top of page
Original.png

బాల గేయాలు - అమ్మ అద్భుత వాక్కులు

బాల గేయాలు, తెలుగు బాల గేయాలు, పిల్లల గేయాలు, నీతి గేయాలు, పిల్లల విలువలు, నిజమైన స్నేహితుడు, గురువు చెప్పిన సత్యాలు, అమ్మ చెప్పిన హితోక్తులు, నైతిక విలువలు, బాలల సాహిత్యం, తెలుగు కవితలు, పిల్లల వ్యక్తిత్వ వికాసం, బాలల నీతి కథలు, విద్యార్థుల గేయాలు, పిల్లలకు మంచి అలవాట్లు

అమ్మ అద్భుత వాక్కులు
అమ్మ అద్భుత వాక్కులు

Bala Geyalu - Amma Adbhutha Vakkulu | Gadwala Somanna 

బాల గేయాలు - అమ్మ అద్భుత వాక్కులు | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 30/06/2026


అమ్మ అద్భుత వాక్కులు 

-------------------------------

చక్కగా చదువుకో 

చుక్కలా వెలిగిపో 

చక్కని మార్గంలో 

మొక్కలా ఎదిగిపో 


బద్ధకాన్ని వదులుకో 

బుద్ధిగా నడుచుకో 

హద్దులోనే ఉంటూ 

వృద్ధిలో సాగిపో 


శుద్దిగా చేసుకో 

శ్రద్ధగా నేర్చుకో 

అబద్దాలు మానేసి 

నిబద్దత చాటుకో 


కన్నీళ్ళను తుడుచుకో 

కన్నోళ్లను చూసుకో 

పన్నీరులా బ్రతికి 

మిన్నగా ఉండిపో 


ఉక్రోషం మానుకో 

ఉద్రేకం అణచుకో 

భద్రంగా ఉంటూ 

శుభ్రతను కోరుకో 


మట్టి విలువ తెలుసుకో 

జట్టుగా కలసిపో 

వట్టి మాటలు వదిలి 

గట్టి పనులు పూనుకో 








నాన్న ఉంటే స్వర్గము 

-------------------------------

నాన్న గారి మనసులో 

వారి గొప్ప పలుకులో 

ప్రేమ నదులు చూడాలి 

ఆశయం నెరవేర్చాలి 


తండ్రి చేయు కష్టాన్ని 

అమితమైన త్యాగాన్ని 

గౌరవించి తీరాలి 

తాకాలోయ్! హృదయాన్ని 


నాన్న ఉంటే లోకము 

తలపించును నాకము 

అంతా గాలించినా 

లేరు ఎవరు సరి తూకము 


నాన్న మనసు ఉన్నతము 

ఆకాశంలా విశాలము 

అర్ధమగుట కడు కష్టము 

పడుతుంది కొంత సమయము 


నాన్న అంటే నమ్మకము 

కుటుంబాన ఆధారము 

పిల్లల ప్రగతికి మార్గము 

బలిష్టమైన దుర్గము 







తాతయ్య సూక్తులు 

-------------------------------

అందరినీ నమ్మడము 

బ్రతుకున మోస పోవడము 

మన తప్పే అవుతుంది 

విచక్షణ కోల్పోవడము 


పోవాలోయ్! అవివేకము 

తగ్గాలోయ్! ఆవేశము 

భవిత బాగుండాలంటే 

తప్పదు శ్రమైక జీవనము 


అభివృద్ధికి అవరోధము 

అందరితో విరోధము 

సమైక్యతే పెరిగితే 

జీవితంలో విజేతే 


అగ్ని వంటిది గర్వము 

తెచ్చిపెట్టు నాశనము 

ఉండాలోయ్! బహు దూరము 

అప్పుడే కదా క్షేమము 







బడి గంట మా నేస్తం! 

