top of page
Original.png

బాల గేయాలు - కన్నోళ్ల ఋణం తీరదు 

4 hours ago
2 min read

గద్వాల సోమన్న రచించిన పది తెలుగు బాల గేయాలు – తల్లిదండ్రుల ప్రేమ, సంస్కారం, బాల్యం, పుస్తక పఠనం, ప్రకృతిపై కవితలు

Bala Geyalu - Kannolla Runam Theeradu | Gadwala Somanna 

బాల గేయాలు - కన్నోళ్ల ఋణం తీరదు | గద్వాల సోమన్న

Published in manatelugukathalu.com on 10/10/2026


బాల గేయాలు – కన్నోళ్ల ఋణం తీరదు

రచన: గద్వాల సోమన్న

చిన్న చిన్న పదాలలో గొప్ప జీవిత సత్యాలను తెలియజేసే పది చక్కని తెలుగు కవితల సమాహారం ఈ బాల గేయాలు.

కన్నవారి ప్రేమకు వెలకట్టలేమని చెప్పే కన్నోళ్ల ఋణం తీరదు, సద్గుణాలు, సంస్కారం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కారం విరియాలి!, మనకు ఉన్నవాటి విలువను గుర్తుచేసే కోల్పోతే తెలుస్తుంది! వంటి గేయాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి.

మహిళల గొప్పతనం, దైవభక్తి, సానుకూల దృక్పథం, పసిపిల్లల అమాయకత్వం, పుస్తక పఠన ప్రాధాన్యం, ప్రకృతితో అనుబంధం వంటి విభిన్న అంశాలను రచయిత గద్వాల సోమన్న సరళమైన పదాలతో, లయబద్ధమైన శైలిలో అందించారు.

బాలలతో పాటు పెద్దలు కూడా చదివి ఆస్వాదించదగిన ఈ పది తెలుగు గేయాలను మనతెలుగుకథలు.కామ్ పాఠకుల కోసం అందిస్తున్నాము.



కన్నోళ్ల ఋణం తీరదు

----------------------------- 

ఎంత నిప్పు తగిలినా 

పసిడి మెరుపు తగ్గదు 

ఎన్ని ఇడుములు వచ్చినా 

మంచోళ్ళ విలువ మారదు 


ఎన్ని జన్మలెత్తినా 

వేనోళ్ళ పొగిడినా

కన్నోళ్ల ఋణం తీరదు 

 వారి త్యాగం ఆగదు 


పరిస్థితులే మారినా 

అమ్మ ప్రేమ వాడిపోదు 

ఒత్తిడెంత తెచ్చినా 

ఆమె మాట తప్పదు 


అపురూపం కన్నవారు 

వారి సాటి ఎవరు లేరు 

తెలిపితే కృతజ్ఞతలు 

బాగుపడును మన బ్రతుకులు 


సంస్కారం విరియాలి!

----------------------------- 

కష్టాలను ఎదురించే 

నష్టాలను భరించే 

మనోధైర్యము ఉండాలి

తరిమే తెగువ రావాలి 


కన్నోళ్లను పూజించే 

గురువులను గౌరవించే 

సంస్కృతే  తేవాలి 

సంస్కారం పెరగాలి


పేదోళ్లను బాధించే 

మనస్తత్వం పోవాలి 

పెద్ద వారిని సేవించే 

దొడ్డ మనసు విరియాలి 


అందరిని ప్రేమించే 

విశాల హృదయముండాలి

శత్రువులను క్షమించే 

దైవగుణము అబ్బాలి 


కోల్పోతే తెలుస్తుంది!

----------------------------- 

డబ్బు విలువ ఖర్చు పెడితే

మనిషి విలువ దూరమైతే 

తెలుస్తుంది జీవితంలో 

వేదన మిగులు హృదయంలో 

 

అవకాశం చేజారితే 

కాలం విలువ గడిచిపోతే

వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది 

పిదప బాధ పడాల్సివస్తుంది 


ఉన్నప్పుడే విలువ యివ్వు 

పంచుకొమ్ము సదా చిరునవ్వు 

వాటి విలువ తెలుసుకొని  మసలు 

వ్యర్థమైనవి చేసుకో దవ్వు 


కన్నోళ్లతో ఉండు ప్రేమగా 

వారి సేవ చేయి అమితంగా 

అవసాన దశలో తోడుంటూ 

ఉండనివ్వు వారిని హాయిగా 


విలువైన కానుకలు వనితలు 

----------------------------- 

అవనిలోన వనితలు 

ఉంటేనే వెలుగులు 

ఇంటిలోన మోదము 

లేదంటే ఖేదము 

 

