదోళ్లను వేదిస్తే
మనసులు గాయపరచితే
భగవంతుడు ఊరుకోడు
పెద్దలను అనుమానిస్తే
అవినీతిని స్నేహిస్తే
అబద్దాలు ఆడితే
మర్యాదలు మాయమగును
విలువలే శూన్యమాగును

ఆరోగ్యమే మహా భాగ్యం
-------------------------------
మనిషికున్న గొప్ప ఆస్తి
ఆరోగ్యం మాత్రమే
పదిలంగా ఉంచితే
హృదయాల్లో స్వర్గమే
ఈ వాతావరణంలో
ఆరోగ్యం భాగ్యమే
నూరేళ్ళ జీవితంలో
ఎంతైనా కీలకమే
అడుగడుగునా నాటుకో
అమూల్యమైన మొక్కలు
స్వచ్ఛ వాయువులు పంచి
మంచితనం చాటుకో
ఆరోగ్య కారకాలు
అవనిలోన వృక్షాలు
చేసేస్తే సంరక్షణ
బాగుండును జీవితాలు

సత్య స్వరాలు
-------------------------------
గౌరవమే మాటతో
చక్కనైన భాషతో
హృదయాల్లో స్థానమే
ప్రేమలొలుకు మనసుతో
మహనీయుల దారిలో
వారు చేయు బోధలో
బంగరు భవిత ఉన్నది
అనుసరిస్తే మంచిది
మంచి మంచి తలపులతో
సజ్జనుల స్నేహంతో
ఎదగాలోయ్! జీవితాన
మురియాలోయ్! లోకాన
మేలు చేసే పనులతో
స్ఫూర్తినిచ్చు మనుషులతో
ఆదర్శం చాటాలి
ఉన్నతంగా ఎదగాలి

గురుదేవుల మేలి మాటలు
-------------------------------
ప్రతి నిముషము ఓర్పుతో
బ్రతుకులోన నేర్పుతో
ఉండాలోయ్! చురుకుగా
పదిమందికి స్ఫూర్తిగా
సడలని సంకల్పంతో
విడవని విశ్వాసంతో
అభివృద్ధి పథంలోన
నడవాలోయ్! భువిలోన
కోపంపై జయంతో
విలువైన వినయంతో
సమాజాన బ్రతకాలోయ్!
ప్రశాంతంగా ఉండాలోయ్!
మహాత్ముల స్నేహంతో
మమతానురాగాలతో
తలపించాలి నాకము
హర్షించాలి లోకము

ఉపాధ్యాయుని హితబోధ
-------------------------------
కలహాలు సృష్టించును
కడు పేరాస గలవాడు
నెమ్మదిని కోల్పోవును
కోపగుణం గలవాడు
చెడు చెలిమి చేయువాడు
అపకీర్తి తెచ్చువాడు
చివరికతడు వంశంలో
చీడపురుగును తలపించును
చేస్తే పనిలో జాప్యము
నష్టమే వాటిల్లును
బ్రతుకులో నిర్లక్ష్యము
చెల్లించాలి మూల్యము
అపనిందలు వేయువాడు
బహు పనికిమాలిన వాడు
అసూయ కల్గియున్నోడు
అశాంతితో కుములువాడు

సఖ్యతకు కృషి చేయాలి
-------------------------------
సుతిమెత్తని హృదయాలు
చేయరాదు గాయాలు
ఊరట కలుగజేయాలి
ఉత్తేజము నింపాలి
విలువైనవి కుటుంబాలు
చేయకు చిన్నాభిన్నము
లేనిపోని తలపులతో
పనికిమాలిన పనులతో
చీల్చరాదు కాపురాలు
పోయకూడదు నిప్పులు
అసూయద్వేషాలతో
సృష్టించరాదు కలతలు
సమాధానానికి కర్తలు
కావాలోయ్! కావాలోయ్!
సమైక్యతకు కృషి ఎంతో
చేయాలోయ్! చేయాలోయ్!

మంచివారి సాంగత్యం మేలు
-------------------------------
దుష్టుల సాంగత్యము
కష్టాలకు ద్వారము
నష్టాల బాటలో
నడిపించును సతతము
చెడ్డవారి స్నేహము
నడవడిని చెరుపుతుంది
సంఘంలో అపకీర్తి
మొత్తానికి తెస్తుంది
సజ్జనుల సహవాసము
బ్రతుకున మధుమాసము
మంచి చెడులను తెలిపి
చూపును సన్మార్గము
మార్గం మంచిదైతే
భవిష్యత్ బాగుండును
స్నేహాన్ని నమ్మితే
జీవితమే సఫలము

