top of page
Original.png

 బాల గేయాలు  - చిత్తశుద్ధి ఉండాలి!

18 hours ago
2 min read

చిత్తశుద్ధి, మంచి మాట, నమ్మకం, ప్రకృతి ప్రేమ, జీవన విలువలను తెలియజేసే తెలుగు బాల గేయాల సమాహారాన్ని ప్రతిబింబించే చిన్నారుల చిత్రం

Bala Geyalu - Chittasuddhi Undali | Gadwala Somanna 

బాల గేయాలు  - చిత్తశుద్ధి ఉండాలి! | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 23/09/2026


‘బాల గేయాలు – చిత్తశుద్ధి ఉండాలి!’ అనే ఈ ప్రత్యేక సమాహారంలో చిత్తశుద్ధి, కృషి, నమ్మకం, సంస్కారం, మానవ సంబంధాలు, మంచి మాట, ప్రకృతి పరిరక్షణ వంటి విలువలను తెలియజేసే పది సందేశాత్మక తెలుగు గేయాలు ఉన్నాయి. పిల్లలకు వినోదంతో పాటు జీవితానికి ఉపయోగపడే మంచి పాఠాలను అందించే ఈ గేయాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చిన్నారులందరికీ ఉపయోగకరంగా ఉంటాయి.


Postలోని 10 బాల గేయాలు

  1. చిత్తశుద్ధి ఉండాలి!

  2. అమ్మమ్మ అమూల్యమైన సూక్తులు

  3. తాతయ్య విలువైన సూచనలు

  4. పసి పిల్లలు మల్లెలు

  5. ముత్యాల్లాంటి మాటలు

  6. చెరుపు చేసే శత్రువులు

  7. నమ్మకమే ఊపిరిగా

  8. జాగ్రత్త! నాలుకతో

  9. అందాల హరివిల్లు

  10. జీవిత పాఠాలు


చిత్తశుద్ధి ఉండాలి!

-----------------------------

లక్ష్యం చిన్నదైనా 

ప్రయత్నం పెద్దదిగా 

ఉండాలోయ్! ఉండాలి 

పోరాటం గొప్పగా 


ఆశయమే దృఢంగా 

ఆలోచన బలంగా 

ఉంటేనే ఫలితము 

వరిస్తుంది విజయము 


ఉంటే అస్థిరంగా 

గురిలేని వానిగా 

ఏది కూడా దక్కదు

ఎండమావి విధంగా 


చిత్తశుద్ధి ముఖ్యమే 

నమ్మకం అవసరమే 

ఏదైనా సాధనకు 

చరిత్రలో నిలుచుటకు 



అమ్మమ్మ అమూల్యమైన సూక్తులు 

-----------------------------

అప్పులాంటి అబద్దము 

బ్రతుకును కూల్చివేస్తుంది 

నిప్పులాంటి వ్యక్తిత్వము 

స్ఫూర్తిగా నిలుస్తుంది 


అప్పు తిరిగి ఇస్తేస్తే 

దక్కుతుంది గౌరవము 

ముప్పు బ్రతుకున తప్పిస్తే 

సుఖమయమే జీవితము 


మనసును అదుపు చేస్తే 

నిజమైన గొప్పతనము 

ఇక అడుగు ముందుకెస్తే 

విజయం అగును సొంతము 


ఏది కూడా వట్టిగా 

రాదు కదా ఓ నేస్తము 

శ్రమించే తత్వమేగా 

తరిమివేయు అపజయము 



తాతయ్య విలువైన సూచనలు 

-----------------------------

గెలుపుకై కష్టాలు 

ఓర్చుకుని నిలవాలి 

వచ్చినా నష్టాలు 

తట్టుకుని ఎదగాలి 


వీలైతే ఇష్టాలు 

మార్చుకుని బ్రతకాలి 

శ్రేష్టమైన భావాలు 

నలుగురికి పంచాలి 


ప్రకృతిలోని అందాలు 

పదిలంగా ఉంచాలి 

మానవ సంబంధాలు 

కాపాడుకోవాలి 


విలువైన వృక్షాలు 

నిలబెట్టును ప్రాణాలు 

నరికివేత  సరికాదు 

అవిలేక భవితలేదు

 

