బాల గేయాలు: మాతృమూర్తికి వందనము

Bala Geyalu - Mathrumurthiki Vandanam| Gadwala Somanna
బాల గేయాలు - మాతృమూర్తికి వందనము | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 07/08/2026
తల్లిదండ్రుల పట్ల గౌరవం, గురువుల బోధన, స్నేహం, దైవభక్తి, క్రమశిక్షణ, మంచి నడవడి, నీతి, మానవ విలువలు వంటి జీవితానికి అవసరమైన గొప్ప సందేశాలను చిన్నారులకు సులభమైన పదాలతో అందించే అద్భుతమైన తెలుగు బాలగేయాల సంకలనం ఇది. ప్రముఖ కవి గద్వాల సోమన్న రచించిన ఈ 20 బాలగేయాలు పిల్లల్లో మంచి ఆలోచనలు, సత్ప్రవర్తన, దేశభక్తి, కుటుంబ విలువలు మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విలువైన సాహిత్య సంపదగా నిలుస్తాయి.
మాతృమూర్తికి వందనము
------------------------------
నవ మాసాలు మోసిన
కనుపాపలా చూసిన
సేవలెన్నో చేసిన
మాతృమూర్తికి వందనము
పాఠాలు బోధించిన
నిత్య సత్యాలు చెప్పిన
క్రమశిక్షణ నేర్పించిన
మాతృమూర్తికి వందనము
జోలపాట ఆలపించిన
మంచి నడతలు నేర్పిన
చిట్టి బొజ్జలు నింపిన
మాతృమూర్తికి వందనము
కుటుంబాన్ని సరిదిద్దిన
సంతతిని లాలించిన
త్యాగాన్ని చూపించిన
మాతృమూర్తికి వందనము
జేజేమ్మ సూక్తులు
------------------------------
సాహసమే ఊపిరిగా
లక్ష్య సాధన ధ్యేయంగా
చేయాలి ఘన కార్యాలు
చేకూరాలి విజయాలు
మనోనిబ్బరం మాలగా
ధరించాలి ధరించాలి
జీవితాన గొప్పగా
ఎదగాలి ఎదగాలి
అభివృద్ధికి అవరోధము
పరికింప పిరికితనమే
అంతులేని ఆనందము
సాధిస్తేనే విజయము
కష్టాలు ఏతెంచినా
కన్నీటిని మిగిల్చినా
మున్ముందుకు సాగాలి
చరిత్ర తిరిగి రాయాలి
భగవంతుడు ఉన్నతుడు
------------------------------
భగవంతుని పై భక్తి
ఇస్తుంది ఘన శక్తి
ఆపదల వేళల్లో
తప్పించుకునే యుక్తి
భగవంతునితో చెలిమి
అపారనైన కలిమి
ఆశ్రయిస్తే గనుక
పర్వతమంత బలిమి
దైవంపై నమ్మకము
ఆధ్యాత్మిక చింతన
పెట్టుకుంటే మేలు
జీవితంలో చాలు
పరమ పురి దారిలో
చేరాలి దైవాన్ని
దేవుని సింహాసనము
చేయాలి హృదయాన్ని
డబ్బుల జబ్బుతో జాగ్రత్త!!
------------------------------
ధనం వలన స్నేహము
దాని వలన వైరము
కలుగజేయు నేస్తము
చెరుపుతుంది బంధము
డబ్బు మార్చు మనసులు
చిదిమి వేయు బ్రతుకులు
ధనాశ ఎక్కువైతే
తీస్తుంది ప్రాణాలు
డబ్బుకు దాసోహము
చూడంగా లోకము
దాని వెంట పరుగులు
పెడుతారు మానవులు
మనశ్శాంతి దూరము
గుండెలపై భారము
పెడుతుందోయ్! పైకము
దానితో జాగ్రత్త!!