-------------------------------

అందమైన మా బడికి 

అక్షరాల అమ్మ ఒడికి 

పలుకుతుంది ఆహ్వానము 

బడి గంట మధుర స్వరము 


మాకెంతో ప్రియము ప్రియము 

వీనులకు పర్వదినము 

బడి గంట తీయని పిలువు 

బ్రతుకుల్లో మేలుకొలుపు 


బడి గంట మా నేస్తము 

త్యాగానికి అది చిహ్నము 

గంట గంటకు మ్రోగుతూ 

ప్రేమగా పలుకుతుంది


కాలం విలువ తెలుపును

క్రమశిక్షణ ఇల నేర్పును 

విద్యార్థులకు ఉపకారము 

అందించును సహకారము







మంచితనం భూషణం 

-------------------------------

మంచితనం ఆభరణము 

మనిషికున్న గొప్పవరము 

కల్గియుంటే గౌరవము 

దైవానికి బహు ఇష్టము 


చెడుతనమే నాశనము 

హరిస్తుంది జీవితము 

మంచి పేరు పోగొట్టును 

మనిషి పరువు అది తీయును 


మంచి అయితే శూన్యము 

ఎంచి చూడ కడు వ్యర్థము 

పంచిపెట్టు పుడమిలో 

పెంచు ఖ్యాతి బ్రతుకులో 


మంచితనం కోరుకో 

పంచడమే నేర్చుకో 

సముద్రంలా తరగనిది 

పరికించ తిరుగు లేనిది 






పెద్ద నాన్న ప్రేమ పలుకులు 

-------------------------------

విమర్శలను తట్టుకుని 

ప్రశ్నలెన్నో ఎదుర్కొని 

నిలబడు వారే యోధులు 

జీవితాన విజేతలు 


విలువలను పెంచుకుని

మమతలను పంచుకుని 

బ్రతుకు వారే మాన్యులు 

కడు ఆదర్శవంతులు 


పుస్తకాలు పట్టుకుని 

విజ్ఞానం అందుకుని 

పదిమందికి స్ఫూర్తిగా 

ఉండువారు ఘనులేగా 


చేయి చేయి పట్టుకుని 

సమైక్యత చాటుకుని 

లోకంలో బ్రతకాలి 

నాకమునే తేవాలి 






మానవా! బద్ధకం మానవా!!

-------------------------------

భగవంతుని సన్నిధిలో 

నిలువలేరు డాంబికులు 

అట్టి వారి హృదయంలో 

వినయం ఎండమావులు 


అబద్దమాడు పెదవులు 

పవిత్రత లేని మనసులు 

దైవానికి అసహ్యము 

నీతి మాలిన బ్రతుకులు 


దేవునిపై భయభక్తులు 

కల్గియుంటే ఇష్టులు 

భగవంతుడు మెండుగా 

కుమ్మరించు దీవెనలు 


దేవునితో విరోధము 

వద్దు వద్దు మానమా!

అభివృద్ధికి అవరోధము 

బద్ధకమే మానవా!