పసి పిల్లలు మల్లెలు 

-----------------------------

పూలలాంటి బాలలు 

పాలలాంటి మనసులు 

మందార మాలికలు 

అందాల తారకలు 


ముద్దులొలుకు పిల్లలు 

ముద్దబంతి సుమములు 

బుద్ధిలోన శ్రేష్టులు 

వృద్ధికి వారు త్రోవలు 


గంతులేయు లేగలు 

కాంతులీను ప్రమిదలు 

పిల్లల్లో ఉన్నవి 

అంతులేని ప్రేమలు 


నేర్పిస్తే విలువలు 

అవుతారు మహనీయులు 

నడిపిస్తే బాలలు 

కాబోయే నేతలు 


ముత్యాల్లాంటి మాటలు 

-----------------------------

మాట్లాడకు కఠినంగా 

దూషించకు ఘోరంగా 

సున్నితమైన హృదయాలు 

అవుతాయి పలు ముక్కలు 


చూడొద్దు హీనంగా 

అవుతావు దారుణంగా 

అందరూ సమానమే 

భగవంతుని నిర్మాణమే 


వేయొద్దు అపనిందలు 

మోపొద్దు నేరాలు 

అమాయకుల బ్రతుకుల్లో 

పోయొద్దు ఇల నిప్పులు 


ఉంటేనే సంస్కారము 

చేస్తారు నమస్కారము 

ఆశ్రయించిన వారికి 

మానొద్దు సహకారము


చెరుపు చేసే శత్రువులు 

-----------------------------

అసత్య ప్రచారములు 

అత్యంత ప్రమాదము 

గాయపరచు మనసులు 

కూల్చును కుటుంబాలు 


చెప్పుడు మాటలతో 

అలాంటి వారితో 

జరుగుతుంది నష్టము 

తెచ్చిపెట్టు కష్టము 


నమ్మొద్దు వదంతులు 

చెరిపే కారకాలు 

సృష్టిస్తే ఘోరము 

ఉండాలోయ్! దూరము 


అంచనా వేయాలి 

నిజాలు గ్రహించాలి 

దొర్లితే పొరపాట్లు 

తరువాత అగచాట్లు 


నమ్మకమే ఊపిరిగా 

-----------------------------

ఉంటేనే ధైర్యంగా 

నిలస్తావు విజేతగా 

బ్రతుకులో ఘన కార్యాలు

చేస్తావు అవలీలగా 


అందరితో ప్రేమగా 

చిరునవ్వులు విరియగా 

జీవించాలి హాయిగా 

సమైక్యత ఉదయించగా 


లేనిపోని వాటితో 

ఓర్వలేనితనంతో 

కోల్పోకు మదిని శాంతి 

జీవితాన నవకాంతి 


మేలు చేసిన వారితో 

ఉండాలి నమ్మకంగా 

ఉదయించే సూర్యునిలా 

ఉద్యమించే యోధునిలా 


జాగ్రత్త! నాలుకతో 

-----------------------------

అగ్ని వంటి నాలుక 

తగలబెట్టు బ్రతుకులు 

తెచ్చిపెట్టు చీలిక 

చెరుపును కుటుంబాలు 


సృష్టించును కలతలు 

ఎన్నెన్నో బాధలు 

జాగ్రత్త! నోటితో 

దానిలోని జిహ్వతో 


చీల్చునోయ్! బంధాలు 

పాడుచేయు స్నేహాలు 

కలహమారి నాలుక 

విపత్తుతో పోలిక 


సాధులేని నాలుక 

పెడుతుందోయ్! గొడవలు 

నాశనం చేయాలని 

దానికుంది కోరిక 


అందాల హరివిల్లు 

-----------------------------

హరివిల్లు గగనంలో 

పిల్లలు సదనంలో 

అందాలకు అందమే 

తిలకిస్తే మోదమే 


నింగి తల్లి నవ్వులు

ఇంద్రధనుస్సు రంగులు  

మోవి మీద విరిసిన 

పరిమళించు పువ్వులు 


గృహంలోన బాలలు 

వారి ముఖమున నగవులు 

అందరిని అలరించే 

వానవిల్లు వెలుగులు 


నింగికి సింగిడి అందము 

అంతులేని బంధము 

పిల్లలుంటే సదనము 

తలపింపజేయు నాకము 


చూస్తే ఇంద్రచాపము 

తరుచుగా అనిపించును 

చిన్నారుల ప్రతిరూపము 

కల్గించును సంతసము 


సప్త వర్ణాల సింగిడి 

అది కాదా! అమ్మ ఒడి 

ఆ నింగిలో  వెలసిన 

ఈ భువిలో నారుమడి

 

జీవిత పాఠాలు 

-----------------------------

బ్రతుకులోన బహుమానము

 ఎంతైనా గొప్పతనము

మాట మీద ఉండడము 

గౌరవానికి కొలమానము 


గతమంతా ఓ పాఠము 

వర్తమానం అవకాశము 

సదా గుర్తుపెట్టుకో 

భవిష్యత్తు ఇక విజయము 


ఎదుటివారి అవసరంతో 

ఎప్పుడూ ఆడుకోకు 

మితిలేని స్వార్ధంతో 

అందరినీ వాడుకోకు 


కష్టాల్లో తోడుగా 

నాన్నలాగ  బాధ్యతగా 

ఉండువారు గొప్పవారు 

కుటుంబాన దివ్వె వారు 



Gadwala Somanna

-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page