సొంతింటి కల
- Mahammad Hasan Shareef
- May 29
- 5 min read
#SonthintiKala, #సొంతింటికల, #MohammadHasanShareef, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Sonthinti Kala - New Telugu Story Written By Mohammad Hasan Shareef
Published In manatelugukathalu.com On 29/05/2025
సొంతింటి కల - తెలుగు కథ
రచన: మహమ్మద్ హసన్ షరీఫ్
అమ్మా.. మనం ఎప్పుడూ హోటల్ రూమ్ లేదా పార్క్ లోనేనా కలిసేది.. మనమంతా ఒకే ఇంట్లో ఎప్పుడు ఉంటాం.. అసలు మనం ఒకే చోట ఉండే అవకాశమే లేదా.. అని 13 ఏళ్ల రోహిత్ అమాయకంగా అడిగాడు..
అవును నాన్నా.. మనమేంటి టూరిస్టుల మాదిరిగా 15 రోజులకు ఒకసారి.. అదీ శనివారం కలవడం.. హోటల్ లో తినడం.. లాడ్జిలో పడుకోవడం.. ఆదివారం సాయంత్రం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం.. ఇదంతా వింతగా ఉంది.. అమ్మా నువ్వైనా చెప్పు. మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్తాం.. అని లాలనగా నిలదీసింది 11 ఏళ్ల నికిత..
మనం మన ఇంటికి వెళ్దాం అమ్ములూ.. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉందాం. ఆ రోజు త్వరలోనే వస్తుంది.. అని పిల్లలను సముదాయించాడు సురేష్.. అయినా అతని ముఖంలో బాధను దాచలేక పోయాడు. అతడి కళ్ళల్లో న్నీళ్ళు సుడిగుండంలా తిరిగాయి. అయినా తమాయించుకుంటూ.. ఇంతకూ మీ చదువులు ఎలా సాగుతున్నాయి రోహిత్, నికిత.. అంటూ మాట మార్చేందుకు ప్రయత్నించాడు సురేష్.
ఓ.. బాగా చదువుతున్నాం నాన్నా.. అంటూ ఇద్దరు పిల్లలు మురిపెంగా అన్నారు. Half yearly ఎగ్జామ్స్ లో (అర్ధ వార్షిక పరీక్షల్లో) నాకు 2 nd (2వ) ర్యాంక్ వచ్చింది నాన్నా.. అని రోహిత్ అన్నాడు. నాకు 1st (1వ) ర్యాంక్ వచ్చింది నాన్నా.. అని నికిత సంబరంగా చెప్పింది.
వెరీ గుడ్.. మీరు ఇలాగే చదవాలి.. మంచి ఉద్యోగం సంపాదించాలి. అప్పుడు మనం తొందరలోనే ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉందాం.. అని ముక్తాయించాడు సురేష్..
పిల్లల ఆవేదన.. భర్త సముదాయింపునకు మౌన సాక్షిగా నిలిచిన మంజుల భారంగా ఓ నిట్టూర్పు విడిచింది. పిల్లలకు, భర్తకు దూరంగా ఎంత కాలం ఉండాలో.. అంటూ బాధ పడింది. ఈ కష్టాలకు అంతం ఎప్పుడో తెలియక ఆవేదన చెందింది.
అవునండి.. మనం వెంటనే ఒక ఇల్లు కొందాం. కిరాయికి అయినా తీసుకొని.. అందరమూ ఒకే దగ్గర ఉందామండి.. ఈ హోటల్, హాస్టల్ బతుకులు ఎంత కాలం.. అని భర్తకు గట్టిగా చెప్పింది మంజుల. ముగ్గురూ మూకుమ్మడిగా దాడి చేయడంతో సురేష్ కు సమాధానం ఇవ్వక తప్పలేదు..