కొలకలూరి ఇనాక్ గారికి
(పుట్టినరోజు శుభాకాంక్షలు )
------------------------------
కొలకలూరి ఇంటి పేరు
వేజెండ్ల వారి ఊరు
ఎనిమిది పదుల వయసులో
ఉన్నది తరగని ఉషారు
రామయ్య, విశ్రాంతమ్మ
పుణ్య దంపతుల పుత్రుడు
సాహితీ లోకంలో
అందరికీ ఘన మిత్రుడు
పూలలా మెత్తని హృదయము
పాలలా తెల్లని సుగుణము
కొలకలూరి ఇనాక్ గారిది
పసి పిల్లల మనస్తత్వము
వర్ధమాన రచయితలకు
అమితమైన ఆదర్శము
సరికొత్త ప్రయోగాలకు
కొలకలూరి వారు నిలయము
మాటేమో మాణిక్యము
మనసేమో ఆకాశము
అందరికతడు బంధువు
అవనిలో అజాత శత్రువు
అహంకారమే శూన్యము
అంతరంగం ప్రేమవనము
యేసు ప్రభు పై నమ్మకము
నిలువెల్లా క్షమాగుణము
స్వయం కృషిని నమ్ముకొనెను
అంచెలంచెలుగా ఎదిగెను
సాహిత్య క్షేత్రంలో
పద్మశ్రీ అందుకునెను
ఎస్వీ యూనివర్సిటీ
పూర్వ ఉపకులపతి వారు
రచనల్లో ఘనాపాటి
లేరు ఎవరు వారి సాటి
అక్షర నీరాజనాలు
అభినందన మందారాలు
కొలకలూరి ఇనాక్ గారికి
వన్నె తగ్గని వారి కృషికి
కొలకలూరి ఇనాక్ గారికి
88వ జన్మదిన శుభములు
ఆయురారోగ్యాలతో
ఉండాలని ప్రార్థనలు
నాన్న చెప్పిన మేటి మాటలు
------------------------------
మనసులో సమాధానము
పెంచుతుంది సంతోషము
మొగంలో దరహాసము
విరజిమ్మును కడు తేజము
నీకుంటే సర్దుబాటు
లేకుంటే తొందరపాటు
ఉండదోయి ఏ క్షామము
అడుగడుగునా క్షేమము
కలుపుగోలుతనముంటే
అందరితో బాగుంటే
ఆనందం నీ వెంటే
మనోబలం నీకుంటే
సుఖము లేని జీవితాలు
చమురు లేని దీపాలు
మితిమీరితే స్వార్ధము
ఉండదోయి ఏ లాభము
తీర్చలేం "అమ్మ ఋణం "
------------------------------
అమ్మ లేని కుటుంబము
నూనె లేని దీపము
తలపించును నరకము
చూడంగా శూన్యము
చిన్నారులకు కష్టము
అంతులేని నష్టము
వారి ఆలన పాలన
అగును ప్రశ్నార్థకము
అమ్మ ఉన్న సదనము
మోదానికి నిలయము
ఉదయించును స్వర్గము
వెదజల్లును అందము
గౌరవించు అమ్మను
ఉన్నప్పుడే మహిలో
తీర్చలేము ఋణమును
ఆరాధించు మదిలో
మాటలతో జాగ్రత్త!!
------------------------------
మాట్లాడుము నెమ్మదిగా
చిరునవ్వుతో ప్రేమగా
బలపడును సంబంధాలు
బాగుండును జీవితాలు
యోచించుము ఎక్కువగా
భాషించుము తక్కువగా
పెరుగుతుంది గౌరవము
వికసిస్తుంది స్నేహము
అమితమైన మాటల్లో
అపవిత్రమైన తలపుల్లో
దాగుంది ప్రమాదమే
అక్షరాల సత్యమే
జాగ్రత్త నోటి మాటలు
తెచ్చుకోకు నాశనము
సృష్టించును కలహాలు
చేయును గందరగోళము
త్యాగమయుడు తండ్రి
------------------------------
ఉంటారు బాధ్యతగా
ఇంటిలో అధిపతిగా
కన్నతండ్రి జగతిలో
ముందుండును ప్రగతిలో
క్రొవ్వొత్తిలా త్యాగము
చేయునోయి యాగము
కుటుంబం సంక్షేమము