తాతయ్య హితోక్తులు 

-------------------------------

హృదయంలో కపటము 

మితిమీరిన గర్వము 

కల్గియుంటే గనుక 

నాశనం జీవితము 


హానికరం కోపము 

చెరుపును ఆరోగ్యము 

నియంత్రిస్తే మేలు 

శాంతగుణమే చాలు 


కఠినమైన మాటలు 

పనికిరాని తలపులు 

ప్రమాద ఘంటికలే

అమితమైన ఆశలు 


చితిమంటలు కలతలు 

తగలబెట్టు బ్రతుకులు 

ఆనందం హరించి 

నలిపేయును మనసులు 






అందాల మొలతాడు

-------------------------------

అందమైన మొలతాడు 

బంగారు మొలతాడు

ఎంచక్కా నడుములో 

వ్రేలాడే మొలతాడు 


ఇష్టమైన మొలతాడు 

ఎరుపు రంగు మొలతాడు

మనోహరమే నడుముకు 

అవ్వ తెచ్చిన మొలతాడు


అవసరమే పెద్దలకు 

కడుతారు పిల్లలకు

ఆనవాయితీ కదా 

కట్టడడం నడుములకు 


 కదులుతుంది మొలతాడు 

రక్షణే మొలతాడు 

నరాలకు ఉత్తేజము,

బిగుతునిచ్చు మొలతాడు


బొడ్డు కింద ఉంటుంది 

నియంత్రణ చేస్తుంది 

కాదు కాదు ఆచారము 

ఆరోగ్యమునిస్తుంది 


మొలతాడుతో లాభాలు 

చూడగా కోకొల్లలు 

అనాదిగా వస్తుంది 

కట్టుకుంటే శుభములు 






అమ్మ నోట ఆణిముత్యాలు 

-------------------------------

వదలాలి ఏమరుపాటు 

లేకుంటే గ్రహపాటు 

జీవితాన అవసరమే 

ముందు చూపు ముఖ్యమే 


ఉంటేనే క్రమశిక్షణ 

చిన్నారుల సంరక్షణ 

అభివృద్ధి సునాయాసము 

నాట్యమాడు సుభిక్షము 


ఆపదలో సహాయము 

అందించుటే సముచితము 

చేయరాదు అన్యాయము 

తలపెట్టకు అపకారము 


చేతనైతే ఉపయోగము 

అక్కరలో సహకారము 

ఉండడమే ఉత్తమము 

అందరికి ఉపయుక్తము 


==================================





Bala Geyalu - Aa Rojulu | Gadwala Somanna 

బాల గేయాలు - ఆ రోజులు... | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 27/06/2026







ఆ రోజులు...

-------------------------------

గుణం చూసి మర్యాద 

ఇచ్చే వారు ఆనాడు 

ధనానికి విలువెక్కువ 

చూడంగా ఈనాడు 


స్వచ్ఛమైన హృదయాలు 

విరబూసిన కుసుమాలు 

యోచిస్తే అలనాడు 

ఉండేవి అనురాగాలు 

 

ఎటుచూసినా మోసము 

అడుగడుగునా ద్రోహము 

మసిబారి పోయెను నేడు 

మనిషిలో మానవత్వము 

 

ప్రేమలొలికే  మనసులు 

పొంగిపొర్లే మమతలు 

అపురూపం ఆ రోజులు

మరుపురాని జ్ఞాపకాలు


 