అభివృద్ధికి బాటలు 

అలరించే తోటలు 

లోకంలో మహిళలు 

కాదు కాదు అబలలు 


ఇంటిని దిద్దుతారు 

కంటిలా ఉంటారు 

స్త్రీ మూర్తులే ఘనులు 

తెస్తారోయ్! ఘనతలు 


వారు ఇంట స్వర్గము 

లేకుంటే నరకము 

అవి రెండు వారి సృష్టి 

వారిపై పెట్టు దృష్టి 


ఇవ్వాలి గౌరవము 

అన్నింటా స్థానము 

అప్పుడే అభివృద్ధి 

కలుగును మనోసిద్ధి 


భగవంతుడు సర్వోన్నతుడు

----------------------------- 

భగవంతుడు తోడుంటే 

బాగుపడును జీవితాలు 

వర్ధిల్లును కుటుంబాలు 

బలపడును ఇల బంధాలు 


ఇంటిలోన దీవెనలు 

బ్రతుకంతా అరుణోదయము 

మోదంతో హృదయాలు 

అగును ఆనంద నిలయాలు 


తొలగించును శాపాలు 

పవిత్రపరచు మనసులు 

దైవమే కటాక్షిస్తే 

ఉంచుతాడు ఉన్నతంగా 


దేవుడే సర్వోన్నతుడు 

చూడ సర్వవ్యాప్తుడు 

అయన సన్నిధిలోన 

సుఖసంతోషాలు మెండు 


సానుకూల దృక్పథం ముఖ్యం 

----------------------------- 

చేస్తేనే ప్రయత్నము 

దరి చేరును విజయము 

అందరికీ ఈ విషయము 

సమగ్రంగా అవగతము 


ఉండాలి సంకల్పము 

చేయాలి కృషి సతతము 

ఈ సత్యం గ్రహిస్తే 

ఏదైనా సాధ్యమే


నిరంతర సాధనతో 

కడు ఆశాభావంతో 

విజయం వైపు అడుగులు 

సాగిపోవాలి దీక్షతో 


సానుకూల దృక్పథమే 

జీవితాల్లో దుర్గమే 

గెలిచేందుకు అనుకూలము 

అది బలమైన ఆయుధము 


దేవుడే శ్రేష్టుడు 

----------------------------- 

గుండెల్లో నింపుకో 

దైవాన్ని నిండుగా 

భక్తితో హత్తుకో 

ధ్యానించు శ్రద్దగా 


ఆధ్యాత్మిక త్రోవలో 

నడవాలి దినదినము 

ఆ దేవుని దృష్టిలో 

ఉంటేనే క్షేమము 


భగవంతుడు ముఖ్యము 

జీవితాన మూలము 

ఇవ్వాలి ప్రాధాన్యము 

అదే కదా అవసరము 


దైవంతో స్నేహము 

సమకూర్చును శాంతము 

కల్గియున్న మంచిది 

అదెంతో అమూల్యము 


పసి పిల్లలు మల్లెలు 

----------------------------- 

 వెన్నెల్లా నవ్వులు 

సన్నజాజి పువ్వులు 

చిన్నారులో మహిలో 

కాంతులీను దివ్వెలు 


వెన్నలాంటి మనసులు 

మిన్న వారి గుణములు 

అల్లరిలో ప్రథములు

అందరికీ ఇష్టులు 


రూపంలో అందము 

పరిమళించు గంధము 

ముద్దులొలుకు పిల్లలు 

మనసుదోచు మల్లెలు 


పిల్లలున్న గృహములు 

చూడ స్వర్గసీమలు 

ఆనంద సాగరాలు 

ఆ దేవుని నిలయాలు


పుస్తక పఠనం శ్రేష్టం 

----------------------------- 

పట్టుకుంటే పుస్తకము 

మారుస్తుంది జీవితము 

పంచుతుంది ఆహ్లాదము 

పెంచుతుంది విజ్ఞానము 


పుస్తకాల పఠనంతో  

ఏకగ్రత సాధనతో 

ఎన్నెన్నో లాభాలు

సంతసించు హృదయాలు 


పుస్తకం హస్త భూషణము 

పరికింపగ ఒకనాడు 

చరవాణిలో భాషణము 

సర్వ నాశనం ఈనాడు 


అందుకే పెరుగుతున్నాయి 

ఘోరమైన నేరాలు 

ప్రతినిత్యం ఘోరాలు 

దారుణం జీవితాలు 


అజ్ఞానం తరుమేందుకు 

బ్రతుకులు బాగుపడుటకు 

పుస్తక పారాయణము 

చూడ ఏకైక మార్గము


చిరుగాలితో చెలిమి 

----------------------------- 

చిరుగాలి వీచిస్తే 

మనసుకెంతో మోదము 

శరీరాన్ని తాకితే 

అత్యంత ఆహ్లాదము 


చిరుగాలితో  స్నేహము 

ఎంతెంతో ఉపయోగము 

అదే గనుక లేకపోతే 

మానవ మనుగడ కష్టము 


నాసికతో సంబంధము 

సృష్టితో అనుబంధము 

ఆయుష్షును పెంచుతుంది 

ఆరోగ్యం పంచుతుంది 


వృక్షాలను పెంచాలి 

స్వచ్ఛ వాయువు పంచాలి 

చిరుగాలి కౌగిలిలో 

ఉపశమనం పొందాలి 



Gadwala Somanna

-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page