నాకు మాత్రం అందరమూ ఒకే దగ్గర నివసించాలని ఉండదా చెప్పు.. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా.. మనం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదుగా మంజుల.. నీవు Software (సాఫ్ట్ వేర్) ఉద్యోగం చేస్తున్నావు. నీవు ఎన్ని ఉద్యోగాలు మారినా.. నీ ఆఫీసులన్నీ హై టెక్ సిటీ సమీపంలోనే ఉన్నాయి. నా టీచర్ ఉద్యోగం మాత్రం హయత్ నగర్ లో.. అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు సురేష్..
నీకు షిఫ్ట్ లు ఉంటాయి. ఒక వారం మార్నింగ్.. మరో వారం మధ్యానం.. ఇంకో వారం నైట్ షిఫ్ట్ లు ఉంటాయి. అందుకే నీ ఆఫీసుకు దగ్గరలోనే ఒక ఇల్లు కొందామంటే.. హై టెక్ సిటీ పరిసరాల్లో మనకు ఇల్లు కొనే స్థోమత కనిపించడం లేదు. ఒక గజానికి రూ.2-3 లక్షలు అంటున్నారు. కనీసం 100 గజాలు కొనాలన్నా.. రూ.2-3 కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇల్లు కట్టడానికి మరో 50 లక్షలు ఖర్చు చేయాలి. అంత డబ్బు మన దగ్గర లేదు కదా.. ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం కదా అని బ్యాంక్ లోన్ కు వెళ్తే.. మన శాలరీలకు కోటి రూపాయలకు మించి లోన్ ఇవ్వనని బ్యాంక్ వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు. అని సురేష్ కాసింత అసహనం వ్యక్తం చేశాడు సురేష్..
ఇక ఫ్లాట్ కొందామని వెళ్తే.. మన దగ్గర అడ్వాన్స్ తీసుకున్న బిల్డర్ మూడేళ్లు అయినా ఇంకా నిర్మాణం పూర్తి చేయలేదు. మనం ఇచ్చిన రూ.50 లక్షలు అతని వద్దే ఉన్నాయి. అందులో రూ.30 లక్షలు బ్యాంకు లోన్ తీసుకున్నాం కదా.. మనమైతే లోన్ కడుతున్నాం కానీ.. ఆ బిల్డర్ మాత్రం మనకు ఫ్లాట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ధర పెరిగిందంటూ ఇంకా అదనపు డబ్బులు ఇమ్మంటున్నాడు. మనం రూ.1.2 కోట్లకు మాట్లాడుకున్న ఫ్లాట్ ధరను అతను ఇప్పుడు 1.5 కోట్లకు పెంచేశాడు. అని సురేష్ కోపాన్ని తమాయించుకుంటూ భార్యకు వివరించాడు.
రూ.50 లక్షలు ఇచ్చాం కదా.. అని బిల్డర్ పెంచిన రూ.1.5 కోట్లకు ఒప్పుకోవాలా.. డ్రాప్ అయిపోవాలా.. అర్థం కావడం లేదు మంజుల.. మనం కట్టిన రూ.50 లక్షలు వెనక్కి ఇవ్వమంటే ఇస్తాడా.. మన ఫ్లాట్ వేరే వాళ్ళు కొంటే.. వాళ్ళు డబ్బులు ఇస్తే.. అప్పుడు వెనక్కి ఇస్తానంటున్నాడు. ఆ కొనేటోడు వచ్చేదెప్పుడో.. మనకు డబ్బులు ఇచ్చేదెప్పుడో.. అర్థం కావడం లేదు. అంటూ అయోమయం వ్యక్తం చేశాడు సురేష్..
మీరు అన్నీ ఇలాగే చేస్తారు. మరి ఇల్లు కిరాయికి తీసుకొని ఉందాం కదా.. అంటూ నింద సురేష్ పై మోపింది మంజుల.