పరోపకారులు పుడమిలో
-------------------------------
రాలిపోయే ఆకులు
వాడిపోయే పూవులు
నేర్పును జీవిత సత్యము
గుర్తించుకో నిత్యము
అస్తమించే సూర్యుడు
పుంజుకుని ఉదయించును
సంగ్రామంలో యోధుడు
త్యాగాన్ని కనుపరచును
ప్రవహించే సెలయేరులు
ప్రార్ధించే అధరాలు
పరోపకారం చేయును
ప్రేమించే హృదయాలు
స్వార్ధగుణమే అల్పము
కల్గియుంటే నష్టము
త్యాగగుణమే శ్రేష్టము
జీవితాన ఘనము ఘనము

స్ఫూర్తిదాతలు చీమలు
-------------------------------
చిట్టి చిట్టి చీమలు
సంఘజీవులు చీమలు
ముందు చూవు కల్గిన
జ్ఞానమున్న ప్రాణులు
స్వార్ధం లేని చీమలు
త్యాగానికి గురుతులు
పొదువు విలువ తెలుపును
క్రమశిక్షణ నేర్పును
కష్టించే చీమలు
స్ఫూర్తి దాతలు చీమలు
ఉన్న దానిలో తృప్తి
వెదకుకొనే చీమలు
చెప్పునోయ్! పాఠాలు
వివరించును సత్యాలు
సృష్టిలోనే చిన్నవి
గుణంలోన పెద్దవి

పిల్లలుంటే స్వర్గము
-------------------------------
భగవంతుని బహుమతులు
ప్రగతికి పట్టుకొమ్మలు
జగతిలో చిన్నారులు
సన్నజాజి కుసుమాలు
ముద్దులొలికే పిల్లలు
తావులీను సిరిమల్లెలు
అందరిని అలరించే
ఆకాశాన తారలు
బలే బలే పసిపిల్లలు
దేవునికి ప్రతిరూపులు
సదనంలో విరిజల్లులు
సుందర జలపాతాలు
పిల్లలుంటే లోకము
తలపిస్తుంది నాకము
లేదంటే ఇంటిలో
అడుగడుగునా శోకము

అవ్వాతాతలు మాకిష్టం
-------------------------------
అవ్వాతాతలు మాకిష్టం
మేమే వారికి ఆరోప్రాణం
మా దగ్గరే పడుకుంటారు
సాహస కథలే విన్పిస్తారు
కొండలా అండగా ఉంటారు
నీతి మార్గాన నడిపిస్తారు
నైతిక విలువలే బోధించి
యోచిస్తారు మా గురించి
కన్నవారే కోపడితే
బుజ్జగించి బొజ్జనింపుతారు
తల్లిదండ్రులను గద్ధించి
మద్దతు మాకు ప్రకటిస్తారు
అవ్వాతాతల సన్నిధిలో
వారు చూపించే ప్రేమలో
ఆనందమే ఉదయించును
ఆదర్శమే కన్పించును

నాన్న చేసిన ప్రబోధము
-------------------------------
కల్గియుంటే వినయము
దైవానికి సంతోషము
అగ్నియే అహంకారము
తగలబెట్టును జీవితము
వినమ్రత ఆభరణము
పరికింప కంఠహారము
ధరించాలి నిరంతరము
వదలొద్దు ఏమాత్రము
కలుగజేయును కష్టము
చెడగొట్టును ఆరోగ్యము
అపారమైన కోపము
ఎక్కువైతే అరిష్టము
నిజ సంపద సుగుణాలు
ఉంటేనే జీవితాలు
బాగుపడును కుటుంబాలు
కట్టబడును కాపురాలు

పెద్దయ్య ప్రవచనాలు
-------------------------------
చేసే పనిలో చిత్తశుద్ధి
ఉంటేనే కదా అభివృద్ధి
దాతృత్వము కల్గియుంటే
బ్రతుకుల్లో ఉండును సమృద్ధి
మంచితనమే జీవితాల్లో
ప్రేమగుణమే కుటుంబాల్లో
పుష్కలంగా ఉంటేనే
బ్రతుకుతుంది మానవత్వము
వదనాల్లో మందహాసము
మాటల్లోను మాధుర్యము
ఉంటేనే హృదయాలు సదా
అవుతాయి ఆనంద సాగరము
కల్గియుంటే సమభావము
అందరిలో ఐకమత్యము
నిలబెట్టవచ్చు దేశకీర్తి
పంచపెట్టవచ్చు ఘన స్ఫూర్తి

పిల్లల వదనాలు అందము
-------------------------------
పసి పిల్లల వదనాలు
వికసించిన కమలాలు
సున్నితమైన హృదయాలు
చిగురించిన వృక్షాలు
చిన్నారుల అధరాలు
పారిజాత పుష్పాలు
చిట్టి చిట్టి పాదాలు
కొలనులోని పద్మాలు
బాలల తీయని పలుకులు
తలపించు తేనెధారలు
హంసను బోలిన నడకలు
రంజింపజేయు మనసులు
పసివారు వెన్నెల జల్లులు
పరిమళించే సిరిమల్లెలు
హృదయాలను ముద్దాడే
సుందర ప్రకృతి దృశ్యాలు