నాన్న నోట నీతి సూక్తులు 

-------------------------------

దైవానికి ఇష్టము 

విలువైన యథార్ధత 

పిల్లలను దిద్దడం 

మన అందరి బాధ్యత 


ప్రేమలేని బ్రతుకులు 

నీరెండిన చెరువులు 

కరుణ లేని పుత్రులు 

త్రాణ లేని ప్రాణులు 


గుణం లేని మనుషులు 

కాపు లేని తరువులు 

కఠినమైన మనసులు 

బండ రాతి సమములు 


జీవితాన విలువలు 

గుబాళించు  సుమములు 

తెచ్చిపెట్టు గౌరవము 

ప్రతి మనిషికి అవసరము 







అమ్మ అమృత వాక్కులు 

-------------------------------

అహర్నిశలు సాధన 

అసలు విజయ రహస్యము 

అభివృద్ధికి వంతెన 

ఘన ఆత్మవిశ్వాసము 


చేస్తేనే సాహసము 

ఏదైనా సాధ్యము 

లేకుంటే మాత్రము 

తోడగును అపజయము 


అమూల్యమైన పట్టుదల 

దాస్యం నుంచి విడుదల 

వచ్చు వరకు ఫలితము 

వీడరాదు ధైర్యము 


వేయాలి ముందడుగు 

అనుకున్న దానిలో 

అపరాదు మన పరుగు 

ఆశయ సాధనలో 







మామయ్య మేటి మాటలు 

-------------------------------

మానాలోయ్ ప్రగల్భాలు

మొదలెట్టాలి ప్రయత్నాలు

సానుకూల దృక్పథంతో 

దాసోహం విజయాలు 


కంటుంటే పగటి కలలు 

అభివృద్ధి ఎండమావి 

శ్రమిస్తేనే బ్రతుకులు 

అవుతాయి ఊటబావి 


జయిస్తే పిరికితనము 

చూపిస్తే క్షమాగుణము 

అదే కదా గొప్పతనము 

అందరికి ఆదర్శము 


బాగుండాలి ప్రయత్నము 

జరుగుతుంది అద్భుతము 

కాకూడదు ఏమాత్రము 

ఆరంభ శూరత్వము 





చిన్నారులు 

-------------------------------

చిన్ని చిన్ని పిల్లలు 

సన్నజాజి సుమములు 

కన్నవారి ఆస్తులు 

మిన్న వారి మనసులు 


ముద్దులొలుకు బాలలు 

ముద్దబంతి పూవులు 

శ్రద్ధగా చదివితే 

వృద్ధికి వారు బాటలు 


మల్లెలాంటి మాటలు 

పల్లెసీమ సొగసులు

అల్లరిలో ప్రథములు 

ఎల్లరికీ ఇష్టులు 


చక్కనైన పిల్లలు

చుక్కల్లా వెలుగులు 

మొక్కల్లా పెంచితే 

మిక్కిలి ప్రయోజకులు  







మేలు మాత్రమే చేయాలి!

-------------------------------

ఫలాలను బట్టి చెట్లను 

గుణాలను బట్టి వ్యక్తులను 

అంచనా వేయవచ్చు 

స్వభావం కనిపెట్టవచ్చు


మాటలను బట్టి మనుషులను 

చేతలను బట్టి పిల్లలను 

సులువుగా గుర్తించవచ్చు 

వారి వారి చర్యలను 


అసలు రంగు బయట పడును 

ఏదో ఒక రోజు తప్పక 

రహస్యమైనది ఉండదు 

దాచపెట్ట వీలుకాదు 


జాగ్రత్తగా ఉండాలి 

మేలి పనులే చేయాలి 

వీలైతే అందరికి 

సహాయమే చేయాలి 






చదువే ప్రాముఖ్యము 

-------------------------------

శ్రద్ధ లేని చదువులు 

నీటి మీద రాతలు 

ఏమాత్రం నిలవని 

గాలిలోన మేడలు 


మాటలు కట్టిపెట్టి 

చదువుపై దృష్టి పెట్టి 

చదవాలి గొప్పగా 

నిలవాలి స్ఫూర్తిగా 


చదువుతో సంస్కారము 

విలువైన విజ్ఞానము 

పొందితేనే ఘనత 

జీవితాల్లో నవ్యత 


అభివృద్ధికి మూలము 

చదువు కదా మార్గము 

అడ్డంకులు వచ్చినా 

చేయకు నిర్లక్ష్యము 






దండకు ఆధారం దారం 

-------------------------------

పూవులన్నీ కూర్చితే 

మాలగా మారుతుంది 

మెడలో అలంకరిస్తే 

గౌరవమే తెస్తుంది 


పూదండకు ఆధారము 

పరికిస్తే దారమే 

స్త్రీల సిగలో ఒదిగితే 

అత్యంత మనోహరమే 


దండలాగ  ఉంటేనే 

ఐకమత్యము సాధ్యము 

విడిపోతే కుటుంబము 

మిగుల అతలాకుతలము 


కలసిమెలసి ఉండాలి 

చేయి చేయి కలపాలి 

రెండు చేతులు కలసినట్లు 

మ్రోగాలోయ్! చప్పట్లు 


కలుపుగోలుతనంతో 

ప్రేమలొలుకు హృదయంతో 

జీవించాలి మంచిగా

ఆదర్శానికి సాక్షిగా 


పూలలోని తావిలా

పాలలోని తెలుపులా 

అందరూ బాగుండాలి 

మాలలోని సొగసులా 









జీవితంలో ఉందాం! 