ఇక ఇల్లు కిరాయికి తీసుకొని ఉందామంటే హైటెక్ సిటీ పరిసరాల్లో నెలకు కిరాయి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. అయినా ఇల్లు తీసుకొని ఉందామంటే.. నా టీచర్ ఉద్యోగం హయాత్ నగర్ లో ఉంది కదా.. హైటెక్ సిటీ నుంచి రోజూ హయాత్ నగర్ కు రావాలంటే రోజూ 35 కిలోమీటర్లు వెళ్లేందుకు.. 35 కిలోమీటర్లు వచ్చేందుకు మొత్తం 70 కిలోమీటర్లు.. ఇంత దూరం బైక్ పై వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. రోజూ బైక్ పై ఉదయం 2 గంటలు.. సాయంత్రం 2 గంటలు జర్నీ కే పోతుంది. ఉద్యోగం కంటే జర్నీ వల్లే ఎక్కువ అలసి పోతున్నాను. పైగా ఎపుడు ఆక్సిడెంట్ అవుతుందో తెలియని పరిస్థితి. మనం బాగానే వెళ్ళినా పక్కవాడు సర్రున దూసుకొని వస్తాడు. మనం తేరుకునే లోపే ఢీకొట్టి వెల్లిపోతాడు. మనం బైక్ పై నుంచి కింద పడిపోవడం.. దెబ్బలు తగలడం రెప్పపాటు కాలంలో జరిగిపోతాయి.. ఒకసారి ఇలాగే ఒక పోకిరీ వెధవ ఆక్సిడెంట్ చేయడంతో నా ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది కదా.. 2 నెలలు బెడ్ పైనే ఉండాల్సి వచ్చింది. అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు సురేష్.
నా ఉద్యోగానికి దగ్గరలో రూమ్ తీసుకుందామంటే.. నీకు (మంజులకు) ట్రావెలింగ్ ఇబ్బంది అయింది. ఆ బాధ భరించలేక నీవు ఉద్యోగమే మానేస్తా.. అని పోరు కూడా పెట్టావు కదా.. ఇద్దరు సంపాదిస్తేనే రోజులు గడిచే రోజులు ఇవి.. ఇక నీవు ఉద్యోగం మానేస్తే.. మన పిల్లల్ని మంచి స్కూల్ లో చదివించే పరిస్థితి ఉండదు కదా. అవసరాలన్నిటికీ కాంప్రమైజ్ కాక తప్పదు. అన్నాడు సురేష్..
అలా అయితే.. మన పిల్లలను మనతో ఉంచుకునే అవకాశమే లేదా.. అని కలత చెందిన హృదయంతో ప్రశ్నించింది మంజుల..
ఇక్కడ ఒక విషయం మంజుల.. అమ్మాయికి డాక్టర్ కావాలని.. అబ్బాయికి ఇంజినీర్ కావాలని కోరిక. అందుకే NEETకు (నీట్) బెస్ట్ కోచింగ్ ఇచ్చే ఉప్పల్ లోని నారాయణ స్కూల్ లో అమ్మాయిని.. JEEకి best (జేఈఈ కి బెస్ట్) కోచింగ్ ఇచ్చే విద్యానగర్ లోని మరో స్కూల్ లో అబ్బాయిని చేర్చాం కదా.. ఇలా నలుగురం నగరానికి నాలుగు వైపులా ఉండాల్సి వస్తోంది. ఇక ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి చెప్పు భార్యామణి.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడ ఇల్లు కట్టుకున్నా.. నలుగురు ఉండే ఇంట్లో ఒక్కరికే మేలు జరుగుతుంది. మిగిలిన ముగ్గురు వెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. అని నిట్టూర్చాడు సురేష్.
అయినా.. అందరమూ హాస్టళ్లలో ఉంటూ.. ఇలా గెస్ట్ ల మాదిరిగా 15 రోజులకు ఒకసారి కలిసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా అని నిలదీసింది మంజుల..