ఇలా చేస్తే మంచిదే
-------------------------------
చిరునవ్వులు చిందిస్తే
వదనానికి బహు అందము
ప్రేమగా పలకరిస్తే
హృదయానికి ఆనందము
ప్రోత్సాహమందిస్తే
అభివృద్ధికి సోపానము
ఉపకారం చేసేస్తే
మదినిండా ఉపశమనము
మనసులను నియంత్రిస్తే
అవుతారు విశ్వ విజేతలు
పిల్లలను చక్కదిద్దితే
బాగుపడుతాయి బ్రతుకులు
అందిస్తే జ్ఞానమే
జీవితాల్లో విజయమే
అహర్నిశలు శ్రమిస్తే
భవిత అగును కుందనమే
చేయాలి మందహాసము
రావాలి నవ వసంతము
తేవాలి జీవితాల్లో
అంతులేని ఉజ్జీవము
ప్రెంచాలి ఉత్తేజము
నింపాలి ఉల్లాసము
అందరి వదనాల్లో
పొందాలి చిద్విలాసము

ఓపిక జీవితాల్లో ఔషధ మూలిక
-------------------------------
అమూల్యమైన ఓపిక
ఆనందాల వేదిక
కల్గియుంటే మాత్రము
బంగారమే జీవితము
జీవితాల్లో దీపిక
భగవంతుని కానుక
ఉంటేనే ఓపిక
అగును చైతన్య గీతిక
చేస్తుంది అద్భుతాలు
ఇస్తుంది సత్ఫాలితాలు
ఘన కార్యాల సాధనకు
ఓపిక ఉంటే బహు మేలు
పరమౌషధ మూలిక
విలువైన మణి హారిక
అసమానమైన ఓపిక
ఉండాలని చిరు కోరిక
ఓపికే లేని వాడు
అది బ్రతుకున లేని నాడు
అభివృద్ధికి కడు దూరము
అక్షరాలది సత్యము

అమ్మమ్మ హెచ్చరికలు
-------------------------------
ఎదుర్కొని అవరోధాలు
నెగ్గాలి జీవితంలో
చదువుకుని తలరాతలు
మార్చుకోవాలి మహిలో
ఎప్పుడు నిరాశ లోయలో
ఉండరాదు! ఉండరాదు!
కష్టాల కాలంలో
ధైర్యాన్ని వీడరాదు
సోమరితనం చెరలోన
సదా నివసించరాదు
పొరుగువారి బ్రతుకులోన
నిప్పులు పోయరాదు
ప్రతీకార జ్వాలల్లో
ప్రతిక్షణం కాలరాదు
ప్రతికూల వేళల్లో
దుస్సాహసం కూడదు

శ్రేష్టమైన పుస్తకాలు
-------------------------------
అమూల్యమైన పుస్తకాలు
కాంతులీనే కాగడాలు
అజ్ఞానాంధకారము తరిమి
బాగుచేయును జీవితాలు
పుస్తకాల పారాయణము
బహు శ్రేష్టమైన అలవాటు
పదును పెట్టును మేధస్సుకు
ప్రశాంతతనిచ్చును మనసులకు
బ్రతుకులో శ్రేయోభిలాషులు
ప్రకాశమానమైన తారలు
స్నేహితులే పుస్తకాలు
వెలిగిస్తాయి జీవితాలు
తోడొచ్చును ప్రయాణంలో
మేలు చేయును జీవితంలో
ఒంటరితనం పోగొట్టును
అమ్మ మాదిరి ఆదరించును
అనునిత్యమూ పఠించాలి
విజ్ఞానం పెంచుకోవాలి
పుస్తకాలతో అనుబంధము
రోజు రోజు పెరుగుతుండాలి
పుస్తకాలే లోకమవ్వాలి
హస్త భూషణమే కావాలి
పాఠకుల సంఖ్య పెంచాలి
పూర్వ వైభవమే తేవాలి

అక్షర సత్యాలు-జీవిత పాఠాలు
-------------------------------
కష్టంతో వచ్చిన ఫలితము
పెంచిన చెట్టు ఇచ్చిన ఫలము
ఎంతో ఎంతో మాధుర్యము
అక్షరాల సత్యము సత్యము
గురువులు పంచే విజ్ఞానము
పుస్తకాల పారాయణము
చేకూర్చును మంచి మెండుగా
ఎదిగేందుకు నిచ్చెనేగా
నీతిమంతుల సహవాసము
కష్టాల్లో మనోనిబ్బరము
చాలా చాలా అవసరమే
కడు శ్రేష్టమైన క్షమాగుణము
శృతిమించిన సోమరితనము
అడుగడుగునా పిరికితనము
చేయును బ్రతుకులు నాశనము
చూడాల్సిందే అపజయము
***

-గద్వాల సోమన్న




Comments