-------------------------------

వికసించిన పువ్వులా 

పసి పిల్లల నవ్వులా 

జీవితంలో ఉందాం!

వెలుగులీను దివ్వెలా 


మల్లెలోని తెలుపులా 

పల్లెసీమ సొగసులా 

జీవితంలో ఉందాం! 

ఎల్లలు లేని ప్రేమలా 


నింగిలోని తారలా 

జీవజలపు ధారలా 

జీవితంలో ఉందాం! 

ప్రవహించే యేరులా 


మేలు చేయు వానలా 

వాన కారు కోయిలలా

జీవితంలో ఉందాం!

సుందర జలపాతంలా 


సాయపడే చేతిలా 

చీకటి తరుము జ్యోతిలా 

జీవితంలో ఉందాం!

ఖ్యాతి తెచ్చే నీతిలా 


అమ్మ చేతి వంటలా 

ఆకలి తీర్చు పంటలా 

జీవితంలో ఉందాం!

ఆదరించు మిత్రునిలా 









అక్కయ్య అభిలాష 

-------------------------------

మమకారాల తోటలో 

మహనీయుల బాటలో 

మంచిగా జీవిద్దాం!

మరుపురాని కోటలో 


అనురాగాల వాడలో 

స్నేహమనే మేడలో 

కలసిమెలసి సాగుదాం!

కన్నవారి నీడలో 


అనుభూతుల తేరులో 

ఆనందపు యేరులో 

అందరూ బాగుందాం!

ఇల షికారుల కారులో 


తల్లిదండ్రుల ప్రేమలో 

గుణవంతుల చెలిమిలో 

అభివృద్ధి చెందుదాం!

గురుదేవుల బోధలో 






తల్లిదండ్రులు పూజ్యులు 

-------------------------------

కన్నవారి తీపి కలలు 

మిన్నగా తీర్చాలోయ్!

వెన్నలాంటి మనసుతో 

వెన్నెల్లా బ్రతకాలోయ్!


తల్లిదండ్రుల త్యాగమును 

వారికున్న బాధ్యతను 

గుర్తిస్తే మంచిదోయ్!

విస్మరిస్తే నష్టమోయ్! 


చేయొద్దు నిర్లక్ష్యము 

కన్నోళ్లను బ్రతుకులో 

వారి మనసులకు గాయము 

కానియ్యకు జగతిలో 


వారు చూపు త్రోవలో 

స్వచ్ఛమైన ప్రేమలో 

ఎదిగిపో ఉన్నతంగా 

మసలుకో సున్నితంగా 


జన్మ దాతలు వేల్పులు 

గౌరవింప అర్హులు 

మర్చిపోకు ఈ సత్యము 

గుర్తించుకో నిత్యము 

=================================








Bala Geyalu - Kastha Yochinchu | Gadwala Somanna 

బాల గేయాలు - కాస్త యోచించూ | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 18/06/2026


పిల్లల మనస్సు మట్టి వంటిది. చిన్నప్పుడే అందులో నాటిన మంచి ఆలోచనలు, విలువలు, అలవాట్లు జీవితాంతం వారిని మంచి మార్గంలో నడిపిస్తాయి. అలాంటి విలువలను సులభమైన పదాలతో, మధురమైన లయతో పిల్లలకు చేరవేసే అద్భుతమైన "బాల గేయాలు – కాస్త యోచించూ..." గేయాల సంకలనం ఇది.

ఈ గేయాలలో స్నేహం, పెద్దల గౌరవం, గురువుల బోధనలు, తల్లిదండ్రుల సూచనలు, నైతిక విలువలు, దయ, క్షమ, సేవాభావం, దేశభక్తి వంటి ఎన్నో మంచి అంశాలు చోటుచేసుకున్నాయి. ప్రతి గేయం ఒక చిన్న నీతి సందేశంలా పిల్లల హృదయాల్లో నిలిచిపోతుంది.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బాలసాహిత్యాభిమానులు తప్పక చదవాల్సిన విలువైన గేయాల సమాహారం ఇది.


