top of page

స్పాట్ వ్యాల్యూయేషన్ ఓ అనుభవం

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguComedyStories, #అనుభవం, #SpotValuation


Spot Valuation O Anubhavam - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 20/05/2025 

స్పాట్ వ్యాల్యూయేషన్ ఓ అనుభవంతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి అందరికీ ఉన్న అనుభవమే. పరీక్షల అనంతరం పేపర్స్ దిద్ది, తగిన మార్కులు వేసేటప్పుడు జవాబు పత్రాలు చదువుతుంటే ఒక్కోసారి నవ్వు, ఒక్కోసారి కోపమూ వస్తాయి కదా! 


జవాబులకు టిక్ మార్కు పెట్టడం ఉంటే పర్లేదు కానీ, వ్యాసరూప ప్రశ్నలకు రాసే జవాబులు భలే రాస్తుంటారు. 


ఉస్మానియాలో తెలుగులో పీజీ చేసే రోజుల్లో ఒక ముస్లిమ్ ప్రొఫెసర్ వుండే వారు. తెలుగు సాహిత్యంలో ఎన్నో పరిశోధనలు చేశారు. మా విద్యార్థుల గౌరవాభిమానాలు చూరగొన్న ప్రొఫెసర్స్ లో ఈయన ఒకరు. చాలామంచి వ్యక్తి.


  పీజీ ఫైనల్ పరీక్షలు జరిగే ముందు తీస్కున్న క్లాసుల్లో పరీక్షల్లో పిచ్చిగా జవాబులు రాయకండి, మాకు విసుగు తెప్పించకండి అంటూ తన అనుభవాన్ని ఇలా వివరించారు.


పీజీ ఫైనల్ పరీక్షలు అయిపోయాయి. పరీక్షాపత్రాలు దిద్దడానికి తేదీ నిర్ణయించి ఆ యా ప్రొఫెసర్స్ అందరికీ పరీక్షపత్రాలు కేటాయించారు. 


మా ఈ ప్రొఫెసర్ గారికి ఒక పేపర్ వచ్చింది. ఏదో సినిమా కథలు కొంచెం రాసి కొన్ని పేపర్లు నింపి, చివరగా ఇలా రాసాడట ఆ అబ్బాయి....


"విన్నపము: 


అయ్యా! 

  నా పేరు రాజు. మా ఊరు ఇది. ఈ సంవత్సరం నేను పాస్ అవ్వకపోతే నా తల్లిదండ్రుల చేత తిట్లు తినాలి. చుట్టాలు పనికిరానివాడిగా చూస్తారు అందుకని ఒక విన్నపం చేసుకుంటున్నాను. 

  మీరు ఇంత స్థాయికి అంటే ఒక యూనివర్సిటీ లో పీజీ స్థాయిలో ప్రొఫెసర్ గా ఉన్నారంటే మీరు చాలా పెద్దవారు అయి వుంటారు. మీకు కూతుళ్లు కూడా వుండే వుంటారు. 


  దయచేసి నన్ను ఎలాగైనా పాస్ చేశారంటే మీకు రుణపడి ఉంటాను. మీ రుణం ఉంచుకోను. మీ అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను మీరు నన్ను పాస్ చేస్తే. 


 ధన్యవాదాలు

  ఇట్లు

  మీ కాబోయే అల్లుడు


 ఇది చదివి మొదట నవ్వు, ఆ తర్వాత కోపం వచ్చాయట. ఆ తరువాత అతన్ని పిలిపించి చివాట్లు పెట్టి, డిబార్ చేశారట. బతిమాలితే ఒక సంవత్సరానికి తగ్గించారట.


మీరూ ఎప్పుడైనా ఇలా రాసి, టీచర్స్ చేత చివాట్లు తిన్నారా? చెప్పండి.


నేనైతే అలా రాసి, అస్సలు చివాట్లు తినలేదు. మీరు టీచర్ అయితే మీకు ఇలాంటి అనుభవం ఎదురయ్యిందా?


కామెంట్స్ రూపంలో మీ స్పందన తెలియజేయండి.


-సుధావిశ్వం





2 Comments


బుర్ర ఖాళీ కానీ ఉదార బుద్ధికి లోటు లేదు. బాగుంది. ఒక ప్రొఫెసరుగా అతడిని అభిభినందించ కుండా ఉండ లేక పోతున్నా

Like
Replying to

మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ

Like
bottom of page