యోచించును నిరంతరము
కష్టాలను దాచుకుని
కన్నీళ్లను అదుముకుని
పిల్లల కొరకు శ్రమిస్తారు
వారి భవిత చూస్తారు
అలుపెరుగని పోరాటము
తన వారికై ఆరాటము
కలనైనా ఉండదోయి
నాన్న గారికి విరామము
నాన్న ఓ ప్రేమ శిఖరము
అందరికీ ఆదర్శము
పైకేమో కఠినమ్ము
మనసేమో నవనీతము
నాన్న ఆశ్రయ దుర్గము
వారుంటే గొప్ప బలము
ఇంటికి వారే పునాది
కుటుంబంలో ఉగాది
నాన్న చెప్పిన సూక్తులు
------------------------------
శత్రువులను ప్రేమతో
ఘన క్షమాగుణంతో
జయించాలి జయించాలి
హృదయాల్లో నిలవాలి
కన్నవారి బోధలో
పెద్దవారి సేవలో
తప్పకుండా ఉండాలి
దీవెనలే పొందాలి
సజ్జనుల స్నేహంలో
పవిత్రమైన బంధంలో
ఉన్నతంగా ఎదగాలి
జీవితంలో వెలగాలి
ముఖమున చిరునవ్వులతో
స్వచ్ఛమైన మనసులతో
ప్రేమ సిరులు పంచాలి
కలసిమెలసి బ్రతకాలి
గురుదేవుల సందేశం
------------------------------
బూతులు,పోకిరిమాటలు,
సరసోక్తులు మానాలి
కృతజ్ఞతావచనములు
నిరంతరం పలకాలి
క్రోధములు,కలహము, కక్షలు
తరిమి తరిమి కొట్టాలోయ్!
భేదములూ ,విమతములూ
తక్షణమే వదలాలోయ్!
విశ్వాసము, మంచితనము,
ప్రేమ, ఆశానిగ్రహము
మదిలో నింపుకోవాలి
సాత్వికము,దయాళుత్వము
మనస్సాక్షి మంచిగా
దైవత్వం గొప్పగా
చూసుకోవాలి ఇలలో
జీవించాలి మనిషిగా
అమ్మ పలుకుల పదనిసలు
------------------------------
ఉంటే ఓపికతో
వరిస్తుంది విజయము
మితిలేని కోపంతో
జరుగుతుంది నష్టము
వీడితే బద్ధకమే
వాడితే బుద్ధినే
వృద్ధినొందు జీవితము
అనుకున్నది సఫలము
నేర్పితే క్రమశిక్షణ
జీవితాలకు రక్షణ
ఫలితం వచ్చే వరకు
ఉండాలి నిరీక్షణ
క్రమమైన జీవితము
ఇస్తుంది ఆదర్శము
కల్గియుంటే ఘనత
ఎంతైనా నవ్యత
అమ్మ అమూల్యమైన మాటలు
------------------------------
ధర్మం అంటే ఆచరణ
దానం అంటే వితరణ
పరుల సొమ్మ పాపమే
చేయరాదు అపహరణ
దైవ నామం ఆదరణ
దైవ ప్రేమ ఉదాహరణ
ముఖ్యమే క్రమశిక్షణ
ఉండాలోయ్ నిరీక్షణ
చేసిన పొరపాట్లకు
ఇవ్వాలోయ్! వివరణ
కల్గియుండాలి బ్రతుకున
అమూల్యమైన విచక్షణ
దైవ నామం రక్షణ
చేయాలి ఆరాధన
మన అందరి బాధ్యత
తెలుగు భాష పరిరక్షణ
సాటిలేని స్నేహము
------------------------------
శ్రేష్టమైన స్నేహము
సృష్టిలో భాగ్యము
కల్గియుంటే గనుక
అత్యంత అదృష్టము
చిన్ననాటి స్నేహము
తెలుగు వోలె మధురము
అరుణోదయం లాగ
జీవితాన తేజము
సాటి లేని స్నేహము
లేదు ఏది సమానము
జీవకోటికి దొరికిన
దేవుని బహుమానము
స్నేహమే సున్నితము
చేయరాదు ద్రోహము
బలమైన నమ్నకము
పరికింప ఉత్తమము
స్నేహం మణిహారము
మేలిమి బంగారము
దండలో దారంలా
బ్రతుకున ఆధారము
స్నేహానికి మించినది
ఎక్కడా లేదు లేదు