గుణమున్న వాళ్లతో 

చేయాలోయ్! స్నేహము 

చిరునవ్వుల మోముతో 

పలకరిస్తే ఘనము 


కన్నోళ్లను ప్రేమతో 

పెద్దలను గౌరవంతో 

చూస్తే మేలు మేలు 

బ్రతుకున అదే చాలు 


పిల్లలను ముద్దుగా 

బ్రతుకులను శ్రద్ధగా 

సరిచేస్తే మంచిది 

మిక్కిలి అవసరమది 


పనికిరాని వారితో 

వ్యర్థమైన వాటితో 

అపాయమే అధికము 

ఉండాలోయ్! దూరము 






నిజమైన వారసులం 

-------------------------------

బాలలం మేం బాలలం 

బాల భానుని వెలుగులం 

పరిమళించే మాలలం 

మిలమిల మెరిసే తారలం 


భువిలో ఎదిగే మొక్కలం 

మదిలో మెదిలే మమతలం 

మేమే మేమే పిల్లలం 

తెల్లని వన్నెల మల్లెలం 


జీవమున్న బొమ్మలం 

అనురాగాల కొమ్మలం 

అల్లరి చేసే పిల్లలం 

అందాల హరివిల్లులం 


భరతమాత ప్రియ బిడ్డలం 

అసలుసిసలు వారసులం

రేపటి భారత పౌరులం 

దేశ రక్షణ సైనికులం





దిద్దుబాటు మేలు 

-------------------------------

అదేపనిగా తప్పులు 

చేస్తేనే తప్పు తప్పు

జీవితాల్లో నిప్పులు 

తెచ్చుకోకూడదు ముప్పు 


పొరుగువారి తప్పులను 

అనునిత్యం వెదకరాదు 

భూతద్దంలో  పెట్టి పెట్టి 

ఏమాత్రం చూడరాదు 


మన తప్పులు దిద్దుకుంటే 

ఎంతైనా మేలు మేలు 

ఒక్కింత సర్దుకుంటే 

అదే కదా పదివేలు 


మామూలు పొరపాట్లు 

సరిచేసుకుంటే చాలు 

అవుతారు మహనీయులు 

మహిలో ఆదర్శపురుషులు





నిజమైన స్నేహితుడు 

-------------------------------

విడువక ప్రేమించును 

చక్కగా నడిపించును 

నిజమైన స్నేహితుడు 

అట్టి వాడు సోదరుడు 


మాట్లాడును ప్రేమగా

బ్రతుకులోన దివ్వెగా 

ఉంటాడు స్నేహితుడు 

కష్టాల్లో తోడుగా 


ఉదయించు సూర్యుడు 

ఉద్యమించు యోధుడు 

నిజమైన స్నేహితుడు 

ఇల ఆపద్భాంధవుడు 


ఆనందం పంచును 

మనోధైర్యం పెంచును 

నిజమైన స్నేహితుడు 

బాధలను పోగొట్టును 





అమ్మ చెప్పిన హితోక్తులు 

-------------------------------

కొన్నిసార్లు మౌనమే 

ఇచ్చును సమాధానము 

శ్రేష్టమైన ధ్యానమే 

ప్రశాంతతకు సోపానము 


అంతులేని చింతలే 

మనశ్శాంతికి విఘాతము 

స్థిమితం లేని మనసులే

అభివృద్ధికి బహు దూరము 


దుర్జనుల సహవాసము 

చివరికది వనవాసము 

సజ్జనుల మైత్రిబంధము 

జీవితాన శాంతి వనము 


పంచితే మంచితనము 

పెంచును ఆశీర్వాదము 

అన్నింటికీ అవరోధము 

అలముకున్న నీచగుణము






గురువు చెప్పిన సత్యాలు 

-------------------------------

చేరాలంటే లక్ష్యము 

రావాలంటే విజయము 

పట్టుదల కావాలోయ్!