మరి ఏం చేద్దాం చెప్పు.. నీ ఆఫీసుకు దగ్గరలో హైటెక్ సిటీ వద్ద రూ.10 వేలు పెడితే నీకు luxury (లగ్జరీ) హాస్టల్ వస్తుంది. నా స్కూల్ కు సమీపంలో హయత్ నగర్ వద్ద రూ.8 వేలు పెడితే నాకు కూడా మంచి హాస్టల్ వస్తుంది.. అదే ఇల్లు కిరాయికి తీసుకుంటే.. డబుల్ బెడ్ రూమ్ ఇంటికి కనీసం రూ.20 వేలు పెట్టక తప్పదు. భోజనాల కోసం ఇద్దరికే రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. పని మనిషికి మరో రూ.5 వేలు. అన్నీ కలుపుకొని రూ. 40 వేల వరకు ఖర్చు చేస్తేనే హైదరాబాద్ లో ఓ ఇంటి వారిగా ఉండగలుగుతాము.. ఇక వచ్చి పోయే బంధువుల ఖర్చు అదనం. అంటూ ఖర్చుల చిట్టా బయట పెట్టాడు సురేష్..
ఇంత చేసినా ప్రశాంతంగా ఉంటామా.. అంటే అదీ లేదు. రోజూ ఉదయం, రాత్రి వంట చేయడం మహా గగనం. ఆఫీసు లో రోజంతా కష్టపడి అలిసి పోతామా.. ఇంటికి వచ్చి rest (రెస్ట్) తీసుకోకుండా మళ్ళీ వంట పని.. ఇక పిల్లలను చదివించడం తలకు మించిన భారం. ఈ కష్టాల కంటే హాస్టల్ లో ఉండడమే బెస్ట్ అనిపిస్తోంది అంటూ ముక్తాయించింది మంజుల..
ఈ కష్టాలు తప్పించుకునేందుకే కదా మనం ఈ మార్గం ఎంచుకున్నది. పిల్లలు ఒకసారి సెట్ అయిపోతే.. వాళ్ల చదువులు పూర్తి అయి ఉద్యోగం చేస్తే.. అప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుందాం. బాధ్యతలన్నీ పూర్తయితే.. పిల్లల చదువుల ఖర్చు అయిపోతే.. నీవు ఉద్యోగం మానేసినా నష్టం లేదు.. నేను కూడా ఎక్కువ సెలవులు పెడుతూ ఇంటిపట్టాన ఉండొచ్చు. పిల్లలను మన దగ్గర ఉంచుకొని.. సిటీకి దూరమైనా.. ఒకే ఇంట్లో ప్రశాంతంగా బతకొచ్చు.. అని చెమర్చిన కళ్ళతో అన్నాడు సురేష్..
ఆ రోజు ఎప్పుడూ వస్తుందో.. మనం ఒకే ఇంట్లో ఎప్పుడు బతుకుతామో.. అంతా అయోమయంగా ఉంది. ఈ బతుక్కి ఆ మంచి రోజు వస్తుందో.. లేదో.. అంటూ ఓ నిట్టూర్పు విడిచింది మంజుల..
ఆ రోజు త్వరలో వస్తుంది మంజుల.. మనమంతా కలిసి ఒకే ఇంట్లో నివసించే రోజు దగ్గరలోనే ఉంది.. అంటూ ఆశలు రేకెత్తించాడు సురేష్.
సమాప్తం
మహమ్మద్ హసన్ షరీఫ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను మహమ్మద్ హసన్ షరీఫ్.. సీనియర్ జర్నలిస్ట్.. రచయిత.. 1999 లో ప్రజాశక్తిలో సబ్ ఎడిటర్ గా ప్రారంభించిన నా జర్నలిజం ప్రస్థానాన్ని 26 ఏళ్ళుగా నిరాటంకంగా కొనసాగిస్తున్నాను. నవ తెలంగాణ, ఆంధ్రజ్యోతి దిన పత్రికలతో పాటు 10 టీవీ, 99 టీవీ, మహా టీవీ తదితర ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ కొనసాగించాను. ప్రస్తుతం ఒక U tube చానెల్ నడిపిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నాను.
జర్నలిస్టుగా కొనసాగుతూనే పలు కథలు రాశాను. నా కథలు వివిధ పత్రికల్లోని ఆదివారం సంచికల్లో ప్రచురితమయ్యాయి.
Comments