దుర్గమై నిలుచునది
హత్తుకుంటే వదలదు
అక్షర ప్రబోధం
------------------------------
చనువు మించితే చులకన
చివరికదే కడు వేదన
సమతుల్యము ముఖ్యమే
సుఖమయం జీవితమే
పెద్దవారిని హేళన
చేయొద్దు ఏమాత్రము
వదులు వ్యర్థ ప్రేలాపన
తెచ్చిట్టు అనర్ధము
ఆత్మవిశ్వాసం వంతెన
నిర్మించుకో హృదయాన
భగవంతుని నామ స్మరణ
జీవితాల్లో రక్షణ
శృతి మించిన వాదన
పెట్టుకుంటే నష్టము
నిరంతరం సాధన
సమకూర్చును విజయము
ఉండాలి అప్రమత్తంగా
------------------------------
ఓర్వలేనితనంతో
ప్రేమలేని హృదయంతో
ఏదీ సాధించలేరు
తృప్తిగా ఉండలేరు
నిత్యం కలహాలతో
పాములాంటి వైరంతో
ప్రశాంతత బహు దూరము
అస్థిరమైన మనసుతో
కఠినమైన మాటలతో
పనికిరాని చేతలతో
ఉండదోయి మర్యాద
విలువలు లేని బ్రతుకుతో
నీతి లేని మనుషులతో
వెన్నుపోటుదారులతో
ఉండాలి జాగ్రత్తగా!
నరరూప రాక్షసులతో
మాస్టారు మేటి మాటలు
------------------------------
వదనంలో నగవులు
విరబూసిన పూవులు
వెండి వెన్నెల వోలె
వెదజల్లును సొగసులు
ప్రేమలీను పలుకులు
జాలువారు తేనెలు
పవిత్రమైన నడతలు
విరజిమ్మును వెలుగులు
వెన్నలాంటి మనసులు
మిన్న కదా జగతిలో
అమూల్యమైన బాలలు
కన్నవారి శ్వాసలు
ఇంటిలోన మహిళలు
ఇల జీవన జ్యోతులు
అభివృద్ధికి బాటలు
అనురాగపు కోటలు
సూక్తి రత్నావళి
------------------------------
కష్టమే వచ్చినా
మోదమే హెచ్చినా
తీసుకో సమంగా
జీవించు క్రమంగా
విజయాలు వరించినా
వినోదం ఊరించినా
గర్వం ప్రదర్శించకు
వినయం విస్మరించకు
సమతుల్యం ముఖ్యము
అదే కదా సౌఖ్యము
ఉంటేనే లౌక్యము
బాగుండును జీవితము
తలబిరుసు తనంతో
ఆకతాయి తనంతో
వ్యక్తిత్వం కోల్పోకు
పనికిరాని పనులతో
నాన్నమ్మ మేలి మాటలు
------------------------------
సిరిమువ్వల నాదాలు
అలరించును హృదయాలు
కర్ణ ద్వయానికి మధురము
ఇవి అక్షర సత్యాలు
అందాల తెలుగు పదాలు
ఆశించును అధరాలు
పంచదారలా తీయన
అవే ఆణిముత్యాలు
మహనీయుల వాక్కులే!
సవరించును లోపాలు
అవి వెలుగు దీపాలే!
దిద్దుతాయి జీవితాలు
కన్నవారి గద్దింపులు
ఉజ్వల భవితకు బాటలు
అవి ముత్యాల సరాలు
జీవితాన వరాలు
ముత్యాల్లాంటి మాటలు
------------------------------
కష్టాల్ని ఎదురించే
బాధల్ని భరించే
దమ్ము, ఓర్పు నీదైతే
జీవితాన విజేతే
బ్రతుకులో వైఫల్యాలు
గెలుపుకు సోపానాలు
లక్ష్యం చేరే వరకు
మానరాదు ప్రయత్నాలు
సానుకూల స్పందనలు
విజయానికి కీలకము
ప్రతికూల దృక్పథమే
అవుతుంది అవరోధము
భగీరథ యత్నంతో
విక్రమార్కుని స్ఫూర్తితో
కావాలి సుసాధ్యము
పలువురికి ఆదర్శము

-గద్వాల సోమన్న





Comments