గుండె ధైర్యం ఉండాలోయ్! 


గెలవాలంటే మనసులు 

కురియాలి ప్రేమ చినుకులు 

వెలగాలంటే ముఖములు 

విరియాలి నవ్వుల పూలు 


బలపడాలంటే బంధము 

నిలవాలంటే స్నేహము 

నమ్మకమే తొలిమెట్టు 

అదే అదే చూపెట్టు 


కావాలంటే అభివృద్ధి 

జీవితాల్లో సమృద్ధి 

కష్టించే తత్వమే 

అత్యంత ప్రాముఖ్యమే






మేటి అక్షర సూక్తులు 

-------------------------------

 పెద్దలను అపహాస్యము 

చేయరాదు చేయరాదు

కన్నోళ్లకు అవమానము 

తేకూడదు  తేకూడదు


మితిమీరిన అనుమానము 

ఉండరాదు  ఉండరాదు

పొరుగు వారి నాశనము 

కోరరాదు  కోరరాదు


పొద్దస్తమానము నిందలు

వేయరాదు వేయరాదు

పదే పదే అబద్దాలు 

చెప్పరాదు చెప్పరాదు


పనికిమాలిన విషయాలను 

మోయరాదు  మోయరాదు

పచ్చని కాపురాలను 

కూల్చరాదు  కూల్చరాదు






పెద్దల మాటలు సద్ది మూటలు 

-------------------------------

పెద్దల మాటల్లో 

వారు చూపు త్రోవలో 

మేలు దాగుంటుంది 

భవిత బాగుంటుంది 


గురువుల గద్దింపులు 

వారు చేయు బోధలు 

బాగు చేయుబ్రతుకులు 

చక్కదిద్దు నడతలు 


అభివృద్ధికి బాటలు 

పరిమళించు తోటలు 

కన్నవారి మాటలు 

మమకారపు కోటలు 


పెద్ద వారి పలుకులు 

చూడ సద్ది మూటలు 

తొలకరి చిరు జల్లులు 

విరిసిన మరు మల్లెలు 


మేలు కోరు మిత్రులు 

ఉన్న వారు ధన్యులు 

వారు కదా సోదరులు 

ఇల శ్రేయోభిలాషులు 






మామయ్య మాటల ముత్యాలు 

-------------------------------

మానితే దుష్టత్వము

వస్తుంది దైవత్వము 

వీడితే కఠినత్వము 

సొంతమగును మృదుత్వము 

 

వదిలితే మూర్ఖత్వము 

కోరితే జన క్షేమము

వసుధైక కుటుంబమే 

విశ్వశాంతి ఖాయమే 


స్నేహిస్తే క్షమాగుణము 

దూరమగును శత్రుత్వము 

త్యజిస్తే అల్పబుద్ధులు 

బయటపడును గొప్పతనము 


పోషిస్తే అనాథులను 

ఆదరిస్తే విధవలను 

దైవమే హర్షించును 

కృపలు కుమ్మరించును





విలువలు లేక వ్యర్థం 

-------------------------------

విలువలు లేని జీవితము 

కాలిపోయిన కాగితము 

గౌరవమే కడు శూన్యము 

కానేరాదు సార్ధకము 


కలువలుంటే కొలనుకు 

పైరులుంటే పొలముకు 

ఎంతో ఎంతో అందము 

విలువలుంటే బ్రతుకుకు 


ఉంటే నైతిక విలువలు 

జీవితాన బహు మేలు 

అందరికీ ఆదర్శము 

పంచుతుంది ఆనందము 


కనికరం చూపుటలో 

ఉపకారం చేయుటలో

పదిమందికి స్ఫూర్తిగా 

ఉండాలి ఉన్నతంగా


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page